భారత ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితా- 2018ను ఫోర్బ్స్ విడుదల చేసింది. 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు మొదటి స్థానం దక్కించుకోగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల నుంచి శక్తిమంతులైన వ్యక్తుల జాబితా రూపొందించడానికి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఎక్కువ మంది వ్యక్తులకు ప్రాతినిథ్యం వహించే దక్షత కలిగి ఉండటం, ఆర్థిక వనరులను నియంత్రించగలగడం, భిన్న రంగాలలో తమ ముద్ర వేయగలగడం, అధికారాన్ని చురుగ్గా వినియోగించుకోగలగడం వంటి అంశాల ఆధారంగా 75 మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు పేర్కొంది.
భూగ్రహం మీద ఉన్న 7.5 బిలియన్ల జనాభా ఉందని.. తమ సామర్థ్యంతో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న75 మంది(మహిళలు, పురుషులు కలిపి)ని ఎంపిక చేశామని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితా సిద్ధం చేయడానికి 100 మిలియన్ వ్యక్తులకు ఒకరి చొప్పున ఎంపిక చేశామని పేర్కొంది.
ఆయన ప్రపంచ నాయకుడు..
భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారని ఫోర్బ్స్ ప్రశంసించింది. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్‌తో జరిపిన చర్చల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడింది. అంతర్జాతీయ అంశాల్లో మోదీ కీలక వ్యక్తిగా మారారని, తన దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని ప్రశంసలు కురిపించింది. 2016లో నోట్ల రద్దు ద్వారా గుణాత్మక మార్పులు చేపట్టి, అవినీతిని తొలగించేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని ప్రశంసించింది. కాగా ‘జియో’తో టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ ఈ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 40వ స్థానాన్ని ఆక్రమించుకున్నారు.
కొత్తగా ఎంపికైన వారు..
కాగా గతేడాది మొదటి స్థానం పొందిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్ నాల్గో, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఐదో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి అత్యంత శక్తిమంతుల జాబితాలో 17 మంది కొత్తగా స్థానం సంపాదించుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. వీరలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్(8), అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్(11), ఎగ్జాన్ మొబైల్ సీఈవో డారెన్ వుడ్స్(34), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్(54), జస్టిస్ రాబర్ట్ మ్యూల్లర్(72) తదితరలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment