వాషింగ్టన్: చట్టబద్ధంగా అమెరికాకు వస్తున్న వలసదారులతో దేశానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతోందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రాముఖ్యత మరోసారి నొక్కి చెప్పిన ట్రంప్..అమెరికా పౌరుల ఉద్యోగాలు, ప్రాణాల్ని పరిరక్షించే ఒక సుదృఢ వలస వ్యవస్థను రూపొందించాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్ని ఉద్దేశించి ఆయన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ పేరిట బుధవారం ప్రసంగించారు. ఏటా జరిగే ఈ జరిగే కార్యక్రమం అధ్యక్ష హోదాలో ట్రంప్‌కు రెండోది కావడం గమనార్హం. ప్రతీకార రాజకీయాలను తిరస్కరించాలని, భేదాభిప్రాయాలు పరిష్కరించుకోకుంటే మరో షట్‌డౌన్ వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రసంగంలో వివిధ అంశాలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
వలసలు, సరిహద్దు గోడపై..
చట్టాలు గౌరవించి, సక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారులు ఎన్నో విధాలుగా మన సమాజాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారు చట్టబద్ధంగా రావాలని కోరుకుంటున్నా. మన పౌరులందరి ప్రయోజనాల్ని రక్షించే ఒక వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మెక్సికోతో సరిహద్దు గోడ కోసం కలసి పనిచేద్దాం. రాజీకొద్దాం. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దే ఒప్పందం చేసుకుందాం.
కాంగ్రెస్‌లో విభేదాలపై..
మరో ప్రభుత్వ షట్‌డౌన్ రాకుండా నివారించాలంటే విభేధాల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పాత గాయాలు మానేలా, భేదాభిప్రాయాలు పక్కనపెట్టి కొత్త పరిష్కారాలు, ఒప్పందాలు చేసుకుందాం. విదేశీ శత్రువులను ఓడించాలంటే స్వదేశంలో మనం కలసిపనిచేయాలి.
తాలిబాన్‌తో చర్చలపై..
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతున్నాయి. శాంతి స్థాపనకు ప్రయత్నంచే సమయం వచ్చింది. తాలిబాన్లతో చర్చల్లో పురోగతి సాధిస్తే, అక్కడ మన సైన్యాన్ని తగ్గించి, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారిస్తాం.
చైనా ఉత్పుత్తులపై టారిఫ్‌లు వేయడంపై
చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు వేయడం ద్వారా అమెరికాకు ప్రతినెలా బిలియన్ల కొద్ది ఆదాయం వస్తోంది. అంతకుముందు, డ్రాగన్ దేశం మనకు ఒక్క డాలర్ కూడా ఇచ్చేది కాదు. దశాబ్దాలుగా అమెరికాకు ప్రతికూలంగా ఉన్న వాణిజ్య విధానాల్ని రద్దుచేయడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం.
కొత్త అణు ఒప్పందం!
భారత్, పాక్‌లను చేరుస్తూ ట్రంప్ సరికొత్త అణు ఒప్పందాన్ని ప్రతిపాదించారు. భారత్‌కు చెందిన పృథ్వీ, అగ్ని క్షిపణులు, పాక్‌కు చెందిన బాబర్, షహీన్, ఘోరి లాంటి క్షిపణుల ప్రయోగాలపై నియంత్రణ ఉండేలా ఆయన ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఆయన నేరుగా భారత్‌ను ప్రస్తావించలేదు. కాగా, కార్యక్రమానికి డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మహిళా సభ్యులు తెలుపు రంగు డ్రెస్‌లలో వచ్చారు. 20వ శతాబ్దంలో ఓటుహక్కు కోసం ఉద్యమించిన మహిళల జ్ఞాపకార్థం వారీ రంగు దుస్తుల్లో వచ్చారు. కాగా, ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు ఈ నెల 27, 28న వియత్నాంలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
వలసదారులతో సుసంపన్నం
Published Thu, Feb 7 2019 4:09 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment