
వేగంగా మారిపోయే పెట్టుబడుల ప్రపంచంలో సాధారణంగా మనం ఊహించని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. ధరలపరంగా ఉండే వ్యత్యాసాలను ఉపయోగించుకుని, లబ్ధిని పొందే వ్యూహమే ఆర్బిట్రేజ్. మార్కెట్లో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని, మెరుగైన రాబడులను అందించే లక్ష్యంతో ఏర్పడ్డ కొత్త తరహా మ్యుచువల్ ఫండ్సే ‘ఆర్బిట్రేజ్ ఫండ్స్’. వీటితో ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఏమిటి, ఇవి ప్రాచుర్యంలోకి పొందడం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆదరణ ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు ఒకసారి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కాన్సెప్టు, పని తీరు, సామర్థ్యాల గురించి తెలుసుకుందాం.
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇలా..
‘అ’ అనే కంపెనీ ఈక్విటీ షేర్లు, క్యాష్ మార్కెట్లో రూ.100 వద్ద, ఫ్యూచర్ మార్కెట్లో రూ.102 వద్ద (ధర ప్రీమియంలో వ్యత్యాసాల వల్ల) ట్రేడవుతున్నాయనుకుందాం. ఫండ్ మేనేజరు ‘అ’ కంపెనీ షేర్లను క్యాష్ మార్కెట్లో రూ.100కు కొని, వాటిని ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.102కు అమ్మాలని అనుకున్నారనుకుందాం. సాధారణంగా నెలాఖరున, ఫ్యూచర్ కాంట్రాక్టు ఎక్స్‌పైర్ అయిపోయే సమయానికి క్యాష్ మార్కెట్, అటు ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు ఒకే స్థాయికి సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఫండ్ మేనేజరు తన ట్రేడింగ్ లావాదేవీని రివర్స్ చేసి, రెండు ధరల మధ్య వ్యత్యాసమైన రూ.2 మొత్తాన్ని రాబడిగా పొందుతారు.
స్టాక్స్, డెరివేటివ్స్ మార్కెట్లలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసే మ్యుచువల్ ఫండ్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మరింత సరళంగా చెప్పాలంటే ఒక అసెట్ స్పాట్ ధర (స్టాక్ మార్కెట్లో), దాని ఫ్యూచర్ ధర (డెరివేటివ్స్ మార్కెట్లో) మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఈ ఫండ్స్ లబ్ధిని పొందుతాయి. అల్గోరిథమ్‌లు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల సహాయంతో స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని ఈ ఫండ్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. అయితే, అవకాశాలు క్షణాల్లో ఆవిరైపోతాయి కాబట్టి, ఈ వ్యూహాన్ని అమలు చేయడమనేది చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ధరపరంగా వ్యత్యాసం చాలా తక్కువ పర్సెంటేజీ పాయింట్లలోనే ఉండొచ్చు, కానీ మార్కెట్లోని మిగతా వారు కూడా ఆ అవకాశాన్ని గుర్తించే ఆస్కారం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసం చాలా వేగంగా మాయమైపోవచ్చు. కనుక మిగతావారికన్నా వేగంగా స్పందించాల్సి ఉంటుంది.
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయం
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ ఇటీవలే కొన్ని చర్యలు ప్రకటించింది. 2024 నవంబర్ 29 నుంచి అదనంగా 45 సెక్యూరిటీల్లో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను అనుమతించింది. అలాగే, మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఉండేలా 2024 నవంబర్ 20 నుంచి ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టు సైజును రూ.15 లక్షలకు పెంచింది. ఈ చర్యలన్నీ, దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్‌ను విస్తరించేందుకు, వైవిధ్యభరితంగా మార్చేందుకు, మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫండ్లు వివిధ రంగాలు, కంపెనీలు, మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా తమ వ్యూహాలను మరింత వైవిధ్యంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇదీ చదవండి: బంగారం లాభాలపై పన్ను ఎంత?
పెట్టుబడులతో ప్రయోజనాలు
మిగతావాటితో పోలిస్తే తక్కువ రిస్క్: మార్కెట్ గమనంతో పట్టింపు లేకుండా ఈ విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. మార్కెట్లో స్ప్రెడ్లను గుర్తించి, తదుపరి ఎక్స్‌పైరీ వరకు ‘లాకిన్’ చేయడంపైనే ఫండ్ దృష్టి పెడుతుంది.
ఒడిదుడుకుల మార్కెట్లలో అనుకూలం: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాబడులను అంచనా వేయడమనేది చాలా మటుకు మ్యుచువల్ ఫండ్ స్కీములకు కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. మరోవైపు, మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడైనా, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడైనా తక్కువ రిస్క్‌తో కూడుకున్న వ్యూహాలుగా ఆర్బిట్రేజ్ ఫండ్లు మెరుగ్గా రాణించగలుగుతాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో షేర్ల ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి, వివిధ మార్కెట్లలో వాటిని అప్పటికప్పుడు కొని అమ్మేయడం ద్వారా, ఆ పరిస్థితిని ఆర్బిట్రేజ్ ఫండ్స్ తమకు అనువైనదిగా మార్చుకుంటాయి.
పన్ను ప్రయోజనాలు: ఈ ఫండ్స్ స్వభావరీత్యా హైబ్రిడ్ ఫండ్సే అయినప్పటికీ ఈక్విటీ ట్యాక్సేషన్‌కి అర్హత ఉంటుంది. ఫండ్ మొత్తం అసెట్స్‌లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఏడాదికన్నా ఎక్కువ కాలం అట్టే పెట్టుకుంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) కింద 12.5 శాతం పన్ను రేటే వర్తిస్తుంది (రూ. 1.25 లక్షల మినహాయింపునకు లోబడి). పన్ను ఆదా చేస్తూ, స్థిరమైన రాబడులను అందించే సాధనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు, ఆర్బిట్రేజ్ ఫండ్‌లు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలవు.
మార్కెట్లో ఒడిదుడుకులను అవకాశాలుగా మల్చుకునే అధునాతన వ్యూహాలతో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, నియంత్రణపరంగా స్థిరత్వం నెలకొన్న భారత మార్కెట్లో, పెట్టుబడిని కాపాడుకుంటూ స్థిరమైన వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్‌లు ఆకర్షణీ యమైన ఆప్షన్. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం హెడ్జింగ్ కోరుకునే ఇన్వెస్టర్లు, ఆర్బిట్రేజ్ ఫండ్‌లను తప్పక పరిశీలించవచ్చు.
- కార్తీక్ కుమార్, ఫండ్ మేనేజర్, యాక్సిస్, మ్యుచువల్ ఫండ్
Comments
Please login to add a commentAdd a comment