పుతిన్ లౌక్యం... ఒబామాకు సంకటం
పుతిన్ అతి తెలివిగా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి మర్కెల్ సూచించిన ప్రతిపాదనలను ఆమోదించారు. దీంతో రష్యా వెనక్కు తగ్గిందని భావిస్తున్నారు. అది పొరపాటు. అమల్లోకిరాని ఒప్పందంతో పుతిన్ అమెరికాను రక్షణ స్థితిలోకి నెట్టేశారు.
చదరంగం ఇద్దరు ఆడే ఆటని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరచినట్టున్నారు. ఉక్రెయిన్ చదరంగపు బల్ల మీద తన ఎత్తులే గాక, ప్రత్యర్థి ఎత్తు లు కూడా తాన ఇష్టమేనని భావిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చెప్పక్కర్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ చడీ చప్పుడు లేకుండా జర్మన్ చాన్సలర్ ఏంజెలా మర్కెల్‌తో కలసి ఉక్రెయిన్ సంక్షోభం పై ఒక అవగాహనకు వచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు దైదియర్ బుర్ఖాల్తర్, పుతిన్‌లు ఈ నెల 7న జరిపిన చర్చల్లో ఆ ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్‌లో కీలక పాత్రధారియైన మర్కెల్ షరతులన్నిటికీ అంగీకరించి పుతిన్ వెనకడుగు వేశారని మీడియా పండితులు విశ్లేషించేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్ ఆగ్నేయ రాష్ట్రాలైన డొనెత్స్క్, లుగాన్స్క్‌లలో రష్యా అనుకూల ‘వేర్పాటువాదులు’ మే 11న జరుప తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ బలగాలను లోతట్టుకు ఉపసంహరించడానికి సిద్ధమన్నారు. జాతీయ సయో ధ్య కోసం చర్చలు జరిపి, ఎన్నికలను నిర్వహించడానికి అంగీకరించారు. బదులుగా రష్యన్లు అత్యధికంగా ఉండే తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం, నియో ఫాసిస్టు ‘స్వాబోదా’ నేషనల్ గార్డు ముఠాలు సాగిస్తున్న ‘ఉగ్రవాద’ వ్యతిరేక సైనిక చర్యలను, అణచివేతను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌లో శాంతి, జాతీయ సయోధ్యలకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అమెరికా ఆశిస్తున్నది అది కాదు. కాబట్టే పుతిన్ వేసిన పాచిక పారింది.
తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని రష్యా అనుకూల ఆందోళనకారులు... ఉక్రెయిన్ నియో నాజీ నేతలంటున్నట్టు ‘ఉగ్రవాదులు’కారు. పాశ్చాత్య ప్రపంచం ప్రచారం చేస్తున్నట్టు ‘వేర్పాటువాదులు’ కారు. సాధారణ కార్మికులు, ప్రజలు. కాకపోతే రష్యన్లు. అయినా వారు రష్యాలో విలీనం కావాలని కోరుకోవడం లేదు. స్వాతంత్య్రం అడగడం లేదు. ఉక్రెయిన్‌లో భాగంగానే ఉండాలని భావిస్తున్నారు. కాకపోతే రాష్ట్రాలకు విస్తృత స్వయం ప్రతిపత్తినిచ్చే ఫెడరల్ వ్యవస్థను కోరుతున్నారు. ఆ డిమాండు కూడా చాలా పాతది. అమెరికా చేతి కీలుబొమ్మ ‘విప్లవకారులకు’ భిన్నంగా వారు పుతి న్ ఆడించేట్టు ఆడే బాపతు కాదు. కాబట్టే ‘పుతిన్ పిరికిపంద. డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఇందుకు బదులుగా మాస్కో రెడ్‌స్క్వేర్‌లో విప్లవంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రష్యన్ ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరు’ అని ‘డొనెత్స్క్ నేషనల్ రిపబ్లిక్’ ప్రకటించింది. పుతిన్ ఒక్క గుండు కూడా పేల్చకుండా చాలా లక్ష్యాలను సాధించారు. మర్కెల్‌ను ప్రసన్నం చేసుకుని అమెరికా-నాటో కూటమిలో విభేదాలను రగిల్చారు. అమెరికా తన సైనిక బలగాలను తూర్పు యూరప్‌కు పంపుతుండగా ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సేనలను ఉపసంహరిస్తానని ప్రకటించారు. పుతిన్ శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ జాతీయోన్మాద ప్రభుత్వం అవహేళన చేసింది. పుతిన్‌కు కావాల్సిందీ అదే. అమల్లోకి రాని ఓ ఒప్పందంతో పుతిన్ అంతా సాధించారు. యథాతథంగా జాత్యహంకార మూకలు రష్యన్ల వేటను సాగిస్తాయి. మే 2న ఒడిస్సీలో 42 మంది ప్రజలను సజీవంగా దహనం చేసిన మూకలు... శుక్రవారం 20 మందిని బలిగొన్నాయి. డొనెత్స్క్, లుగాన్స్క్ ప్రజలు ఉక్రెనియన్ పాలకులను నిద్రపోనీయరని పుతిన్‌కు తెలుసు. చోద్యం చూడటమే పుతిన్ పని.
అన్నిటికీ మించి విప్లవాన్ని సమర్థించిన ప్రజలు సైతం కొత్త ప్రభుత్వం పాతదేనని, కాకపోతే గ్యాస్ ధరలు 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని, పన్నుల భారం తెగపెరిగిందని వాపోతున్నారు. శాంతిని కోరుతున్నారు. 1,700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం దేశాన్ని దివాలా తీయించనుంది. ఐఎంఎఫ్ రుణంలో రష్యా ఇంధన సంస్థ ‘గాజ్‌ప్రోమ్’కు 270 కోట్ల డాలర్లు, ఐఎంఎఫ్ పాత బకాయిల చెల్లింపులకు 500 కోట్ల డాలర్లు అయిపోతాయి. ట్యామషెంకోలాంటి అవినీతిగ్రస్త విప్లవ నేతలు తినేది తినగా ఇక మిగిలేది ఎంత? ఐఎంఎఫ్ షరతులు ఎలాంటివో చెప్పక్కర్లేదు. తూర్పు, దక్షిణ భాగాలు విడిపోతే ఈ రుణాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ బెయిలవుట్లతో గ్రీస్‌లాంటి యూరప్ దేశాలు ఎంత బాగుపడ్డాయో తెలిసినవాళ్లు ఉక్రెయిన్‌కు ఏ గతి పడుతుందో ఊహించగలరు. చిట్టచివరకు తూర్పు, దక్షిణ ప్రాంతాలే కాదు... మొత్తంగా ఉక్రెయిన్ తన కాళ్ల దగ్గరకు రాక తప్పదని పుతిన్ అంచనా. కాదనలేం.
పిళ్లా వెంకటేశ్వరరావు