నవంబర్ 4...
చమురు దిగుమతులపై ప్రపంచ దేశాలకు అమెరికా విధించిన గడువు. ఆ తేదీ నుంచి అన్ని దేశాలు ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా, మిత్రదేశాలు వైదొలగాయి. ఇరాన్‌ను ఒంటరి చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆ దేశంపై ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురుతోపాటు మరికొన్ని వస్తువులు దిగుమతి చేసుకోరాదని, అలా చేసిన దేశాలు కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నవంబర్ 4 తర్వాత ఇరాన్ నుంచి చమురు ఉత్పాదనల దిగుమతిని జీరో స్థాయికి తీసుకురావాలని షరతు విధించారు. దాంతో చవకగా దొరికే ఇరాన్ చమురు ఉత్పాదనలపై ఆధారపడిన దేశాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య చమురు ఒక చదరంగం ఆటగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నౌకల గమ్యం ఒక్కసారిగా మారిపోతోంది.
అమెరికా ఆధిపత్యం...
ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినప్పటి నుంచి అమెరికా చమురు ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. 2015 వరకు తన చమురు నిల్వలను ఎగుమతి చేసే విషయంలో అమెరికా విపరీతమైన పరిమితులు విధించుకుంది. 2015 చివర్లో అమెరికా ఈ పరిమితులన్నింటినీ సడలించింది. దాంతో నెమ్మదిగా ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు కొన్ని వందల బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతి చేసే అమెరికా... ఇప్పుడు ఆసియా, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలకు రోజుకు 2 లక్షల బ్యారెళ్ల చొప్పున ఎగుమతి చేస్తున్నట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. బయటకు చెప్పకపోయినా అమెరికాలోని అన్ని రకాల చమురు నిల్వల స్థాయి సౌదీ అరేబియా కంటే ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంలో దక్షిణ కొరియాకు అమెరికా చమురు ఎగుమతులు 313 శాతం పెరిగి ప్రస్తుతం రోజుకు 2,67,000 బ్యారెళ్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ సంస్థ చెబుతోంది. అలాగే జపాన్‌కు 198 శాతం, భారత్‌కు 165 శాతం ఎగుమతులు పెరిగాయి. బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలకూ చమురు రవాణా గణనీయంగా పెరిగింది. చైనా దిగుమతులు ఆగిపోవడంతో ఆ మేర అమెరికా చమురు మార్గాలు ఇతర ఆసియా దేశాలు, ఐరోపా వైపు మళ్లినట్లు కనిపిస్తోందని అమెరికా ఆర్థిక నిపుణుడు కరోలినే బెయిన్ అన్నారు. చమురు కోసం ఇరాన్‌పై ఆధారపడ్డ దేశాలకు తాము ప్రత్యామ్నాయం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్న భరోసా వెనుక అంతరార్థం అర్థం చేసుకోవచ్చు.
అయోమయంలో ఐరోపా...
ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, ఇరాన్‌పై ఆంక్షలు విధించడాన్ని ప్రధాన ఐరోపా దేశాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఒప్పందం యథాతథంగా కొనసాగాలని ఇప్పటికీ పట్టుబడుతున్నా ఇప్పుడు నవంబర్ 4 గడువును ఎలా అధిగమించాలా అనే సంశయంలో పడ్డాయి. అమెరికాతో ఉన్న సుదీర్ఘ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకునేందుకు ఈ దేశాలు సిద్ధంగా లేవు. అలాగని ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకునేందుకు అంగీకరించే పరిస్థితులు లేవు. ఇరాన్ చమురు దిగుమతులను పూర్తిగా ఆపేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాయి. అంతర్జాతీయ వ్యాపారం.. ముఖ్యంగా చమురు కొనుగోలు విషయంలో డాలర్ స్థానంలో యూరోను ప్రత్యామ్నాయ మారకంగా తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. అలాగే ఆంక్షల జోలికి పోకుండా చట్టబద్ధంగా ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఐరోపా బ్యాంకులు తెరపైకి తెచ్చాయి. అయితే ఇరాన్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి ఐరోపా, భారత్ పూర్తిగా సిద్ధంగా లేవని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయని తెలుసుకున్న అమెరికా ఆందోళన చెందుతోంది. ఇరాన్ చమురు విషయంపై చర్చించడానికి అత్యవసరంగా యూరప్ వెళ్లనున్న అమెరికా ఉన్నతస్థాయి ప్రతినిధి బ్రెయిన్ హుక్ ఆ తర్వాత భారత్‌తో సంప్రదింపుల కోసం ఆయన ఈ వారంలో ఢిల్లీ రానున్నారు. ఈ సంప్రదింపులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మరోవైపు చమురు వ్యాపారంలో తన ప్రత్యర్థి అయినప్పటికీ ఇరాన్‌కు మద్దతివ్వడానికి రష్యా ముందుకొస్తోంది. అమెరికా ఆంక్షలు అమలు కాకుండా ఏ విధమైన వ్యూహం అమలు చేయాలన్న విషయంపై ఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి.
ఖాతరు చేయని చైనా..
అమెరికాతో ఇప్పటికే వాణిజ్యపరమైన యుద్ధం చేస్తున్న చైనా ట్రంప్ విధించిన నిషేధాన్ని ఖాతరు చేయడం లేదు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తులను వినియోగించే చైనా తన అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతిని యథావిధిగా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అంతే కాదు.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును పూర్తిగా నిలిపేసింది. అమెరికన్ చమురు పొందే దేశాల్లో చైనాది రెండో స్థానం. 2016 జూలై వరకు చైనా రోజుకు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. అమెరికా సెన్సెక్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016 ఆగస్టు తర్వాత చైనా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపేసింది. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కొలంబియా నుంచి వచ్చే చమురు పరిమాణం ఇటీవలి కాలంలో ఐదు రెట్లు పెరిగింది. అలాగే బ్రెజిల్ చమురు కూడా ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి చైనా ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా 17.1 కోట్ల బ్యారెళ్ల చమురును నిత్యం పొందుతోంది. అలాగే ఒమన్, కువైట్ నుంచి కూడా చైనాకు చమురు రవాణా విపరీతంగా పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ టాంకర్ ట్రాకర్ పసిగట్టింది
భారత్ దారి ఎటు?
ఇరాన్‌పై ఆంక్షల విషయంలో తమకు సడలింపు ఇవ్వాలంటూ అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఒకవైపు రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం మరోవైపు ఇరాన్ నుంచి అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుం టుండటం అమెరికా సహించలేకపోతోంది. అమెరికా షరతులను అంగీకరించని దేశాలపై విధించే తమ చట్టం కాట్సూ పరిధిలోకి భారత్ వైఖరి వస్తుందని అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నుంచి చవకగా లభించే చమురు ఉత్పత్తుల దిగుమతిని పూర్తిగా నిలిపేయడానికి భారత్ సిద్ధంగా లేదు. అదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య, రక్షణ, సాంకేతిక సంబంధాలను దూరం చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. 2017–18లో మొత్తం 22 కోట్ల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న భారత్ (ఇరాన్ మొత్తం ఎగుమతుల్లో ఇది 9 శాతం) తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దేశం నుంచి చమురు దిగుమతులను కొంత తగ్గించుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోటును భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఆంక్షలకు ముందు (2015) మాదిరిగానే ఇరాన్‌తో చమురు దిగుమతికి రూపాయిని మారకంగా ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నవంబర్ మాసానికి భారత ప్రభుత్వరంగ చమురు సంస్థ ఐవోసీ, ఎంఆర్‌పీఎల్ 12.5 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతికి ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మరోవైపు చమురు కోసం ఇతర దేశాలతోనూ భారత్ చర్చిస్తోంది.
బ్యారెల్ 100 డాలర్లు?
ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు, పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్)లో సభ్యత్వంగల వెనిజులాలో సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు చేరుకోవచ్చన్న ఊహాగానాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. 2016 వరకు 50 డాలర్లలోపు ఉన్న ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70–80 డాలర్ల మధ్య ఊగిసలాడుతుండగా ఇది 100 డాలర్లకు పెరిగే అవకాశాలు న్నాయని నిపుణులు భావిస్తు న్నారు. విమానయాన రంగం భారీగా విస్తరించడం, ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగకపోవడంతో చమురు వినియోగం పెరిగి దాని డిమాండ్‌ను విపరీతంగా పెంచు తోందని ‘ది గార్డియన్’ పత్రిక అంచనా వేసింది. నవంబర్‌లో ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురు రోజుకు 20 లక్షల బ్యారెళ్లు తగ్గడంతో వచ్చే ఏడాదికి చమురు ధర 100 డాలర్లకు చేరినా ఆశ్చర్యం పోనవసరం లేదని చమురు వ్యాపార నిపుణుడు అలెక్స్ బియార్డ్ ఇటీవల లండన్‌లో జరిగిన ఓ సదస్సులో చెప్పారు. ప్రస్తుతం ముడి చమురు రేటు 78 డాలర్లు ఉండగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీలో లీటరుకు వరుసగా రూ. 82.86, రూ. 74.12గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర ఏకంగా రూ. 90.22కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిపోతుండటంతో ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం కల్లా పెట్రోల్ రేటు రూ. 100కు చేరుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్ బంకుల్లో మిషన్లను మూడంకెల రేటు వచ్చేలా మార్చేందుకు సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధర 100 డాలర్లకు పెరిగి, మన దేశంలో రూపాయి విలువ తగ్గిపోతున్న దశలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు ఎంతగా పెరుగుతాయన్న అంచనాల్లో నిపుణులు నిమగ్నమయ్యారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment