nuclear deal
-
ఇప్పుడు పుతిన్‌కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్‌తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్‌ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్‌లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్‌కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్‌కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
అమెరికాతో చర్చలపై ఆసక్తి లేదు: ఉత్తర కొరియా
సియోల్: అమెరికాతో అణు చర్చలను పునఃప్రారంభించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి సన్ గ్వాన్ బుధవారం తేల్చిచెప్పారు. అమెరికాతో చర్చలపై తమకు ఆసక్తి లేదని పేర్కొన్నారు. సంప్రదింపులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందంటూ అమెరికా, దక్షిణ కొరియా అధికారులు ఇటీవలి కాలంలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలపై రి సన్ గ్వాన్ నీళ్లు చల్లారు. ఇప్పటికిప్పుడు అమెరికాతో సంబంధాలు పెంపొందించుకోవాలన్న ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. తమతో మళ్లీ చర్చలు మొదలుపెట్టాలని అమెరికా గనుక భావిస్తే తీవ్ర ఆశాభంగం తప్పదని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ మంగళవారం స్పష్టం చేశారు. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగిన అణు చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
అణు ఒప్పందం మరో అయిదేళ్లు
వాషింగ్టన్: అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మీడియాకి చెప్పారు. 2010లో బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,550కి మించి అణు వార్హెడ్లను మోహరించడానికి వీల్లేదు. అమెరికా ప్రతిపాదనని రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెప్పారు. డైట్ కోక్ బటన్ తీసేశారు నూతన అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న ఒక నిర్ణయం నెటిజన్లని విస్మయపరుస్తోంది. దీనిపై జర్నలిస్టు టామ్ న్యూటన్ డన్ చేసిన ఒక ట్వీట్ వైరల్‌గా మారింది. డన్ 2019లో ట్రంప్ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లినప్పుడు ఆయన టేబుల్‌పై ఎర్ర రంగు బటన్ కనిపించింది. ఆ బటన్ నొక్కగానే బట్లర్ డైట్ కోక్ తీసుకొని రావడంతో ఆయనకి విషయం అర్థం అయింది. కేవలం కోక్ తాగడం కోసమే ట్రంప్ ఆ సదుపాయంం ఏర్పాటు చేసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలన్నింటినీ బైడెన్ తిరగతోడుతున్నట్టుగానే ఈ బటన్న్నీ తొలగించారు. కొత్తింట్లో అడుగు పెడదాం అనుకుంటే.. ప్రమాణ స్వీకారానంతరం కొత్త ఇంట్లో అడుగుపెట్టాలనుకున్న జోబైడెన్ దంపతులకు కొద్ది క్షణాల పాటు చేదు అనుభవం ఎదురైంది. నార్త్ పోర్టికో గుండా లోపలికి ప్రవేశించేందుకు బైడెన్ దంపతులు ప్రయత్నించగా తలుపు తెరచుకోలేదు. దీంతో ఆయన వెనక్కు తిరిగి తనతో పాటు వచ్చిన వారివైపు చూశారు. ఆ తర్వాత అందరూ కలసి లోపలికి వెళ్లడం కనిపించింది. అయితే ఆ తలుపులను ఎవరైనా లోపలి నుంచి తెరిచారా లేక బైడెన్ దంపతులే తోసుకుంటూ వెళ్లారా అనేది కనిపించలేదు. దీంతో ఇంట్లో అడుగు పెట్టకముందే ప్రొటోకాల్ ఉల్లంఘన కనిపించినట్లు అయింది. ఈ వ్యవహారానికి ముందే వైట్ హౌజ్‌లో వీటిని చూసుకొనే ఉద్యోగిని తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు. -
ట్రంప్ తలపై రూ.575 కోట్లు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన జనరల్ సులేమానీ(62) మృతదేహం సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. సులేమానీకి నివాళులర్పించేందుకు నలుపు రంగు దుస్తులు ధరించిన జనం ఇసుకేస్తే రాలనంతమంది తరలివచ్చారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్ సులేమానీ, తదితరులకు చెందిన శవపేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామన్నట్లు మిర్రర్ వెబ్సైట్ తెలిపింది. సులేమానీకి నివాళులర్పిస్తూ ఖమేనీ కంటతడి అలాగైతే.. ఇరాక్‌పైనా ఆంక్షలు అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.‘ఇరాక్ కోసం మేం చాలా డబ్బు వెచ్చించాం. మా బలగాలను ఉంచిన వైమానిక స్థావరం ఏర్పాటుకు కోట్లాది డాలర్ల ఖర్చయింది. అదంతా తిరిగి చెల్లించకుండా ఖాళీ చేసేదిలేదు. ఒక వేళ మాపై ఒత్తిడి చేసినా, తేడాగా వ్యవహరించినా ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆంక్షలను ఇరాక్ చవిచూడాల్సి ఉంటుంది’అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అణు ఇంధన శుద్ధి పరిమితులపై.. తాజా పరిణామాల నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా, 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విరోధం ఇప్పటిది కాదు ► 1979: అమెరికా అండతో కొనసాగుతున్న ఇరాన్ పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ► 1988: గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ► 2000: ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు. ► 2002: ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను అమెరికా దుష్ట్రతయంలో చేర్చింది. ► 2013–16: ఒబామా హయాంలో ఇరాన్‌తో సంబంధాలు గాడినపడ్డాయి. ► 2015: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ► 2019: అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. -
ట్రంప్ మెట్టు దిగాలి
ముంచుకొస్తుందనుకున్న సంక్షోభం కాస్త వెనక్కి తగ్గినట్టే కనబడింది. ఆంక్షలతో అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్...దేనికైనా సిద్ధం కాచుకోండంటూ ఇటు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ దూకుడు ప్రదర్శిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ జోక్యం చేసుకుని నడిపిన రాయబారం సత్ఫలితాలిచ్చినట్టే అనిపించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానియెల్ మేక్రాన్ చర్చలకు ప్రాతిపదికగా రూపొందించిన నాలుగు అంశాల పత్రాన్ని అమెరికా, ఇరాన్‌లు రెండూ సూత్రప్రాయంగా అంగీకరించడం అందరిలో ఆశలు రేకెత్తించింది. బాహాబాహీ సవాళ్లు విసురుకునే రెండు దేశాల మధ్య చర్చలు జరగడం అంత సులభమేమీ కాదు. అవతలి దేశానికి తలొగ్గినట్టు కనబడితే చిన్నచూపు చూస్తారన్న భయం ఇద్దరిలోనూ ఉంటుంది. అమెరికా–ఇరాన్ చర్చలు అందువల్లే చివరి నిమిషంలో ఆగిపోయాయి. చర్చలకు ముందు ఆంక్షలు ఉపసంహరించేది లేదని ట్రంప్ చెబుతుండగా...అలా జరిగితేనే చర్చలకు సిద్ధపడతానని రౌహానీ స్పష్టం చేశారు. ఆంక్షలు నిలిపివేస్తామని ప్రకటిస్తే తప్ప కనీసం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరించారు. పైగా ఆంక్షలు ఎత్తేయడానికి ట్రంప్ ప్రైవేటుగా అంగీకరించినా, బహిరంగంగా ప్రకటించడానికి ఆయనకు అహం అడ్డొస్తున్నదని రౌహానీ అనడంతో పరిస్థితి మొదటికొచ్చింది. రాయబారం ప్రక్రియ ఆగింది. ఇరు దేశాలూ దాదాపు మూడేళ్లుగా వాగ్యుద్ధంలో తలమునకలై ఉన్నందువల్ల పరిస్థితి వెనువెంటనే చక్కబడుతుందని ఆశించలేం. అది సద్దుమణగడానికి మరిన్ని దఫాల చర్చలు అవసరం కావొచ్చు. ఇరాన్ ఒక్క మెట్టయినా దిగకున్నా ట్రంప్ చర్చలకు సిద్ధపడటం ఇందులో గమనార్హమైన విషయం. బెదిరింపుల వల్ల ఆశించిన ఫలితం రాదన్న సంగతిని అది గుర్తించిందని ఈ పరిణామం తేటతెల్లం చేస్తోంది. ఇరాన్‌తో అమెరికా, యూరప్ దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అధికారంలోకొస్తే రద్దు చేస్తానని ప్రకటించిన ట్రంప్ నిరుడు ఆ పని చేశారు. అంతకు మూడేళ్ల ముందునుంచీ రెండు దేశాల మధ్యా నెలకొన్న ఘర్షణ వాతావరణం అందరిలోనూ ఆందోళన కలిగించింది. ముఖ్యంగా అణు ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న యూరప్ దేశాల పరిస్థితి ముందు నుయ్యి– వెనక గొయ్యి అన్నట్టు మారింది. రివాజుగా తాము అమెరికాతో గొంతు కలిపి ఒప్పందం నుంచి తప్పుకోవాలో... ప్రస్తుతం వ్యాపారపరంగా తమకు లాభదాయకంగా ఉన్న ఇరాన్‌తోనే ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో అవి పడిపోయాయి. అమెరికా వైఖరిని ఆ దేశాలు మొదట్లో తప్పుబట్టినా ఇరాన్ రోజురోజుకూ పెంచుతున్న దూకుడుతో అవి అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు బావులు ద్రోన్ దాడుల్లో ధ్వంసమైన ఉదంతం తర్వాత ఆ దేశాలు తప్పనిసరై ఇరాన్‌ను తప్పుబట్టాయి. ఇది ఇరాన్‌కు కష్టం కలిగించింది. తమపై అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పుడు గట్టిగా వ్యతిరేకించడానికి సిద్ధపడని దేశాలు ద్రోన్ దాడితో తమకు సంబంధం లేదంటున్నా ఆరోపణలకు దిగుతున్నాయని ఇరాన్ తప్పుబట్టింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పల్టీలు కొడుతున్న వర్తమాన పరిస్థితుల్లో ‘పులి మీద పుట్ర’లా పశ్చిమాసియాలో యుద్ధం వచ్చి పడితే కష్టాలు మరిన్ని రెట్లు పెరుగుతాయని ప్రపంచ దేశాలన్నీ వ్యక్తం చేస్తున్న భయాందోళనలు సహేతుకమైనవే. ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రంగా ఉండటం, ఉపాధి అవకాశాలు మందగించడం, అధిక ధరలు వగైరా ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే యూరప్ దేశాలను కూడా పట్టిపీడిస్తున్నాయి. ఈ విషయంలో అక్కడి అధికార వ్యవస్థలపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నారు. క్రమేపీ విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి యూరప్ దేశాలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి యూరొపియన్ సెంట్రల్ బ్యాంక్ గత నెలలో అనేక చర్యలు ప్రకటించింది. డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గించడంతోపాటు బాండ్ల కొనుగోలు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపింది. ఈ విషయంలో జర్మనీ, డచ్, ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంకులనుంచి వ్యతిరేకత వ్యక్తమైనా అది ఖాతరు చేయలేదు. ఎగుమతులను పెంచుకోవడానికే కావాలని యూరో విలువ తగ్గేలా యూరొపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నిస్తున్నదని ట్రంప్ ఆరోపించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో చిచ్చు రేగితే ప్రపంచంలోని అన్ని దేశాలకూ అది జీవన్మరణ సమస్యగా మారుతుంది. యూరప్ దేశాలు అణు ఒప్పందంలో కొనసాగుతామని చెప్పినంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని, ఆంక్షల ఎత్తివేతకు ఆ దేశాలు ప్రయత్నించకపోతే తాము కూడా ఆ ఒప్పందం నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఇరాన్ చేసిన హెచ్చరిక ఆ దేశాలపై పని చేసింది. కనుకనే మేక్రాన్ అమెరికా, ఇరాన్‌ల మధ్య రాయబారం నడపడానికి సిద్ధపడ్డారు. ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తే అక్కడి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతుందని, చివరకు అది కుప్పకూలుతుందని ట్రంప్ ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. ఆంక్షల వల్ల ఇరాన్ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవమే. దానికున్న ఏకైక ఆదాయ వనరు ముడి చమురును అమ్ముకోవడానికి అమెరికా విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయి. కనుక ఖజానా నానాటికీ క్షీణిస్తూ అది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోలు చేసే మన దేశం అమెరికా ఒత్తిడితో తప్పుకుంది. అయితే పిల్లిని గదిలో బంధించి కొడితే అది కూడా తిరగబడుతుంది. కనుకనే ఇరాన్ రణభేరి మోగించింది. తటస్థతను నటిస్తున్న యూరప్ దేశాలపై ఒత్తిడి ప్రారంభించింది. ఏ యుద్ధమైనా సమస్యకు పరిష్కారం ఇవ్వదు. మరిన్ని జటిలమైన సమస్యల్ని రాజేస్తుంది. దాంతో సంబంధం ఉన్నా లేకున్నా అందరినీ ముంచేస్తుంది. ఇంతవరకూ తాను అనుసరించిన విధానాలు నిష్ప్రయోజనమయ్యాయని అమెరికా ఇప్పటికైనా గ్రహించి, చర్చలకు సిద్ధపడటం ఉత్తమం. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తే చరిత్ర క్షమించదు. -
అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం
జెనీవా : అణ్వాయుధాల పరిమితిపై నూతన ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా, అమెరికాలు బుధవారం జెనీవాలో సమావేశం కానున్నాయి. ఈ ఒప్పందంలో భాగస్వామ్యులు కావాలంటూ అమెరికా చైనాను సైతం కోరింది. ‘అన్ని రకాల అణ్వాయుధాలను పరిమితం చేయడానికి రష్యా, చైనాలతో ‘తదుపరి తరం’ ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని చూడాలనుకుంటున్నాను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఒసాకాలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో ట్రంప్ ఈ అంశాన్ని వ్యక్తిగతంగా చర్చించారు. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి బీజింగ్ ఎంతవరకు సిద్ధంగా ఉంటుందో స్పష్టంగా తెలియదని ఆనాడే అమెరికా అధికారులు వెల్లడించారు. ‘ఈ చర్చల్లో చైనా పాల్గొనడానికి ముందస్తు షరతులను ఒప్పుకోం’ అని చైనా కూడా సమాధానం ఇచ్చింది. అయితే ఈ ఒప్పందంపై మాకు ఆసక్తి లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వ్యాఖ్యానించింది. దీంతో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంపై రష్యా, అమెరికాలు మాత్రమే చర్చలకు సిద్ధమయ్యాయి. క్షీణించిన సంబంధాలు అమెరికా, రష్యాల సంబంధాలు మెదటినుంచి ఒకదానిపై ఒకటి యుద్ధప్రేరేపిత సంబంధాలే. అయితే 1991లో యుఎస్ఎస్ఆర్ కుప్పకూలి అమెరికా అగ్రరాజ్యంగా ఏకధృవప్రపంచం ఏర్పడినా సైనిక రంగంలో రష్యా ఇంకా అగ్రరాజ్యమే. దీంతో ఇరుదేశాలు అంతర్జాతీయంగా అనేక అంశాలలో విభేదించుకున్నాయి. ముఖ్యంగా 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడం, సిరియా యుద్ధంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు రష్యా మద్దతు ఇవ్వడంతో వీటి మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అలాగే అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందంటూ విచారణలు, బ్రిటిష్ గడ్డపై మాజీ గూఢచారిని, అతని కుమార్తెను రష్యా విషం ఇచ్చి చంపిందనే ఆరోపణలు కూడా తోడవడంతో వీటి మధ్య సంబంధాలు ఇంకా క్షీణించాయి. ఉక్రేనియన్ నావికాదళ పడవలు, సిబ్బందిని, అలాగే యుఎస్ పౌరులను రష్యా నిర్బంధించడం వంటి ఇతర సంఘటనలపై కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చర్చలు ఫలిస్తాయా? ప్రచ్చన్న యుద్ధకాలంనాటి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్న విషయం తెలిసిందే. స్వల్పశ్రేణి, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేయకూడదంటూ రష్యా, అమెరికాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంతో రష్యా భయం యూరప్‌కు తొలగింది. అయితే ట్రంప్ వచ్చాక పరిస్థితి మారింది. యూరప్ భద్రత యూరపే చూసుకోవాలంటూ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో రష్యా తిరిగి మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తుందేమోనని భయం యూరప్‌కు పట్టుకుంది. పైగా మాస్కో యూరప్‌లోని ఏ ప్రాంతంపైన దాడిచేయాలన్నా క్షణాల్లో ఏర్పాట్లు చేసుకునేంతగా సామర్థ్యం కలిగి ఉందని యుఎస్ అధికారులు హెచ్చరించారు. ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. ఈ సమావేశంలో ఐఎన్ఎఫ్ ఒప్పందం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో రష్యా, అమెరికాల మధ్య చర్చలు ఫలవంతంగా నడుస్తాయా?.. ట్రంప్ ఉండగా ఇది సాధ్యమేనా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది: ట్రంప్
వాషింగ్టన్: 2015 నాటి అణు ఒప్పందం లోని నిబంధనలను ఉల్లంఘించి యురేనియం నిల్వలను అనుమతించిన స్థాయికి మించి పెంచి ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. యురేనియం నిల్వలను పెంచుకోవడాన్ని ఆపాలంటూ అమెరికా విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పిన నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు చేశారు. అణు ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ తొలిసారిగా గత సోమవారం ఉల్లంఘించింది. ‘ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది. నేను కొత్తగా ఇరాన్‌కు చెప్పదలచుకున్నది ఏదీ లేదు. అయితే తాము నిప్పుతో ఆడుకుంటున్నామన్న విషయాన్ని ఇరాన్ గుర్తెరగాలి’ అని ట్రంప్ శ్వేతసౌధంలో మీడియాతో అన్నారు. అనంతరం శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘యూరేనియంను చిన్న మొత్తంలో నిల్వ చేసుకునేలా అణు ఒప్పందంలో ఇరాన్‌కు అవకాశం కల్పించడమే తప్పు. అసలు ఏ స్థాయిలోనూ యురేనియం నిల్వలను కలిగి ఉండేందుకు ఇరాన్‌ను అనుమతించి ఉండాల్సింది కాదు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు అమెరికాతోపాటు మా మిత్రదేశాలు కూడా ఎప్పటికీ అనుమతించవు’ అని అన్నారు. అణు ఒప్పందం ప్రకారం 300 కేజీల వరకు యురేనియంను నిల్వచేయొచ్చు. -
ఉత్తర కొరియాలో ట్రంప్
పన్‌మున్‌జొమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఉత్తర కొరియా వచ్చారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్‌మున్‌జొమ్ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమయింది. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ట్రంప్ ఆ దేశాధ్యక్షుడు కిమ్‌తో కలిసి నిస్సైనిక మండలంలోకి వచ్చారు. అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు మొదలు పెట్టేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. కాగా ట్రంప్ ఉత్తర కొరియా పర్యటనపై దక్షిణ కొరియాలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనిపై ఆశాభావం వ్యక్తం చేయగా, మరికొందరు దీనిని వ్యర్థ ప్రయత్నంగా పేర్కొన్నారు. కిమ్‌ను అమెరికాకు ఆహ్వానించినట్టు ట్రంప్ తెలిపారు. ఆయన రావాలనుకుంటే ఏప్పుడయినా అధ్యక్ష భవనానికి రావచ్చని కిమ్‌కు చెప్పినట్టు ట్రంప్ వెల్లడించారు. ఉత్తర కొరియా రమ్మనడం నాకు గౌరవకారణం. అలాగే, నేను ఉత్తర కొరియాలో అడుగుపెట్టడం నాకు గర్వకారణం’అని ట్రంప్ ఉత్తర కొరియా అధినేతతో అన్నారు. చర్చలకు కూర్చుంటూ ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల విభజనకు గుర్తుగా నిలిచిన ఈ ప్రాంతంలో మేం చేసుకున్న కరచాలనం గతాన్ని మరిచిపోవాలన్న మా ఆకాంక్షకు నిదర్శనం’ అని కిమ్ అన్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం జరిగింది. ట్రంప్ శనివారం ట్విట్టర్లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు ఆహ్వానం పంపారు. ఆదివారం వారిద్దరూ సమావేశమయ్యారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం అంతర్జాతీయంగా ఆందోళనకు దారి తీస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఉత్తర కొరియాను ఒప్పించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది సింగపూర్‌లో రెండు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. అది విఫలమయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌లు వియత్నాంలో మళ్లీ చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా ఫలప్రదం కాలేదు. 2017లో ఉత్తర కొరియా ఆరు అణు పరీక్షలను నిర్వహించింది. అమెరికాను చేరుకోగల క్షిపణులను పరీక్షించింది. గత ఏడాది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయేల మధ్య నిస్సైనిక మండలంలో మొదటి సారి సమావేశం జరిగింది. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య సయోధ్య కుదర్చడానికి మూన్ ప్రయత్నించారు.దానికి కొనసాగింపుగా ట్రంప్ ఇప్పుడు ఉత్తర కొరియాలో అడుగు పెట్టారు. ట్రంప్ కిమ్‌తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు. అణు చర్చలకు మార్గం సుగమం ట్రంప్ ఉత్తర కొరియా పర్యటనపై దక్షిణ కొరియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన అణు చర్చలు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరంటోంటే, వియత్నాం చర్చల్లాగే ఈ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఎదుర్కొనున్న ట్రంప్, మూన్‌లు ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పని చేశారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం
టెహ్రాన్: అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణుఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని యూరప్ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాండీ తెలిపారు. యూరప్ దేశాలు మౌనం వహిస్తే, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. సాధారణంగా అణుఇంధన రియాక్టర్లలో 20 శాతం వరకూ శుద్ధిచేసిన యురేనియంను వాడతారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ప్రతిగా 3.67 శాతం శుద్ధిచేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. -
వలసదారులతో సుసంపన్నం
వాషింగ్టన్: చట్టబద్ధంగా అమెరికాకు వస్తున్న వలసదారులతో దేశానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతోందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రాముఖ్యత మరోసారి నొక్కి చెప్పిన ట్రంప్..అమెరికా పౌరుల ఉద్యోగాలు, ప్రాణాల్ని పరిరక్షించే ఒక సుదృఢ వలస వ్యవస్థను రూపొందించాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్ని ఉద్దేశించి ఆయన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ పేరిట బుధవారం ప్రసంగించారు. ఏటా జరిగే ఈ జరిగే కార్యక్రమం అధ్యక్ష హోదాలో ట్రంప్‌కు రెండోది కావడం గమనార్హం. ప్రతీకార రాజకీయాలను తిరస్కరించాలని, భేదాభిప్రాయాలు పరిష్కరించుకోకుంటే మరో షట్‌డౌన్ వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రసంగంలో వివిధ అంశాలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. వలసలు, సరిహద్దు గోడపై.. చట్టాలు గౌరవించి, సక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారులు ఎన్నో విధాలుగా మన సమాజాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారు చట్టబద్ధంగా రావాలని కోరుకుంటున్నా. మన పౌరులందరి ప్రయోజనాల్ని రక్షించే ఒక వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మెక్సికోతో సరిహద్దు గోడ కోసం కలసి పనిచేద్దాం. రాజీకొద్దాం. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దే ఒప్పందం చేసుకుందాం. కాంగ్రెస్‌లో విభేదాలపై.. మరో ప్రభుత్వ షట్‌డౌన్ రాకుండా నివారించాలంటే విభేధాల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పాత గాయాలు మానేలా, భేదాభిప్రాయాలు పక్కనపెట్టి కొత్త పరిష్కారాలు, ఒప్పందాలు చేసుకుందాం. విదేశీ శత్రువులను ఓడించాలంటే స్వదేశంలో మనం కలసిపనిచేయాలి. తాలిబాన్‌తో చర్చలపై.. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతున్నాయి. శాంతి స్థాపనకు ప్రయత్నంచే సమయం వచ్చింది. తాలిబాన్లతో చర్చల్లో పురోగతి సాధిస్తే, అక్కడ మన సైన్యాన్ని తగ్గించి, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారిస్తాం. చైనా ఉత్పుత్తులపై టారిఫ్‌లు వేయడంపై చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు వేయడం ద్వారా అమెరికాకు ప్రతినెలా బిలియన్ల కొద్ది ఆదాయం వస్తోంది. అంతకుముందు, డ్రాగన్ దేశం మనకు ఒక్క డాలర్ కూడా ఇచ్చేది కాదు. దశాబ్దాలుగా అమెరికాకు ప్రతికూలంగా ఉన్న వాణిజ్య విధానాల్ని రద్దుచేయడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం. కొత్త అణు ఒప్పందం! భారత్, పాక్‌లను చేరుస్తూ ట్రంప్ సరికొత్త అణు ఒప్పందాన్ని ప్రతిపాదించారు. భారత్‌కు చెందిన పృథ్వీ, అగ్ని క్షిపణులు, పాక్‌కు చెందిన బాబర్, షహీన్, ఘోరి లాంటి క్షిపణుల ప్రయోగాలపై నియంత్రణ ఉండేలా ఆయన ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఆయన నేరుగా భారత్‌ను ప్రస్తావించలేదు. కాగా, కార్యక్రమానికి డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మహిళా సభ్యులు తెలుపు రంగు డ్రెస్‌లలో వచ్చారు. 20వ శతాబ్దంలో ఓటుహక్కు కోసం ఉద్యమించిన మహిళల జ్ఞాపకార్థం వారీ రంగు దుస్తుల్లో వచ్చారు. కాగా, ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు ఈ నెల 27, 28న వియత్నాంలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
చమురు 'చదరంగం'
నవంబర్ 4... చమురు దిగుమతులపై ప్రపంచ దేశాలకు అమెరికా విధించిన గడువు. ఆ తేదీ నుంచి అన్ని దేశాలు ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా, మిత్రదేశాలు వైదొలగాయి. ఇరాన్‌ను ఒంటరి చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆ దేశంపై ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురుతోపాటు మరికొన్ని వస్తువులు దిగుమతి చేసుకోరాదని, అలా చేసిన దేశాలు కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నవంబర్ 4 తర్వాత ఇరాన్ నుంచి చమురు ఉత్పాదనల దిగుమతిని జీరో స్థాయికి తీసుకురావాలని షరతు విధించారు. దాంతో చవకగా దొరికే ఇరాన్ చమురు ఉత్పాదనలపై ఆధారపడిన దేశాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య చమురు ఒక చదరంగం ఆటగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నౌకల గమ్యం ఒక్కసారిగా మారిపోతోంది. అమెరికా ఆధిపత్యం... ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినప్పటి నుంచి అమెరికా చమురు ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. 2015 వరకు తన చమురు నిల్వలను ఎగుమతి చేసే విషయంలో అమెరికా విపరీతమైన పరిమితులు విధించుకుంది. 2015 చివర్లో అమెరికా ఈ పరిమితులన్నింటినీ సడలించింది. దాంతో నెమ్మదిగా ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు కొన్ని వందల బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతి చేసే అమెరికా... ఇప్పుడు ఆసియా, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలకు రోజుకు 2 లక్షల బ్యారెళ్ల చొప్పున ఎగుమతి చేస్తున్నట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. బయటకు చెప్పకపోయినా అమెరికాలోని అన్ని రకాల చమురు నిల్వల స్థాయి సౌదీ అరేబియా కంటే ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంలో దక్షిణ కొరియాకు అమెరికా చమురు ఎగుమతులు 313 శాతం పెరిగి ప్రస్తుతం రోజుకు 2,67,000 బ్యారెళ్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ సంస్థ చెబుతోంది. అలాగే జపాన్‌కు 198 శాతం, భారత్‌కు 165 శాతం ఎగుమతులు పెరిగాయి. బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలకూ చమురు రవాణా గణనీయంగా పెరిగింది. చైనా దిగుమతులు ఆగిపోవడంతో ఆ మేర అమెరికా చమురు మార్గాలు ఇతర ఆసియా దేశాలు, ఐరోపా వైపు మళ్లినట్లు కనిపిస్తోందని అమెరికా ఆర్థిక నిపుణుడు కరోలినే బెయిన్ అన్నారు. చమురు కోసం ఇరాన్‌పై ఆధారపడ్డ దేశాలకు తాము ప్రత్యామ్నాయం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్న భరోసా వెనుక అంతరార్థం అర్థం చేసుకోవచ్చు. అయోమయంలో ఐరోపా... ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, ఇరాన్‌పై ఆంక్షలు విధించడాన్ని ప్రధాన ఐరోపా దేశాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఒప్పందం యథాతథంగా కొనసాగాలని ఇప్పటికీ పట్టుబడుతున్నా ఇప్పుడు నవంబర్ 4 గడువును ఎలా అధిగమించాలా అనే సంశయంలో పడ్డాయి. అమెరికాతో ఉన్న సుదీర్ఘ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకునేందుకు ఈ దేశాలు సిద్ధంగా లేవు. అలాగని ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకునేందుకు అంగీకరించే పరిస్థితులు లేవు. ఇరాన్ చమురు దిగుమతులను పూర్తిగా ఆపేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాయి. అంతర్జాతీయ వ్యాపారం.. ముఖ్యంగా చమురు కొనుగోలు విషయంలో డాలర్ స్థానంలో యూరోను ప్రత్యామ్నాయ మారకంగా తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. అలాగే ఆంక్షల జోలికి పోకుండా చట్టబద్ధంగా ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఐరోపా బ్యాంకులు తెరపైకి తెచ్చాయి. అయితే ఇరాన్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి ఐరోపా, భారత్ పూర్తిగా సిద్ధంగా లేవని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయని తెలుసుకున్న అమెరికా ఆందోళన చెందుతోంది. ఇరాన్ చమురు విషయంపై చర్చించడానికి అత్యవసరంగా యూరప్ వెళ్లనున్న అమెరికా ఉన్నతస్థాయి ప్రతినిధి బ్రెయిన్ హుక్ ఆ తర్వాత భారత్‌తో సంప్రదింపుల కోసం ఆయన ఈ వారంలో ఢిల్లీ రానున్నారు. ఈ సంప్రదింపులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మరోవైపు చమురు వ్యాపారంలో తన ప్రత్యర్థి అయినప్పటికీ ఇరాన్‌కు మద్దతివ్వడానికి రష్యా ముందుకొస్తోంది. అమెరికా ఆంక్షలు అమలు కాకుండా ఏ విధమైన వ్యూహం అమలు చేయాలన్న విషయంపై ఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఖాతరు చేయని చైనా.. అమెరికాతో ఇప్పటికే వాణిజ్యపరమైన యుద్ధం చేస్తున్న చైనా ట్రంప్ విధించిన నిషేధాన్ని ఖాతరు చేయడం లేదు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తులను వినియోగించే చైనా తన అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతిని యథావిధిగా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అంతే కాదు.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును పూర్తిగా నిలిపేసింది. అమెరికన్ చమురు పొందే దేశాల్లో చైనాది రెండో స్థానం. 2016 జూలై వరకు చైనా రోజుకు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. అమెరికా సెన్సెక్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016 ఆగస్టు తర్వాత చైనా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపేసింది. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కొలంబియా నుంచి వచ్చే చమురు పరిమాణం ఇటీవలి కాలంలో ఐదు రెట్లు పెరిగింది. అలాగే బ్రెజిల్ చమురు కూడా ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి చైనా ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా 17.1 కోట్ల బ్యారెళ్ల చమురును నిత్యం పొందుతోంది. అలాగే ఒమన్, కువైట్ నుంచి కూడా చైనాకు చమురు రవాణా విపరీతంగా పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ టాంకర్ ట్రాకర్ పసిగట్టింది భారత్ దారి ఎటు? ఇరాన్‌పై ఆంక్షల విషయంలో తమకు సడలింపు ఇవ్వాలంటూ అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఒకవైపు రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం మరోవైపు ఇరాన్ నుంచి అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుం టుండటం అమెరికా సహించలేకపోతోంది. అమెరికా షరతులను అంగీకరించని దేశాలపై విధించే తమ చట్టం కాట్సూ పరిధిలోకి భారత్ వైఖరి వస్తుందని అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నుంచి చవకగా లభించే చమురు ఉత్పత్తుల దిగుమతిని పూర్తిగా నిలిపేయడానికి భారత్ సిద్ధంగా లేదు. అదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య, రక్షణ, సాంకేతిక సంబంధాలను దూరం చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. 2017–18లో మొత్తం 22 కోట్ల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న భారత్ (ఇరాన్ మొత్తం ఎగుమతుల్లో ఇది 9 శాతం) తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దేశం నుంచి చమురు దిగుమతులను కొంత తగ్గించుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోటును భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఆంక్షలకు ముందు (2015) మాదిరిగానే ఇరాన్‌తో చమురు దిగుమతికి రూపాయిని మారకంగా ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నవంబర్ మాసానికి భారత ప్రభుత్వరంగ చమురు సంస్థ ఐవోసీ, ఎంఆర్‌పీఎల్ 12.5 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతికి ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మరోవైపు చమురు కోసం ఇతర దేశాలతోనూ భారత్ చర్చిస్తోంది. బ్యారెల్ 100 డాలర్లు? ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు, పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్)లో సభ్యత్వంగల వెనిజులాలో సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు చేరుకోవచ్చన్న ఊహాగానాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. 2016 వరకు 50 డాలర్లలోపు ఉన్న ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70–80 డాలర్ల మధ్య ఊగిసలాడుతుండగా ఇది 100 డాలర్లకు పెరిగే అవకాశాలు న్నాయని నిపుణులు భావిస్తు న్నారు. విమానయాన రంగం భారీగా విస్తరించడం, ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగకపోవడంతో చమురు వినియోగం పెరిగి దాని డిమాండ్‌ను విపరీతంగా పెంచు తోందని ‘ది గార్డియన్’ పత్రిక అంచనా వేసింది. నవంబర్‌లో ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురు రోజుకు 20 లక్షల బ్యారెళ్లు తగ్గడంతో వచ్చే ఏడాదికి చమురు ధర 100 డాలర్లకు చేరినా ఆశ్చర్యం పోనవసరం లేదని చమురు వ్యాపార నిపుణుడు అలెక్స్ బియార్డ్ ఇటీవల లండన్‌లో జరిగిన ఓ సదస్సులో చెప్పారు. ప్రస్తుతం ముడి చమురు రేటు 78 డాలర్లు ఉండగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీలో లీటరుకు వరుసగా రూ. 82.86, రూ. 74.12గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర ఏకంగా రూ. 90.22కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోతుండటంతో ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం కల్లా పెట్రోల్ రేటు రూ. 100కు చేరుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్ బంకుల్లో మిషన్లను మూడంకెల రేటు వచ్చేలా మార్చేందుకు సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధర 100 డాలర్లకు పెరిగి, మన దేశంలో రూపాయి విలువ తగ్గిపోతున్న దశలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు ఎంతగా పెరుగుతాయన్న అంచనాల్లో నిపుణులు నిమగ్నమయ్యారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇరాన్‌తో వ్యాపారం చేస్తే మాతో రద్దు
టెహ్రాన్: అణు ఒప్పందం రద్దు తర్వాత ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మళ్లీ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇరాన్‌తో ఏ దేశమైనా వ్యాపారం చేస్తే, ఆ దేశంతో అమెరికా తన వ్యాపారాన్ని నిలిపేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ‘ఇరాన్‌పై మరింత సమర్థవంతమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నవంబర్‌లో వాటి స్థాయి మరింత పెరుగుతుంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశం మాతో వారి వాణిజ్యాన్ని నిలిపేయాల్సి ఉంటుంది. ప్రపంచ శాంతి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను’ అని ట్రంప్ ట్విటర్లో హెచ్చరించారు. ఆ వెంటనే జర్మన్ కార్ల తయారీ కంపెనీ డైమ్లర్.. ఇరాన్‌తో తన కార్యకాలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ ప్రజల్లో కోపం, భయం, దిక్కారం వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి
వాషింగ్టన్: అణు ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్‌పై అమెరికా 2015లో ఎత్తేసిన ఆంక్షలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి సోమ విధించారు. మంగళవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ ఈ ఏడాది మే నెలలోనే రద్దు చేయడం తెలిసిందే. మరింత సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆంక్షలను తొలగించేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా తాజాగా విధించిన ఆంక్షల ప్రభావం భారత్ వంటి పలు దేశాలపై తీవ్రంగా ఉండనుంది. అమెరికా తాజా నిర్ణయంతో ఆటోమొబైల్ రంగం, బంగారం సహ ఇతర విలువైన లోహాలు, ముడి చమురు తదితరాల్లో ఇరాన్‌తో ఇతర దేశాలు వ్యాపారాన్ని నిలిపేయడమో తగ్గించుకోవడమో చేసుకోవాల్సి వస్తుంది. -
అమెరికావి బందిపోటు షరతులు
ప్యాంగ్యాంగ్: అణు నిరాయుధీకరణ కోసం అమెరికా బందిపోటు మాదిరి షరతులు పెడుతోందని ఉత్తరకొరియా మండిపడింది. చర్చల సందర్భంగా ఆ దేశం వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరమని పేర్కొంది. అయితే, తమ మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయని అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ ఇటీవల సింగపూర్‌లో జరిపిన శిఖరాగ్ర భేటీ అనంతరం పాంపియో గత రెండు రోజుల్లో 8 గంటలపాటు ఉత్తరకొరియా కీలక నేత యోంగ్ చోల్‌తో చర్చించారు. ‘సింగపూర్ సమావేశం స్ఫూర్తిని దెబ్బతీసేలా మైక్ పాంపియో వ్యవహరిస్తున్నారు. అణ్వాయుధాలను వదిలివేసేందుకు ఏకపక్షంగా, బందిపోటు మాదిరి బెదిరిస్తూ అనేక డిమాండ్లను మా ముందుంచారు’ అని చర్చల అనంతరం ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది. -
‘ప్రత్యేక భాగస్వామ్యం’ మనది
సోచి: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరాయని, ఇది ఇరు దేశాలు సాధించిన భారీ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు నాటిన వ్యూహాత్మక భాగస్వామ్యమనే విత్తనాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పుతిన్‌తో చర్చలు విజయవంతంగా సాగాయని, భారత్–రష్యాల మధ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ తెలిపారు. రష్యాలోని నల్లసముద్ర తీరప్రాంత నగరమైన సోచిలో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మోదీ అనధికారికంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానిస్తూ.. మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. నాలుగు నుంచి ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపైనే ఎక్కువ సమయం చర్చించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, అఫ్గానిస్తాన్, సిరియాల్లో పరిస్థితి, ఉగ్రవాద ముప్పు, త్వరలో జరగనున్న ఎస్సీవో, బ్రిక్స్ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌ల మధ్య చర్చ జరిగింది. పుతిన్‌కు ప్రత్యేక స్థానం: మోదీ భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి రష్యాలో పర్యటించడాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కలుసుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు పుతిన్. నా రాజకీయ జీవితంలో పుతిన్, రష్యాలకు ప్రత్యేక స్థానం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, రష్యాలు ఎప్పటినుంచో మిత్రదేశాలు., ఆ రెండింటి మధ్య ఇంతవరకూ విభేదాలు లేని మైత్రి కొనసాగింది. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్ల స్నేహ సంబంధాల్లో ఈ అనధికారిక భేటీ ఒక కొత్త కోణం. దీనిని ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. భారత్, రష్యాల మధ్య సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా గత 18 ఏళ్లలో అనేక అంశాలపై పుతిన్‌తో చర్చించే అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ను అభినందించారు. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు చరిత్రాత్మక స్థాయికి చేరాయని మోదీ ప్రశంసిం చారు. సోచిలో బొకారెవ్ క్రీక్ నుంచి ఒలింపిక్ పార్కు వరకూ ఇరువురు బోటు షికారు చేశారు. ఇరు దేశాలకు ప్రయోజకరంగా..: రష్యా సోమవారం నాటి చర్చలు చాలా ఉత్సుకతతో, ఇరు దేశాలకు ఉపయోగకరంగా సాగాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను ఉద్దేశించి ఆ దేశ అధికారిక వార్తాపత్రిక టాస్ పేర్కొంది. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా–భారత్ మధ్య సైనిక సహకారంపై చర్చలు జరుగుతాయని పెస్కోవ్ చెప్పారు. రష్యా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ సోమవారం రాత్రి భారత్‌కు పయనమయ్యారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి పుతిన్ వీడ్కోలు పలికారు. -
జూన్ 12న ట్రంప్, కిమ్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల తొలి శిఖరాగ్ర సమావేశానికి వేదిక, తేదీ ఖరారయ్యాయి. జూన్ 12న సింగపూర్‌లో ఇరువురు నేతలు భేటీ అయి కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణపై చర్చలు జరపనున్నారు. స్వయంగా ట్రంపే గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఉత్తర కొరియా నిర్బంధం నుంచి ముగ్గురు అమెరికా పౌరులను విడిపించుకుని విదేశాంగ మంత్రి మైక్ పోంపియో స్వదేశం చేరుకున్న వెంటనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. -
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
వాషింగ్టన్: ఏడు దేశాలు రెండేళ్లపాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత 2015లో సాకారమైన చారిత్రక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ‘క్షీణించిన, కుళ్లినది’గా అభివర్ణించే ట్రంప్.. తాను అధికారంలోకి వస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని 2016లో ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే జేసీపీవోఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు మంగళవారం ట్రంప్ ప్రకటించారు. తననిర్ణయంతో అమెరికా మిత్రదేశాలతోనూ విభేదాలు తెచ్చుకున్నారు. అమెరికాతో సంబంధం లేకుండా తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, ఇరాన్ కూడా అలాగే చేయాలని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలతోపాటు జర్మనీ కూడా కలసి ఇరాన్‌తో రెండేళ్లపాటు చర్చలు జరిపిన అనంతరం 2015లో వియన్నాలో జేసీపీవోఏ ఒప్పందం కుదరడం విదితమే. అణు కార్యక్రమాలను నిలిపివేసినందుకుగాను అప్పటివరకు ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేశారు. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ద్వారా ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ చట్టంగా కూడా గుర్తించారు. ‘మనం ఇరాన్ అణు బాంబును నియంత్రించలేమనేది నాకు స్పష్టంగా తెలుసు. ఈ ఒప్పందం మూలంలోనే లోపాలు ఉన్నాయి. కాబట్టే దీని నుంచి అమెరికా తప్పుకుంటున్నదని నేను ప్రకటిస్తున్నాను’ అని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించారు. ట్రంప్ నిర్ణయ ప్రభావమెంత? అమెరికాప్రకటించిన ఆంక్షలు ఇరాన్ ఆటోమొబైల్ రంగంపై మూడు నెలల తర్వాత, చమురు రంగంపై ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. కాబట్టి అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశాల్లేవు. అమెరికా మిత్ర దేశాలు అనేకం ఇరాన్ నుంచి ముడి చమురు కొంటున్న నేపథ్యంలో అవి అమెరికాను అనుసరిస్తూ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ మిత్రదేశాల బ్యాంకులపై అమెరికా ఆరు నెలల తర్వాత ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐరోపా మిత్రదేశాలు కోరుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల మిత్ర దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీలు అమెరికాకు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. భారత్‌పై తక్షణ ప్రభావం ఉండదు: ఇరాన్‌పై అమెరికా పునరుద్ధరించిన ఆర్థిక ఆంక్షలను ఐరోపా దేశాలు పాటించనంత వరకు భారత ముడిచమురు దిగుమతులపై ప్రభావం ఉండదని భారత అధికారులు వెల్లడించారు. -
పార్లమెంట్లో అమెరికా జెండాకు నిప్పు
తెహ్రాన్ : ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో, ఐక్యరాజ్యసమితితోపాటు అమెరికా మిత్రదేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఇటు ఇరాన్ సైతం డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ అనూహ్య ప్రకటనపై తీవ్రంగా మండిపడుతోంది. ఇరాన్ చట్టసభ్యులు ఏకంగా తమ పార్లమెంట్లో అమెరికా జెండానే తగులబెట్టేశారు. ‘అమెరికాకు మరణం’ అంటూ ఆందోళన చేశారు. బుధవారం ఉదయం తెహ్రాన్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సుమారు 20 మంది చట్టసభ్యులు స్పీకర్ చాంబర్ వద్దకు వెళ్లి ఈ ఆందోళన చేపట్టారు. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మంగళవారం రాత్రి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నీ ఇరాన్‌పై తిరిగి విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు ఒప్పందం విధ్వంసకరమన్నారు. తమ నిర్ణయాన్ని కాదని ఏ దేశమైనా ఇరాన్‌కు సహకారం అందిస్తే అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలను నమ్మొద్దని ఇరాన్ చట్టసభ్యుడు అయతోలహ్ అలీ ఖమెనెయి ఆరోపించారు. ఇరాన్ డీల్‌కు సంబంధించిన సింబాలిక్ కాపీని సైతం అమెరికా జెండాతో పాటు తగులపెట్టేశారు. దేశీయ బాలీస్టిక్ మిస్సైల్ ప్రొగ్రామ్‌పై తాము వెచ్చిస్తూనే ఉంటామని చట్టసభ్యులు అమెరికాను హెచ్చరించారు. అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో, ఈ విషయాలను డీల్ చేసే విషయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మానసిక సామర్థ్యం సన్నగిల్లినట్టు తెలుస్తుందని చట్టసభ్యులు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు గత రాత్రి చేసిన కామెంట్లు చాలా సిల్లీగా ఉన్నాయని అయతోలహ్ అలీ ఖమెనెయి అన్నారు. ఆయన చేసిన కామెంట్లలో 10కి పైగా వ్యాఖ్యలు నిరాధారమైనవేనని, ట్రంప్ పాలనలో అంతా ముప్పేనని ఆరోపించారు. ‘ఇరాన్ ప్రజల తరుఫున చెబుతున్నా. మీరు చేసింది చాలా పెద్ద తప్పు’ అని అన్నారు. ఖమెనెయి ఇప్పటికే పలుమార్లు అమెరికాపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. ఇరాన్లో అత్యధిక అథారిటీ కలిగిన నేత ఖమెనెయి. -
సంచలన ప్రకటన.. అమెరికాకు షాక్
న్యూయార్క్ : అణు ఒప్పందాల విషయంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అణు ఒప్పందం నుంచి తప్పుకుంటే.. తాము అణు పరీక్షలను మొదలుపెడతామని అమెరికాకు షాకిచ్చింది. ఈ మేరకు యూఎస్ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జరీఫ్ ప్రకటించారు. ఆదివారం న్యూయార్క్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘ఇరాన్, అగ్ర దేశాల(చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ) మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. అయితే అణు ఒప్పందాన్ని పాటించటంలో అమెరికా విఫలం అయ్యింది. ఒప్పందం ప్రకారం మేం అణు పరీక్షలకు దూరంగా ఉన్నాం. కానీ, ఇప్పుడు అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తోంది. వారు గనుక ఆ పని చేస్తే మేం అణు పరీక్షలు నిర్వహించటం మొదలుపెడతాం. అణు బాంబులను తయారు చేస్తాం’ అని హెచ్చరించింది. అణు ఒప్పందం తర్వాత.. 2016లో ఒబామా హయాంలో అణు సంబంధిత ఆంక్షల ఎత్తివేత షరతు మేరకు ఇరాన్-అమెరికాల మధ్య మరో ఒప్పందం కూడా జరిగింది. కానీ, అమెరికా మాత్రం అన్ని ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ వార్నింగ్‌పై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రోన్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై ఇరాన్ హెచ్చరికలపై చర్చించారు. ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంటేనే మంచిదని.. అలా అయితే ఇరాన్‌ను కట్టడి చేయొచ్చని ఆయన ట్రంప్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు అణు ఒప్పందంపై ఓ నిర్ణయానికి రావాలంటూ యూరోపియన్ యూనియన్ దేశాలకు అమెరికా అల్టిమేటం(మే 12వ తేదీ) ప్రకటించింది. అణుఒప్పందానికి భారత్ స్వాగతం -
ట్రంప్ వింత పోకడ
అమెరికా అధ్యక్ష పీఠం అధిష్టించిన నాటినుంచీ ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేయాలని తహతహలాడుతున్న డోనాల్డ్ ట్రంప్ ఆ దిశగా తొలి అడుగేశారు. రెండేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఆ ఒప్పందాన్ని తాజాగా ధ్రువీకరించేందుకు నిరాకరించారు. ఇది నేరుగా ఆ ఒప్పందంనుంచి వైదొలగే చర్య కాకపోయినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడానికి, తిరిగి అని శ్చితి ఏర్పడటానికి దారితీస్తుంది. ఒప్పందాన్ని సవరించి అందులో కొత్త డిమాండ్లు చేర్చాలన్నది ట్రంప్ ప్రధాన వాదన. ఒప్పందంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్య క్రమాన్ని చేర్చాలని, సిరియా, ఇరాక్లలో ఇరాన్ రివల్యూషనరీ గార్డుల ఉనికి గురించి కూడా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నారు. క్షిపణి కార్యక్రమం తమ ఆత్మరక్షణ కోసం ఉద్దేశించిందే తప్ప ఎవరిపైనా దాడి చేయడానికి కాదని ఇరాన్ అంటున్నది. అలాగే 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించిన రివల్యూషనరీ గార్డు వ్యవస్థను పటిష్టం చేసుకోవడం తమ హక్కని చెబుతోంది. ఇరాన్ తీసుకుంటున్న ఈ చర్యలు రెండూ పశ్చిమాసియాలో దాని ప్రాబల్యాన్ని పెంచుతాయని, తమకు ముప్పు తీసుకొస్తాయని సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఆందోళనపడుతున్నాయి. ఆ రెండు దేశాల ప్రయోజనాలనూ పరిరక్షించడమే ధ్యేయంగా అమెరికా తాజా చర్యకు పూనుకుంది. నిజానికి ఒప్పందం కుదిరిననాడే రిపబ్లికన్ పార్టీ దాన్ని దుయ్యబట్టింది. తమ పార్టీ అధికారంలోకొచ్చాక ఒప్పం దాన్ని రద్దు చేస్తామని ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే చెప్పారు. వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు మొదలెట్టాలని భావించినా విదేశాంగ శాఖ ఉన్నతా ధికారులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఒప్పందాన్ని ఇరాన్ తు చ తప్పకుండా పాటిస్తున్నప్పుడు ఇలా చేయడం అసాధ్యమని వివరించారు. అందుకే ఇరాన్‌కు ఆగ్రహం కలిగించి, దానంతటదే ఒప్పందంనుంచి వైదొలగేలా చేయాలని ట్రంప్ ఎత్తుగడలేశారు. అది కూడా సాధ్యపడకపోవడంతో ఎప్పటికప్పుడు ఒప్పందాన్ని అయిష్టంగానే ధ్రువీకరిస్తున్నారు. ఇప్పుడిక ధ్రువీకరణకు నిరాకరించారు. అయితే ఇది అమెరికాకు ఇరాన్‌తో మాత్రమే కాదు... ఆ ఒప్పందంలో భాగంగా ఉన్న బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలతో కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇకపై ఏ ఒప్పందంలోనూ అమెరికాతో కలిసి నడవరాదని ఆ దేశాలు నిర్ణయిస్తే అంతర్జాతీయంగా అమెరికా ఏకాకి అవుతుంది. దాని ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కొత్త పార్టీ అధికారంలోకొచ్చినప్పుడల్లా పాత ఒప్పందాలను తిరగదోడే సంస్కృతి మొదలైతే ఏ దేశాన్నీ మరో దేశం విశ్వసించే స్థితి ఉండదు. ఇప్పటికే బ్రిటన్ విదే శాంగమంత్రి బోరిస్ జాన్సన్ అమెరికా వైదొలగినా ఒప్పందం కొనసాగుతుందని చెబుతున్నారు. కొన్నాళ్లక్రితం తానే తూర్పారబట్టిన ఒప్పందాన్ని... అధికారంలోకొచ్చిన వెంటనే వెనువెంటనే రద్దు చేస్తానని చెప్పిన ఒప్పందాన్ని నిర్ణీత వ్యవధిలో ఎప్పటికప్పుడు ధ్రువీకరించాల్సి రావడంతో ట్రంప్‌కు తలకొట్టేసినట్టవుతోంది. అలాగని దాన్నుంచి పూర్తిగా తప్పుకుంటే పర్యవసానాలెలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే ఉత్తర కొరియా కొరకరాని కొయ్యగా మారింది. ఎన్నివిధాల బెదిరిం చాలని చూసినా, దూషిస్తున్నా ఆ దేశాధ్యక్షుడు కిమ్ లొంగిరావడం లేదు సరి గదా... ఒకటికి పది మాటలు అంటిస్తున్నారు. క్షిపణి పరీక్షలు జరుపుతూ ఆ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లను బెంబేలెత్తి స్తున్నారు. ఆ విషయంలో ప్రపంచ దేశాలను సంప్రదించడం, వివిధ మార్గాల్లో పరిష్కారానికి ప్రయత్నించడంలాంటివి చేయాల్సిన తరుణంలో సమస్యలేని చోట నిప్పెట్టాలని చూసే ధోరణి తగదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలో ఆ దేశాలన్నీ ఇరాన్‌తో చర్చల్లో పాల్గొన్నాయి. తమతోపాటు అమె రికా కూడా సంతృప్తి చెందాకే ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంలోని అంశాలన్నిటికీ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చి ఇరాన్ దానిపై సంతకం చేసింది. ఆమాటకు అది కట్టుబడి ఉన్నంతకాలమూ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న దేశాలు ఆంక్షల్ని సడలించాల్సిందే. ఒప్పందంలో అమెరికా ధ్రువీకరణ భాగం కాదు. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా రూపొందించుకున్న ఇరాన్ అణు ఒప్పంద సమీక్షా చట్టంలోని అంశమది. ఆ చట్టం ప్రకారం ప్రతి 90 రోజులకూ అమెరికా అధ్యక్షుడు అణు ఒప్పందాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా అమెరికన్ కాంగ్రెస్ 60 రోజుల్లో ఇరా న్పై ఆంక్షలకు సిద్ధపడొచ్చు. ఒప్పందాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లదే అక్కడ పైచేయి గనుక అదేమంత కష్టం కాకపోవచ్చు. అయితే వర్తమాన పరిస్థితుల్లో రిపబ్లికన్లు అందుకు సిద్ధపడతారా అన్నదే ప్రశ్న. ఇంతకాలమూ అమెరికా చెప్పినట్టల్లా వ్యవహరిస్తున్న పాశ్చాత్య దేశాలు ఈ తాజా పరిణామాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండటం ఒక అనుకూలాంశం. ఈ విష యంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు ఒకే స్వరం వినిపిస్తున్నాయి. అణు ఒప్పందం ఏ ఒక్క దేశానిదో కాదని... దాన్ని కొనసాగించాలా లేదా అన్నది ఎవరో ఒకరే నిర్ణ యించడం కుదరదని ఆ దేశాలు చెబుతున్నాయి. రష్యా, చైనాలు సైతం సహజంగా ఇరాన్ పక్షం ఉంటాయి. ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా భాగస్వామ్య దేశాలు ఒప్పందాన్ని గౌరవించినంతకాలమూ ఇరాన్ కూడా దానికి కట్టుబడి ఉంటుందని చెప్పడం మినహా ఒప్పందాన్ని అమెరికా కాలదన్నితే తమ వ్యూహమేమిటన్నది బయటపెట్టలేదు. ఒప్పందం కుదిరి, అది సక్రమంగా అమ లవుతున్నప్పుడు కొత్త అభ్యంతరాలు లేవనెత్తడం, కొత్త షరతులు విధించాలనుకో వడం అమెరికా ప్రతిష్టనే దిగజారుస్తుంది. తన మిత్ర దేశాలకు లబ్ధి చేకూర్చడం కోసం ఇరాన్‌ను నిరాయుధం చేయాలనుకోవడం, సహచర పాశ్చాత్య దేశాల అభ్యంతరాలను సైతం బేఖాతరు చేయడం అమెరికా ప్రతిష్టకు హాని కలిగిస్తాయి. దాని విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. ఆ దుస్థితిని నివారించగలిగినవారు, కూర్చున్న కొమ్మను నరుక్కునే ఇలాంటి పోకడలను అరికట్టగలిగినవారు అమెరికా పౌరులే. వారందుకు సిద్ధపడాలి. -
అమెరికాకు మరో ఝలక్.. ఈసారి ఇరాన్!
టెహ్రాన్: అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. మధ్యంతరశ్రేణి క్షిపణిని తాజాగా విజయవంతంగా పరీక్షిచినట్టు ఇరాన్ ప్రకటించింది. క్షిపణీ పరీక్షలు చేపడితే.. ఇరాన్ తో చేసుకున్న చారిత్రక అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామని అమెరికా హెచ్చరించినా.. ఆ దేశం ఏమాత్రం లెక్కచేయలేదు. శుక్రవారం నిర్వహించిన భారీ ఆయుధ కవాతులో ప్రదర్శించిన ఖోరామ్ షాహ్ర్ క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ శనివారం ప్రసారం చేసింది. అయితే, ఈ క్షిపణిని ఎప్పుడు పరీక్షించారనే వివరాలను టీవీ వెల్లడించలేదు. ఈ క్షిపణిని త్వరలోనే ప్రయోగిస్తామని అధికారులు శుక్రవారం మీడియాకు చెప్పారు. ఇప్పటికే ఉత్తర కొరియా తెగేసి అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం అమెరికాకు సవాలుగా మారింది. ఈ విషయమై అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. తాజాగా ఇరాన్ సైతం అగ్రరాజ్యం హెచ్చరికలను బేఖాతరు చేయడం గమనార్హం. -
ఇరాన్ ఓటర్ల వివేకం!
అటో, ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే ఏ దేశ పౌరులైనా ఏం చేస్తారో ఇరాన్ పౌరులు కూడా అదే చేశారు. గత నెల 26న ఆ దేశ పార్లమెంటు మజ్లిస్‌కూ, నిపుణుల అసెంబ్లీకీ జరిగిన ఎన్నికల్లో ఛాందసవాద, అతివాద అభ్యర్థులను ఓడించి మితవాదులు, సంస్కరణవాదుల కూటమికి పట్టంగట్టారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు హసన్ రౌహానీపై గత కొన్నేళ్లుగా ఛాందసవాదులు, అతివాదులు కారాలు మిరియాలు నూరుతున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని పాశ్చాత్య దేశాలకు ఆయన తాకట్టు పెట్టారన్నది వారి ప్రధాన ఆరోపణ. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌పై అమలవుతున్న కఠోరమైన ఆంక్షలు తాత్కాలికంగా నిలిచిపోవడానికి వీలుకల్పించిన అణు ఒప్పందానికి అంగీకరించడమే వారి దృష్టిలో పెద్ద నేరం. దేశాన్ని శక్తిమంతంగా, శత్రు దుర్భేద్యంగా మార్చడానికి దోహదపడే అణ్వస్త్రాల బాటలో పోకుండా పాశ్చాత్య దేశాల షరతులకు రౌహానీ తలొగ్గాడన్నది వారి వాదన. తమవద్ద అణ్వాయుధాలు ఉంచుకుని...వాటిని కనీసం తగ్గించుకునే ప్రయ త్నం కూడా చేయని అగ్రరాజ్యాలు మరే దేశమూ కొత్తగా ఆ దోవన పోకూడదని హుకుం జారీ చేయడంలో అప్రజాస్వామికత ఉన్న సంగతి వాస్తవమే. తమకు అను కూలంగా ఉండేవారూ, తమ మిత్రులుగా ఉండేవారూ ఎంతటి ప్రమాదకారులైనా పట్టించుకోని తత్వం ఆ దేశాలది. అలాంటి అప్రజాస్వామిక ధోరణితోనే ఇరాన్‌ను ఆంక్షల చట్రంలో బిగించి ఆ దేశ ప్రజానీకాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇరాక్, లిబియా, సిరియా,యెమెన్ తదితర దేశాల్లో ఎదురవుతున్న పరా జయాల అనంతరం పశ్చిమాసియాలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోపడ్డాక పాశ్చాత్య దేశాలు ఇరాన్ విషయంలో తమ వైఖరిని సడలించుకున్నాయి. అసలు ఇరాన్లో ఏ తరహా అణు కార్యక్రమమైనా కొనసాగడానికి వీల్లేదన్న అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు కొన్ని పరిమితులతో దాన్ని ఉపయోగించుకోవచ్చునని మెట్టు దిగాయి. ఆ విషయంలో ఇరాన్ ఆచరణ చూశాకే ఆంక్షలు దశలవారీగా ఎత్తే స్తామని బేరం పెట్టాయి. ఇరాన్ ఇందుకు అంగీకరించలేదు. పరస్పరం విశ్వాసం కలిగి ఉండే పక్షాలమధ్య మాత్రమే చర్చలు ఫలిస్తాయని, అలాంటి విశ్వాసం ఏర్ప డాలంటే ఆంక్షలు ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అందువల్లే ఆయుధాలు, క్షిపణులపై ఉండే ఆంక్షలు మినహా మిగిలినవాటిని పాశ్చాత్య దేశాలు సడలించక తప్పలేదు. మొన్న జనవరిలో ఇరాన్‌పై ఆంక్షలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరిచింది. ఛాందసవాదుల దూకుడుతో రౌహానీ రాజకీయ భవితవ్యం ఏమవుతుందన్న సందే హాలు సైతం వ్యక్తమయ్యాయి. పాశ్చాత్య దేశాలతో చర్చించడంద్వారా ఇరాన్‌ను ఘర్షణాత్మక పంథానుంచి తప్పిస్తానని, ఆంక్షలు సడలేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మూడేళ్లక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రౌహానీ విజయం సాధించారు. అయితే మజ్లిస్‌లోనూ, నిపుణుల అసెంబ్లీలోనూ ఆయనకు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత విజయం ఆ అవరోధాలను గణనీయంగా తగ్గించింది. ఆయనకు బలాన్ని చేకూర్చింది. 290మంది ఉన్న మజ్లిస్‌లో ఛాందసవాదులు, అతివాదులకు 103 స్థానాలు లభించగా మితవాదులకూ, సంస్కరణవాదులకూ 95 సీట్లు వచ్చాయి. 14మంది స్వతంత్రులు కూడా ఎన్నికయ్యారు. విజేతకు అవస రమైన కనీస మెజారిటీ ఎవరికీ లభించనందువల్ల 69 స్థానాల్లో వచ్చే ఏప్రిల్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. మత గురువుల ఆధిపత్యం ఉండే 88మంది సభ్యుల నిపుణుల అసెంబ్లీలో అత్యధిక స్థానాలు రౌహానీ నేతృత్వంలోని కూటమి గెల్చుకుంది. రౌహానీకి ఈ గెలుపు సునాయాసంగా ఏమీ లభించలేదు. సంస్కరణ వాదులు, మితవాదులు నిలిచి గెలిచే పరిస్థితులు లేనివిధంగా రాజ్యాంగ నిబంధ నలు రూపొందాయి. గిట్టనివారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికే అవన్నీ. మీడి యాను అడ్డం పెట్టుకుని, మతాన్ని ఆలంబన చేసుకుని సవాలక్ష కారణాలు చూపి అనేకుల్ని పోటీకి అనర్హుల్ని చేశారు. రౌహానీకి నగరాల్లో పట్టున్నదని గ్రహించి, అక్కడినుంచి తక్కువమందికి ప్రాతినిధ్యం ఉండేలా నియోజకవర్గాలను రూపొం దించారు. ఇన్ని పరిమితుల్లో నగరాలను రౌహానీ గెల్చుకున్నారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో మాత్రం ఇప్పటికీ ఛాందసవాదుల హవాయే కొనసాగింది. పార్లమెంటులో ఇతరులను కలుపుకొని మెజారిటీ సాధించడం రౌహానీకి కష్టమేమీ కాదు. నిపుణుల అసెంబ్లీలో ఎటూ ఆయనకు తగినంత బలం ఉంది. అయితే అంతమాత్రాన పాలన సజావుగా సాగుతుందని చెప్పడానికి లేదు. ఇప్పటికీ అధికార యంత్రాంగంలో ఛాందసవాదుల పట్టు బలంగా ఉంది. సైన్యంలో వారిదే ప్రాబల్యం. దేశానికి సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేనీ మొగ్గు సైతం వారివైపే ఉంటుంది. అమెరికాతో కుదిరిన అణు ఒప్పందాన్ని సైన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆంక్షలు సడలిన అనంతరం అభివృద్ధిపై దృష్టి పెడదామని రౌహానీ అనుకున్న సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయి. చమురు ఉత్పత్తిపైన ప్రధానంగా ఆధారపడే ఇరాన్‌కు ఇది పెద్ద దెబ్బ. మరోపక్క ఇరాన్ సమాజంపై మతం పేరిట ఛాందసవాదులు విధించిన ఎన్నో ఆంక్షలు మహిళల పురోగతికి, మానవహక్కుల అమలుకు ఆటంకంగా మారాయి. ఆధునికత అంటే పాశ్చాత్య దేశాలను అనుకరిస్తూ నైతికంగా దిగజారడమేనని ఛాందసవాదులు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా అందరికీ సమాన హక్కులు, మానవహక్కులుండే సమాజాన్ని సాధించడమే ఆధునికతగా సంస్కరణవాదులు చెబుతున్నారు. తమ దేశంపై అమలవుతున్న ఆంక్షలు పోవాలని... పేదరికం, నిరుద్యోగంవంటివి రూపుమాసిపోయేందుకు వీలుగా దేశ పునర్నిర్మాణం జరగాలని సగటు ఇరాన్ పౌరులు కోరుకున్నారు. అందుకనే వారు సంస్కరణవాదులు, మితవాదుల కూటమికి పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రౌహానీ మెరుగైన పాలన అందించి జనం ఆకాంక్షలను నెరవేర్చగలరని ఆశించాలి. -
ఇరాన్ అణుఒప్పందానికి భారత్ స్వాగతం
న్యూఢిల్లీ: అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్, ఆరు ప్రపంచ శక్తిమంత దేశాల(సిక్స్ వరల్డ్ పవర్స్) మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని భారత్ ప్రకటించింది. తామెప్పుడూ శాంతియుత అణుకార్యక్రమాలకే మద్ధతిస్తామని, ఆరు దేశాల ప్రతినిధులు ఇరాన్‌తో ఆ మేరకే చర్చలు జరిపి విజయం సాధించినట్లు తెలిపింది. దీనిపై పూర్తిస్థాయిలో జరిగే ఒప్పందంపై జూన్ 30న సంతకాలు జరగనున్నట్లు పేర్కొంది. 'ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లగల, అందరికి సముచితమైన కీలక ఒప్పందంపై జూన్ 30న నిర్ణయం జరగనుంది' అని భారత విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ తెలిపారు. ఇరాన్ అణుకార్యక్రమాల వివాదాన్ని ఆ దేశ హక్కులను గౌరవిస్తూనే శాంతియుత మార్గంలో పరిష్కరించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని ఆయన చెప్పారు. ఆరు ప్రపంచ శక్తులు అనగా చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ. ఇవీ ప్రపంచ దేశాల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇరాన్ నిర్వహించే అణుకార్యక్రమాలను నియంత్రించడం కోసం శాంతియుత పంథాను అనుసరించేందుకు 2006లో ఏర్పడ్డాయి. టెహ్రాన్ వివాదాస్పద అణుకార్యక్రమం విషయంలో దౌత్య ఒప్పందాలు చేస్తుంటాయి.