బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కరచాలనం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు.
ఉక్రెయిన్‌పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు.
ఆయుధాలు, ఆర్థిక అంశాలపై..
రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు.
శాటిలైట్ల కోసమేగా వచ్చింది!
పుతిన్
రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్‌తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్‌ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు.
ఆంక్షలతో కలిసిన ఇద్దరు
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఆ ఆయుధాలు ఇవ్వండి
సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు.
మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ
కిమ్ షరతు
రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం.
ప్రత్యేక రైల్లో.. లిమోజిన్‌తో సహా..
ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్‌లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్‌కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్‌కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment