
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎవరి అంచనాలకూ అందకూడదన్న సంకల్పంతో ఉన్నట్టు కనబడుతోంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం ఆయన ఇరాన్‌పై ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతే కాదు... తనను చంపటానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్‌పై దాడి చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చానన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావా లని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు.
సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చానని ట్రంప్ వివరణనిచ్చారు. తొలిసారి అధికారంలోకొచ్చినప్పుడు అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా ట్రంప్ 2018లో ఏకపక్షంగా రద్దుచేశారు. అది కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటుఇరాన్ సంతకాలు చేశాయి. ఆంక్షలు సడలించటానికి అంగీకరించాయి.
ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్‌లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు.
ట్రంప్ తాజా ప్రతిపాదనలో చర్చల ప్రస్తావన ఉన్నా నిజానికది మరిన్ని డిమాండ్లు తమముందుంచి లొంగదీసుకోవటానికేనని ఇరాన్ మత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ చేసిన ప్రకటనను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇరాన్‌లో తమ కీలుబొమ్మ పాలకుడు మహమద్ రెజా పహ్లావీ (ఇరాన్ షా) 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో పదవీచ్యుతుడైనప్పటినుంచీ అమెరికా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ఆనాటినుంచి కొనసాగిన ఆంక్షల పర్వం ఎడతెరిపి లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.
ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధించటం కూడా పరిపాటైంది. 1988లో 290 మందితో వెళ్తున్న ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని సైనిక విమానంగా భావించి అమెరికా కూల్చివేసింది. తాను విధించిన ఆంక్షల్ని మరింత విస్తృతం చేయటానికి 2006లో భద్రతామండలిలో తీర్మానం చేయించింది. 2012లో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పర్యవసానంగా పసిపిల్లలకు పాలడబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
తన ప్రధాన ఆదాయ వనరైన ముడిచమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవటంతో... అమె రికా బ్యాంకుల్లోవున్న వేలాదికోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్ల స్తంభించటంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వాదన సమంజసమైనది. అణు కార్య క్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటినుంచీ కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది.
గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా, ఇరాన్‌లమధ్య పర స్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలుత తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేమిటో ఎవరికీ తెలియదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నదని ట్రంప్ ఆరోపించారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలా కనబడుతోంది.
సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ నిరుడు జూన్‌లో ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చు కోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలే వున్నాయి. ఇరాన్‌తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ హామీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు.
ట్రంప్ తొలి ఏలుబడి నాటికి పశ్చిమాసియాలో ఇరాన్ దాదాపు ఏకాకి. సౌదీ అరేబి యాతో దానికి ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడలా కాదు. ఇరాన్‌తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నిటికీ మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యాన్ని ఛిద్రం చేస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లతో ఇరాన్‌కు సాన్నిహిత్యముంది. అందువల్ల ఇరాన్‌తో నిజంగా ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. అయితే ఇరాన్‌నుంచి ఆశించే ఎలాంటి ఆచరణైనా ఇజ్రాయెల్‌కు కూడా వర్తింపజే సినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. కాని పక్షంలో ఈ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment