Pilla venkateswara rao
-
సీనియర్ పాత్రికేయుడు పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, పీపుల్స్‌వార్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన పిళ్లా వెంకటేశ్వరరావు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. 1980లలో ఆయన పీపుల్స్‌వార్ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. విప్లవోద్యమంలో అధ్యాపకుడిగా, ఉద్యమ నిర్మాణ కర్తగా ఏళ్లపాటు పనిచేశారు. 2004 ఎన్నికల సమయంలో లొంగిపోయి సాధారణ జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత పత్రికారంగంలో చురుగ్గా పనిచేశారు. ‘సాక్షి’పత్రికలో పదేళ్లపాటు సేవలందించారు. ఈ దశాబ్ద కాలంలో పత్రికారచనలో తనదైన ముద్ర వేశారు. తర్వాత కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బందులు పడి పాత్రికేయ వృత్తికి కూడా దూరమయ్యారు. చదవండి: వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు -
ఇప్పటికే చిరంజీవి చేతిలో నష్టపోయారు
విజయవాడ : ఇప్పటికే కాపు సామాజిక వర్గం సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతుల్లో తీవ్ర నష్టాలకు గురైందని ఏపీ కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో సంచనల వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రూపంలో మరో చిరంజీవి నాటి పరిస్థితులకు కాపు సామాజిక వర్గం గురైతే, సభ్య సమాజంలో మరో పాతికేళ్ల వరకూ తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. ఈ దుస్థితిని కాపు సామాజిక వర్గానికి కల్పించవద్దని పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ హక్కుల సాధనకు పోరాటం చేస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు పోరాటాన్ని బలహీనపరిచే ఏ చర్య అయినా..కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గట్టిగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచవలసిన తరుణంలో పవన్ కల్యాణ్ వ్యవహార శైలి కాపులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని వెల్లడించారు. బీజేపీ హామీలు మరచిన విధానం చూడగానే తెలుగువారికి ఒళ్లు కంపరం పుడుతున్న దశలో..బీజేపీ భావాలకు వకాల్తా పుచ్చుకుని కాపు సామాజిక వర్గానికి ద్రోహం తలపెట్టవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్సీపీ నేతపై కత్తులతో దాడి
-
ఆరు నెలల్లో నెరవేర్చకుంటే ఆమరణదీక్ష
అన్నవరం (తూర్పు గోదావరి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం.. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేర్చి, కాపుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంక టేశ్వరరావు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మంగళవారం జరిగిన కాపునాడు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలలో ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ డిమాండ్ నెరవేర్చలేదన్నారు. అలాగే, కాపుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తానన్న చంద్రబాబు కేవలం రూ.100 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని, అందులో రూ.50 కోట్లు విడుదల చేశారన్నారు. ఇది కూడా తమను మోసం చేయడమేనని విమర్శించారు. ఈ రెండు డిమాండ్లు ఆరు నెలల్లో నెరవేర్చకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ప్రధానకార్యదర్శి ప్రగడ సుబ్బారావు, కార్యదర్శి తోటకూర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యూరప్‌పై వేర్పాటువాదం నీడ
స్కాట్లాండ్ స్వతంత్రం కోసం జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ యూరప్ అంతటా ఉత్కంఠను రేపుతోంది. ఎడతెగని ఆర్థిక సంక్షోభం కారణంగా స్పెయిన్, బెల్జియం, ఇటలీ తదితర దేశాలలో ఇప్పటికే వెల్లువెత్తుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు స్కాట్లాండ్ స్వాతంత్య్రం కొత్త ఊపిరిలూదుతుందని ఈయూ నేతలు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఒక శకానికి సంబంధించిన మౌలికమైన భ్రమలన్నీ అడుగంటిపోయినప్పుడు ఆ శకం చరమాంకానికి చేరిందనుకోవచ్చు’’ (ఆర్థర్ మిల్లర్). యూరప్ నేడు సరిగ్గా అలాంటి ఘట్టాన్నే చేరుతున్నట్టు అనిపిస్తోంది. యునెటైడ్ కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ ఐర్లాండ్ (బ్రిటన్) సెప్టెంబర్ 18 కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తోంది అందుకే. 307 ఏళ్ల క్రితం రెండు రాచ కుటుంబాల కలయికతో ఇంగ్లండ్‌లో భాగమైన స్కాట్లాండ్ నేడు తిరిగి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం కోసం తహతహలాడుతోంది. ఈ నెల 18న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో 40 లక్షలకు పైగా స్కాట్లాండ్ ఓటర్లు ‘అవును’ లేదా ‘కాదు’ అంటూ దాని భవితపై తీర్పు చెప్పనున్నారు. స్కాట్లాండ్ అంతటా, ఎక్కడ ఎటు చూసినా ‘యస్’ అన్న నీలి రంగు పోస్టర్లు, జెండాల రెప రెపలే. బ్రిటన్‌లో భాగంగానే ఉండాలని కోరుకుంటున్న స్కాటిష్ పౌరులు సైతం స్వతంత్ర స్కాట్లాండ్ వాదమే నెగ్గాలని లోలోపల కోరుకునే విచిత్ర పరిస్థితి ఎదురవుతుందని ప్రధాని డేవిడ్ కామెరాన్ ఊహించలేదు. మహా అయితే 30 శాతానికి మించి అవును అనరని ఆయన గట్టి లెక్కలే వేశారు. ఆ ధీమాతోనే 2012లో స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణకు ఆమోద ముద్ర పడనిచ్చారు. దురదృష్టవశాత్తూ జాతీయ ఉద్వేగాలు కూడికలు, తీసివేతలకు ఒదిగేవి కావు. ఎంత జాగ్రత్తగా కట్టిన లెక్కలైనా అతి తరచుగా తప్పుగా తేలుతూనే ఉంటాయి. స్కాట్లాండ్ విషయంలో అదే జరిగింది. అనూహ్యమైన రీతిలో బ్రిటన్ నుండి స్వతంత్రాన్నే కోరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నేడు ఐక్యతావాదులు, వేర్పాటువాదుల్లో ఎవరు ఆధిక్యతను సాధిస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. స్కాటిష్ ప్రజల తీర్పు కోసం బ్రిటన్ మాత్రమే కాదు యూరోపియన్ రాజ్యాలన్నీ ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. నెత్తుటి ఏరులు పారించి గీసిన జాతీయ రాజ్యాల, దేశాల భ్రమాత్మక శకం ‘చరమాంకానికి’ ఆ తీర్పు నాంది కాగలదనే భయం వాటిని వెన్నాడుతోంది. యూరప్‌ను వెంటాడుతున్న వేర్పాటువాద భూతం స్కాట్లాండ్ బ్రిటన్ తలనొప్పి కాదు... యునెటైడ్ కింగ్డమ్లా జాతీయ రాజ్యాలుగా, దేశాలుగా చెలామణి అవుతున్న బహు జాతుల దేశాలన్నిటికీ తలనొప్పే. కాబట్టే యూరోపియన్ యూనియన్ రాజధాని బ్రసెల్స్ పరిస్థితి అగమ్య గోచరం అవుతోంది. ఇప్పటికే స్వాతంత్య్రం కోరుతున్న బెల్జియంలోని ఫ్లెమిష్ జాతీయులు కూడా స్కాట్లాండ్ బాట పడితే, ఆ దేశం నిట్ట నిలువునా రెండుగా చీలిపోతే? బహుశా డేవిడ్ కామెరాన్ కంటే ఎక్కువగా నిద్రలేకుండా గడుపుతున్నది స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్ కావాలి. ఇప్పటికే బ్రస్సెల్స్‌లో స్కాటిష్, ఫ్లెమిష్ వేర్పాటువాదులతో కలిసి భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్న కెటొలోనియన్లకు స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని మించిన ప్రేరణ మరేం కావాలి? బాస్క్ మాత్రం రజోయ్ మాటలను చెవిన పెడుతుందా? ఇటలీలోని పడానియా మాత్రం తక్కువ తిందా? చివరికి మధ్యధరా సముద్రం లోని నలుసులాంటి ద్వీపం కోర్సికా ఇంకా ఫ్రాన్స్ పాలన సమ్మతం కాదని స్వాతంత్య్రం ప్రకటించుకోకుంటుందా? యూరప్ ఈ కొస నుండి ఆ కొసనున్న ఉక్రెయిన్ వరకు కనీసం 30 వేర్పాటు ఉద్యమాలు యూరప్ సరిహద్దులను తిరగ రాస్తామంటున్నాయి. అంతేకాదు అమెరికాలో కొన్ని ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్నాయి. కెనడాలోని క్యుబెక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఆ పోరాటానికి యూరోపియన్ ఉదారవాదులు, వామపక్షాల మద్దతు సైతం లభిస్తోంది. క్యుబెక్‌లో 80 శాతం ఫ్రెంచి మాట్లాడేవారైనందున దానికి స్వాతంత్య్రం అవసరమైతే... యూరప్‌లోని స్కాటిష్ తదితర జాతుల ప్రజలకు అవసరం కాకుండా పోతుందా? అవుననే వారంటున్నారు. కాబట్టే యూరప్‌లో పెచ్చు పెరిగిపోతున్న జాతీయవాదం ముప్పంటూ గగ్గోలు పెడుతున్నారు. స్కాటిష్ జాతి ప్రత్యేక అస్థిత్వం సెప్టెంబర్ 18 స్కాట్లాండ్ చరిత్రలో ఓ ఉజ్జ్వల ఘట్టానికి సంకేతం. అది సరిగ్గా ఏడు శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ ప్రథమ స్వాతంత్య్ర యుద్ధంలో విజయం సాధించిన రోజు. ఆ రోజున బన్నాక్బర్న్ యుద్ధ రంగంలో ఇంగ్లండ్ రాజు రెండవ ఎడ్వర్డ్ సేనలు ‘అనాగరిక’ స్కాటిష్ స్వాతం త్య్ర యోధుల చేతుల్లో ఓటమిని చవి చూశాయి. స్కాట్లాం డ్ జాతీయ స్వాతంత్య్ర ఆకాంక్షలకు ప్రతీకగా, జానపద కథానాయకునిగా మారిన చారిత్రక వ్యక్తి, జాతీయ హీరో విలియం వాలెస్ (మెల్ గిబ్సన్ హాలీవుడ్ క్లాసిక్ ‘బ్రేవ్ హార్ట్’ హీరో) నినాదం ‘స్కాట్లాండ్ శాశ్వతం’ అక్షర సత్య మనడానికి రుజువు నేడు వెల్లువెత్తుతున్న జాతీయతా వెల్లువే. 1706 నాటి ‘ట్రీటీ ఆఫ్ యూనియన్’ రాజకీయ ఐక్యతను సాధించిందే తప్ప... స్కాటిష్ భాషాసంస్కృతు లను, విలక్షణమైన వారి జాతీయాభిమానాన్ని, గౌరవాన్ని రూపు మాపలేకపోయింది. అందుకు కారణం జాతుల విలక్షణతలను ప్రతిబింబించే రాజకీయ వ్యవస్థను నిర్మించలేని ఇంగ్లండు అహంకారం, అభిజాత్యమేనని చెప్పనవసరం లేదు. కాబట్టే బ్రిటన్ ఐక్యతకు ముప్పు వాటిల్లనున్నా... స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ బ్యాలెట్ పేపర్‌పై ‘అవును’, ‘కాదు’ అనే రెండిటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశమే తప్ప మూడో అవకాశం లేదు. నిజమైన ఐక్యతను కాపాడే మూడో అవకాశం లేకపోలేదు. అది, నేటి యూనిటరీ వ్యవస్థ స్థానంలో బ్రిటన్‌లో ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. కాకపోతే అలాంటి సమూలమైన రాజ్యాంగ సవరణల ఊసే అది ఎత్తడం లేదు. అదే వైఖరిని స్పెయిన్, ఇటలీ తదితర దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. అలాంటప్పుడు వేర్పాటువాదం వినా గత్యంతరం లేదని మైనారిటీ జాతులు భావిస్తే తప్పవుతుందా? ఇప్పుడే ఎందుకు? ముందెన్నడూ లేని విధంగా నేడే ఈ జాతుల లేదా వేర్పాటు ఉద్యమాలు ఎందుకు ముందుకొస్తున్నాయి? స్కాట్లాండే సమాధానం చెబుతుంది. ప్రపంచ వ్యాపార, వలసవాద శక్తిగా బ్రిటన్ వెలిగిన కాలంలో (1885-1939) ఇంగ్లండ్‌తో ఐక్యత వలన స్కాట్లాండ్కు కలిగిన ఆర్థిక ప్రయోజనాలు ఆ తదుపరి ఆవిరి అయ్యాయి. ప్రత్యేకించి 1960లు, 1970లలో స్కాట్లాండ్ ఆర్థికంగా దిగజారింది. 1979లో మార్గరేట్ థాచర్ అధికారంలోకి వచ్చేసరికి స్కాట్లాండ్లో 15 బొగ్గు గనులుండగా ఆమె గద్దె దిగేనాటికి రెండు మిగిలాయి! నాటి నుండి నేటి వరకు, ప్రత్యేకించి 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి సంక్షేమ వ్యయాలపై కోతలు పడుతూనే ఉన్నాయి. ఫలితంగానే స్కాటిష్ నేషనలిస్టు పార్టీ అధికారంలోకి రాగలిగింది. యూరోపి యన్ ఆర్థిక వైఫల్యమే స్కాట్లాండ్ సహా యూరప్ అంతటా జాతీయవాదం, వేర్పాటువాదం పెరగడానికి ఏకైక కారణం. నార్వేలా స్కాట్లాండ్ కూడా చమురు నిధులతో ప్రభుత్వ విద్య, వైద్యం, పెన్షన్లను అమలు చేయగలదని వేర్పాటువాదుల వాదన. చిన్న దేశంగా అది మనలేదనడానికి లేదు. దానికంటే చాలా చిన్నవైన మాల్టా, సైప్రస్, లగ్జెంబర్గ్లు ఈయూలో ఉన్నాయి. చిన్న దేశమైన డెన్మార్క్ విజయాలే స్కాట్లాండ్ లాంటి దేశాల ఉనికికి హామీ. ప్రజాభిప్రాయ సేకరణ స్కాట్లాండ్కు నేడు స్వాతంత్య్రం ఇవ్వకపోయినా అధిక అధికారాల బదలా యింపును, అధిక స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. జాతీయ దేశాలుగా వెలుగుతున్న పెద్ద జాతుల పాలకులు మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇచ్చేలా ఫెడరల్ విధానాలకు మరలకపోతే, ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాకపోతే పరిస్థితి విషమించకా తప్పదు. అది పచ్చి మితవాద జాత్యహంకార ధోర ణులకు దారితీయకా తప్పదు. తప్పు పట్టాల్సింది జాతీయ ఆకాంక్షలను కాదు. పిళ్లా వెంకటేశ్వరరావు -
‘ఆ ఇద్దరి’ నడుమ నరేంద్ర మోడీ
భారత్‌తో వాణిజ్య వ్యూహాత్మక మైత్రి కోసం చైనా, జపాన్‌లు రెండూ పోటీపడుతున్నాయి. ప్రత్యర్థులుగా ఆసియాలో ప్రచ్ఛన్న యుద్ధానికి కాలు దువ్వుతున్న ఈ రెండు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో మోడీ చాకచక్యంగా వ్యవహరించగలుగుతున్నారు. సంసార జంజాటానికి దూరంగా బతుకుతున్న నరేంద్ర మోడీ ప్రధానిగా ఏక కాలంలో రెండు ‘ప్రేమాయణాలను’ రక్తి కట్టిస్తున్నారు. ఆసియాలో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులను సృష్టిస్తున్న చైనా, జపాన్‌లు రెండూ మోడీపై తెగ ప్రేమ ఒల కబోసేస్తున్నాయి. నేటి అత్యధునాతన ‘ప్రేమ’లకు పునాది ప్రయోజనవాదమే. జపాన్, చైనాలకు ప్రేమ కానుకల చిట్టా లున్నాయి. జపాన్‌తో ‘వ్యూహాత్మక మైత్రి’ జపం చేస్తూనే గత యూపీఏ ప్రభుత్వం జపాన్ కు చె ందిన ‘మిసుబిషి’, ‘హోండా’లను 260 కోట్ల డాలర్ల పన్ను బకాయీల కోసం తెగ ఇబ్బంది పెట్టింది. భారత పన్ను చట్టాల్లోని మార్పుల వల్ల ఏర్పడ్డ ఆ బకాయీలను మాఫీ చేయడమే ‘న్యాయ’ మని జపాన్ ప్రధాని షింజో అబే మొరపెట్టుకున్నా కనికరిం చలేదు. అబే ప్రేమ కానుకల చిట్టాలోని మొదటిది అదే. దీర్ఘకాలిక అల్ప వృద్ధి జాఢ్యం బారిన పడ్డ జపాన్ చైనాతో ఇప్పటికే భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. అయినా అది దక్షిణ చైనా సముద్రంలోని సెనెకాకు దీవుల కోసం చైనాతో జగడానికి దిగింది. ఫలితంగా గత ఏడాది కాలంలోనే చైనాకు జపాన్ ఎగుమతులు 18 శాతం మేర క్షీణించిపోయాయి. భారీ ఎత్తున జపాన్ వస్తు వుల మార్కెట్ విస్తరణకు అవకాశాలను, ‘ఢిల్లీ - ముంబై కారిడార్’ వంటి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సహా భారీగా జపాన్ పెట్టుబడులకు అవకాశాలను ఆశిస్తున్నారు. మోడీ ఆ కోరికలను తీర్చడానికి సిద్ధమే. కాకపోతే ఆయనది కూడా ప్రయోజనవాద ప్రేమే. భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు జపాన్ అడిగిందే తడవుగా చక చకా పచ్చజెండా ఊపేశారు. కాకపోతే అబేకు ‘దక్షిణ టిబెట్’ దారి చూపారు. ఈశాన్య భారతాన్ని చైనా ఆ పేరుతోనే పిలుస్తుంది. ఈశాన్యం సరిహ ద్దుల్లోని రక్షణ ఏర్పాట్లకు అవసరమైన రోడ్లు వంతెనల నిర్మాణ భారీ ప్రాజెక్టులన్నీ జపాన్‌కు అప్పగిస్తున్నారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులను తెరిచింది కూడా అమెరికా, జపాన్ ల కోసమే. చైనాను ఏకాకిని చేసే వ్యూహంతో అమెరికా - జపాన్‌లు నిర్మిస్తున్న ఆసియా - పసిఫిక్ కూటమిలో భారత్ చేరాలని మన జాతీయ మీడియా, కార్పొరేట్ గుత్తాధిపతులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ‘వ్యూహాత్మక’ మౌనంతో మోడీ వారందరినీ సంతృప్తిపరుస్తున్నారు. ఇక చైనా, మోడీల మధ్య ప్రేమ బంధం చాలా పాతది. 2002 గుజరాత్ మత కల్లోలాల కారణంగా అమెరికా వంటి దేశాలు మోడీని ‘అంటరానివాడి’గా చూస్తుండగా... 2006, 2007, 2011లలో ఆయన చైనాలో పర్యటించారు. చైనా రెడ్ కార్పెట్ పరచి ఘన స్వాగతం పలకడమే కాదు, ఒక ముఖ్య మంత్రికి దేశాధినేతకు ఇచ్చేటంత గౌరవాన్ని ఇచ్చింది. చైనా ఆయనను ‘నిర్ణయాత్మకమైన, సత్వరమైన నిర్ణయాలను తీసుకోగల, శక్తివంతమైన, ఫలిత ప్రధాన్య దృక్పథంగల నేత’గా గుర్తించింది. ప్రధానిగా మోడీని ‘చైనా డైలీ’ ఏకంగా ‘భారత నిక్సన్’ అంటూ ఆకాశానికెత్తేసింది. అబే కూడా సరి గ్గా మోడీలోని ఈ లక్షణాలను చూసే ముచ్చటపడిపోతుండ టం విశేషం. ప్రతిపక్షంలో ఉండగా చైనా, పాకిస్థాన్‌ల పట్ల ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని బీజేపీ దుయ్యబడు తుంది. కానీ ఏబీ వాజపేయీ హయాంలోనే చైనా సిక్కింను భారత్‌లో భాగంగా గుర్తించింది! ఇప్పటికైతే మోడీ చైనాతో వాణిజ్య, పెట్టుబడుల బంధా నికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా సరిహద్దు సమస్యను పక్క న బెట్టి ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచి స్తోంది. ఇటీవల బ్రిక్స్ దేశాల సమావేశం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు క్సీ జింగ్పింగ్ సూచించింది అదే. మోడీ సైతం సరిహద్దుల్లోని సంఘర్షణలను పక్కనబెట్టి కీలకమైన రక్షణ, విద్యుత్ రంగాల్లో చైనా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అ నుమతులు జారీ చేస్తున్నారు. ‘జాతీయ భద్రతకు ముప్పు’ అని జంకి యూపీఏ ఇదే చేయలేకపోయింది. అలా అని మోడీ సరిహద్దు సమస్యను చిన్న చూపు చూస్తున్నదీ లేదు. చైనా పట్ల కఠిన ైవె ఖరిని చూపే మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్‌ను విదేశాంగ శాఖ జూనియర్ మంత్రిగా నియమించారు. చైనా, పాక్‌లలో రహస్య కార్యకలాపాల నిర్వహణకు పేరు మోసిన మాజీ గూఢచారి శాఖ అధిపతి అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారును చేశారు. ‘దక్షిణ టిబెట్’కు ఆయననే ఇన్చార్జిని చేశారు. రేపు చైనాతో వ్యూహాత్మక చర్చలకు ఆయనే మోడీ తరఫున ప్రతినిధిగా హాజరుకాబోతున్నారు. ఇప్పటికైతే మోడీ చైనా, జపాన్‌లతో ఏకకాలంలో ప్రేమను చాకచక్యంగానే నెట్టుకొస్తున్నారు. మరో చిరకాల ప్రేమికురాలు అమెరికా కూడా రంగంలోకి దిగాక ఎలాంటి మార్పులు వస్తాయో వేచిచూడాలి. పిళ్లా వెంకటేశ్వరరావు -
‘ప్రచ్ఛన్నయుద్ధం’ నీడలో ఆఫ్రికా
ఆఫ్రికా ఖండంలో ఆమెరికా, చైనాల మధ్య సాగుతున్న సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం అంతగా వెలుగులోకి రావడం లేదు. వాణిజ్యం, దీర్ఘకాలిక పెట్టుబడుల బాటలో చైనా, అమెరికా మిత్ర దేశాలపై ప్రాబల్యాన్ని సాధిస్తోంది. అమెరికా తన పాత సైనిక వ్యూహాలతో, వాటి ఫలితమైన ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’లో మరింతగా కూరుకుపోతోంది. ప్రపంచ యుద్ధాలకు కాలం చెల్లిపోయింది. 20వ శతాబ్దపు అనాగరిక ప్రపంచంలో ప్రపంచ శక్తులు తె లిసీతెలియక ఆడిన ఆటలవి. ఇది అత్యధునాతనమైన 21వ శతాబ్దం. యుద్ధం నాగరికతగా, ప్రపంచమే యుద్ధంగా, యుద్ధమే శాంతిగా మారిపోయాక యుద్ధ ప్రమాదం గురించి మాట్లాడటం అనుచితం, అసందర్భం. అఫ్ఘానిస్థాన్‌లోనో, ఇరాక్‌లోనో, సిరియాలోనో, ఉక్రెయిన్లోనో యుద్ధమో లేక అంతర్యుద్ధమో, కాదంటే ముసుగు యుద్ధమో జరుగుతోం దంటే... బ్రేక్ ఫాస్ట్‌కీ, కాఫీ కప్పుకీ మధ్య ఓ లుక్కు వేస్తే వేస్తామేమో. ఎవడి చావు ఎవడికి కావాలి? ఎవరికీ అక్కర్లేని చావులకు ఆఫ్రికా ఖండం ఎప్పటి నుంచో ప్రసిద్ధి. ప్రపంచంలోనే అతి పిన్న దేశం దక్షిణ సూడాన్ ‘చావు’ బ్రేకింగ్ న్యూస్‌గా కాదుగదా స్క్రోలింగ్‌గా కూడా కంట పడటం లేదు. అలాం టి దేశానికి సమాచార మంత్రి మైఖేల్ మకుయీ లూత్ ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఆఫ్రికా-అమెరికా శిఖరాగ్ర సదస్సుకు హాజరై ఏం చెబితే ఎవరికి కావాలి? ‘‘సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో మా దేశం మొట్ట మొదటి రణ రంగంగా మారుతోంది. మా దేశాన్ని నిలుపునా విచ్ఛిన్నం చేస్తున్న అంతర్యుద్ధం నిజానికి ప్రపంచ అగ్ర శక్తులు తమ బంట్లతో సాగిస్తున్న ప్రాక్సీ యుద్ధం.’’ లూత్ ప్రస్తావించినది. ఆఫ్రికాలోని అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం గురించి. ‘మంత్రసాని’ కడుపు మంట దక్షిణ సూడాన్‌కు పురుడు పోసి, అస్తిత్వంలోకి తెచ్చిన మంత్రసాని అమెరికా. వందల కోట్ల డాలర్లు ధారపోసి తిరుగుబాటు దళాలను పోషించి ‘పురిటి ఖర్చును’ భరించినది అదే. ఆఫ్రికాలో మూడో అతి పెద్ద చమురు నిక్షేపాలున్న దేశం తన గనులను అప్పగించేస్తే సరిపుచ్చుకోవాలని భావించింది. అందుకు అనుమతించే ‘సొంత’ ప్రభుత్వం ఉండాలని కోరుకుంది. ఆ ఆశతోనే ఇంత చేసింది. అమెరికాయే పెంచి పోషించిన బిన్ లాడెన్‌కు సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ కాసిన్ని రోజులు ఆశ్రయమిచ్చాడు. ఆ నెపంతో అమెరికా ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ ఆపరేషన్స్‌తో, దక్షిణ, ఉత్తర సూడాన్ల మధ్య చిచ్చును దావానలంగా మార్చి సూడాన్‌ను రెండు ముక్కలు చేసింది. నోట్లోని మాంసం ముక్కను డ్రాగన్ తన్నుకు పోతే ఊరుకుంటుందా? 1996 నుంచి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులను, చౌకగా సరుకులను గుమ్మరించడం ప్రారంభించిన చైనాను అమెరికా తక్కుగా అంచనా వేసింది. ఏదో ముడిపదార్ధాలు, ఖనిజాలకు కక్కుర్తిపడే చౌక వస్తు తయారీ బాపతేనని భావించింది. కానీ చాపకింది నీరులా అది సర్వాంతర్యామిగా విస్తరిస్తుందని ఊహించలేదు. చైనా ఇప్పుడు దక్షిణ సూడాన్ కు ప్రధాన వ్యాపార భాగస్వామి. అమెరికాను వెనక్కు నెట్టేసి ఆఫ్రికా ఖండానికే ప్రధాన భాగస్వామిగా మారిపోయింది. అధ్యక్షుడు సల్వా కీర్ ప్రభుత్వంతో చైనాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనొక్కరే ఏమిటి ఆఫ్రికాలోని ప్రభుత్వాధినేతలందరికీ చైనా అంటే ఎనలేని ప్రేమ. అమెరికాలాగా అది అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అప్పటికి ఏ ప్రభుత్వం ఉంటే అదే దాని ప్రభుత్వం! రాజకీయాలకు అతీతమైన నికార్సయిన ఆర్థిక, వ్యాపార బంధాల దారి. 2000లో ఆఫ్రికాతో 1,000 కోట్ల డాలర్లున్న చైనా వాణిజ్యం నేడు అమెరికాకు రెండు రెట్లకు అంటే 20,000 కోట్ల డాలర్లకు చేరిందంటే ఊరికే కాదు. సహజంగానే దక్షిణ సూడాన్ చమురు నిక్షేపాలపైనా చైనా పట్టు బిగుస్తోంది. ఇదంతా చూస్తూ సహించేదెలా? సల్వా కీర్‌ను కూలదోయడం కోసం తెగల తిరుగుబాటుదార్లకు ఆయుధాలిచ్చి అమెరికా చిచ్చు రేపింది. గత రెండేళ్లలో పది వేల మంది బలైనా, లెక్కలేనంత మంది అత్యాచారాలకు గురైనా, 15 లక్షల మంది నిర్వాసితులైనా దానికి పట్టదు. ప్రధాన చమురు సంస్థల్లో 40 నుంచి 70 శాతం వాటాలను చేజిక్కించుకున్న చైనా సంస్థలు తాజాగా కీర్ ప్రభుత్వానికి 100 కోట్ల డాలర్ల రుణాన్ని అందజేశాయి. ‘అర్ధరహితమైన ఈ యుద్ధం కోసం మేం మా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టేస్తున్నాం’ అని స్థానిక పరిశోధకుడొకరు వాపోయారు. అంతా చైనీయం ఇథియోపియా నేడు ‘చైనా ఇథియోపియా’! ప్రపంచ వస్తు తయారీ సూపర్ పవర్ చైనా ఇటీవలి కాలంలో ఆ దేశాన్ని అతి పెద్ద వస్తు తయారీ కేంద్రంగా మార్చేస్తోంది. గత ఏడాదిలోనే ఆ దేశానికి చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 3.4 రెట్లు పెరిగి దాదాపు 100 కోట్ల డాలర్లకు చేరాయి. అవి మన దేశంలోకి ప్రవేశిస్తున్న స్వల్పకాలిక పెట్టుబడులు కావు. నేరుగా పారిశ్రామిక రంగంలోకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి దీర్ఘకాలిక పెట్టుబడులుగా చేరేవి. ఫలితంగా రెండేళ్లలో చైనా తూర్పు ఆఫ్రికా దేశాల్లో 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇథియోపియా, కెన్యా, లెసాతో, రువాండా, సెనెగల్, టాంజానియా తదితర దేశాల్లో చైనా వస్తు తయారీ వివ్లవాన్ని సృష్టించబోతోందని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికశాస్త్రవేత్త జస్టిన్ లిన్ యీఫూ తెలిపారు. ‘ఇథియోపియా సరిగ్గా 30 ఏళ్ల క్రితంనాటి చైనా లాగా ఉంది. సగటు వేతనాలు నెలకు 40 డాలర్లు (రూ. 2,600). ఇప్పటికే ఆఫ్రికాను చౌక వస్తువులతో ముంచెత్తుతున్న చైనా లోటెక్ వస్తు తయారీతో ఆఫ్రికానే చైనాగా మార్చేయబోతోంది’ అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిబోరా బ్రాటిగామ్ అన్నారు. రాబోయే ఐదేళ్లలో కూడా చైనా వ్యాపార ఆధిపత్యానికి తిరుగులేదని అంచ నా. కాదనలేని విధంగా చైనా ఇటీవలే వివిధ దేశాలతో 40,000 కోట్ల డాలర్ల విలువైన నిర్మాణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటికే ఆఫ్రికాలో అది 2,200 మైళ్ల రైలు రోడ్లు, 1,400 మైళ్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ ఊబిలో అమెరికా చైనా ఆఫ్రికాను గొప్ప అవకాశాల గనిగా చూసి పాతుకుపోతుంటే అమెరికా తన సైనిక దృక్పథంతో పీక లోతు వరకు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధాల్లో కూరుకుపోయింది. కల్నల్ గఢాఫీని హతమార్చి, లిబియాను బుగ్గిచేసి ‘ప్రజాస్వా మ్యాన్ని’ స్థాపించింది. ఆ ప్రజాస్వామ్యం భగ్గున దేశాన్ని మండించేస్తోంది. ఆ ధాటికి తట్టుకోలేక రాజధాని ట్రిపోలీలో నుంచి సైతం అమెరికా దౌత్య సిబ్బంది పలాయన మంత్రం పఠించాల్సి వచ్చింది. ఆఫ్రికా నుండి చేసుకునే చమురు దిగుమతుల్లో 70 శాతం కోసం లిబియాపై ఆధారపడిన చైనాకు ‘లిబియా విప్లవం’ వల్ల 2,000 కోట్ల నష్టం వాటిల్లింది. గడాఫీ కూలదోసివేతకు కారణాల్లో ఒకటి... చైనా ప్రాబల్యానికి అడ్డు కట్టవేయడం. లిబియాపై దాడికి అమెరికా దాని మిత్ర దేశాలు చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. గడాఫీ వ్యతిరేక యుద్ధం కోసం వారు అన్ని తెగలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చారు. కేంద్ర అధికారం కూలిపోయాక ఆ తెగలన్నీ ‘ప్రజాస్వామ్యాన్ని’ ధిక్కరిస్తున్నాయి. లిబియా యుద్ధంలో కీలక పాత్ర వహించిన ట్యు రెగ్ తెగలు అత్యాధునిక ఆయుధాలతో మాలీ, చాద్, నైజీరియా, బుర్కినా పోసో, ఘనా, గినియా, అల్జీరియాల్లో కూడా అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయి. మాలీలో అమెరికా సహాయంతో సైనిక జోక్యానికి దిగిన ఫ్రాన్స్ అక్కడి నుండి బయటపడే పరిస్థితి లేదు. సోమాలియాలో 2006లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఇస్లామిక్ కోర్ట్ యూనియన్ (ఐసీయూ) ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా 2007లో కూల్చింది. అందుకోసం ఇథియోపియా, కెన్యాలను సోమాలియాపై యుద్ధానికి దించింది. ఫలితంగా ఐసీయూ చీలిపోయి అల్ షబాబ్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని పెంపొందించుకుంది. అది ఇథియోపియా, కెన్యా, ఉగాండా తదితర దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడుతోంది. మేలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాంగ్రెస్ కమిటీలో మాట్లాడుతూ, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో ఆఫ్రికా ప్రధాన రంగంగా ముందుకు వస్తోందంటూ 5,000 కోట్ల డాలర్ల నిధులను అందుకు కేటాయించారు. అఫ్ఘానిస్థాన్‌ను నుంచి ఉపసంహరించే సేనలను ఆఫ్రికాలో స్పెషల్ ఆపరేషన్స్‌కు నియమించబోతున్నారు. చైనా ప్రాబల్యాన్ని పరిమితం చేసే లక్ష్యం నుండి దాన్ని ఎదుర్కొనే లక్ష్యానికి మారినట్టుగా ఇటీవల ఒబామా ప్రకటించారు. కానీ చైనా దీర్ఘకాలిక వ్యూహంతో వాణిజ్య, పెట్టుబడుల బంధాలతో 54 దేశాల ఆఫ్రికా మద్దతును కూడగట్టడానికి యత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికల నుండి అమెరికాను సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. లిబియాలో తిన్న ఎదురు దెబ్బకు చైనా మూల్యాన్ని వసూలు చేయక తప్పనట్టే కనిపిస్తోంది. పిళ్లా వెంకటేశ్వరరావు -
పిడికిలెత్తిన ‘యూరో’ జనం
విశ్లేషణ బలపడుతున్న పచ్చి మితవాదానికి, వామపక్ష అతివాదానికి పునాది ఈయూ ఆర్థిక తాత్వికతలో భాగంగా మారిన పొదుపు చర్యలే. ఈ రెండు ధోరణులూ ఈయూ అస్థిత్వానికి చరమ గీతం పాడేవే. రెండు ధోరణుల్లోనూ దేనినైనా ఎంచుకోవాల్సి వస్తే ఈయూ నేతలు లె పెన్ మితవాద జాతీయవాదం బాటనే ఎంచుకుంటారు. యూరప్ పెను భూకంపానికి గురయిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె గత సోమవారం దిగ్భ్రాంతితో నోరు తెరిచారు. అది యూరోపియన్ యూనియన్ ఎన్నికల ఫలితాల ఉత్పాతం. హాలెండే నోరు తెరిచింది ఫ్రాన్స్‌లో అధికార సోషలిస్టు పార్టీ 14 శాతం ఓట్ల ఘోర పరాభవంతో మూడో స్థానంలో నిలిచినందుకు కాదు... ‘సరిహద్దులు లేని ఒకే దేశం’ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అస్థిత్వానికే ఎసరు తేనున్న పెను ముప్పును చూసి. 751 సభ్యుల యూరోపియన్ పార్లమెంటులో దాదాపు 140 మంది ఈయూను పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకించేవారే కానున్నారు. ఈయూ మూడు మూల స్తంభాల్లో రెండైన ఫ్రాన్స్, బ్రిటన్లు ప్రజలు మాత్రం దివాలా తీసిన ఈయూ దుకాణం కట్టిపెట్టేసి ఎవరి దారి వారు చూసుకోవడమే ఉత్తమమని తీర్పు చెప్పడం ఆందోళనకరమే మరి. 28 ఈయూ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో గత దఫా కంటే ఓటర్లు ఎక్కువగా పాల్గొన్నా పోలింగ్ 42 శాతమే! జాతీయ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగినా ఈయూ ఎన్నికలపై ఓటర్లు ఇలా నిరాసక్తతను వ్యక్తం చేయడమే సాధారణమే. ఈయూ ఒకే దేశంగా ఎంతగా ‘ఐక్యమైందో’ చెబుతుంది. 25 నుంచి 30 శాతం ఓటర్లు ఆ ‘ఐక్యత’ పట్ల సైతం వ్యతిరేకతను కనబరిచారు. ‘యూరో’ పట్ల, యూరోపియన్ కమిషన్ ఆధిపత్యం పట్ల వ్యతిరేకత గత ఏడాది కంటే కూడా పెరిగినట్టు ఎన్నికలకు ముందే వెల్లడైంది. అయినా ఫలితాలు ఇలా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. ఈయూకు అత్యంత కీలకమైన జర్మనీలో అధికార పార్టీ పరువు దక్కించుకున్నదన్న ఊరటకంటే... తదుపరి ఎన్నికల నాటికి ఈయూ మద్దతుదార్ల సంఖ్య ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరికి పడిపోక తప్పదనే అంచనాలు సృష్టిస్తున్న ఆందోళనే ఈయూ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క రోజుకు రాజులైన ఓటర్ల సందడి సద్దుమణిగాక వడ్డించాల్సిన సబ్ ఠీక్ హై కథనాలను మీడియా ‘నిపుణులు’ ఇప్పటికే సిద్ధం చేశారు. రాజకీయ నాయకత్వ వైఫల్యం? ఎన్నికల ఫలితాల వల్ల ఈయూ అనుకూల పార్టీలకు, వాటి ఆధిపత్యానికి ఇప్పుడొచ్చిన ముప్పేమీ లేదు. కాబట్టి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), యూరోపియన్ కేంద్ర బ్యాంకు (ఈసీబీ), యూరోపియన్ కమిషన్ (ఈసీ) ‘త్రయం’ ఇకపై కూడా యూరప్‌పై ఏకచ్ఛత్రాధిపత్యం నెరపగలదు. అయితే యూరప్ వ్యాప్తంగా జర్మనీ సహా ప్రతి చోటా ఈయూ పట్ల, ‘పొదుపు’ (ఆస్టిరిటీ) చర్యల పట్ల పెరుగుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను ఎలా వివరించాలి? ఈయూ నేతలు, వారి మద్దతుదార్లు సైతం ఈ అంసతృప్తిని ‘గుర్తిస్తున్నారు.’ కానీ అదంతా ఆయా దేశాల్లోని రాజకీయ అస్థిరత, నాయకత్వ అసమర్థతల ఫలితమేనని కొట్టిపారేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు, నేటి అంతర్జాతీయ సంచలనం మెరిన్ లె పెన్ ఇమ్మిగ్రేంట్స్‌కు (వలస వచ్చిన విదేశస్తులు) వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతుంటే ఆమెకు సమాధానం చెప్పలేకపోవడమే ఫ్రాన్స్‌లో సోషలిస్టుల ఓటమికి కారణం. బ్రిటన్‌లో మితవాద పక్షం ఓటమికి కారణం యూకేఐపీకి సమాధానం చెప్పలేకపోవడం! యూరప్ వ్యాప్తంగా విదేశస్తులు, ముస్లింల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు, జాతీయవాద, జాతీయోన్మాద ధోరణులకు లె పెన్ విజయమే నిదర్శనం. ఫ్రాన్స్, బ్రిటన్లలో వలే ఘన విజయాలను సాధించకున్నా మొత్తంగా ఈ పార్టీలు పెద్ద ఎత్తున ప్రతి చోటా బలపడ్డాయి. గ్రీస్‌లో పొదుపు చర్యలను, ఈయూను వ్యతిరేకించే వామపక్ష సిర్జియా విదేశీయులపట్ల, ముస్లింలపట్ల ఎలాంటి వ్యతిరేకతా లేకుండానే విజయం సాధించింది. అక్కడే నియోనాజీ పార్టీ గోల్డెన్ డాన్ కూడా గణనీయంగా బలం పుంజుకుంది. మొత్తంగా యూరప్‌లో ఇటు మితవాదం, జాతీయోన్మాదం అటు పాప్యులిస్టు పార్టీలుగా పిలిచే ప్రభుత్వ సంక్షేమ వ్యయాలు, ఉపాధి కల్పనకు పట్టం గట్టే పార్టీలు పుంజుకున్నాయి. ఇంచుమించుగా ప్రతి చోటా ప్రజల అసంతృప్తి సాంప్రదాయేతరమైన కొత్త పార్టీలవేపే మొగ్గు చూపింది. అందుకే సోషల్ డెమోక్రాట్లు, కమ్యూనిస్టుల వంటి సంప్రదాయ వామపక్షాలు ఎక్కువగా దెబ్బతినిపోయాయి. ప్రజల అసంతృప్తి వ్యక్తమైన తీరు భిన్నంగా ఉన్నా అది వేలెత్తి చూపుతున్నది మాత్రం గత ఐదేళ్లుగా ఈయూ త్రయం ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలవైపూ, ఆరేళ్ల తదుపరి కూడా వదలని ఆర్థిక సంక్షోభం వైపు. వాటికి ఏమని ‘సమాధానం’ చెప్పాలి? ఈయూ దేశాలన్నిటిలోనూ కలిపి సగటున 12.2 శాతానికి చేరిన నిరుద్యోగానికి ‘సమాధానం’ ఏమిటి? 2011లోనే కోలుకుందన్న అమెరికా వృద్ధి 2014 మొదటి త్రైమాసికలో తిరిగి అథోముఖం పట్టిన చేదువాస్తవం ఎదురుగా ఉండగా ఈయూ కోలుకుంటుందని ఎలా సమాధాన పరచగలరు? మరణ శాసనమే ఈయూ నేతల మౌనమే లె పెన్‌ల బలం. వలస వచ్చిన విదేశస్తులే నిరుద్యోగం తదితర ఆర్థిక కడగండ్లకు కారణమంటూ యూరప్ అంతటా యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీలు ‘సమాధానం’ చెబుతున్నాయి. గత పదేళ్లలో 20 లక్షల మంది అత్యున్నత స్థాయి వృత్తి నిపుణులు బ్రిటన్, అమెరికాలకు వలసపోయారు. దీంతో తూర్పు యూరప్, ఆసియాలనుంచి వలస శ్రామిక శక్తి వలస రాకపోతే ఫ్రాన్స్ మరింత సంక్షోభంలో పడుతుంది. గత వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వలస పోవడం 7 రెట్లు పెరిగి, 700 కోట్లకు చేరింది. ఇలాంటి వాస్తవాలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆరేళ్ల ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాకున్నా. తిండీబట్టా గూడూ లేకున్నా, వాటిని సంపాదించుకునే ఉపాధి అవకాశాలు లేకున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆసరాను ఎప్పటికో అప్పటికి ఎలాగోలా స్వేచ్ఛా విపణి దేవతలు కరుణిస్తారని చెప్పాలి. అలాంటి కాకమ్మ కబుల్లు వినే రోజులు పోయాయి. మితవాద లె పెన్లు, వామపక్ష ట్సియాపరస్లు చెప్పే సమాధానాలు నమ్మే పరిస్థితి వచ్చిందనేదే ఈయూ ఎన్నికల ఫలితాల సారం. లె పెన్లకు విరుద్ధంగా గ్రీస్ నేత ట్సియాపరస్ మరో మార్గం చూపుతున్నారు. గ్రీస్‌ను రుణాల ఊబిలోకి దించిన ఈయూ నుంచి, యూరో నుంచి వైదొలగి, విదేశీ రుణాలను ఎగ్గొట్టి సంక్షోభం నుంచి బయటపడే మార్గం. లె పెన్‌ల కంటే యూరో అధినాయక త్రయానికి ట్సియాపరస్లంటేనే భయం. గ్రీస్ బోర్డు తిప్పేస్తే మునిగేది ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ బ్యాంకర్లే. గత ఐదేళ్లలో 30 శాతం వేతనాల కోతను, 27.7 శాతం నిరుద్యోగం క్షోభను అనుభవిస్తోన్న గ్రీస్ ప్రజలకు అంతకుమించిన తరుణోపాయం ఏముంది? వామపక్ష సిరిజా ట్సియాపరస్, పచ్చి మితవాద జాతీయోన్మాద లె పెన్లు ఇద్దరి పరిష్కారాలూ ఈయూకు చరమగీతం పాడేవే. అంతదాకా ఎందుకు యూరో కరెన్సీని ఆమోదించని బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీయే రెండేళ్ల తదుపరి ఈయూ నుంచి బయటపడే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనుకుంటోంది. ప్రతి ఈయూ దేశంతోనూ భారీ విదేశీ వాణిజ్య మిగులు ఉన్న జర్మనీయే ఈయూ ఐక్యతను ఆచరణలో నిరాకరిస్తోంది. అన్ని దేశాలు జర్మనీ నుంచి కొనాల్సిందే తప్ప అది ఎవరి దగ్గరి నుంచి కొనదు. లె పెన్లు కోరుతున్నట్టు శ్రామిక శక్తి గమన శీలతను నిరోధించే వలసల వ్యతిరేక చట్టాలు రావడమంటే జాతీయ రాజ్యాల సరిహద్దులు పటిష్టం కావడమే. ఈయూ అస్థిత్వాన్ని రద్దు చేయడమే. బలపడుతున్న పచ్చి మితవాదానికి, అతివాద వామపక్ష వాదానికి పునాది ఈయూ ఆర్థిక తాత్వికతలో భాగంగా మారిన పొదుపు చర్యలే. ఈ రెండు ధోరణులూ ఈయూ అస్థిత్వానికి చరమ గీతం పాడేవే. రెండు ధోరణుల్లోనూ దేనినైనా ఎంచుకోవాల్సి వస్తే ఈయూ నేతలు లె పెన్‌ల బాటనే ఎంచుకుంటారు. అప్పుడే యూరోపియన్ బ్యాంకర్లు సుఖంగా ఉంటారు. వడ్డీలు, అసళ్లు భద్రంగా ఉంటాయి. యూరప్‌లో రెక్క విప్పుతున్న నియోనాజీ జాతీయోన్మాద ధోరణులను వ్యతిరేకించేవారు గుర్తించనిది ఒక్కటే. యూరప్‌కు ఎదురవుతున్న నాజీయిజం ముప్పు లె పెన్‌ల నుంచి, గోల్డెన్ డాన్ల నుంచి కాదు... పొదుపు చర్యల నుంచి, ఈయూ అనే అర్థరహితమైన అవ్యవస్థ నుంచి. - పిళ్లా వెంకటేశ్వరరావు -
దరహాసాల దేశంలో విషాదస్వామ్యం
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన యింగ్లుక్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి థాయ్ ప్రతిపక్షాలు ఆరు నెలలుగా చేస్తున్న అందోళనలు దేశాన్ని సైన్యం చేతుల్లోకి నెట్టాయి. ఎన్నికలకు సైతం అంగీకరించక రాజ్యాంగేతర అధికారం కోసం అంగలార్చి ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చాయి. ‘ప్రజాస్వామ్యం చూడక తప్పని విషాదాంత ప్రహసనం’ అని నమ్మక తప్పేట్టు లేదు. ‘ప్రజాస్వామ్యం దేశానికి చాలా కీడు చేసింది’ అంటూ థాయ్‌లాండ్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ప్రయుత్ చాన్ ఓచా ప్రవచిస్తుంటే నోళ్లు తెరుచుకు వినాల్సిన రోజులొచ్చాయి. 1932లో రాచరికం రద్దయినప్పటి నుంచి పద్దెనిమిదిసార్లు సైనిక తిరుగుబాట్లు జరిగిన ఆ దేశంలో మే22న పందొమ్మిదో కుట్రకు పాల్పడ్డందుకు ప్రయుత్ను తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రజాసామ్యమంటే ప్రజా తీర్పుకు కట్టుబడటం కానప్పుడు సైనిక జుంటాలు కబంద హస్తాలు చాచడం తప్పదు. ప్యూథాయ్ పార్టీకి పట్టంగట్టి మెజారిటీ ప్రజలు తప్పు చేశారన్నట్టు... వీధులకెక్కి, పరిపాలనను స్తంభింపజేసి, సైనిక జోక్యానికి ‘రాచ’ బాట వేసిన డెమోక్రటిక్ పార్టీ ప్రతిపక్ష నేత సుతెప్ తౌగ్సుబెన్ను తప్పు పట్టాలి. ప్యూథాయ్ నేత్రి యింగ్లుక్ షినావత్ర మాజీ ప్రధాని తక్సిన్ షినావత్రకు చెల్లెలుగా పుట్టడం మహా పాపమే కావచ్చు. విదేశాల్లో ఉన్న అన్న తెర వెనుక నుంచి ఆమె పార్టీని నడిపిస్తున్న మాటా నిజమే కావచ్చు. కానీ థాయ్ ప్రజలకు తక్సిన్ అవినీతి చరిత్రా తెలుసు, ఘోర నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రజలకు, పేదలకు చేసిన మేలూ తెలుసు. వృద్ధి వెలుగులకు నోచుకోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల ప్రజలు తక్సిన్ వల్ల జరిగిన మేలును మరచిపోలేకపోవడం తప్పే కావచ్చు. కానీ వాళ్లు మరచిపోలేదు. తక్సిన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అవినీతి రొంపిలో మునిగి తేలుతున్న సెతెప్కు నగరాల, పరిశ్రమల వృద్ధి వెలుగులే తప్ప, వృద్ధి రేట్ల జిలుగులే తప్ప మురికివాడల, గ్రామీణ ప్రాంతాల చీకట్లు పట్టవనీ తెలుసు. అందుకేనేమో తక్సిన్ దుబాయ్‌లో స్వచ్ఛంద ప్రవాసంలో ఉన్నా 2011లో ఆయన చెల్లెలికి పట్టంగట్టారు. ప్రజాస్వామ్యమంటే కుల,మత, వర్గ, లైంగిక వివక్షకు తావు లేకుండా పౌరులందరికీ ఒక్కొక్కరికి ఒక ఓటు ప్రాతిపదికపై జరిగే ఎన్నికలనీ, రాజ్యాగబద్ధంగా నిర్దేశితమైన మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న పరిపాలన అనీ మనకు తెలిసిన నిర్వచనానికి కాలదోషం పట్టిపోయిందని సుతెప్ తదితర ప్రతిపక్ష నేతలు తేల్చేశారు. ప్రజాస్వామ్య మంటే పరిపాలనా దక్షత, వ్యవహార శైలి కూడా అని కొత్త నిర్వచనం చెప్పారు. యింగ్‌లుక్‌కు అవి లేవని తేల్చేసి ప్రజలు చెప్పిన తప్పుడు తీర్పును మార్చే ప్రయత్నంలో మునిగి తేలారు. పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలకు యింగ్లుక్ సిద్ధమయ్యారు. 2006లో సైనిక కుట్రతో తక్సిన్‌ను గద్దెదించినప్పటి నుంచి 2011 సార్వత్రిక ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు ‘తప్పుడు తీర్పులు’ చెబుతూనే ఉన్నారు. యింగ్లుక్ నేతగా ఉన్న ప్యూథాయ్కి పట్టంగడుతూనే ఉన్నారు. నేడే కాదు మరో నాలుగేళ్ల తర్వాతైనా గెలవలేమని తెలిసిన ప్రతిపక్షాలు రాజ్యాంగ విరుద్ధంగా తమకు అధికారం అప్పగించాల్సిందేనని పట్టుబట్టాయి. నేటి సైనిక కుట్రకు తలుపులు బార్లా తెరిచాయి. గత ఆరునెల్లుగా తక్సిన్ల మద్దతుదార్లయిన గ్రామీణ, పేద ‘ఎర్రచొక్కాలు’, ప్రతిపక్షాల మద్దతుదార్లయిన ‘పచ్చ చొక్కాలు’ వీధుల్లో ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాయి. ఘర్షణల్లో 30 మంది మృతి చెందారు కూడా. ఈ నెల 7న థాయ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని యిం గ్లుక్ రాజ్యాంగ ఉల్లంఘనకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీర్పు చెప్పింది. దీంతో ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధానిగా నివత్తమ్రోంగ్ బూన్సోంగ్పైసాన్ ప్యూధాయ్ పార్టీ ఎన్నుకుంది. ప్రయుత్ ఆయన్ను కూలదోసి ప్రజాస్వామ్యం ‘ముప్పు’ నుంచి థాయ్‌లాండ్‌ను రక్షించారు! 2006లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తస్కిన్ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి 2014 సైనిక తిరుగుబాటు వరకు ప్రధాని కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న పౌర అధికారిని బదిలీ చేయడమే ప్రధానిగా యింగ్లుక్ చేసిన మహా నేరం. మే 22న జరిగిన సైనిక కుట్రలో ‘న్యాయ వ్యవస్థ’ భాగస్వామి. అలంకారప్రాయమైన రాజు భూమిబల్ అదుల్యదేజ్‌కు (86) గట్టి మద్దతుదారు ప్రయుత్‌కు సింహాసనం ఆశీస్సులు తక్షణమే లభించి తాత్కాలిక ప్రధాని కాగలిగారు. ప్రాధాన్యం కోల్పోతున్న రాచరికం సైన్యం సహాయంతో సైనిక తిరుగుబాటుకు సమంజసత్వాన్ని ఆపాదించాలని ప్రయత్నిస్తోంది. సైన్యమే 2006 కుట్ర తర్వాత రచించిన 2007 రాజ్యాంగాన్ని రద్దుచేయడం దేశాధినేతగా ప్రయుత్ చేసిన మొట్టమొదటి పని. విదేశీ చానళ్లు సహా మీడియా బ్లాకౌట్, సామాజిక వెబ్సైట్ల నిషేధంతో ప్రతిపక్షాల గోలను అవినీతి వ్యతిరేక ప్రజాస్వామ్య పోరాటంగా భ్రమించి వీధులకెక్కిన మధ్యతరగతి విద్యావంతుల కళ్లను తెరిపించారు. సైనిక కుట్రను వ్యతిరేకిస్తున్న అధికార, ప్రతిపక్షాల నిరసనకారులకు ‘ఆట ముగిసిపోయింది’ అని చెప్పేసి అన్ని ఆందోళనలను నిషేధించారు. పారిశ్రామిక వర్గాలు ఈ ‘అస్థిరత’ తొలగిపోతుందని సెలవిస్తున్నాయి. అంటే ప్రయుత్ అంటున్నట్టే సైనిక పాలనకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదు. బ్యాంకాక్ విశ్వవిద్యాలయానికి చెందిన రాజ కీయ విశ్లేషకులొకరు అన్నట్టు ’థాయ్ ప్రజలు మళ్లీ బహుశా చీకటి రోజులను చూడాల్సి వస్తుంది’. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ఉక్రెయిన్ గద్దెపై ‘చాక్లెట్ రాజా’
ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు ‘విప్లవ పార్టీల’న్నిటి నీ చెత్తబుట్టలోకి విసిరేశారు. ఉక్రే నియన్లలో కనిపించనిదిగా చెప్పే రాజీతత్వం కలిగిన పొరొషెంకో అధ్యక్షుడు కావడం అమెరికా, రష్యాలకు గౌరవప్రదంగా ఉక్రెయిన్ చిక్కుముడి నుంచి బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది. యూరోపియన్ నేతలకు గత ఆదివారం దుర్దినం. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ఈయూ అస్తిత్వాన్నే సవాలు చేసే పార్టీలకు భారీ ఆధిక్యతను కట్టబెట్టారు. సరిగ్గా అదే రీతిలో అదే రోజున జరిగిన ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు ‘విప్లవ పార్టీల’న్నిటినీ చెత్తబుట్టలోకి విసిరేశారు. 2005లో సీఐఏ సూత్రధారిగా సాగిన ‘ఆరెంజ్ విప్లవ’ నేత్రి, మాజీ ప్రధాని యూలియా ట్యామషెంకో నేటి ఎన్నికల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగి ఘోర పరాభవం చవి చూశారు. ఏ పార్టీకీ చెందని పెట్రో పొరొషెంకో (48) ద్వితీయ స్థానంలో నిలిచిన ఆమె కంటే నాలుగు రెట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ఉక్రెయిన్ ఎన్నికలను ప్రజాస్వామ్య విజయంగా కీర్తిస్తున్న అమెరికా, ఈయూలు పొరొషెంకోకు పాశ్చాత్య దేశాలకు అనుకూలునిగా ఉన్న పేరును గుర్తు చేస్తున్నాయి. ఈయూలో చేరడానికే కాదు, నాటో సైనిక కూటమిలో చేరడానికి కూడా ఆయన సుముఖులని చెప్పుకుని మురుస్తున్నాయి. ఫిబ్రవరి ‘ప్రజాస్వామిక విప్లవాన్ని’ ఆయన సమర్థించారని జ్ఞప్తి చేస్తున్నాయి. అయితే అమెరికా, ఈయూల అనధికార అభ్యర్థి ట్యామెషెంకో మాత్రం ఆయన ‘రష్యా పంచామంగ దళానికి చెందిన ద్రోహి’ అని పదే పదే ఆరోపించారు. జర్మన్ మీడియా నిస్సందేహంగా ఆయన రష్యా అనుకూలుడేనని తేల్చిపారే సింది. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా కనిపించే పొరొషెంకో 130 కోట్ల డాలర్ల నికర ఆస్తులతో ‘ఫోర్బ్స్’ ప్రపంచ బిలియనీర్ల జాబితాకు ఎక్కారు. రష్యా, యూరప్‌లలో ఏటా 100 కోట్ల డాలర్ల అమ్మకాలు సాగించే ‘రోషెన్’ చాక్లెట్ల పరిశ్రమకు ఆయనే అధిపతి. ఉక్రెయిన్, లిథుయేనియా, రష్యా తదితర యూరోపియన్ దేశాల నగరాల్లోని చాక్లెట్ల ఫ్యాక్టరీలేగాక కార్లు, షిప్ యార్డ్లు తదితర రంగాలకు ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. సోవియెట్ యూనియన్ సామ్రాజ్యపు శిథిలాలే ఆయన సామ్రాజ్యానికి పునాది. తూర్పు యూరప్ ప్రైవెటైజేషన్ ఉన్మాదంతో ఊగిపోతుండగా ప్రభుత్వ ఆస్తులను, చాక్లెట్ కంపెనీలను కారు చౌకకు కోనేసి ఆయన కోట్లకు పడగలెత్తారు. ఉక్రెనియాను శాసించే గుప్పెడు మంది కుబేరుల్లో ఒకరయ్యారు. ఉక్రేనియన్లలో కనిపించనిదిగా చెప్పే రాజీతత్వం ఆయనకు వరం. ‘గాలి వాటాన్ని’ బట్టి ఎప్పుడు ఎటు ఉండాలో అప్పుడు అటే ఉండగల నేర్పు ఆయన సొంతం. కాబట్టే యుషుచెంకో ‘ఆరెంజ్ విప్లవ’ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, ఫిబ్రవరిలో పదవీచ్యుతుడైన విక్టర్ యానుకోవిచ్ ప్రభుత్వంలో వాణిజ్య, ఆర్థికాభివృద్ధి మంత్రిగా పనిచేయగలిగారు. తదుపరి ‘విప్లవ’ పక్షంలో చేరారు. రష్యాతో సంఘర్షణ, అంతర్యుద్ధ పరిస్థితుల మధ్య తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు దేశ ఐక్యత నే తప్ప మితవాద నియో నాజీ జాతీయోన్మాదాన్ని కోరుకోవడం లేదని పొరొషెంకో గ్రహించారు. ఉక్రెయిన్ ఐక్యతనే ఎన్నికల అస్త్రంగా ధరించి బరిలోకి దిగారు. మూడు నెలల్లో రష్యాతో సత్సంబంధాలను పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశారు. ‘రష్యా భాగస్వామ్యంలేని ఉక్రెయిన్ సుస్థిరత లేదా ప్రాంతీయ సుస్థిరత, బహుశా ప్రపంచ సుస్థిరత అసాధ్య’మని ప్రకటించారు.జూన్‌లో రష్యాతో చర్చలు జరపనున్నట్టు గెలిచిన వెంటనే తెలిపారు. చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ సైతం ప్రకటించారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం దాదాపు శూన్యం. కానీ పొరొషెంకో వ్యాపార సామ్రాజ్యంపై రష్యా అధికారికంగా, అనధికారికంగా విధించిన ఆంక్షలు మాత్రం ఆయనను తెగ చికాకు పెడుతున్నాయి! తూర్పు ప్రాంతంలో సాగుతున్న సైనిక చర్యను నిలిపివేసే విషయంపై మాత్రం ఆయన పెదవి మెదపలేదు. ఎప్పుడు బిగబట్టాలో, ఎప్పుడు జారవిడవాలో తెలిసిన బేరగాడు పొరొషెంకో. ఆయనలాంటి రాజీవాద నేత ఎన్నిక కావడం ఇటు అమెరికా, ఈయూలకు, అటు రష్యాకు కూడా గౌరవప్రదంగా ఉక్రెయిన్ చిక్కుముడి నుంచి బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది. పొరొషెంకో శాంతి ఫార్ములా ప్రకారం పాశ్చాత్య దేశాలతో అనుబంధాన్ని కలిగి ఉండే హక్కు ఉక్రెయిన్‌కు ఉంటుంది. అలాగే ఉక్రెయిన్, నల్ల సముద్ర ప్రాంతంలోని రష్యా వాణిజ్య, వ్యూహాత్మక ప్రయోజనాలకు, ‘సహజ హక్కులకు’ హామీని కల్పిస్తుంది. ఈయూలో చేరే విషయాన్ని 2025 నాటికి వాయిదా వేసి, నాటోలో చేరడం ఇప్పట్లో అసాధ్యమని ఆయన తేల్చేశారు! అగ్రరాజ్యాలకు, ఈయూకు ఆమోదయోగ్యమైన ఈ ఫార్ములాను జాతీయోన్మాదంతో పేట్రేగుతున్న నియో నాజీ ముఠాలు ఆమోదిస్తాయా? తూర్పు ప్రాంత ప్రజలు ఆదరిస్తారా? అనేదే ప్రశ్న. ఉక్రెయిన్ చిచ్చులో చలి కాగుతున్న అందరి నోళ్లనూ చాక్లెట్ రాజా తీపిచేయగలరా? - పిళ్లా వెంకటేశ్వరరావు -
‘ఆమ్ ఆద్మీ’ కథ ముగిసిందా ?
గెలుపు, ఓటముల లెక్కలకు ఆప్ ఒదగదు. ఆ పార్టీ పుట్టింది వీధుల్లోని ఆందోళనల నుంచి. ఆ పార్టీ నేతలంతా ఆందోళనకారులే. అధికారంలో కంటే వీధుల్లోనే వాళ్లు సౌఖ్యంగా ఉండగలరు. ప్రభుత్వంగా కంటే ప్రతిపక్షంగానే వాళ్లు నేర్వాల్సింది చాలా ఉంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవనేది సార్వత్రిక సత్యమేమీ కాదు. ‘ఆమ్ ఆద్మీ’ నేత కేజ్రీవాల్ ‘ఆత్మహత్య’ను మీడియా ధన్వంతరులం తా నిర్ధారించారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చేయడమే తరువాయి అనుకుంటుండగా ఆవిష్కృతమవుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రహనంపై అడగాల్సిన అస లు ప్రశ్న తప్ప అన్నీ చర్చకు వస్తున్నాయి. 49 రోజుల పాలన తదుపరి ఫిబ్రవరి 14న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ అర్ధంతరంగా రాజీనామా చేశారు. ఎన్నడూ అధికారాన్ని తమంతట తాము వదిలిపోని కాంగ్రెస్, బీజేపీల చేత ‘భాగోరా’ (పారిపోయినవాడు) ముద్ర వేయించుకున్నారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలకు ఒక్క దాన్నీ దక్కించుకోలేక మూల్యం చెల్లించుకున్నారు. తమ ప్రభుత్వ రాజీనామాతో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు పరిష్కారం తిరిగి శాసన సభకు ఎన్నికలు జరపడమేనని ఆప్ వాదిస్తూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతో పాటూ శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని డిమాండు చేసింది. అలా చేస్తే భారీ వ్యయ ప్రయాసలు తప్పుతాయని వాదించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు ససేమిరా వల్లకాదన్నాయి. వెంట వెంటనే ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్క రం కాదని హితవు చెప్పాయి. హఠాత్తుగా ఇప్పుడు వారికి ఎన్నిక లు జరిపేయడమే ఉత్తమమని అనిపిస్తోంది. ఆప్ గెలుస్తుందనుకుంటే ఎన్నికలు జరపడం చేటు, ఓడిపోతుందనుకుంటే శ్రేయస్కరం! రెండు ప్రధాన జాతీయ పార్టీల ఢిల్లీ యూనిట్లు ఇలా శీర్షాసనం వేయడాన్ని ప్రధాన జాతీయ మీడియా ప్రశ్నించకపోగా గమనించనట్టు నటిస్తోంది. డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా లేక ఎన్నికలకు సిద్ధం కావడమా? అనేది తేల్చుకోలేక కేజ్రీవాల్ వేస్తున్న పిల్లిమొగ్గలను మాత్రం భూతద్దాల్లోంచి చూస్తోంది. ‘సున్నా’లో దాగిన వాస్తవాలు మోడీ సుడి గాలి వడిలోనే శాసనసభ ఎన్నికలను జరిపేస్తే తిరిగి కోలుకోనివ్వకుండా ఆప్‌ను చావు దెబ్బ తీసేయొచ్చనే బీజేపీ ఎత్తుగడ తేలిగ్గానే అర్థం అవుతుంది. కాకపోతే ఢిల్లీ శాసనసభలో 8 స్థానాలున్న (మొత్తం 70) కాంగ్రెస్... లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఆధిక్యతను సాధించలేదు. ఇప్పుడు ఎన్నికలకు దిగితే ఆ సీట్లు కూడా దక్కవు. హర్యానా, మహారాష్ట్రల్లో ఈ ఏడాదే జరగనున్న శాసనసభ ఎన్నికల పీడకలలతో ఆ పార్టీ ఇప్పటికే సతమతమవుతోంది. కేజ్రీవాల్ కాళ్లా వేళ్లాపడైనా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి పరువు దక్కించుకోవాల్సింది పోయి మూడో పరాభవం కోసం అది ఎందుకు ఆరాటపడుతున్నట్టు? ప్రత్యర్థులైన రెండు జాతీ య పార్టీలకు ‘వెంటవెంటనే ఎన్నికల నిర్వహణ’ వల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందనే జ్ఞానోదయం ఇప్పుడే ఎందుకు కలిగినట్టు? లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ చుట్టిన గుండు సున్నా వెనుక దాగిన ‘మింగుడు పడని’ వాస్తవాలే సమాధానాలు చెబుతాయి. ఢిల్లీలో 28 అసెంబ్లీ స్థానాలున్న ఆప్... 10 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచింది. మిగతా 60 సెగ్మెంట్లలోనూ అదే ద్వితీయ స్థానంలో ఉంది. మధ్యతరగతి విద్యావంతులు ఆప్‌కు మొహం చాటు చేసినా, మోడీ దుమారం రేగుతున్నా బీజేపీ ఢిల్లీలో సాధించిన ఓట్లు 46 శాతం. శాసనసభ ఎన్నికల నాటి 33 శాతంతో పోలిస్తే అది 13 శాతం ఎక్కువే. కానీ, 2009లో కాంగ్రెస్‌కు పోలైన 57 శాతం ఓట్లతో పోలిస్తే...? మరింత ‘ఆందోళనకరమైన’ వాస్తవం మరొకటుంది. ఆప్ ఓట్లు 28 నుంచి 33 శాతానికి... 5 శాతం మేర పెరిగాయి! ‘భాగోరా’ పార్టీకి మధ్య తరగతి ఓట్లలో పడ్డ గండిని పూడ్చడమే గాక మొత్తం ఓట్లు పెరిగేలా చేసింది ఎవరు? ముస్లిం ఓటర్లు. ఆప్‌ను అధికారానికి దూరంగా ఉంచకపోతే. చేసిన తప్పులు సరిచేసుకొని, ఇల్లు చక్కదిద్దుకొనే అవకాశాన్ని ఇస్తే... రాజధాని నుంచి కాంగ్రెస్ అంతర్ధానమయ్యే ప్రమాదం ఉంది. ఇక బీజేపీకి మరోసారి ఆశాభంగం కలిగినా ఆశ్చర్యపోలేం. ‘ఆత్మహత్య చేసుకున్న’ ఆప్ అంటే కాంగ్రెస్, బీజేపీలకు అందుకే భయం. ముస్లింల చూపు ఆప్‌పైనే... ఇదిలా ఉండగా ఎన్నికలు జరిగితే ఆప్‌కు 11 అసెంబ్లీ స్థానాలకు మించి దక్కవనే మీడియా పండితుల బెదిరింపులకు కేజ్రీవాల్ ఎందుకు దడుస్తున్నట్టు? ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నట్టు? ఎన్ని తప్పులు చేసినా చాలా సెక్షన్ల ప్రజ ల్లో కేజ్రీవాల్ నిజాయితీపై విశ్వాసం ఉంది. ఆప్‌లాంటి ప్రత్యామ్నాయం ఉంటే ముస్లింలే కాదు విద్యావంతులైన మధ్యతరగతి యువత కూడా అటే మొగ్గు చూపుతుంది. ఈ వాస్తవాలు సాంప్రదాయకమైన ఎన్నికల లెక్కలకు ఒదిగేవి కావు. గెలుపు, ఓటముల లెక్కలకు ఆప్ ఒదగదు. ఆ పార్టీ పుట్టింది వీధుల్లోని ఆందోళనల నుంచి. ఆ పార్టీ నేతలంతా ఆందోళనకారులే. అధికారంలో కంటే వీధుల్లోనే వాళ్లు సౌఖ్యంగా ఉండగలరు. ప్రభుత్వంగా కంటే ప్రతిపక్షంగానే వాళ్లు నేర్వాల్సింది చాలా ఉంది. ముస్లింలు కాంగ్రెస్, ఎస్పీల వంటి పార్టీలకు ఓటు బ్యాంకులనే సాంప్రదాయకమైన ఎన్నికల లెక్కల డొల్ల తనాన్ని ఎన్నికల ఫలితాలు బయటపెట్టాయి. దేశవ్యాప్తంగా ముస్లింలు ఎక్కువగా కేంద్రీకరించి ఉన్న దాదాపు 87 లోక్‌సభ నియోజక వర్గాలను సీఎస్డీఎస్ గుర్తించింది. వాటిలో 45 స్థానాలను బీజేపీ గెలుచుకుంది! వారణాసిలో కేజ్రీవాల్‌కు ఓటు చేయని ముస్లింలు ఢిల్లీలో ఆప్‌కు ఓటు చేశారు. ముస్లింలు ఎవరి ముల్లెగానో ఉండరనేది ఈ ఎన్నికల్లో స్పష్టమైంది. ఆప్ కార్యాలయాల్లో ముస్లిం యువత ఎక్కువ చురుగ్గా కనిపిస్తోంది. వారణాసి, ఆమేథీల ప్రజలు ఆప్‌ని అందలమెక్కించక పోయినా ‘వాళ్లు వేరే రకం మనుషులు’ అని గుర్తించగలిగారు. విమర్శకులు గుర్తించ నిరాకరిస్తున్నది అదే. ఢిల్లీ ప్రభుత్వాన్ని అర్ధంతరంగా వీడటం సరికాదని కేజ్రీవాల్ బహిరంగంగానే గుర్తించారు. కాంగ్రెస్ (414), బీజేపీ (415) స్థానాల్లో పోటీ చేస్తే వాటిని మించి ఒకేసారి 424 సీట్లలో పోటీకి దిగడం, తాను స్వయంగా వారణాసికి బందీ కావడం వంటి తీవ్రమైన తప్పిదాలను ఆయన గుర్తించలేరని ఎందుకనుకోవాలి? తీరా ఎన్నికల సమరం మొదలయ్యాక తప్పు ‘సరిదిద్దుకోవాలని’ పలాయనం చిత్తగిస్తే అది నిజంగానే ఆత్మహత్య అయ్యేది. పంజాబ్‌లో మొట్టమొదటిసారి బరిలోకి దిగి 25 శాతం ఓట్లను, 4 లోక్‌సభ స్థానాలను (మొత్తం 13) సాధించగలిగేవారే కాదు. చిన్న రాష్ట్రాలపై మొత్తంగానూ, పెద్ద రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని స్థానాలపైనా దృష్టిని కేంద్రీకరించి, గట్టి, మంచి అభ్యర్థులుంటేనే బరిలోకి దిగాలనే గుణపాఠాన్ని పంజాబ్ ఆప్‌కి నేర్పింది. ఆప్ లాంటి మధ్యతరగతి విద్యావంతుల సాంప్రదాయేతర పార్టీలు భర్తీ చేయగల రాజకీయ శూన్యం దేశంలో ఉన్నదనే సందేశాన్ని పంపింది. ప్రతిపక్ష స్థానమే మేలు ఆప్ నేతలు తమను విశ్వసిస్తున్న పేద, మురికి వాడల ప్రజల పైనా, మధ్యతరగతి దిగువ అంతస్తులపైనా, ముస్లింలపైనా నమ్మకముంచి ప్రతిపక్షంలో కూచోవడానికి సిద్ధం కావడం మంచిది. ప్రతిపక్షంగా దొరికే సమయాన్ని భావజాలపరమైన ఐక్యతకు, అంతర్గత విభేదాల పరిష్కారానికి, నిర్మాణ పటిష్టతకు ఉపయోగించుకోవడం ఉత్తమం. అరాచకవాదాన్ని తన రాజకీయ తాత్వికతగా పేర్కొన్న కేజ్రీవాల్ ఆప్‌ను దేశవ్యాప్తమైన ఒకే పార్టీగా నిర్మించాలని తాపత్రయపడటం విడ్డూరం. అంతకంటే వైవిధ్యభరితమైన తమలాంటి పార్టీలు ఎక్కడికక్కడ ఏర్పడటానికి తోడ్పడం ఉత్తమం. దేనికైనా నిలకడగా ఒక సంఘటిత ఐక్య నిర్మాణంగా ఆప్ మనగలగడం ముఖ్యం. అప్పుడే అది ఓటమిని గెలుపుగా మార్చుకోగలుగుతుంది. కేజ్రీవాల్‌ను, ఆప్‌ను రాజకీయంగా హత్య చేయాలనే ప్రయత్నాలు వ్యర్థం. ఆప్ తప్పులను దిద్దుకుని ప్రణాళికాబద్ధమైన ఐక్య కార్యాచరణకు దిగగలిగితే సజీవంగా ఉంటుంది. లేకపోతే మెల్లమెల్లగా ఆదే మరణిస్తుంది. తప్ప హత్యకు గురి కాదు, ఆత్మహత్య చేసుకోదు. సజీవంగానూ, సమరోత్సాహంతోనూ ఓటమిని లెక్కచేయకుండా పోరాడే వారిని ఎవరు ఓడించగలరు? - పిళ్లా వెంకటేశ్వరరావు -
చైనా ‘క్రీడ’... వియత్నాం విలవిల
ఉక్రెయన్లో రష్యా ‘తలనొప్పి’తో సతమతమవుతున్న ఒబామా ప్రభుత్వానికి ఇప్పట్లో ఆగ్నేయ ఆసియా మిత్రులకు ఇచ్చిన ‘అభయం’ గుర్తుకు రాదు. చైనాను ఏకాకిని చేసి చుట్టుముట్టే ‘ఆసియా వ్యూహాన్ని’ ఆచరణలో పెట్టగల సత్తా నేటి అమెరికా బలగాలకు లేదు. కీలెరిగి వాత పెట్టడం సంగతేమోగానీ... ఒకరి కీలుకి వాత పెట్టి మరొక రికి చికిత్స చేసే శక్తి చైనాకే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం-చైనాల మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు ఆ ‘చికిత్స’లో భాగమే. ఈ నెల 7న చైనా తన భారీ చ మురు రిగ్గును (హెచ్‌వైఎస్‌వై 981) దాదాపు 60 నౌకల రక్షణతో దక్షిణ చైనా సముద్రంలోకి దించింది. వియత్నాం తన ‘ప్రత్యేక ఆర్థిక మండలం’గా (ఈఈజెడ్) పేర్కొంటున్న వివాదాస్పద ‘పార్సెల్ దీవుల’ ప్రాంతంలో తవ్వకం ప్రారంభించింది. రిగ్గుకు చుట్టూ మూడు మైళ్ల ప్రాంతాన్ని తమ ‘ప్ర త్యేక మండలం’గా ప్రకటించింది. ఆ పరిధిలోకి ప్రవేశించే వియత్నాం కోస్ట్‌గార్డ్ ఓడలపై వాటర్ కేనన్లను ప్రయోగిస్తోంది. దీంతో వియత్నాంలో చైనా వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. నిజానికి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో సరిహద్దు వివాదాలున్న దేశాలలో వియత్నామే దానితో సహకరించే వైఖరితో వ్యవహరిస్తోంది. అందుకే ఈ హఠాత్పరిణామం పరిశీలకులకు ఒక పట్టాన మింగుడు పడటం లేదు. ఈనెల 6న... అంటే చైనా హెచ్‌వైఎస్‌వై 981ని రంగంలోకి దించడానికి సరిగ్గా ఒకరోజు ముందు... చైనాకు చెందిన ఒక చేపల మర పడవను ఫిలిప్పీన్స్ స్వాధీనం చేసుకుంది. ‘కలయాన్ దీవుల’పై చైనాతో వివాదంలో వున్న ఆ దేశాన్ని అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించారు. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటూ పొడిగించే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యవాదాన్ని సవాలు చేసే ఉద్దేశంతోనే ఫిలిప్పీన్స్ ఆ దేశం చేపల పడవను స్వాధీనం చేసుకుంది. అమెరికాతో అతిగా అంటకాగుతున్న ఫిలిప్పీన్స్‌కు ‘చికిత్స’ చేయడానికి చైనా అప్పటికే సిద్ధంగా ఉండటంతో వెంటనే రంగంలోకి దిగింది. సరిగ్గా ఏ కీలుకు వాత పెట్టాలో అక్కడే వాతపెట్టింది! వియత్నాంకు అమెరికాతోగానీ, జపాన్తోగానీ లాంఛనప్రాయంగా ఎలాంటి రక్షణ ఒప్పందమూ లేదు. కాబట్టి తక్షణమే సైనిక సంఘర్షణకు దిగనవసరం లేదు. ఒకవేళ వియత్నాంతో చిన్నపాటి సంఘర్షణ అనివార్యమైనా 1945 నుంచి ఎలాంటి నిజ యుద్ధ అనుభవంలేని చైనా నావికా దళానికి అది చక్కటి అనుభవమే అవుతుంది. వియత్నాం తీరంలో ప్రస్తుతం చైనా రేకెత్తిస్తున్న ఉద్రిక్తతలు అంతకు ముందు తలెత్తిన ఉద్రిక్తతలకు భిన్నమైనవి. చైనా... వియత్నాం తనదిగా పేర్కొన్న ప్రాంతంలోకి ప్రవేశించడమే కాదు, ఆర్థిక, వాణి జ్యపరంగా ఆ ప్రాంతాన్ని వాడుకుంటానని చాటింది. తద్వారా ఆ ప్రాంతంలో తనకు సరిహద్దు వివాదాలున్న వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, బ్రూనీలకు.... తనను నిలవరించే శక్తి ఏదీ లేదని ఒకేసారి హెచ్చరికను పంపింది. అమెరికా వైపు చూపులు మాని అవి తనతో నెయ్యం నెరపాలని అంతరార్థం. లేకపోతే వంద కోట్ల డాలర్ల ఖరీదైన ‘హెచ్‌వైఎస్‌వై 981’ తదుపరి మజిలీ ఫిలిప్పీన్స్ తీరంలోని కలయాన్ దీవులేనని పరమార్థం. ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు సవివరంగా నివేదిస్తున్న అంతర్జాతీయ మీడియాకున్న ‘అమాయత్వం’ ఫిలి ప్పీన్స్కు లేదు. అందుకే అది బెంబేలెత్తి అమెరికాకు విన్నపాలు పంపుతోంది. ఖండనలకు మించి శ్వేతసౌధం చేయగలిగేది ఏదీ లేదని చైనాకు తెలుసు. ఉక్రెయిన్‌లో తలదూర్చి ‘రష్యా తలనొప్పి’తో సతమతమవుతున్న ఒబామా ప్రభుత్వానికి... ఇప్పట్లో ఆగ్నేయ ఆసియా మిత్రులకు తాను అభయ హస్తం ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చే అవకాశం లేదు. అమెరికా గత రెండేళ్లుగా ‘ఆసియా వ్యూహం’ పేరిట చైనాను ఏకాకిని చేసి చుట్టుముట్టే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టగల సత్తా నేటి అమెరికా బలగాలకు లేదు. ‘‘మనకు ఆ సమష్టి రక్షణ వ్యూహాన్ని అమలుచేయడానికి తగిన ంత నావికా బలగం, మానవ బలగం ఉన్నాయా?’’ అని అమెరికా నౌకా దళ ఉన్నతాధికారి జనరల్ జాన్ పాక్స్టన్ ప్రశ్నించారు. చైనాతో సయో ధ్యే మేలనుకునే ఒబామా తదుపరి అమెరికా అధ్యక్షుల హయాంలో అది సాధ్యం కావచ్చు. ఆ వచ్చే కొత్త అధ్యక్షులు అమెరికా ‘ఆసియా వ్యూహ’ కర్త మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటనే కావచ్చని చైనా సరిగ్గానే అంచనా వేస్తోంది. హిల్లరీ అధ్యక్ష పదవి చేపట్టేటప్పటికే ఆమె ‘ముద్దు బిడ్డ’ అసియా వ్యూహాన్ని నిష్ఫలం చేయాలని భావిస్తోంది. పదేళ్లుగా అమెరికాతో సాగిస్తున్న శాంతియుత పరస్పర సహకార దశ ముగిసిపోయిందని ఇటు చైనా అటు పెంటగాన్ గుర్తించాయి. రానున్న సంఘర్షణాత్మక దశకు సన్నాహాలు చేయడానికి చైనాకు అమెరికా, రష్యాల మధ్య సరికొత్త ‘కోల్డ్‌వార్’కు మించిన శుభ ముహూర్తం మరేముంటుంది? పిళ్లా వెంకటేశ్వరరావు -
పుతిన్ లౌక్యం... ఒబామాకు సంకటం
పుతిన్ అతి తెలివిగా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి మర్కెల్ సూచించిన ప్రతిపాదనలను ఆమోదించారు. దీంతో రష్యా వెనక్కు తగ్గిందని భావిస్తున్నారు. అది పొరపాటు. అమల్లోకిరాని ఒప్పందంతో పుతిన్ అమెరికాను రక్షణ స్థితిలోకి నెట్టేశారు. చదరంగం ఇద్దరు ఆడే ఆటని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరచినట్టున్నారు. ఉక్రెయిన్ చదరంగపు బల్ల మీద తన ఎత్తులే గాక, ప్రత్యర్థి ఎత్తు లు కూడా తాన ఇష్టమేనని భావిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చెప్పక్కర్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ చడీ చప్పుడు లేకుండా జర్మన్ చాన్సలర్ ఏంజెలా మర్కెల్తో కలసి ఉక్రెయిన్ సంక్షోభం పై ఒక అవగాహనకు వచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు దైదియర్ బుర్ఖాల్తర్, పుతిన్‌లు ఈ నెల 7న జరిపిన చర్చల్లో ఆ ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్‌లో కీలక పాత్రధారియైన మర్కెల్ షరతులన్నిటికీ అంగీకరించి పుతిన్ వెనకడుగు వేశారని మీడియా పండితులు విశ్లేషించేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్ ఆగ్నేయ రాష్ట్రాలైన డొనెత్స్క్, లుగాన్స్క్లలో రష్యా అనుకూల ‘వేర్పాటువాదులు’ మే 11న జరుప తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ బలగాలను లోతట్టుకు ఉపసంహరించడానికి సిద్ధమన్నారు. జాతీయ సయో ధ్య కోసం చర్చలు జరిపి, ఎన్నికలను నిర్వహించడానికి అంగీకరించారు. బదులుగా రష్యన్లు అత్యధికంగా ఉండే తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం, నియో ఫాసిస్టు ‘స్వాబోదా’ నేషనల్ గార్డు ముఠాలు సాగిస్తున్న ‘ఉగ్రవాద’ వ్యతిరేక సైనిక చర్యలను, అణచివేతను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌లో శాంతి, జాతీయ సయోధ్యలకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అమెరికా ఆశిస్తున్నది అది కాదు. కాబట్టే పుతిన్ వేసిన పాచిక పారింది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని రష్యా అనుకూల ఆందోళనకారులు... ఉక్రెయిన్ నియో నాజీ నేతలంటున్నట్టు ‘ఉగ్రవాదులు’కారు. పాశ్చాత్య ప్రపంచం ప్రచారం చేస్తున్నట్టు ‘వేర్పాటువాదులు’ కారు. సాధారణ కార్మికులు, ప్రజలు. కాకపోతే రష్యన్లు. అయినా వారు రష్యాలో విలీనం కావాలని కోరుకోవడం లేదు. స్వాతంత్య్రం అడగడం లేదు. ఉక్రెయిన్‌లో భాగంగానే ఉండాలని భావిస్తున్నారు. కాకపోతే రాష్ట్రాలకు విస్తృత స్వయం ప్రతిపత్తినిచ్చే ఫెడరల్ వ్యవస్థను కోరుతున్నారు. ఆ డిమాండు కూడా చాలా పాతది. అమెరికా చేతి కీలుబొమ్మ ‘విప్లవకారులకు’ భిన్నంగా వారు పుతి న్ ఆడించేట్టు ఆడే బాపతు కాదు. కాబట్టే ‘పుతిన్ పిరికిపంద. డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఇందుకు బదులుగా మాస్కో రెడ్‌స్క్వేర్‌లో విప్లవంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రష్యన్ ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరు’ అని ‘డొనెత్స్క్ నేషనల్ రిపబ్లిక్’ ప్రకటించింది. పుతిన్ ఒక్క గుండు కూడా పేల్చకుండా చాలా లక్ష్యాలను సాధించారు. మర్కెల్‌ను ప్రసన్నం చేసుకుని అమెరికా-నాటో కూటమిలో విభేదాలను రగిల్చారు. అమెరికా తన సైనిక బలగాలను తూర్పు యూరప్‌కు పంపుతుండగా ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సేనలను ఉపసంహరిస్తానని ప్రకటించారు. పుతిన్ శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ జాతీయోన్మాద ప్రభుత్వం అవహేళన చేసింది. పుతిన్‌కు కావాల్సిందీ అదే. అమల్లోకి రాని ఓ ఒప్పందంతో పుతిన్ అంతా సాధించారు. యథాతథంగా జాత్యహంకార మూకలు రష్యన్ల వేటను సాగిస్తాయి. మే 2న ఒడిస్సీలో 42 మంది ప్రజలను సజీవంగా దహనం చేసిన మూకలు... శుక్రవారం 20 మందిని బలిగొన్నాయి. డొనెత్స్క్, లుగాన్స్క్ ప్రజలు ఉక్రెనియన్ పాలకులను నిద్రపోనీయరని పుతిన్‌కు తెలుసు. చోద్యం చూడటమే పుతిన్ పని. అన్నిటికీ మించి విప్లవాన్ని సమర్థించిన ప్రజలు సైతం కొత్త ప్రభుత్వం పాతదేనని, కాకపోతే గ్యాస్ ధరలు 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని, పన్నుల భారం తెగపెరిగిందని వాపోతున్నారు. శాంతిని కోరుతున్నారు. 1,700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం దేశాన్ని దివాలా తీయించనుంది. ఐఎంఎఫ్ రుణంలో రష్యా ఇంధన సంస్థ ‘గాజ్ప్రోమ్’కు 270 కోట్ల డాలర్లు, ఐఎంఎఫ్ పాత బకాయిల చెల్లింపులకు 500 కోట్ల డాలర్లు అయిపోతాయి. ట్యామషెంకోలాంటి అవినీతిగ్రస్త విప్లవ నేతలు తినేది తినగా ఇక మిగిలేది ఎంత? ఐఎంఎఫ్ షరతులు ఎలాంటివో చెప్పక్కర్లేదు. తూర్పు, దక్షిణ భాగాలు విడిపోతే ఈ రుణాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ బెయిలవుట్లతో గ్రీస్‌లాంటి యూరప్ దేశాలు ఎంత బాగుపడ్డాయో తెలిసినవాళ్లు ఉక్రెయిన్‌కు ఏ గతి పడుతుందో ఊహించగలరు. చిట్టచివరకు తూర్పు, దక్షిణ ప్రాంతాలే కాదు... మొత్తంగా ఉక్రెయిన్ తన కాళ్ల దగ్గరకు రాక తప్పదని పుతిన్ అంచనా. కాదనలేం. పిళ్లా వెంకటేశ్వరరావు -
ఆఫ్రికా ‘సూపర్’ విషాదం
నైజీరియాలో జరిగిన బాలికల కిడ్నాప్ ఘటన పెచ్చరిల్లుతున్న తీవ్రవాద హింసాకాండకు మచ్చుతునక. అధ్యక్షుడు గుడ్‌లక్ ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతూ, గణాంకాల గారడీతో నైజీరియా ఆఫ్రికాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని ప్రకటించింది. చీకటి ఖండం ఆఫ్రికాలో హఠాత్తుగా మరో దేశం ‘సూపర్ పవర్’గా ఆవిర్భవించిందని అంతర్జాతీయ మీడియా గత సోమవారం కోడై కూసింది. ఆదివారం రాత్రి కళ్లు మూసి, తెల్లారి తెరిచేసరికి నైజీరియా ఆఫ్రికాలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. ఇలాంటి ‘అద్భుత ఆర్థిక వృద్ధి’ కథనంతో పాటూ రొటీన్ దిక్కుమాలిన చావుల గొడవెం దుకు అనిపించడం సహజమే. సోమవారం నాడే (ఏప్రిల్ 14) రాజధాని అబూజాలో జరిగిన బాంబు దాడిలో 71 మంది మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రం బోర్నోలో 126 మంది బాలికల కిడ్నాప్ సంచలనంతో పాటూ ఆ బాంబు దాడి కూడా వెలుగు చూసిందనేది వేరే సంగతి. కిడ్నాపైన బాలికలను సైన్యం విడిపించిందని గురువారం మీడియా బ్రేకింగ్ న్యూస్ లిచ్చింది. విడుదలైన బాలికల ఫోటోలు, వీడియోలు లేవు, కిడ్నాపర్ల చెర వీడిన పిల్లలు విలపిస్తున్న తల్లుల దగ్గరికి చేరింది లేదు. పాఠశాల ప్రిన్సిపాల్ సైతం బాలికల విడుదల వార్తను ధృవీకరించ లేదు. అబూజా బాంబు దాడికి, బోర్నో బాలికల కిడ్నాప్‌కు పాల్పడినది ఇస్లామిక్ తీవ్ర వాద సంస్థ ‘బోకో హరామ్’ అని భావిస్తున్నారు. నైజీరియా రాత్రికి రాత్రే ప్రపంచంలోని 26వ అతి పెద్ద ఆర్థిక వ్యవ స్థగా ఆవిర్భవించి. దక్షిణ ఆఫ్రికాను వెనక్కునెట్టి ఆఫ్రికాలో ప్రథమ స్థానాన్ని సంపాదించడం ‘అద్భుతమే.’ భారత్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ దేశాలు ఇలాంటి ఘనతతోనే ప్రాంతీయ ‘సూపర్ పవర్’లుగా వెలుగుతున్నాయి. నైజీ రియా కూడా ‘సూపర్ పవర్’ అయినట్టే. అలా అని 2009 నుంచి తీవ్రవాద హింసాకాండతో, మత విద్వేషాలతో అట్టుడుకుతున్న ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో నెత్తురుటే రులు పారడం ఆగిపోతుందా? ప్రపంచ చమురు ఉత్పత్తిలో 12వ స్థానంలో, చమురు ఎగుమతిలో 8వ స్థానంలో ఉన్న ఈ ‘చమురు సంపన్న దేశం’ పేదరికంలో కూడా ఘనమైన స్థానంలోనే ఉంది. 17 కోట్ల జనాభాలో 10 కోట్ల మంది పేదలని ప్రపంచ బ్యాంకు అంచనా. ఇక మానవాభివృద్ధి సూచికలో దానిది 153వ స్థానం! నైజీరియా ఇలా ‘ఆఫ్రికా సూపర్ పవర్’ అయినంత మాత్రన ప్రజా జీవితాల్లో అద్భుతాలేవీ ఆశించవద్దని ఆర్థిక మంత్రి ఎన్గోజీ ఒకొన్జో సెలవిచ్చారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి పేదరి కానికి సంబంధం లేదు. దేశం సంపన్నవంతమైతే ప్రజలు సంపన్నులైపోరు. ఇంతకూ నైజీరియా రాత్రికి రాత్రే ప్రపం చంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో 30వ స్థానం నుంచి 26వ స్థానానికి ఎలా చేరింది? మన ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు మాంటెక్‌సింగ్ ఆ కనికట్టు విద్యతోనే మన పేదరికాన్ని మటుమాయం చేసి చూపారు. నైజీరియాలో కూడా అలాగే జీడీపీని లెక్కగట్టే ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చేసి... 2013 జీడీపీని రె ట్టింపు (51,000 కోట్ల డాలర్లు) చేసేశారు. ఈ తిప్పలన్నీ ఎందుకు? వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు! అవినీతికి మారుపేరైన అధ్యక్షుడు గుడ్‌లక్ జొనాథన్ 2019 వరకు అధికారం చెలాయించాలి, అంతర్జాతీయ చమురు, గనుల కంపెనీలు, విదేశీ బాంకులు నిరాటంకంగా నైజీరియా సహజ సంపదలు కొల్లగొట్టే అవకాశాలు తెరిచి ఉండాలంటే ‘అద్భుతాలు’ ప్రదర్శించక తప్పదు. ఇక ఆబూజా బాంబు దాడి, ఆడపిల్లల కిడ్నాప్‌ల వంటి ఘటనలంటారా? అలాం టివి పట్టించుకోనవసరం లేదు. అల్‌కాయిదాతో సంబంధా లున్నాయని భావిస్తున్న బోకోహరామ్ను తుదముట్టించేశా మని 2013 మొదట్లోనే గుడ్‌లక్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక దళాలను ఉపసంహరించారు కూడా. నైజీరియా బహుజాతులకు నిలయం. 510 భాషలు సజీవంగా ఉన్నాయి. నేటి జనాభాలో 50 శాతం ముస్లింలు, 47 శాతం క్రైస్తవులని సీఐఏ అంచనా. ఖనిజ సంపదలున్నా దేశం పేదరికంలో మగ్గుతూనే ఉంది. అభివృద్ధిలో వెనుక బడిపోయిన ఉత్తరాది తెగలలో పేదరికం, నిరుద్యోగం, నిర్లక్ష్యాల కారణంగా తీవ్రంగా అసంతృప్తి పెరిగింది. అదే బోకోహరామ్ పుట్టి పెరగడానికి తోడ్పడింది. ఒకప్పటి యుద్ధ ప్రభువులంతా సైనికాధికారులై సైనిక కాంట్రాక్టుల ముడుపుల నార్జించి సంపదలతో తులతూగుతుంటే సాధారణ సైనికులు దరిద్రంలో మగ్గే పరిస్థితి. దీంతో సైన్యం బోకోహరామ్‌తో పోరాటానికే కాదు, సైనిక నేతల రక్షణకు సైతం శ్రద్ధ చూపడం లేదు. ఇదే పరిస్థితి ముదిరితే ‘ఆఫ్రికా సూపర్ పవర్ ’ రెండు ముక్కలయ్యే ప్రమాదం లేకపోలేదు. పిళ్లా వెంకటేశ్వరరావు -
త్రిశంకు నరకంలో బంగ్లా బీహారీలు
1947 నాటి దేశ విభజనతో లక్షలాది బీహార్ ముస్లింలు సర్వం వదిలి తూర్పు పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. 1971 బంగ్లా స్వాతంత్య్రం వారిని మరోసారి సర్వం కోల్పోయేట్టు చేసింది. ద్రోహులుగా ముద్ర వేయించుకొని వారు స్వదేశంలోనే శరణార్థులుగా బతుకుతున్నారు. శాపగ్రస్త జాతులకు ప్రపంచంలో కొదవ లేదు. అలాంటి వారందరిలోకీ విచిత్రమైన దైన్యం బంగ్లాదేశ్ బీహారీలది. వారు పౌరులు కాని పౌరులు, శరణార్థులు కాని శరణార్థులు. దేశం లేని ప్రజలు. అలాంటి బీహారీలంటే అందరికీ చిన్న చూపే, వివ క్షే. ఒకప్పుడు వృత్తి నిపుణులుగా, వ్యాపారులుగా, ప్రభుత్వోద్యోగులుగా బతికిన చోటే హఠాత్తుగా నాలుగు దశాబ్దాల క్రితం శరణార్థులయ్యారు. జనాభాలో 94 శాతం నిరక్షరాస్యులుగా దిగజారారు. 13 ప్రాంతాల్లో దాదాపు 70 శరణార్థి శిబిరాలనే మురికికూపాల్లో అంటరానివారిలా బతుకున్న దైన్యం బీహారీలది. అంతర్జాతీయ సంస్థల నిర్వచ నాల ప్రకారం వారు శరణార్థులూ కారు, వారు ఉంటున్నవి శరణార్థి శిబిరాలూ కావు! వారు విదేశీయులూ కారు స్వదేశీయులూ కారు. వారు 1947 దేశ విభజన చేసిన గాయాలు. 1971 బంగ్లాదేశ్ విమోచనా పోరాటపు బలి పశువులు. భారతదేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు, అత్యాచారాల ఫలితంగా ముస్లింలు పెద్ద ఎత్తున అటు పశ్చిమ పాకిస్థాన్‌కు (నేటి పాక్). ఇటు తూర్పు పాకిస్థాన్‌కు (నేటి బంగ్లాదేశ్) వలసపోయారు. ‘బంగ్లా బంధు’గా పిలిచే ముజిబుర్ రెహ్మాన్ (నేటి ప్రధాని షేక్ హసీనా తండ్రి) అప్పట్లో మతకల్లోలాలతో అట్టుడి కిన బీహార్ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ముస్లింలను తూర్పు పాకిస్థాన్‌కు రావాలని ప్రోత్సహించారు. లక్షలాది మంది బీహారీలు అలా తూర్పు పాకిస్థాన్ చేరారు. వృత్తి నిపుణులు, రైల్వే వర్కర్లయిన బీహారీలను మొదట్లో బెంగాలీలు సాదరంగానే ఆహ్వానించారు. వృత్తి పనివారుగా, వ్యాపారులుగా చాలా మంది స్థిరపడ్డారు. భారత్‌కు తలిపోయిన హిందువుల స్థానంలో విద్యావంతులైన బీహారీలు ప్రభుత్వోద్యోగాలలో సైతం చేరారు. అయితే పశ్చిమ పాక్ పాలకులు తూర్పు పాక్‌లోని బెంగాలీల పట్ల ఎప్పుడూ అనుమానాస్పద దృష్టితోనే ఉండేవారు. అసలు బెంగాలీ భాషంటేనే భారతీయమైనదనే భావన వారిని వేధించేది. అందుకే ఉర్దూ మాట్లాడే బీహారీలను ఉన్నత ప్రభుత్వోద్యోగాలలో నియమించారు, అన్నివిధాలా ప్రోత్సహించారు. సహజంగానే ఇది బెంగాలీలకు కంటగింపుగా మారింది. బెంగాలీల పట్ల పాక్ అణచివేత ధోరణే 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది. బంగ్లా స్వాతంత్య్రానికి నేరుగా కారణమైన 1970 ఎన్నికల్లో బీహారీలు పశ్చిమ పాక్ పాలకుల ముస్లిం లీగ్‌ను సమర్థించారు. అంతేకాక బంగ్లా విముక్తి పోరాట కాలంలో పాక్ సైన్యం సాగించిన అమానుష హత్యాకాండలో, అత్యాచారాల్లో కొందరు బీహారీలు పాల్గొన్నారు. దీంతో మొత్తంగా బీహారీలపై దాడులు, ఊచకోతలు సాగాయి. బంగ్లాదేశ్ ఏర్పడ్డాక కూడా ఇదే వైఖరి కొనసాగి రెడ్‌క్రాస్ స్వయంగా బీహారీల రక్షణ కోసం నిలవాల్సి వచ్చింది. ఎట్టకేలకు 1972లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బీహారీలకు బంగ్లా పౌరులుగా ఉండే హక్కును కల్పించింది. ఆరు లక్షల మంది బంగ్లాలో స్థిరపడాలని కోరుకోగా, 5,39,000 మంది రక్షణ లేదని భావించి పాక్‌కు వెళ్లాలని భావించారు. వారి తరలింపుకు అంగీకరించిన పాక్ హక్కుల సంస్థల ఒత్తిడి మేరకు దఫదఫాలుగా 1,70,000ల మందిని మాత్రమే ఆమోదించింది. మిగతావారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి తీరుగా మారింది. 1947లో ఒకసారి దేశ విభజన కల్లోలానికి సర్వం వదిలి తూర్పు బెంగాల్ చేరిన బీహారీలు మరోసారి, సర్వం కోల్పోయి ఎక్కడికీ పోలేక, ఉన్నచోట బతకలేక బతుకులీడ్చాల్సిన దుస్థితిలో బతుకుతున్నారు. పాక్ రక్షణను నమ్మి అక్కడికి వెళ్లిన వాళ్ల పరిస్థితి కూడా అదే దీన స్థితి కావడమే విషాదం. 2008లో సుప్రీంకోర్టు ఉర్దూ మాట్లాడే బీహారీల పిల్లలకు మాత్రమే పౌరసత్వాన్ని, ఓటు హక్కును కల్పించింది. దీంతో పరిస్థితి పెద్దగా మారిందేమీ లేదు. బీహారీ శిబిరాల్లో పుట్టిన ప్రతి ఐదుగురు శిశువుల్లో ముగ్గురు మూడు నెలలైనా నిండక ముందే కన్నుమూయడమే అందుకు నిదర్శనం. బీహారీల క్యాంపులను దాటి బెంగాలీలతో కలిసి విద్యాసంస్థల్లో చేరినవారు పరీక్షల్లో గట్టెక్కిన దాఖలాలు లేవు. బీహారీలను బెంగాలీలలో విలీనం చేసుకునే ప్రయత్నాల పేరిట ప్రభుత్వం వారికి బెంగాలీ భాషను నేర్పి, బెంగాలీలోనే విద్యాబోధనను ప్రోత్సహిస్తున్నామని అంటోందే తప్ప బీహారీలందరికీ పౌరసత్వ హక్కులను మాత్రం కల్పించడానికి సిద్ధం కావడం లేదు. బెంగాలీలు వారిని పాకిస్థానీలుగానే పరిగణిస్తున్నారంటే మరి పరిగణించ రా? పాక్‌లోని బీహారీలకు పట్టిన గతిని చూసి నేడు ఎవరూ పాక్‌కు వెళ్లాలనుకోవడం లేదనేది ఎవరికీ అక్కర్లేదు. అంతర్జాతీయ మైనారిటీల హక్కుల సంస్థలు ఎప్పటికప్పుడు బంగ్లా ప్రభుత్వాలకు బీహారీల హక్కుల సమస్యలను గుర్తు చేస్తూనే ఉన్నా... ఆ ‘బంగ్లా ద్రోహుల’ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకోవాలి? -పిళ్లా వెంకటేశ్వరరావు -
ప్రచ్ఛన్నయుద్ధంలో ‘డ్రాగన్’ రంగ ప్రవేశం!
ప్రపంచమంతా ఉక్రెయిన్ సంక్షోభంవైపు చూస్తుంటే చైనా కన్ను ఫిలిప్పీన్స్ ఏలుబడిలో ఉన్న దీవులపై పడింది. ఆ దీవులకు వెళ్లే ఫిలిప్పీన్స్ నౌకలను అడ్డగించింది. అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కుదరబోయే సైనిక ఒప్పందమే ఈ పరిణామానికి కారణం. క్రిమియా ప్రజాభిప్రాయ సేకరణ ఘట్టం తదుపరి ఉక్రెయిన్ సంక్షోభాన్ని అమెరికా, రష్యాలు ఏ మలుపు తిప్పబోతున్నాయోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తూ మరో కీలక పరిణామాన్ని పట్టించుకోలేదు. ఐదు వేల మైళ్ల దూరంలోని దక్షిణ చైనా సముద్రంలో చైనా డ్రాగన్ అమెరికాపైకి పంజా విసిరింది. ఎప్పుడూ జరిగేట్టుగానే మత్తగజాల పోరు లో నలిగి చస్తున్నది ఫిలిప్పీన్స్. మార్చి 9వ చైనా స్ప్రాట్లీ దీవుల వ్యవహారంలో ఫిలిప్పీన్స్‌తో ఉన్న వివాదాన్ని తేల్చిపారేయడానికి సిద్ధమైంది. ఫిలిప్పీన్స్‌తో ఇంత వరకు ఉన్న యథాతథ పరిస్థితి కొనసాగింపునకు మంగళం పాడేసింది. ‘సెకండ్ థామస్ షావోల్’ ప్రాంతంలో నౌక దిగ్బంధాన్నివిధించింది. అక్కడి ఫిలిప్పీన్స్ సేనలకు ఆహారం తదితర సరఫరాలను తీసుకుపోతున్న ఓడలను తిప్పి పంపేసింది. ఫిలి ప్పీన్స్ వెంటనే దురాక్రమణకు స్వస్తి పలకాలంటూ హుకుం జారీ చేసింది. అక్కడి సైనికుల మీద ‘కనికరం’ చూపి గగన తలం నుంచి ఆహారాన్ని అందించడాన్ని అనుమతిస్తోంది. ఇకపై అనుమతిస్తుందా అనేది చెప్పడం లేదు. ఉక్రెయిన్ ‘తిరుగుబాటు’ సంబరంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఉత్సాహ భంగం తప్పింది కాదు. వచ్చే నెలలో ఆయన ఫిలిప్పీన్స్‌లో పర్యటించాల్సి ఉంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు బెనిగినో అక్వినోతో కలసి కీలకమైన సైనిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. నిజానికి జనవరి 27నే చైనా యథాతథ స్థితికి స్వస్తి పలికింది. షావోల్ నుంచి ఫిలిప్పీన్స్ జాలర్లను చైనా నావికా దళం బెదిరించి పంపే సింది. అప్పటి నుంచి ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు అక్వినోకు చైనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు పాశ్చాత్య మీడియా తాజాగా ప్రసాదించిన ‘హిట్లర్’ బిరుదును అక్వినో గత నెలలోనే చైనా అధ్యక్షుడు క్సీజింగ్పింగ్కు ప్రసాదించారు. చైనాను కట్టడి చేయాలంటూ అమెరికాను గట్టిగా కోరారు. ఆ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సంక్షోభం అదను చూసుకొని అమెరికాకు దడిచేది లేదనే సందేశాన్ని చైనా పంపింది. అయితే చైనా సరికొత్త దూకుడుకు అసలు కారణం అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య కుదరబోతున్న సైనిక ఒప్పందమే. 2020 నాటికి అమెరికా తన నావికా బలంలో 60 శాతాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతానికి తరలించబోతోంది. అందులో గణనీయమైన భాగం ఫిలిప్పీన్స్‌లోని అమెరికా స్థావరాల్లో సమీకరిస్తారు. అందుకు వీలుగా ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సైనిక ఒడంబడికను విస్తరించి, పొడిగించడానికి అక్వినోను ‘ఒప్పించిన’ తర్వాతే అమెరికా ఆమె మొర ఆలకించింది. గత నెలలో మొదటిసారిగా దక్షిణ చైనా సముద్రంలో ‘రక్షిత’ ప్రదేశాన్ని ప్రకటించిన చైనాను ప్రత్యక్షంగా తప్పుబట్టింది. అమెరికా సైనిక వ్యూహంలోని ఈ మౌలిక మార్పు చైనా ఆట కట్టించే తాపత్రయమేననేది చైనాకు తెలుసు. ఆ ఆటలో కీలక భాగస్వామి జపాన్ కాగా, ఫిలిప్పీన్స్ తొలి బలి పశువు. ఉక్రెయిన్‌లో అమెరికా ఆడుతున్న ఆట 1990 నుంచి అమలవుతున్న రష్యా ‘పని ముగించే’ సుదీర్ఘ వ్యూహంలో చివరి ఘట్టం. 1990 తదుపరి ఏడు ‘వార్సా’ (ఒకప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కూటమి) దేశాలు, మూడు సోవియట్ రిపబ్లిక్కులు నాటో కూటమిలో భాగమయ్యాయి. ఉక్రెయిన్‌లోని ‘విప్లవ’ ప్రభుత్వం నిలదొక్కుకోవడమే తరువాయి నాటోలో చేరుతుంది. రష్యాతో బాలిస్టిక్ క్షిపణుల ఒప్పందాన్ని బేఖాతరు చేసి అమెరికా ఇప్పటికే పోలాండ్, లాత్వియా, ఇస్తోనియా తదితర ప్రాంతాల్లో ఖం డాంతర క్షిపణులను మోహరించింది. పశ్చిమ దిశ నుంచి రష్యాను చుట్టుముట్టేసే వ్యూహంలో చిట్టచివరి మెట్టు ఉక్రెయిన్. భద్రంగా చేతిలో ఉన్న రొట్టెను ఎప్పుడైనా ఆరగిం చొచ్చు. ఉక్రెయిన్‌లో అంతా అమెరికా అనుకున్నట్టుగా ముగిసిపోతే రష్యాలో ‘ప్రజాస్వామ్య విప్లవం’ ‘జాతుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు’ పట్టంగట్టి తినడానికి వీలుగా ‘రొట్టె’ను ఏడు ముక్కలు చేసే పథకాన్ని ‘పెంటగాన్’ జార్జి డబ్ల్యూ బుష్ హయాంలోనే సిద్ధం చేసింది. ఉక్రెయిన్ తర్వాత తన వంతేనని చైనాకు బాగా తెలుసు. అందుకే నేటి నయా కోల్డ్‌వార్‌లో రష్యా ఒంటరిగా లేదంటూ అది దక్షిణ చైనా సముద్రం మీదుగా శ్వేతసౌథానికి సందేశం పంపింది. ఒబామా తేల్చుకోవాల్సింది ఒక్కటే. క్రిమియాలోని 95 శాతం ప్రజలు రష్యాలో భాగంగా ఉండాలంటూ ఇచ్చిన తీర్పును బేఖాతరు చేసి ఇప్పుడే చైనా కొరివితో తలగోక్కోవడమా? లేక అంతర్జాతీయ సేనలంటూ అమెరికా, ఐరాస, రష్యా సేనలను నిలిపి ఉక్రెయిన్ను ‘తటస్థ’ దేశం చేయడ మా? లేక ఉక్రెయిన్ను రెండో, మూడో ముక్కలు చేసి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో కలిసి పంచుకోవడమా? - పిళ్లా వెంకటేశ్వరరావు -
శాంతి మిథ్య... యుద్ధం సత్యం?
జెనీవాలో జరిగిన సిరియా శాంతి చర్చలు విఫలమయ్యాయి. తిరిగి మరో దఫా చర్చలు జరపడానికి కుదిరిన అంగీకారమే సాధించిన పురోగతి. ప్రధాన తిరుగుబాటుదార్లు బహిష్కరిస్తున్న చర్చలవల్ల శాంతి ఒప్పందం కుదిరినా ఇప్పట్లో శాంతి నెలకొనే అవకాశం కనబడదు. విఫలం కావాలని ‘రాసి పెట్టి’ ఉన్న సిరియా ‘శాంతి’ చర్చలు గత శుక్రవారం మరోసారి విఫలమయ్యాయి. పశువుల్లాగా గడ్డి పరకలను, కలుపు మొక్కలను తిని చావక తప్పని సిరియన్లు అన్ని బాధల నుంచి ‘విముక్తి’కి చేరువవుతున్నారు. ప్రభుత్వ సేనల ముట్టడిలోని పురాతన నగరం హోమ్స్‌లో 40 వేల మందికి ఆకలి చావులను తప్పించగల ప్రపంచ ఆహార సంస్థ ట్రక్కులు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. ముట్టడిలో ఉన్న తిరుగుబాటుదార్ల లొంగుబాటు కోసం సైన్యం ఎదురుచూస్తోంది. ఆహారం తిరుగుబాటుదార్లకు చేరితే ప్రమా దం. పౌరుల మాటంటారా? ఎంత మంది చావడం లేదు? పది రోజుల క్రితం జెనీవాలో మొదలైన సిరియా శాంతి చర్చలు ముగిసేలోగానే, వారంలోనే కనీసం 1,500 మంది పౌరులు మరణించారు. మూడేళ్ల క్రితం అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి కనీసం 1,30,000 మంది చనిపోయారు. గాలి బుడగ జీవితానికి విలువేముంది? గెలుపు ముఖ్యం. హోమ్స్ ఒక్కటే కాదు, యార్మూక్, అలెప్పీ తదితర ప్రాంతాల్లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సైన్యం ముట్టడిలో చిక్కుకుపోయినవారు 2.5 లక్షలైతే. తిరుగుబాటుదార్ల ముట్టడిలో ఉన్న వారు 50 వేలు. అసద్ ‘పైచేయి’ స్పష్టమే. అధికార మార్పిడి సంగతి ముందు తేల్చాలని జెనీవా చర్చల్లో ప్రతిపక్ష ప్రతినిధులు పట్టుబట్టారు. సిరియా ప్రతిపక్ష ప్రతినిధులంటున్న ‘నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ’ సభ్యుల్లో మూడో వంతు చర్చలకు వ్యతిరేకం. తిరుగుబాటుదార్లలో అత్యంత ప్రధాన శక్తులైన జబాత్ అల్ నస్రా, ఐఎస్‌ఐఎల్‌లు చర్చలను బహిష్కరించడమే కాదు, పాల్గొన్న వారిని ద్రోహులుగా ప్రకటించాయి. చర్చలకు ముందే తిరుగుబాటుదార్లకు తక్షణం ఆయుధాలను అందించాలంటూ పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు... శాంతికి ఏకైక మార్గం యుద్ధమేననే పాత ‘సత్యాన్ని’ పునరుద్ఘాటించారు. తిరుగుబాటుదార్లు, వారి సూత్రధారులైన సౌదీ, కతార్‌లు వారిపైనే దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నాయి. ఆ కాంగ్రెస్ సభ్యులే ఇరాన్‌పై అంక్షలు విధిం చాలని పట్టుబడుతున్నారు. భావి అధ్యక్షురాలిగా భావిస్తున్న మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ గతంలో ఇరాన్‌పై కఠోరమైన ఆంక్షలతో దృఢవైఖరిని అనుసరించిన వారే. హిల్లరీకి బదులుగా ఒబామాను అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకుని డెమోక్రాట్లు చారిత్రక తప్పిదం చేశారని పెంటగాన్ (రక్షణశాఖ) నిన్న మొన్నటి వరకూ నిట్టూర్పులు విడుస్తుండేది. ఆమె సైతం ఇరాన్‌పై ఆంక్షలు మధ్యప్రాచ్య శాంతికి భంగం కలిగిస్తాయని హెచ్చరించారు! అంటే సిరియాపై కూడా పునరాలోచన లేదన్న మాటే. అసద్ ప్రభుత్వం ‘మొండి వైఖరి’ని ఘాటుగా విమర్శించిన ఒబామా సుతిమెత్తగా రెండో దఫా చర్చల్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెనీవా చర్చలు ‘పురోగతి’ సాధించి ఉంటే ఏమై ఉండేది? ఆకలితో అలమటిస్తున్న సిరియన్లకు రొట్టె ముక్క అందేదా? అమెరికా, సౌదీ, కతార్ల నేతృత్వంలో ‘సిరియా మిత్రులు’ అందించిన అపార ఆర్థిక, ఆయుధ సంపత్తిగల అల్‌కాయిదా సిరియా విభాగం జబాత్... అమెరికా, రష్యా, చైనా, సౌదీ, కతార్ తదితరులు ఎవరి మాటనూ లెక్క చేసే బాపతు కాదు. తూర్పున జబాత్తో పోరాడుతున్న కుర్దు గెరిల్లాలకు కావలసింది కుర్దిస్థాన్ తప్ప మరే ప్రభుత్వమూ కాదు. అగ్రరాజ్యాలు, ప్రాంతీయ అధిపత్యశక్తులు కలిసి వేసిన సిరియా చిక్కుముడి తేలిగ్గా విప్పగలిగేది కాదు. సిరియన్లకు కావాల్సిన శాంతి, జెనీవా చర్చల్లో పాల్గొంటున్న వారికి కావలసిన ‘శాంతి’ ఒక్కటి కావు. ఉగ్రవాదం నిప్పుతో చెలగాటమాడి ఎన్నిసార్లు తలబొప్పి కట్టినా అమెరికా గుణపాఠం నేర్చుకోలేదు. సౌదీ కూడా ఆ బాటలోనే ఉంది. అల్‌కాయిదా అధినేత అయమాన్ అల్ జవాహరి ఆదివారం ఒక ప్రకటనలో ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్’ (ఐఎస్ఐఎల్) తిరుగుబాటుదార్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని, సిరియాలో జబాత్ మాత్రమే తమ అనుబంధ సంస్థని ప్రకటించాడు. తిరుగుబాటుదార్ల చేతుల్లోని ఏకైక నగరం రఫా వారి చేతుల్లోనే ఉంది. చిన్నదే అయినా ఐఎస్ఐఎల్ అత్యంత శక్తిమంతమైనది. ఇరాక్, లెబనాన్లలో మారణహోమాన్ని సృష్టిస్తోంది. దానికి ఇతర గ్రూపులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో జనవరిలోనే దాదాపు 2,000 మంది చనిపోయారు. అటు అల్‌కాయిదా, ఇటు ఐఎస్ఐఎల్ రెంటినీ చెప్పు చేతల్లో పెట్టుకోగలనని సౌదీ భావిస్తే అది రెండు పులుల మీద స్వారీ చేయడమే అవుతుంది. ఇక ఆకలి, అనారోగ్యం, చావు అలవాటుగా మార్చుకున్న సిరి యన్లు తిండి, బట్ట, నీరు, విద్యుత్తు ఏమి కరువైనా బతగ్గలరు. ‘ఇదంతా దేవుడికి చెబుతాను’ అంటూ మూడేళ్ల మున్నా అబూసులేమాన్ తుది శ్వాస విడుస్తూ అందించిన సందేశాన్ని మన నం చేసుకుంటూనైనా వేచి చూడాలి. తప్పదు. -పిళ్లా వెంకటేశ్వరరావు -
అవినీతి పోరు... చైనా జోరు
చైనా అధ్యక్ష, ప్రధాన మంత్రులు సహా పార్టీ, ప్రభుత్వ అత్యున్నత నేతలు విదేశాల్లో భారీ ఎత్తున దాచిన సంపదల గుట్టు ఇటీవల రచ్చకెక్కింది. అవినీతిపై సమరం ప్రకటించిన ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలపై విరుచుకుపడుతోంది. ‘రక్కసులతో పోరాడేవారు ఆ క్రమంలో తామే అలా మారిపోకుండా జాగ్రత్తపడాలి (నీషే).’ చైనా అధ్యక్షుడు క్సీ జింగ్పింగ్ ‘పెద్ద పులులను, చిన్న కీటకాలను సైతం వదిలేది లేదు’ అంటూ గత ఏడాది మార్చిలో అవినీతి రక్కసిపై యుద్ధం ప్రకటించారు. నీషే హెచ్చరిక ఆయనకు వర్తించదు. ఆయనలాంటి వారు ‘దేవతలు’గా మారిపోకుండా జాగ్రత్తపడాలేమో. అధ్యక్షుడు క్సీ, ప్రధాని లీ పెంగ్, మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్జియావో బావోలు సహా దాదాపు 17 వేల మంది కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ అగ్రనేతలు విదేశాల్లో దాచిన ‘కష్టార్జితం’ వివరాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ నెల 22న పేర్లతోసహా బయటపెట్టింది. కరీబియన్ సముద్రంలోని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో మాజీ ప్రధాని వెన్ పుత్ర రత్నాలతో కలిసి క్సీ బావ మరిది డెంగ్ జియాగుయి భారీ రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నట్టు తేలింది. 2000-2010 మధ్య చైనా నేతలు విదేశాల్లో దాచిన సంపద నాలుగు లక్షల కోట్ల డాలర్లని అంచనా. ‘ఆర్థిక సంస్కరణలతో దేశం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల బాటపడుతుందని భావించాం. ఒకతరం గడిచే సరికే ఆర్థిక, రాజకీయ అధికారాలను దుర్వినియోగపరచి పార్టీ, ప్రభుత్వ నేతలు అత్యంత సంపన్నవంతులుగా మారిపోయారు’ అని ఓ చైనా అధ్యాపకుడు వాపోయాడు. చైనాను మార్కెట్టు పట్టాలెక్కించిన డెంగ్ జియావోపింగ్ హయాం (1980లు) నుంచి పార్టీ నాయకత్వంలో నెలకొన్న ‘సుస్థిరత’, ‘ఐక్యత’లకు ముఖ్య ప్రాతిపదిక నేతల ఉమ్మడి ఆస్తులు, పెట్టుబడుల బంధనాలేననే వాదనను కాదనలేం. డెంగ్ కుటుంబ సభ్యుల ‘కష్టార్జితం’ వివరాలు కూడా ఐసీఐజే జాబితాలో ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ అధికారుల అవినీతిని 53 శాతం ప్రజలు ప్రధాన సమస్యగా భావిస్తుంటే, వ్యాపారులే అవినీతి, అక్రమాలు ప్రధాన సమస్యని 27 శాతం భావిస్తున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఫూజియాన్ రాష్ట్రం క్వాన్‌జౌ 500 హెక్టార్లలో నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును గత నెల 18 నుంచి రైతులు అడ్డగించి ఆందోళన సాగిస్తున్నారు. రైతుల భూమిని వారికి తెలియకుండానే ప్రభుత్వం అమ్మేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రైతులకు పరిహారాన్ని చెల్లించి రియల్ ఎస్టేటర్లు కొనుక్కున్నారు. విదేశీ వ్యాపార సంస్థలు సైతం బ్యాలెన్స్ షీట్లలోని ‘ఇతర ఖర్చులు’ (ముడుపులు) కళ్లు చెదిరేట్టుగా పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. అలా అని ప్రభుత్వం చేతులు ముడుచుకు కూచోలేదు. బీజింగ్‌లో గత పది రోజుల్లో ఐదుగుర్ని కటకటాల వెనక్కు తోసేసింది. అందరిపై ఒకటే ఆరోపణ... ‘ప్రజలను పోగు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించడం.’ వారిలో గత ఆదివారం నాలుగేళ్ల శిక్ష పడ్డ క్సు జియాంగ్ అవినీతి వ్యతిరేక, ప్రజాస్వామిక హక్కుల సంస్థ ‘న్యూ సిటి జెన్స్’ నేత. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా క్సీ ప్రభుత్వం పది నెలల క్యాంపయిన్ చేపట్టింది! మరోవంక అవినీతిపరులకు శిక్షలు పడుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 20 వేల మంది అవినీతిపరులను శిక్షించారు. వారిలో దాదాపు అంతా ‘కీట కాలే.’ ‘పెద్ద పులి’ ఒక్కటీ లేదు. అవినీతి నిరోధక శాఖ కంటే అవినీతిపరులైన అధికారుల మాజీ ఉంపుడుగత్తెలే సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రతీతి. 2013లో రెనిమిన్బో విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనంలో ఏ మాత్రం చేతనైన (అవినీతి) మగాడికైనా కనీసం ‘ప్లస్ టూ’ ఉండాల్సిందే. ఇల్లాలికి తోడు ‘రెండో ఆమె’ (ఎర్నాయి), ‘చిన్నామె’ ఉండాలి. అవి నీతిపరులైనా ‘ప్లస్సులు’ లేని ‘దద్దమ్మలు’ 5 శాతం మాత్రమే. మిగతా 95 శాతం ధీరుల్లో 40 శాతానికి ఎప్పటికప్పుడు కొత్త ‘ప్లస్సులు’ కావాలి. మాజీ ‘ప్లస్సులు’ ప్రతీకారంతో ప్రేమ పిపాసుల అనైతికత తో పాటూ అవినీతిని కూడా ‘నెట్’ కెక్కించేస్తున్నారు. మాజీ ఉంపుడుగత్తెల అవినీతి వ్యతిరేక ఉద్యమం జోరును పార్టీ అధికారిక పత్రిక ‘పీపుల్స్ డైలీ’ సైతం గుర్తించక తప్పలేదు. ‘అవినీతి వ్యతిరేక పోరాటానికి ఉంపుడుగత్తెలపైనే ఆధారపడ కూడదు’ అని గత మేలో అది ఏకంగా సంపాదకీయమే రాసింది. భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లు నమ్మించి నట్టేటముంచిన ఫాన్ హుయి (42) అనే పురావస్తు అధికారి తన మధ్యస్త స్థాయి జీతంతో కూడబెట్టిన కళ్లు చెదిరే సంపదను అతని మాజీ ఉంపుడుగత్తె జీ యింగ్నాన్ (26) గత జూలైలో ఏకంగా టీవీకి ఎక్కి మరీ బయటపెట్టింది. ‘పాత ప్రేమలను మరచి ప్రియురాళ్లు పగబట్టి ప్రతీకారానికి దిగడం న్యాయమా?’ అని నాన్కింగ్ మేయర్ కటకటాలు లెక్కిస్తూ వాపోతున్నారు. ఆయన 18 మంది ఉంపుడుగత్తెలను గలిగిన వీరునిగా రికార్డును సృష్టించినవాడు. ఇంతకూ అధ్యక్షుడు క్సీ 5 శాతం దద్దమ్మల్లోనే ఉండి ఉంటారంటారా? పిళ్లా వెంకటేశ్వరరావు -
బంగ్లా బ్యాలెట్‌పై నెత్తుటి మరక
విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు ‘అవామీ లీగ్ గెలిస్తే షేక్ హసీనాతోపాటూ ఓ గుప్పెడు మంది గెలుస్తారు, ఓడిపోతే మొత్తంగా బంగ్లాదేశ్ ఓడిపోతుంది’ అని ప్రముఖ బంగ్లా కవి, రచయిత, విమర్శకుడు అహ్మద్ సోఫా అపుడెప్పుడో అన్నారు. అవామీ లీగ్, హసీనాలు గెలిచినా బంగ్లాదేశ్ ఓడిపోయే ప్రమాదం ఉన్నదనే చేదు నిజాన్ని గుర్తించడానికి నేడు ఆయన లేరు. జనవరి 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని హసీనా, ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయాన్ని సాధించాయి. విజయోత్సవ వేడుకలు మాత్రం లేవు. 2009లోలాగా ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్లవద్ద బారులు తీరిన ఓటర్లు లేరు. వచ్చిన వారు కూడా భయం భయంగానే వచ్చారు. రాని వారిలో చాలా మంది భయంతోనే రాలేదు. రాజ ధాని ఢాకాలో సైతం ఎన్నికల సందడి లేదు. అక్కడున్న 20 పార్లమెంటరీ స్థానాలకు ఐదు చోట్లే ఎన్నికలు జరిగాయి. మిగతా అన్నీ ‘ఏకగ్రీవ’ ఎన్నికలే. మొత్తం 300 స్థానాల్లో 154 ఏకగ్రీవ ఎన్నికలు. అందులో 127, మొత్తం స్థానాల్లో నాలుగింట మూడువంతులు అధికార పార్టీ ఖాతాలోనే. అయినా అవామీ నేతలు విజయోత్సవాలు జరుపుకోడానికి సిగ్గుపడుతున్నారు. దాదాపు పాతికేళ్లుగా బంగ్లా రాజకీయాలను శాసిస్తున్న అవామీ, బీఎన్‌పీలు బరిలోకి దిగి కలబడకుండానే... దక్కిన విజయం అతి చప్పగా అనిపించడం సహజమే. దేశవ్యాప్తంగా ఎన్నికల తదుపరి చెలరేగుతున్న హింసాకాండలో ఇప్పటికే 30 మందికి పైగా మరణించారు. అఖండ విజయం దక్కించుకున్న ఆ పార్టీ అధికారంలో ఉండేదెన్నాళ్లనేది అప్పుడే చర్చనీయాంశంగా మారింది. ఏకపక్ష ఎన్నికల ‘సంప్రదాయం’ మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించింది. మూడో అతిపెద్ద పక్షమైన జాతీయ పార్టీ అధినేత, మాజీ ప్రధాని, నియంత మొహ్మద్ హుస్సేన్ ఎర్షాద్... హసీనా, ఖలీదాల మధ్య అటూ ఇటూ మూడు మొగ్గలేసి... బహిష్కరణ మంత్రం పఠించారు. పర్యవసానంగా ఎన్నికలు ముగిసే వరకు సైనిక ఆసుపత్రిలో ‘విశ్రాంతి’ తీసుకోవాల్సి వచ్చింది. నాలుగో అతి పెద్ద రాజకీయ పక్షం జమాతే ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణకు గురైన పార్టీ. 1971 నాటి యుద్ధ నేరస్తుల నేతృత్వంలోని పార్టీ. బీఎన్పీ నేతృత్వంలోని 17 ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో అమెరికా, రష్యా, ఈయూలు ఎన్నికల పరిశీలకులను పంపడానికి నిరాకరించాయి. అయితే ఏకపక్ష ఎన్నికలు బంగ్లాకు కొత్తేమీ కాదు. ఒకప్పటి స్నేహితులు, నేటి బద్ధ శత్రువులు హసీనా, ఖలీదాలు ఈ ఎన్నికలతో మూడుసార్లు ప్రధాని పీఠం దక్కించుకున్న సమ ఉజ్జీలయ్యారు. కానీ హసీనా 1996 నాటి ఖలీదా రికార్డును అందుకోలేక పోయారు. బీఎన్పీ అప్పుడు 300 స్థానాలకు 300 దక్కించుకోగలిగింది! నేడు హసీనా 232 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ ప్రధాని ఎర్షాద్కు సైతం ఏకపక్ష ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఖ్యాతి ఉంది. ఇలాంటి ఎన్నికల ప్రహసనాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయనడంలో సందేహం లేదు. అంతమాత్రాన హసీనాను నియంతగానూ, ఖలీదాను ప్రజాస్వామ్య యోధురాలుగానూ జమకట్టేయలేం. బహిష్కరణ రాజకీయం ఖలీదా నేతృత్వంలోని పార్టీలు ఎన్నికలను ఎందుకు బహిష్కరించినట్టు? సార్వత్రిక ఎన్నికలను తాత్కాలిక ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించే పద్ధతికి హసీనా ప్రభుత్వం స్వస్తి పలికారు. ఆమె అధికారంలో ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఖలీదా ఆరోపణ. 15వ రాజ్యాంగ సవరణతో ఆపద్ధర్మ ప్రభుత్వం పద్ధతిని హసీనా రద్దు చేసిన మాట నిజమే. కానీ ప్రజలు ఎన్నుకోని వారు ప్రభుత్వాధికారాన్ని చలాయించడం రాజ్యాంగ విరుద్ధం. సదరు ఆపద్ధర్మ ప్రభుత్వ పద్ధతి సైతం బీఎన్పీ మిత్ర పక్షాల సభ్యులతో నిండిన ఏకపక్ష పార్లమెంటు 1996లో చేసిన రాజ్యాంగ సవరణ ఫలితమే. ఆపద్ధర్మ ప్రభుత్వ నిర్వహణలో ఎన్నికలు జరిగితే ఖలీదా చేతిలో హసీనా చిత్తయ్యేవారా? అలాంటి పరిస్థితే ఉంటే ఖలీదా నోట బహిష్కరణ మాటే వచ్చేదే కాదు. హసీనా పాలన సంతృప్తికరమని ప్రజలు భావించడం లేదు నిజమే. అలా అని ప్రజలు బీఎన్పీకి పట్టంగట్టే పరిస్థితి లేదు. ‘దొంగల పార్టీ’గా బీఎన్పీ ఖ్యాతి ఇసుమంతైనా తగ్గలేదు. అవామీ, హసీనాలు అవినీతి మరక అంటక పరమ పవిత్రంగా ఉన్నవారూ కారు. ఈ ఐదేళ్ల కాలంలో హసీనా సన్నిహిత బంధువుల ఆస్తులు విపరీతంగా పెరిగాయని అందరికీ తెలి సిందే. అయినా అవామీకి ఇంకా ‘దొంగల పార్టీ’ బిరుదు దక్కలేదు. అంతకు మించి ఆ పార్టీ లౌకికవాద, ప్రజాస్వామిక స్వభావం దాని సానుకూలాంశం. 1971 నాటి యుద్ధ నేరస్తులకు మరణశిక్షలను విధించాలనే డిమాండుతో గత ఏడాది మొదట్లో పెల్లుబికిన షాబాగ్ ఉద్యమం... మతోన్మాద జమాతేకి, దాని అంగబలంతోనే హింసాత్మక రాజకీయాలను నడిపే బీఎన్పీకి కంటగింపయింది. ప్రత్యేకించి జమాతే మనుగడ కోసం బరితెగించి, హింసాకాండకు దిగింది. దాని ముసుగు సంస్థ హిఫాజత్ ఇస్లాం గత ఏడాది మే నుంచి దేశ వ్యాప్తంగా హింసాకాండను సృష్టిస్తోంది. అవామీ కార్యకర్తలపైనే గాక లౌకికవాదులందరిపైనా దాడులను సాగిస్తోంది. గత ఏడాది కాలంగా జమాతే, బీఎన్‌పీలు రేకెత్తించిన హింసాకాండలో కనీసం 500 మంది పౌరులు మరణించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరి 40 మంది బలయ్యారు. రాజ్యాంగ నిపుణులు తానియా అన్వర్ అన్నట్టు ‘‘నేడు మనం చూస్తున్న హింసాకాండలో, దాడుల్లో అత్యధిక భాగం రాజకీయ హింస కానే కాదు. కీలకమైన, వ్యూహాత్మక నిర్మాణాలపైన, కేంద్రాలపైన, మైనారిటీలపైన పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. ఇది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాద శక్తులతో బీఎన్పీ తెగదెంపులు చేసుకుని ముందుకు సాగాలి’’ ఖలీదా అలాంటి హిత వచనాలను వినే స్థితిలో లేరు. సాధ్యమైనంత త్వరగా హసీనా ప్రభుత్వాన్ని కూల్చే అరాటంలో ఉన్నారు. జమాతే, హిఫాజత్‌లను వదిలి.. మైనారిటీలపై దాడులకు అవామీయే కారణమంటూ మంగళవారం సైతం ఆమె ప్రత్యారోపణకు దిగారు. గెలిచి ఓడిన హసీనా భారత్, అమెరికాలు తూర్పు, పడమరల్లా పరస్పర విరుద్ధ వైఖరులను ప్రదర్శించే అరుదైన సందర్భాన్ని బంగ్లా ఎన్నికలు కల్పించాయి. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని. తిరిగి ఎన్నికలు జరపాలని అమెరికా అంటే... పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగాయి, ‘రాజ్యాంగపరమైన ఆవశ్యకతను’ నెరవేర్చాయి అంటూ భారత్ హసీనా గెలుపుకు ఆమోద ముద్ర వేసింది. తొమ్మిదవ పార్లమెంటు పదవీ కాలం ముగిసేసరికి ఎన్నికలు జరగాల్సిన రాజ్యాంగపరమైన ఆవశ్యకత ఉన్నా... హసీనా రాజకీయ సయోధ్యకు తగు కృషి చేసి ఉండాల్సిందని పలువురు విమర్శకులు భావిస్తున్నారు. పార్లమెంటు పదవీ కాలం ముగిశాక ఎన్నికలకు 90 రోజుల గడువు రాజ్యాంగబద్ధంగా వీలవుతుం దని బంగ్లా రాజ్యాంగ నిపుణులు ఆసిఫ్ నజ్రుల్, రఫీఖుల్ హఖ్, తానియా అన్వర్ వంటి వారు భావిస్తున్నారు. భారత్ అంటున్నట్టు నిబంధనల ప్రకారమే హసీనా ఎన్నికలు జరిపారు. కానీ లౌకికతత్వం, ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటున్న సమయంలో హసీనా అదే పనిగా ఇస్లామిక్ మతోన్మాదం బూచిని చూపి భయపెట్టి గెలవాలని ప్రయత్నించారు. అంతేగానీ జమాతే, హిఫాజత్‌లను ఏకాకులను చేసే రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఒకవంక జమాతేపై 1971 నాటి యుద్ధ నేరాల విచారణకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తేనె తుట్టెను కదిపారు. మరోవంక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటును రద్దు చేసి మతతత్వవాదులకు, ఖలీదాకు ప్రజాస్వామ్య పరిరక్షకుల వేషం గట్టే అవకాశం కల్పించారు. అవామీ మద్దతుదార్లయిన ప్రజలు సైతం హసీనా ఆ విషయంలో తప్పు చేశారని భావిస్తున్నారు. తద్వారా ఆమె ఎన్నికలను బహిష్కరించడానికి సాకును సృష్టించి ఇచ్చారు. చివరికి హసీనా లౌకికవాద, ప్రజాస్వామ్యశక్తులకు దూరమై ఏకాకి అయ్యే పరిస్థితికి చేరువయ్యారు. ఖలీదా ఊహించని విధంగా తన బహిష్కరణ ఎత్తుగడలో ఇరుక్కుపోయారు. బయటపడే దారి కోసం అన్వేషిం చారు. దక్షిణ ఆసియాలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని హసీనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న భారత్ చొరవ జూపి ఖలీదా గౌరవప్రదంగా ఆ ఇరకాటంలోంచి బయటపడేలా వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించాల్సింది. హసీనా గెలుపంటేనే బంగ్లా ప్రజాస్వామ్యం, లౌకికతత్వాలు పదిలం కావడమన్నట్టు ప్రవర్తించిన మన విదేశాంగా శాఖ హ్రస్వ దృష్టికి మూల్యం చెల్లించక తప్పదు. ఈ ఎన్నికల్లో నిజమైన విజయం సాధించిన పక్షం ఏదైనా ఉందంటే జమాతే, హిఫాజత్ల మత ఛాందసవాదమే. ఎన్నికల తదుపరి హింసాకాండ, అస్థిరత ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఇప్పటికే అవి భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనం తూర్పు సరిహద్దుల నుంచి కూడా సీమాంతర ఉగ్రవాదం సమస్యను ఎదుర్కోవాల్సిరావచ్చు. ఏది ఏమైనా ఇప్పటికైతే సైన్యం తటస్థంగానే ఉంది, అధికారం పగ్గాలు పట్టాలని ఆరట పడటం లేదు. అదే ఉన్న కాసింత ఊరట. -
ఈ ‘మండేలా’ చెర వీడేనా!
విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు ‘పాలస్తీనీయులకు స్వేచ్ఛ లభించక పోతే మా స్వేచ్ఛ అసంపూర్ణమైనదిగానే మిగిలిపోతుందని మాకు బాగా తెలు సు’, 1997 ఐక్యరాజ్య సమితి పాలస్తీనా సంఘీభావ దినం నాటి నెల్సన్ మండేలా మాటలు సుపరిచితమైనవే. కాకపోతే ఆయన మరణించిన వెంటనే జెరూసలెంలోని అమెరికన్ కాన్సులేట్ ‘ఫేస్బుక్’ పేజీపై అవి ప్రత్యక్షం కావడం మాత్రం రెండు విధాలుగా అసందర్భం. ‘చెప్పనలవిగాని దురాగతాలకు పాల్పడిన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అమెరికాయే’ అన్న (2003) మండేలాను అమెరికా 2008 వరకు ఉగ్రవాద జాబితాలోనే ఉంచి తగిన శాస్తి చేసింది. మరణించాక పొగడ్తలు తప్పవుగానీ... మధ్యప్రాచ్యంలో అమెరికా బహిఃప్రాణమైన ఇజ్రాయెల్ రాజధాని నుంచి పాలస్తీనా స్వేచ్ఛ గురించి మాట్లాడటం ఏమిటి? పైగా మండేలా దృష్టిలో ఇజ్రాయెల్ ‘ఆక్రమిత ప్రాంతాల్లోని నిస్సహాయులైన అరబ్బులను ఊచకోత కోస్తున్న ఉగ్రవాద రాజ్యం!’ సదరు ఫేస్ బుక్ పేజీ పాలస్తీనీయుల ఆధీనంలోని గాజా, వెస్ట్‌బ్యాంక్ వ్యవహారాలను చూసే విభాగానికి మాత్రమే సంబంధించినది. మండేలా మాటలను అమెరికా వల్లె వేసినది కూడా పాలస్తీనీయులు విని తరించాలనే తప్ప ‘ఉగ్రవాద రాజ్యానికి’ తీరు మార్చుకోమని హితవు పలకడానికి కాదనేది స్పష్టమే. కాబట్టే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విమానం ఖర్చులు దండగని మండేలా అంత్యక్రియలకు వెళ్లలేదు. తద్వారా ‘ఆయన పాలస్తీనా ప్రేమికుడు మండేలాకు తన దృష్టిలో ఉన్న స్థానం ఏ పాటిదో చెప్పకనే చెప్పారు’ అని సుప్రసిద్ధ ఇజ్రాయెల్ దినపత్రిక ‘హార్తెజ్’ వ్యాఖ్యానించింది! మండేలాను నిన్నటి వరకు ఉగ్రవాదిగా పరిగణించిన ప్రపంచ పెద్దలంతా పోటీలు పడి మొసలి కన్నీళ్లు కార్చారే తప్ప మండేలా మరణానంతరమైనా ఆయన కల ‘సంపూర్ణ స్వేచ్ఛ’ను నిజం చేసే ఊసు ఎత్తడం లేదు. ‘పాలస్తీనా మండేలా’ ఇజ్రాయెల్ బందీగానే ఉన్నాడు. ‘మండేలాను విడుదల చెయ్యండి!’ మండేలా 27 ఏళ్ల జైలు జీవితంలో 18 ఏళ్లు రాబిన్ దీవిలో గడిపారు. 1963 అక్టోబర్ 27న అహ్మద్ మొహ్మద్ కత్రదా అనే ఆప్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకర్త ‘మండేలాను విడుదల చెయ్యండి!’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ తదుపరి ఆయన కూడా అరెస్టయి అదే దీవిలో 18 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఈ ఏడాది సరిగ్గా అదే రోజున 84 ఏళ్ల వృద్ధునిగా కత్రదా భార్యా సమేతుడై తిరిగి రాబిన్ దీవికి వెళ్లి ‘పాలస్తీనా మండేలాను విడుదల చెయ్యండి!’ అనే అంతర్జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు. పలువురు మండేలా సహచరులతో పాటూ ఐదుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు సైతం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 2002 నుంచి జైల్లో మగ్గుతున్న మర్వాన్ బార్గౌతి విడుదల కావాలంటే ఈ జన్మకాక మరి నాలుగు జన్మలెత్తాలి. ఆయన ఐదు జీవిత కాల కారాగారవాస శిక్షలను ఒకదాని తర్వత మరొకటి అనుభవించాల్సి ఉంది! మండేలాలాగే మర్వాన్ కూడా ‘ఉగ్రవాది’. మొట్టమొదటి పాలస్తీనా పార్లమెంటు సభ్యుడు. విడుదలైతే భౌగోళికంగా, రాజకీయంగా రెండు ముక్కలుగా విసిరేసినట్టున్న పాలస్తీనాకు అధ్యక్షుడవుతాడు. 1993 ఓస్లో శాంతి ఒప్పందాలు జరిగి మూడు ద శాబ్దాలు కావస్తున్నా ఇజ్రాయెల్‌లాగే పాలస్తీనా కూడా స్వతంత్ర సర్వసత్తాక దేశం ఎందుకు కాలేదని నిలదీస్తే అమెరికా ఠక్కున చెప్పే సాకు... పాలస్తీనీయులు ఫతా, హమస్‌ల మధ్య చీలిపోయి ఉన్నారనేదే. ఆ రెండు పాలస్తీనా వర్గాలను ఒక్క తాటిపైకి తేగల ఏకైక నేత మర్వాన్. అందుకే అతడు జైల్లో ఉండటం అమెరికా, ఇజ్రాయెల్‌లకు అవసరం. ‘మండేలా భక్తులకు’ మండేలా కల అసంపూర్తిగా మిగిలిపోవడమే శ్రేయస్కరం. ఉగ్రవాదా? విమోచనా యోధుడా? ఇజ్రాయెల్ ఉగ్రవాదిగా చెబుతున్న మర్వాన్ హిబ్రూ, ఇంగ్లిష్ భాషల్లో పాండిత్యం ఉన్నవాడు. జైలు నుంచి ఆయన స్మగుల్ చేసి పంపిన పాలస్తీనా విమోచన పోరాట చరిత్రకు డాక్టరేట్ పట్టా సైతం లభించింది. పదిహేనేళ్ల ప్రాయంలోనే యాసర్ అరాఫత్ నేతృత్వంలోని ‘ఫతా’లో చేరి సాయుధ పోరాట విభాగంలో కీలక పాత్రధారి అయ్యాడు. మొదటి, రెండవ పాలస్తీనా ‘ఇంతిఫాదా’లకు (తిరుగుబాట్లు) నేతృత్వం వహించాడు. మర్వాన్పై పలు హత్యాయత్నాలు విఫలలమయ్యాక వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా తాత్కాలిక రాజధాని రముల్లాలో మర్వాన్‌ను ఇజ్రాయెల్ సైన్యం 2002లో అరెస్టు చేసింది. ఇజ్రాయెల్ తనది కాని భూభాగంలో చేసిన ఈ అరెస్టు చెల్లదు. పైగా పార్లమెంటు సభ్యుడుగా మర్వాన్కు దౌత్య రక్షణ కూడా ఉంది. అయినా ఇజ్రాయెల్‌కు తోచిందే న్యాయం. ‘ఉగ్రవాది’ మర్వాన్ జైల్లోనే మగ్గుతున్నాడు. ఆయనను పాలస్తీనా మండేలాగా పిలవడమేమిటని ఇజ్రాయెల్ తప్పుబడుతోంది. కానీ మర్వాన్ అమాయక పౌరులను హతమార్చే హత్యాకాండకు వ్యతిరేకి. ‘‘రేపటి మా పొరుగువారైన ఇజ్రాయెల్ పౌరులపై దాడులను నేనూ, మా ఫతా ఉద్యమం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాం. అయితే మా ఆత్మరక్షణ హక్కును, ఇజ్రాయెల్ దురాక్రమణ ను ప్రతిఘటించడానికి మాకున్న హక్కును మాత్రం ఎన్నటికీ వదులుకునేది లేదు. 1967కు ముందటి సరిహద్దులకు ఇజ్రాయెల్ ఉపసంహరించుకునే ప్రాతిపదికపై పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు రెండు సమాన, స్వతంత్ర దేశాలుగా శాంతియుతంగా సహజీవనం సాగించాలనే నేడు కూడా కోరుకుంటున్నాను’’. ‘పాలస్తీనా విమోచనా సంస్థ కూడా మాలాగే స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడుతోంది... ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పొరాడుతున్నారు కాబట్టి ఖండించాలి అంటే కుదరదు, అది అసాధ్యం’ అని మండేలా 1990లోనే స్పష్టం చేశారు. ‘నిన్నటి వరకు నన్ను కూడా ఉగ్రవాదివనే అన్నారు’ అని మర్వాన్ లాంటి విముక్తి పోరాటాలకు మద్దతు పలికారు. మండేలా అన్నట్టు ఇజ్రాయెల్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశం. అరబ్బు భూభాగంలో ఇజ్రాయెల్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను గాంధీజీ 1930లలోనే తీవ్రంగా నిరసించారు. అయినా బ్రిటన్, అమెరికాలు 1948లో ఐక్యరాజ్య సమితి పేరిట ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసి, పాలస్తీనాకు సగ భూభాగం మిగిల్చారు. ఆ ఐరాస సరిహద్దులను దాటి ఇజ్రాయెల్ సాగించిన దురాక్రమణలతో నేటి పాలస్తీనా 10 శాతం కంటే తక్కువగా మిగిలింది. అది కూడా వెస్ట్‌బ్యాంక్, గాజా అనే రెండు విడి విడి ముక్కలుగా ఉంది. 1993లో ‘బిగ్ ఫోర్’ (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా)మధ్యవర్తులుగా ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఓస్లో శాంతి ఒప్పందం కుదిరింది. 1948 నాటి ఐరాస సరిహద్దులను ఇజ్రాయెల్ దురాక్రమణతో చెరిపివేయడాన్ని పాలస్తీనా ఆమోదించింది, 1967 ఇజ్రాయెల్ దురాక్రమణకు ముందటి పాలస్తీనా, అరబ్బు భూభాగాలనన్నిటినీ తిరిగి అప్పగించడానికి ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఆ ఒప్పందాన్ని గౌరవించక తూర్పు జెరూసలెం, వెస్ట్‌బ్యాంక్, గాజాలలోకి యూదులను దించి అక్రమ సెటిల్మెంట్లను చేపడుతూనే ఉంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలు రెండు స్వతంత్ర దేశాలుగా అస్తిత్వంలో ఉండటాన్ని ఇజ్రాయెల్ ఆచరణలో తిరస్కరిస్తోంది. దెయ్యం చెబితే దారికి వస్తారా? నేడు వెస్ట్‌బ్యాంక్‌పై ఆధిపత్యం వహిస్తున్న ఫతా నేతగా, పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షునిగా ఉన్న మొహ్మద్ అబ్బాస్ ఇజ్రాయెల్, అమెరికాల సహాయంపైనే అధారపడి బతుకుతున్న ‘కీలుబొమ్మ’గా అప్రతిష్టపాలయ్యారు. ఇక గాజాపై ఆధిపత్యం వహిస్తున్న హమస్ ఒకప్పుడు ఫతాలో భాగంగా ఉన్నదే. ఖలీద్ మషాల్ నేతృత్వంలోని ఆ సంస్థ సాయుధ మిలిటెంటు కార్యకలాపాలు సాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో సైతం ఇటీవల బలపడుతోంది. అయితే ప్రస్తుతం ఫతాతో అంగీకారానికి వచ్చి పనిచేస్తోంది. అయితే ఫతా శాంతియుత పంథాను తిరస్కరిస్తోంది. పరస్పర విరుద్ధమైన ఈ శక్తులను ఐక్యం చేయగల శక్తి మర్వాన్కు ఉన్నది. పదేళ్లుగా జైల్లో ఉన్నా ఆయనకు రెండు ప్రాంతాల్లోనూ గొప్ప జనాదరణ ఉంది. పైగా హమస్ ఆయన నేతృత్వంలో పాలస్తీనా నేషనల్ అథారిటీలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందువల్లనే పాలస్తీనా సమస్య పరిష్కారంపై ఆసక్తి ఉన్నవారంతా ఆయనను విడుదల చేయాలని కోరుతున్నారు. ఇజ్రాయెల్ రాజకీయ పక్షాల్లో సైతం తరచుగా ఆయనకు క్షమాభిక్ష ప్రకటించి రాజకీయ సయోధ్య కుదుర్చుకోవాలనే చర్చ సాగుతోంది. అధ్యక్షుడు సైమన్ పెరస్ 2007 ఎన్నికల్లో గెలిస్తే మర్వాన్‌ను విడుదల చేస్తామనే వాగ్దానం చేశారు. గెలిచాక సహజంగానే అది మరిచారు. ప్రధాని నెతన్యాహూ వ్యతిరేకతే అందుకు కారణమని భావిస్తున్నారు. 2009లో ఒబామా సైతం 1967 సరిహద్దుల ప్రాతిపదికపై పాలస్తీనా సమస్య పరిష్కారం కావాలని ప్రకటించి ఆపై దాటవేశారు. మండేలా విడుదలతో దక్షిణ ఆఫ్రికా సమస్య పరిష్కారమైనట్టే మర్వాన్ విడుదలతోనే పాలస్తీనా సమస్య పరిష్కారం అవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ‘రెండు దేశాల’ పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడదు. దేవుడు చెప్పినా వినని వాడు దెయ్యం చెబితే వింటాడట. అల్‌కాయిదా కారణంగానైనా మర్వాన్ విడుదల అవుతాడేమోనని ఆశించాలి. అల్‌కాయిదా అనుబంధ సంస్థ ముజాహిదిన్ షురా కౌన్సిల్ ఈ నెల 11న హెబ్రాన్‌లో తమ మిలిటెంట్లు ముగ్గురు ఇజ్రాయెల్ సైన్యం చేతిలో మరణించారని ప్రకటించింది. ఆ ప్రకటనతో పాటే అది తమ జిహాదీ ఉద్యమం వెస్ట్‌బ్యాంక్‌లో స్థిరంగా కాళ్లూనుకుందని తెలిపింది. ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ ‘షిన్ బెత్’ సైతం అది నిజమేననీ, షురా వెస్ట్‌బ్యాంక్‌లో భారీ ఎత్తున ఆయుధాలను నిల్వచేసి, స్థావరాలను ఏర్పరుచుకుందనీ, ఇజ్రాయెల్‌లో దాడులు చేయడానికి వేచి చూస్తోందని పేర్కొంది. అప్పుడెప్పుడో గాంధీ చెప్పాడు వినలేదు, నిన్న మండేలా చెప్పాడు వినలేదు. ఇప్పుడు అల్‌కాయిదా ముప్పు ముంచుకొస్తుంటేైనె నా అమెరికా, బ్రిటన్లు వింటాయా? స్వతంత్ర పాలస్తీనాకు ఇజ్రాయెల్‌ను అంగీకరింపజేస్తాయా? లేక పాలస్తీనా, ఇజ్రాయెల్లను అల్‌కాయిదా ఉగ్రవాద దాడులకు బలిచేస్తాయా? -
సంపదే ఆ దేశానికి శాపం
ఆఫ్రికా ఖండంలో ఎప్పడు ఏం జరిగినా అది దానికి కీడుగానే పరిణమించాలని ‘రాసిపెట్టి’ ఉంది. అందుకే దక్షిణ సూడాన్ నేడు నెత్తురోడుతుంది. కాబట్టే ఆఫ్రికాలోనే అతి సుదీర్ఘమైన యాభయ్యేళ్ల అంతర్యుద్ధం తదుపరి 2011లో ఆవిర్భవించిన దక్షిణ సూడాన్ ముచ్చటగా మూడేళ్లయినా కాకముందే అంతర్యుద్ధం అంచులకు చేరింది. పుట్టిన నాడే అది తన ‘కాళ్ల మీద లేచి నిలబడలేని దేశం. కాలు కదిపి అడుగు వేయలేని దేశం’ అని విజ్ఞులు అన్నారు. అరైవె కి పైగా జాతుల తెగలతో కూడిన ప్రజలు ఉత్తర సూడాన్ పాలకుల వివక్షకు, అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా ‘సూడాన్ ప్రజా విముక్తి ఉద్యమం’ (ఎస్పీఎల్ఎమ్)గా ఐక్యమయ్యారు. వారిని ఒక జాతిగా ఐక్యం చేయాల్సిన దేశాధ్యక్షుడు సల్వా కిర్ ఆ బాధ్యతను స్వీకరించలేదు. న్యూర్ తెగకు చెందిన మచార్ అనుకూల సైనికాధికారులు ఆయనతో చేయి కలిపారు. డింకా తెగకు చెందిన సల్వా కీర్‌ను గద్దె దించేవరకు పోరాటం సాగుతుందని మచార్ సైతం హెచ్చరించారు. అమెరికా వంటి సంపన్న దేశాలు అక్కడి చమురు కోసం అంతర్యుద్ధంలో... పశువులనే అమూల్య సంపదగా ఎంచి బతికే పశుపాలక తెగల చేతులకు అత్యాధునిక మారణాయుధాలను అందించారే గానీ దక్షిణ సూడాన్ మనుగడకు, ప్రజాస్వామ్యానికి పూచీ పడలేదు. అందుకే ఇంచుమించు కోటి జనాభాలో 90 శాతంగా ఉండే డింకా, న్యూర్ తెగల వారు ఒకరి నొకరు తెగ నరక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ మారణ హోమంలో సమిధలవుతున్న అమాయక పౌరులను శరణార్థి శిబిరాలకు తర లించే కృషిలో సైతం ప్రపంచ పెద్దల పత్తా లేదు. ఇరాక్, అఫ్ఘాన్ల వంటి యుద్ధాలకు లక్షల సైన్యాన్ని తరలించిన శక్తివంతులు తమ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిం చడంలో తలమునకలవుతున్నారు. ప్రాణాలు తీయడమే ఎరిగిన వారికి ప్రాణాలర్పించైనా ప్రాణాలను నిలపడం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి ‘అల్పమైన’ బాధ్యతలను నెరవేర్చడానికి మనలాంటి బడుగు దేశాల సైనికులున్నారు. ఇద్దరు జవాన్లను పోగొట్టుకున్న భారత శాంతి దళాలు తెగువ చూపకపోతే కొన్ని వేల నిండు ప్రాణాలు బలై పోయేవని ఐరాస పేర్కొంది. ఇంతవరకు కనీసం వెయ్యి మంది పౌరులు ఈ మారణకాండలో హతమై ఉంటారని, అంతర్గత నిర్వాసితుల సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అది భావిస్తోంది. సల్వాకిర్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా ఉన్న ఈయక్ మచార్ సైనిక కుట్రకు పాల్పడటంతో డిసెంబర్ 15 నుంచి దేశ జనాభాలో 90 శాతంగా ఉన్న రెండు ప్రధాన తె గలైన డింకా, న్యూర్ తెగల మధ్య అల్లర్లు చెలరేగాయని అధికారిక కథనం. అయితే ఈ అశాంతి, అస్థిరతలకు సల్వా కిర్ జూలైలో నాంది పలికారు. మచార్‌తో పాటూ ప్రభుత్వం లోని అందర్నీ పదవుల నుంచి తొలగించారు. ఫిబ్రవరిలో వంద మందికిపైగా సైనిక అధికారులను తొలగించే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణ సూడాన్ ఐక్యతకు పునాది తెగల ఐక్యతే. దాన్ని పటిష్టం చేయగలిగితే అత్యంత వెనుకబడిన దేశం అభివృద్ధి చెందడానికి కావలసిన సకల వనరులు ఉన్నాయి. దేశం పొడవునా పారే నైలు నదీ జలా లతో పచ్చగా ఉండే దక్షిణ సూడాన్‌లో పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, క్రోమియమ్, జింక్, టంగస్టిన్, మైకా, వెండి, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ సంపదలున్నాయి. దేశంలోని చమురు నిక్షేపాలపై చైనాకు అది సూడాన్‌లో భాగంగా ఉన్నప్పటి నుంచి ఆధిపత్యం ఉంది. అధికారం కోసం కుమ్ములాడుతున్న పక్షాలు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే దేశం జాతి మారణహోమంలోకి, మరో సుదీర్ఘ అంతర్యుద్ధంలోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు, చైనా ప్రస్తుతం అక్కడి ఖనిజ సంపదలను చక్కబెట్టే పనిలో ఉన్నాయి. దక్షిణ సూడాన్ చమురును రవాణా చేసే పైపు లైన్ల వ్యవస్థ ఉత్తరాన ఉన్న సూడాన్‌లోనే ఉంది. ‘అబేయీ’ అనే కీలకమైన చమురు పట్టణం విషయంలో ఆ రెండు దేశాల మధ్య వివాదం, ఘర్షణలు రగులుతున్నాయి. దీంతో ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం మరిన్ని అత్యాధునిక ఆయుధాలను, సాయుధ సంపత్తిని సమకూర్చుకుంది. చైనా దానికి సరికొత్త ఆయుధ సరఫరాదారు. అందుకే పశు పోషక తెగల మధ్య పశు సంపదకోసం, పచ్చిక మైదానాల కోసం జరిగే సర్వసాధారణమైన సంఘర్షణలు శైశవ ప్రాయంలోని దేశాన్ని కుక్కలు చింపిన విస్తర్ని చేసే ముప్పు దిశకు దిగజారుతున్నాయి. ఒకప్పుడు బ్రిటన్ వలస పాలకులు సూడాన్‌ను మత ప్రాతిపదికపై దక్షిణ, ఉత్తర ప్రాంతాలుగా విభజించి, మతాల చిచ్చును రగిల్చి పాలించారు. చివరికి సూడాన్ రెండు ముక్కలు కావడానికి కారణమయ్యారు. నేటి అశాంతికి ప్రపంచ శక్తుల తెర వెనుక రాజకీయాలు కూడా తోడైతే పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. -పిళ్లా వెంకటేశ్వరరావు -
అగ్రరాజ్యమే అసలు దోషి
విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు దేవయాని వ్యవహారాన్ని పనిమనుషుల హక్కుల సమస్యతో కలగాపులగం చేస్తే బాధితురాలిని దోషిగా మార్చే అమెరికా ఇంద్రజాలానికి సహకరించడమే అవుతుంది. వెట్టిచాకిరి గురించిగానీ, విదేశీ శ్రామికుల హక్కుల గురించి గానీ మాట్లాడే అర్హత అమెరికాకు లేదు. అమెరికాలో అత్యంత అవమానకరమైన రీతిలో అరెస్టుకు గురైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కథ తిరగాల్సిన మలుపులన్నీ తిరుగుతోంది. బాధితురాలు దోషిగా బోనెక్కాలనే నినాదాలు జంతర్ మంతర్‌లో మారుమోగే పరిస్థితి ఏర్పడింది. పలుకుబడిగల భారతీయ దొరబాబులు, దొరసానులు పనిమనుషులకు కనీస వేతనాలు, పనిగంటలు లేకుండా వెట్టి చేయించడాన్ని ‘ప్రశ్నించిన’ అమెరికాను నిరసించడమేమిటని ఘరేలూ కామ్‌గార్ సంఘటన్ నిలదీ స్తోంది. సంఘటన్ మాటలు న్యూయార్క్ ప్రాసిక్యూటర్ లేదా అటార్నీ జనరల్ ప్రీత్ భరారా పాడుతున్న పాటకు ప్రతిధ్వని. భారత్‌లాంటి బడు గు దేశాల దౌత్యవేత్తల ఇంటి పనిమనుషుల హక్కుల పరిరక్షణ కర్తగా అమెరికా వల్లిస్తున్న చిలుకపలుకులనే మన జాతీయ మీడియా కూడా పలకడం మొదలు పెడుతోంది. భరారాతో పాటూ మన మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్న స్ట్రాస్ఖాన్ అరెస్టు ఉదంతమే నిజానికి అమెరికా కపట నాటకాన్ని బయటపెడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మాజీ అధ్యక్షుడంతటి వాడిని, ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం ఎక్కడానికి పరుగులు తీస్తున్నవాడిని నిలిపి సంకెళ్లు వేశామని భరారా గొప్పలు పోతున్నారు. చిత్తకార్తె కుక్కలాంటి మనిషిగా పేరున్న స్ట్రాస్ ఖాన్ హోటల్లోని ఆప్రికన్ మహిళా సేవకురాలిపై అత్యాచారం జరిపిన కేసులో అమెరికా ఆయనకు సంకెళ్లూ వేసింది. అత్యాచారాన్ని అంగీకారంతో కుదిరిన లైంగిక కార్యకలాపంగా ‘రుజువు’ చేసి, బాధితురాలినే దోషిని చేసింది! నేడు దేవయాని అరెస్టు వ్యవహారంతో పనిమనుషుల హక్కుల రక్ష ణ సమస్యతో కలగాపులగం చేస్తే బాధితురాలిని దోషిగా మార్చే అమెరికా ఇంద్రజాలానికి సహకరించడమే అవుతుంది. వెట్టిచాకిరి గురించిగానీ, ఇమ్మిగ్రేంట్ లేబర్ హక్కుల గురించి మాట్లాడే అర్హత అమెరికాకు లేదు. చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది విదేశీ యుల కన్నీళ్లు, చమట, నెత్తురు ఇంకిన రొట్టెనూ, మాంసం ముక్కనూ తినే భరారా సహా అంతా బతుకుతున్నారు. వారిని ఉద్ధరిస్తే ప్రపంచాన్ని ఉద్ధరించినట్టే. వియన్నా మాయాజాలం వియన్నా ఒప్పందాలకు లోబడే దేవయాని అరెస్టు జరిగిందని అమెరికా అం టుంటే, మన విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అది ఆ ఒప్పందాలను బేఖాతరు చేసిందని అంటున్నారు. 1961 నాటి వియన్నా దౌత్యసంబంధాల ఒప్పందం దౌత్య సిబ్బందికి మాత్రమే పౌర, క్రిమినల్ చట్టాల నుంచి, అరెస్టుల నుంచి పూర్తి రక్షణను కల్పిస్తుంది. కాన్సులేట్ సిబ్బందికి అలాంటి పూర్తి రక్షణ ఉండదని మాత్రమే 1963 నాటి వియన్నా కాన్సులేట్ సంబంధాల ఒప్పందం పేర్కొంది. ఆ రక్షణకు ఉన్న పరిమితులను నిర్వచించలేదు. కాన్సులేట్ సిబ్బందికి ఎవరికీ తమ క్రిమినల్ చట్టాల నుంచి, అరెస్టుల నుంచి ఎలాంటి రక్షణా లేకుండా అమెరికా చేసింది. కాబట్టే కాన్సులేట్ అధికారిణి దేవయాని అరెస్టును మన దౌత్య కార్యాలయానికి తెలిపి చేతులు దులుపుకున్నారు. అమెరికా వియన్నా ఒప్పందాలను గౌరవించలేదనే అనుకున్నా ఆ వివాదాన్ని తీర్చే దెవరు? ఇలాంటి వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానంలో పరిష్కరించుకునే అంశాన్ని సభ్య దేశాల ఇష్టాయిష్టాలకే పరిమితమైన ఒప్పందంగా విడిగా గుర్తించారు. ఆ తప్పనిసరి కాని ఒప్పందాన్ని తొలుత అంగీకరించిన అమెరికా 2005లో దాన్నుంచి వైదొలగింది! దేవయాని కేసును వియన్నా ఒప్పందాల చట్రానికి కుదించడమంటే ఆమె అరెస్టు, తనిఖీలు అన్నీ సమంజసమేనని అంగీకరించడమే. కాకపోతే కరడుగట్టిన నేరస్తుల వలే ‘కావిటీ సెర్చ్’కు గురి చేయడం మాత్రమే అమెరికా చేసిన తప్పవుతుంది. పనిమనిషి సంగీత రిచర్డ్, ఢిల్లీలో ఉన్న ఉన్న ఆమె భర్త ఫిలిప్ రిచర్డ్‌లు తనను మోసం, వంచన, వేధింపులకు గురిచేశారని, డబ్బు కోసం బెదిరింపులకు దిగారని దేవయాని ఢిల్లీ పోలీసులకు జూలైలోనే ఫిర్యాదు చేశారు. అంతకు ముందే సంగీత కనబడటం లేదని అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయబోతే ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు అవసరమని వారు కేసు నమోదు చేసుకోలేదు. అయితే సంగీత మన్‌హట్టన్ అటార్నీ కార్యాలయం నుంచి దేవయానితో చర్చలు జరిపి భారీ మొత్తం డబ్బు, సాధారణ వీసా ఇప్పించాలని డిమాండు చేశారని దేవయాని కథనం. అది సంగీత న్యాయవాది సమక్షంలోనే జరిగిన వ్యవహారం. ఆ చర్చలు విఫలం కావడంతో దేవయానిపై విదేశీ కోర్టుల్లో కేసులు దాఖలు చేయరాదని ఢిల్లీ న్యాయస్థానం సంగీతకు ఆదేశాలను జారీ చేసింది. నవంబర్‌లో ఫిలిప్ అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇచ్చింది. ఇవన్నీ తెలిసి తెలిసి అమెరికా విదేశాంగ శాఖ సంగీత నుంచి దేవయానిపై ఫిర్యాదును స్వీకరించి కోర్టు ధిక్కారానికి పాల్పడింది. అంతకు మించి హాలివుడ్ తరహాలో ‘ఆపరేషన్ దేవయాని’ని చేపట్టింది. సంగీత కేసులో సాక్షిగా నిలబెట్టడానికి నిందితుడ్ని గుట్టుచప్పుడు కాకుండా అమెరికాకు తరలించింది. అందుకోసం అమెరికా రాయబార కార్యాలయం చేత స్వదేశంలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్న ఫిలిప్‌కు, వారి పిల్లలకు వీసాలు జారీ చేసింది. ఇది మన న్యాయ వ్యవస్థనే కాదు, ప్రభుత్వాన్నే వంచించడం అతి పెద్ద నేరం. ఆ వెంటనే నాటకీయంగా దేవయానిని అక్కడ అరెస్టు చేసి, అవమానించారు. భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంగా చెప్పుకుంటున్న అమెరికా మన కు ఇస్తున్న విలువ ఇది. ఇలాంటి దేశ దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ప్రత్యేకమైన హక్కులను, మర్యాదలను అందించి అడుగులకు మడుగులు ఒత్తుతున్నాం. నిజానికి అలాంటి విశేష హక్కులను కల్పించడమంటేనే భారత్, అమెరికాతో సమానమైన హోదా గల దేశం కాదని అంగీకరించడం. కాబట్టే అది మన ‘స్థానం’ మనకు చూపింది. బోనెక్కాల్సింది ఎవరు? అమెరికా దురహంకార పూరితమైన దౌత్య నేరాలు, కోర్టు ధిక్కారాలతో పోలిస్తే దేవయానిపై ఉన్న వీసా మోసం, కనీస వేతనాల చట్టం ఉల్లంఘనలు అసలు లెక్కలోకి వచ్చేవేనా? సంగీత వీసా కోసం దేవయాని అమెరికా కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా ఒక తప్పుడు ఒప్పంద పత్రాన్ని సమర్పించినట్టు స్పష్టం అవుతోంది. ఆ ఒప్పం దంలో పేర్కొన్న దాని కంటే చాలా తక్కువకే (నెలకు రూ. 30 వేలు) ఆమె సంగీతతో నిజమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ నేరానికి దేవయానిని అరెస్టు చేసేట్టయితే అంతకంటే ముందు మన విదేశాంగ శాఖను అరెస్టు చేయాలి. అమెరికా కనీస వేతనాల చట్టం ప్రకారం పనిమనుషులకు వేతనాలను చెల్లించాలంటే వర్థమాన దేశాల దౌత్యవేత్తలలో అత్యధికుల జీతాలు మొత్తం సరిపోవు. కనీస వేతనం చెల్లించలేనంత తక్కువ వేతనాలను దౌత్యవేత్తలకు చెల్లిస్తున్నందుకు భరారా భారత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు. ఇదేదో తెలియని విషయం కాదు కూడా. దేవయానికి ముందు సైతం మరో ముగ్గురు భారత అధికారులు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుని ఎలా బయటపడ్డారో ఊహించడం కష్టం కాదు. 2008లో వివిధ వెనుకబడిన దేశాలకు చెందిన 42 మంది దౌత్యవేత్తలపై ఇలాంటి కేసులను బనాయించే ప్రయత్నం చేసింది. ఎందుకో పాకిస్థాన్‌లో ఇద్దరు పౌరులను చంపిన సీఐఏ కాంట్రాక్టర్ రేమండ్ డేవిస్ ఉదంతం చెబుతుంది. అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడే డేవిస్ తమ దౌత్యవేత్త అని వకాలతు పుచ్చుకున్నారు. అమెరికా దౌత్య అధికారులకు సీఐఏ అధికారులకు మధ్యన వ్యత్యాసం పెద్దగా లేదు. లిబియా, సిరియా ‘విప్లవాల్లో’ దౌత్యకార్యాలయాలు సీఐఏ హెడ్‌క్వార్టర్స్‌గా బహిరంగంగానే పనిచేశాయి. దౌత్యవేత్తలంతా ఏ దేశంలో ఉన్నా ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ సేకరణ కూడా చేయాలని అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాలను వికీలీక్స్ రెండేళ్ల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్ని దేశాల దౌత్యవేత్తలతోనూ ‘సంబంధాలను’ పెంచుకొని ఇన్ఫార్మర్లను తయారు చేసుకోవడం సీఐఏకు అలవాటు. అలా పుట్టుకొచ్చిందే విదేశీ దౌత్యవేత్తల పనిమనుషుల వేతనాలు స్థితిగతులపై నిఘా. లేకపోతే మిత్ర ప్రభుత్వాలను తమ దేశంలో జరుగుతున్న చట్టాల ఉల్లంఘనల గురించి హెచ్చరించి ఉండేది. దేవయాని అరెస్టుకు సరిగ్గా వారం ముందు న్యూయార్క్‌లో రష్యా కాస్సులేట్ ఆధికారులు 45 మంది ఇన్సూరెన్స్ మోసంలో ఇరుక్కోగా... వారితో మెతకగా వ్యవహరించాలని విదేశాంగశాఖ అదేశించింది. రష్యా ప్రత్యర్థి కాగా, మనం అలుసుగా దొరికిన మిత్రులం! చట్టవిరుద్ధ విదేశీయుల అమెరికా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 1.17 కోట్లు. ఇలాంటి కార్మికుల శ్రమపైనే ఆధారపడ్డ దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ అలబామా, జార్జియా, ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో వారి పరిస్థితులు 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో నేడు అలాగే ఉన్నాయి. ప్లోరిడాలో 5 లక్షల మంది ఏడెళ్ల లోపు పిల్లలు పంటపొలాల్లో తోటల్లో రోజుకు ఏడు నుంచి పది గంటల వరకు పనిచేస్తున్న వైనం ఇటీవల అక్కడి టీవీల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఆరు లక్షల మంది మైక్సికన్లలోఏ 52 శాతం అక్రమంగా వలస వచ్చినవారే. అలాంటి వారికి అతి తక్కువ వేతనాలేగాక, పని పరిస్థితులు దుర్భరం. వారిపై ఎలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినా అడిగేవారు లేరు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కు పంపేస్తారని భయంతో వారు నోరెత్తరు. అలాంటి అక్రమ విదేశీయుల వెట్టి వల్లనే అమెరికాలో ఆహార పదార్థాల ధరలు అందుబాటులో ఉన్నాయనేది బహిరంగరహస్యం. సంగీత గోడు పట్టిన అమెరికాకు తమ దేశంలోని కోటి మంది వెట్టి వారిగోడు వినిపించకపోడంలో ఆశ్చర్యంలేదు. -
లౌక్యవాద మతతత్వం!
విశ్లేషణ పిళ్లా వెంకటేశ్వరరావు ‘జీవించడమంటే భయపడటాన్ని వెన్నంటే మరణించడమంటే భయం పుట్టుకొస్తుంది’ (మార్క్ టై్వన్). కాంగ్రెస్‌ను ప్రస్తుతం రెండో భయం వెంటాడుతోంది. దురదృష్టంలో అదృష్టంలాగా ఢిల్లీ జాదూగర్ కేజ్రీవాల్ దుమారంలో పడి కాంగ్రెస్ మృత్యుకళకు అంత ప్రాధాన్యం లభించడం లేదు. ఎన్నికలకు ముందు వరకు జాతీయ వార్తల్లో ప్రధాన వ్యక్తిగా నిలిచిన నరేంద్రమోడీని అతి చిన్న రాష్ట్రమైన ఢిల్లీ హీరో వెనక్కు నెట్టేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనే కాదు ఢిల్లీలో సైతం మోడీ హవా కనిపించిందని బీజేపీ ఢంకా బజాయిస్తుంటే, కాంగ్రెస్ అది మోడీ గాలి కానే కాదని వాదిస్తోంది. జాతీయ మీడియాలో ఇప్పుడు వీస్తున్నది మాత్రం కేజ్రీవాల్ గాలే. ఆ గాలిలో పడి కొట్టుకుపోయే కంటే మధ్యప్రదేశ్ ఫలితాల నుంచి ప్రారంభిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీల గీత ఎలా ఉండబోతోందో అర్థంకావచ్చు. ఎంపీలో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నందున అధికారపార్టీ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ కొండంత ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్ ఓడిపోవడంలో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అక్కడ గతం కంటే గణనీయంగా ఎక్కువ సీట్లను తెచ్చుకోగలిగింది. ఇది ఆ పార్టీకి ఢిల్లీ, రాజస్థాన్లతో పోల్చదగిన పరాభవం. ఎంపీలో బీజేపీ ఘన విజయాన్ని మోడీకి అంటగ ట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయి ఉంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని ఉండేవారమని స్థానిక నేతలు దృఢంగా చెబుతుండటం విశేషం, అలాంటి ఆశ్చర్యకర పరిణామమే మరొకటి కూడా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 7 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లలో 70 శాతానికిపైగా సంప్రదాయకంగా కాంగ్రెస్‌కు ఓటు చేసేవారు. ముస్లింలకు అది కేటాయించిన 8 స్థానాల్లో ఈసారి కాంగ్రెస్‌కు దక్కింది ఒక్కటే. ముస్లింలలో 60 శాతం మంది బీజేపీకి ఓటు చేశారు! ఎంపీకి భిన్నంగా ముక్కోణపు పోటీ జరిగిన ఢిల్లీలో ముస్లిం నేతలు బహిరంగంగానే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ 70 శాతం ముస్లిం ఓట్లను కోల్పోయింది. ప్రముఖ ముస్లిం పండితుడు ముఫ్తి ఆర్షద్ ఖ్వాస్మి ‘‘లౌకిక ప్రభుత్వాలుగా చెప్పుకునేవారు ముస్లింలు ఎక్కడికిపోతారు? అని అనుకుంటున్నారు. మోడీ పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టి వాళ్లకు ఓటు చేసేలా ఇక చేయలేరు. ఢిల్లీలో నమూనా రుచి చూపించాం అంతే’’ అని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ మోడీ అనుకూల వ్యాఖ్యలుగా ప్రచారం చేసుకుంటోంది. కానీ ముస్లింలలో మోడీపట్ల వ్యతిరేకత అంతరించిపోలేదు. ముస్లిం నేతలు కాంగ్రెస్, బీజేపీలను ఓడించమని పిలుపునిచ్చి, ఆమ్ ఆద్మీని గెలిపించమని చెప్పకనే చెప్పారు. ఢిల్లీ ముస్లింల వైఖరిని స్థానిక కారణాలతో వివరించడం పొరబాటు. గతంలో ముస్లింలు బీజేపీని ఎవరు ఓడించగలిగితే వారికే వ్యూహాత్మకంగా ఓటు చేసేవారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయాలున్న ప్రతి చోటా వారిద్దరికీ వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ఓటు చేస్తారని చెప్పవచ్చు. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్‌కో లేక ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్కో కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఈ పరిణామాన్ని గుర్తించారు కాబట్టే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్‌తో పొత్తు చర్చలకు స్వస్తి పలకాలని ఆరాటపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖీ పోటీలు నెలకొన్న చోట్ల ప్రాంతీయ, స్థానిక పరిస్థితుల మీద ఆధారపడి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయించుకునే అవకాశాలు ఎక్కువ. కనీసం యూపీ, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల వరకైనా ఈ వ్యూహాత్మక ఓటింగ్ తప్పదనే చెప్పొచ్చు. 540 లోక్‌సభ స్థానాల్లో 150 నియోజక వర్గాల్లో ముస్లింలు కేంద్రీకృతమై ఉండి గెలుపు ఓటములను నిర్ణయించే స్థానంలో ఉన్నారు. ఎంపీలో చౌహాన్ సంక్షేమ పథకాలే ఆయనకు ముడో దఫా పట్టం గట్టాయనేది తిరుగులేని వాస్తవం. కాంగ్రెస్‌వి మైనారిటీలను బుజ్జగించే ఓటుబ్యాంకు రాజకీయాలని తిట్టిపోసే బీజేపీకి చెందిన ఆయన ప్రత్యేకించి ముస్లింల కోసం పలు సంక్షేమ పథకాలను, చర్యలను చేపట్టి వారి అనుకూల ఓటును సంపాదించారు! కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో సైతం ముస్లింలు దానికి ముఖం చాటేయడం విశేషం. కాంగ్రెస్ 16 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దిం చగా ఒక్కరూ గెలవలేదు. బీజేపీ ముగ్గుర్ని నిలిపగా ఇద్దరు గెలిచారు! కాంగ్రెస్ ఓటమి ఊహించినదే. కానీ అది అక్కడ తుడిచి పెట్టుకు పోవడానికి కారణం మోడీ కాదు. జాట్లు కలిసికట్టుగా కాంగ్రెస్‌కు బద్ధవ్యతిరేకులుగా మారడమే అందుకు కారణం. ఎస్సీ, ఎస్టీలను సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంకులుగా పరిగణించలేని స్థితి ఏర్పడింది. 34 ఎస్సీ స్థానాల్లో ఒక్కటీ దానికి దక్కలేదు. 25 ఎస్సీ స్థానాల్లో 4 మాత్రమే దక్కాయి. మోడీ ప్రభావం ఏమైనా ఉంటే అది ఢిల్లీలో ఆమ్ ఆద్మీని అధికారానికి ఆమడ దూరంలో నిలిచేలా చేయడంలో మాత్రమే ఉంది. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసి సంఘ్ నాయకత్వం తప్పు చేసిందా? 1996లోఎల్కే ఆద్వానీకి బదులుగా ఏబీ వాజపేయిని ప్రధానిని చేయడానికి కినిసిన సంఘ్... నేడు ఆ ఆద్వానీని కాదని మోడీకి పట్టం గట్టడానికి సిద్ధం కావడంలోని మతలబే ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. 2002 గోధ్రా అల్లర్ల తదుపరి ముస్లింలు బీజేపీకి బద్ధ వ్యతిరేకులయ్యారు. కానీ 2012 గుజరాత్ ఎన్నికల్లో 25 శాతం ముస్లింలు మోడీకి ఓటు చేశారు! భయభీతావహులను చేసి ముస్లింలు చివరికి తమనే శరణుకోరేలా చేసుకునే ఎత్తుగడల్లో మోడీ సాధించిన ఘన విజయం ఇది. కాగా మతతత్వవాద ఎజెండాతో ఎదురుదెబ్బలు తింటున్న సంఘ్ మోడీలో పరిపాలనా దక్షుణ్ణి, అభివృద్ధి సాధకుడ్ని ‘కనుగొంది’. ఈ ప్రచారంతో అది గోధ్రాతో కోల్పోయిన హిందూ లౌకికవాద ఓటర్లను తిరిగి ఆకర్షించగలగడమే కాదు, పట్టణ మధ్యతరగతి విద్యావంతుల్లో మోడీని సమర్థుడైన పాలకునిగా చె ల్లుబాటు చేయగలుగుతోంది. ఆమ్ఆద్మీ సరిగ్గా ఇక్కడే ఢిల్లీలో బీజేపీని మట్టి కరిపించింది. మోడీ కర్ణాటక ఎన్నికల్లో పరిపాలన, అభివృద్ధి పాట పాడారు. ఢిల్లీ ఎన్నికల్లో సామరస్యాన్ని బోధిం చారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్‌పై కత్తి దూసారు. ఏ రోటికాడ ఆ పాటమోడీ, బీజేపీల నేటి వ్యూహం. కాబట్టే చౌహాన్ మైనారిటీల సంక్షేమ కర్త కాగలిగారు. ఇది నిజానికి సంఘ్ అలవరుచుకున్న రాజకీయ లౌక్యం. బీజేపీకి అది తయారు చేసిన లౌక్యవాద మతతత్వం టానిక్. ఇది సంఘ్ పరివార్ మౌలిక భావజాలానికి పొసగదనే సందేహం అక్కర్లేదు. కాషాయం రంగు వెలిసిపోతోందని లౌకికవాదులు సంతోషించాల్సింది ఏమీ లేదు. దాని మతతత్వం పదిలంగానే ఉంది. సామదానబేధ దండోపాయాలను అన్నిటినీ ఏకకాలంలో ప్రయోగించగల మోడీ ప్రస్తుతం ఆమ్ఆద్మీ డిల్లీలో అనుసంచిన ఎత్తుగడలను అమలుచేసే ప్రయత్నంలో ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో 90 వేల మంది 18-24 ఏళ్ల యువ ఓటర్లున్నారని లెక్కగట్టి వారిని నియోజకవర్గాల వారీగా ఆకర్షించే వ్యూహాలను స్థానిక నేతలతో కలిసి రచిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ జాదూను ప్రదర్శిస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ‘కేజ్రీ ఫ్యాక్టర్’ సార్వత్రిక ఎన్నికలపై ఎలా ఉండబోతోం దంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఢిల్లీ ఫలితాలు మధ్యతరగతి, విద్యావంతులు కీలకపాత్ర ధారులుగా ఉన్న ఒక మహానగరానికి సంబంధించినవనే విషయం కీలకమైనది. రానున్న ఐదు మాసాల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం అసాధ్యం. అంతకు మించి పట్టణ ప్రజలను దాటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ప్రత్యామ్నాయంగా నిలవడం అంతకంటే అసాధ్యం. పైగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయాలుగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోవడం తేలికేం కాదు. రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక, నిర్ణయాత్మక శక్తులు కానున్నాయనే అంచనాను మార్చుకోవాల్సిన స్థాయిలో ‘కేజ్రీ ఫ్యాక్టర్’ పనిచేసే అవకాశం లేదనే చెప్పాలి. అయితే పట్టణ మధ్యతరగతి యువత, విద్యావంతులు రాజకీయాల పట్ల, సామాజిక సమస్యల పట్ల ఆసక్తిలేని వారనే భ్రమలను ఆమ్ఆద్మీ పటాపంచలు చేసింది. ఢిల్లీలో ఇటీవలే సాగిన రెండు గొప్ప ప్రజా ఉద్యమ కెరటాలపై నుంచి ఎదిగి వచ్చిన ఆ పార్టీ చట్టధిక్కారానికి పాల్పడి మరీ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలపై ఆందోళనలు సాగించి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక ఎజెండాతో ప్రారంభమైన ఆమ్ఆద్మీ... సామాన్యుని వెతలను తీర్చగల ఆర్థిక సామాజిక కార్యక్రమాన్ని రూపొందించుకొని, సమైక్యంగా నిలిస్తే 2019 ఎన్నికల నాటికి ఒక నిర్ణయాత్మక శక్తి కాగలుగుతుంది. ఇప్పటికైతే ప్రజల దైనందిన సమస్యలకు పరిష్కారాలను దాటవేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లు ఆడుతున్న నాటకం ముగిశాక జరిగే కూడికలు తీసివేతల ప్రహసనాన్ని చూడక తప్పదనే అనుకోవాలి. కాంగ్రెస్ ఓడిందేగానీ బీజేపీ గెలుపునకు చాలా దూరంలో ఉంది. ఆ లోగా ఏమైనా జరగవచ్చు. -
ఓటమి కూడా గెలుపే కదా!
మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియాలో ఒక ధోరణిగానే బలపడుతోంది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది. అపురూపమైన పగడపు దిబ్బల దేశం మాల్దీవులు చరి త్రగా మిగలనుంది. భూతాప ప్రకోపానికి సముద్ర మట్టా లు పెరుగుతుండటం వల్ల జలసమాధి కానున్న ద్వీప దేశాల్లో అది ముందు వరుసలో ఉంది. రెండు రోజుల క్రితం వార్సాలో ముగిసిన వాతావారణ మార్పుల అంతర్జాతీయ సదస్సుకు దాని గోడు వినిపించలేదు. కానీ ఈ నెల 16న జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మన విదేశాంగశాఖకు ‘ప్రజాస్వామ్య’ విజయం కనిపించింది. మాల్దీవులు ‘మార్పు’నకు పట్టం గట్టిందని మన జాతీయ మీడియాకు తోచింది. లండన్ నుంచి వెలువడే ‘టెలి గ్రాఫ్’ పత్రికకు మాత్రం... సెప్టెంబర్ 7 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించిన (47 శాతం ఓట్లు) మాజీ అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ ‘గెలుపును సుప్రీంకోర్టు దురాక్రమిం చింది’ అని అది రాసింది. అత్యంత నిష్పాక్షికంగా, అవకతవకలకు తావులేని విధంగా జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను కొట్టి పారేసింది. వాయిదాల మీద వాయిదాలతో సెప్టెంబర్ 28న జరగాల్సిన రెండో రౌండు ఎన్నికలతో ఎట్టకేలకు ఈ వ్యవహారం 16న కొలిక్కి వచ్చింది. మనం మరచినంత తేలిగ్గా ఆ పత్రిక... ఈ రద్దుల, వాయిదాల చరిత్రను మరచిపోలేక పోయినట్టుంది. గత ఫిబ్రవరిలో మొహ్మద్ వహీద్ హస్సన్ అకారణంగా సైన్యం సహాయంతో మొట్టమొదటి ప్రజాస్వామిక అధ్యక్షుడు నషీద్‌తో బలవంతంగా రాజీనామా చేయించి స్వయంగా అధ్యక్షుడయ్యాడు. నషీద్‌తో పాటూ భారత్‌సహా ప్రపంచ దేశాలన్నీ తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని కోరాయి. 2013 జూలైలో ఎన్నికలను నిర్వహిస్తానన్న వహీద్ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. నవంబర్ 9న తిరిగి జరిపిన ఓటింగ్‌లో సెప్టెంబర్ ఫలితాలే పునరావృతమయ్యాయి. ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లకు మించలేదు. మరో వాయిదాతో 16న జరిగిన రెండో రౌండు ముఖాముఖి ఎన్నికలో యమీన్ 51 శాతం ఓట్లతో గెలిచాననిపించుకోగలిగారు. సుప్రీంకోర్టు పాత్రధారిగా కొట్టివేత, సాగదీతలతో వహీద్‌ను ముందుంచి సైన్యం ఆడిన నాటకం రక్తికట్టింది. ఇంతకూ నషీద్‌ను ఓడించిన యమీన్ అబ్దుల్ గయూమ్ ఎవరు? మాల్దీవులను మూడు దశాబ్దాల పాటూ, 2008 వరకు నిరంకుశ నియంతృత్వానికి గురిచేసిన నియంత మహ్మద్ అబ్దుల్ గయూమ్‌కు తమ్ముడు, ఆయన పార్టీ పీపీఎం నేత. గయూం బంటు యమీన్ ప్రజాస్వామ్యవాదేననున్నా... గెలిచే అభ్యర్థి ఓడిపోయేంత వరకు ఎన్నికల ప్రక్రియను సాగదీయడం ఎలాంటి ప్రజాస్వామిక ప్రక్రియ? మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియా ప్రాం తంలో నేడు ఒక ధోరణిగానే బలపడుతోంది. శ్రీలంకలో అధ్యక్షుడు మహింద రాజపక్స ఒకవంక దేశాన్ని సైనికీకరణకు గురిచేస్తున్నారు. మరోవంక న్యాయవ్యవస్థను గుప్పి ట పెట్టుకుంటున్నారు. తానే నియమించిన ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించి మరీ అడ్డు తొలగిం చుకున్నారు. పాకిస్థాన్‌లో కూడా న్యాయవ్యవస్థకు సైన్యానికి మధ్యన ఇలాంటి అనుబంధం బలపడుతోంది. ఈ అపవిత్ర బంధానికి ఉన్న మరో కోణం... మత ఛాందసవాద ఉన్మాదం. మలుపులు తిరిగిన మాల్దీవుల ఎన్నికల కథను కంచికి చేర్చినది కూడా అదే. మూడో స్థానంలోని అభ్యర్థిగా నిలిచిన మాల్దీవుల కుబేరుడు అబ్దుల్ ఖాసీంకు అవి మద్దతు పలికాయి. రెండో రౌండ్లో మతోన్మాదశక్తులు గయూం సోదరునివైపు మొగ్గు చూపాయి. ఈ వాయిదాల కాలమంతా పీపీఎమ్ మతోన్మాద ఛాందసవాద శక్తులను బుజ్జగిస్తూనే గడిపింది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది. శ్రీలంక, మయన్మార్‌లలో బౌద్ధ మతోన్మాదం, పాక్, మాల్దీవుల్లో ఇస్లామిక్ మతోన్మాదం నిజమైన ప్రజాస్వామ్యానికి ఆ దేశాలను ఆమడ దూరంలో ఉంచడానికి హామీని కల్పించడానికి ప్రయత్నిస్తునాయి. నేడు ఎన్నికల ఆటలో ఓడిన నషీద్ దేశాధ్యక్షునిగా 2009లో విలక్షణమైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సముద్రం అట్టడుగున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు! మాల్దీవులను సముద్రం మింగేయబోతున్నవిషయాన్ని సముద్రంలో మునిగి చెపితేనన్నా అంతర్జాతీయ సమాజానికి పడుతుందేమోనని ఆశించారు. పట్టలేదు. నేడు మాల్దీవుల ప్రజాస్వామ్యం గంగలో కలుస్తున్నా ఎవరికీ పట్టదు. యమీన్‌తో సత్సంబంధాలకోసం తాపత్రయం తప్ప మనకు మరేమీ పట్టదు గాక పట్టదు. చైనా బూచి మనకు నిద్ర పట్టనీయదు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
చిదంబర పలుకులు
రోజూ చచ్చేవాడి కోసం ఏడ్చేవాడు ఎవడు అన్నట్టు... ఏళ్ల తరబడి అనునిత్యం అనుభవించక తప్పని శిక్షగా మారిన ధరల పరుగు పందేన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. అందుకేనేమో పట్టించుకోవాల్సిన వారు ఎట్టకేలకు పెదవి విరిచి ‘చిదంబర’ రహస్యాన్ని విడమరిచారు. చిల్లర ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం కాదు కదా, వాటి పరుగు జోరుకు కళ్లెం వేయడం కూడా తమ వల్ల కాదని, ఆ మాట కొస్తే ఎవరి వల్లా కాదని ఆర్థిక మంత్రి చిదంబరం గురువారం తేల్చేసారు. వినియోగదారుల ధరల సూచీపై ఆధారపడి లెక్కగట్టే రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అంతకు ముందటి మాసంతో పోలిస్తే 10.09 శాతం పెరిగింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 7 శాతం పెరి గింది. ఈ ఒక్క నెల్లోనే కాదు గత ఐదేళ్లుగా నెలకు 10 శాతం ఎక్కువ ధరలు చెల్లించి ప్రజలు నిత్యజీవితావర వస్తువులను కొసుక్కోవాల్సి వస్తోంది. ధరలతో పాటూ పరుగు తీసి ఎంత ధరంటే అంతా చెల్లించి చస్తున్నారు. చెల్లించనే లేని వాళ్లు కొనుక్కోలేక చస్తున్నారు. ఎవరికి ఏ చావు రాసి పెట్టి ఉంటే అదే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి మన ప్రధాని మన్మోహన్సింగ్ వరకు అంతా మనలాంటి వర్థమాన దేశాల ప్రజలు ఆదాయాలు పెరిగి, తెగ తినడమే ఆహార ధర ల పెరుగుదలకు కారణమని తేల్చారు. మనసులోని మాట పైకి చెప్పకూడని ఎన్నికల కాలం కాబట్టో ఏమో చిదంబరం ఆ మాట అనలేదు. కానీ ఆహార ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని చెప్పుకొచ్చారు. ఇక విశ్లేషకులంతా ఉల్లి, కూరగాయల ధరలదే ఈ పాపమంతా అని నిర్ధారించారు. కూరగాయల ధరలు అసాధారణంగా 45.67 శాతం పెరిగిన మాట నిజమే. మరి తిండిగింజలు గత నెల కంటే 12.01 శాతం ఎందుకు పెరిగినట్టు? ముద్దంటూ ఉంటేగా నంజుకోడానికి కూర ముక్క కావాల్సింది? గంజి కాసుకోడానికైనా ఇన్ని గింజలుండాలే? పళ్లు ఇప్పటికే ధనవంతుల విలాసంగా మారి వెక్కిరిస్తున్నాయి. కూరగాయలు వాటి పక్కకే రెక్కలు కట్టుకు పోతున్నాయి. ఇది పట్టదా? అని అడగడానికి లేకుండా చిల్లర ధరల పెరుగుదల జోరు తగ్గించడం తేలికేమీ కాదని, ఆ మాటకొస్తే అసలు ఇప్పట్లో సాధ్యం కాదనేది చిదంబరం చెప్పిన రహస్యం. మరో ఐదేళ్లో, పదేళ్లో సామాన్యుల అరికాళ్ల కింద మంటలు భగభగ మండుతూనే ఉంటాయని ఆయన తేల్చేసారు. ఆ మంటలు ఆర్పే ఫైరింజన్లు మోడీ దగ్గర కూడా లేవని చెప్పకుండానే అర్థమై పోయేలా అసలు సంగతి కూడా చెప్పారు. ఆహార పదార్థాల గిరాకీతో పోలిస్తే సరఫరా తక్కువగా ఉండటమే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కార ణమని, కాబట్టి అది తగ్గాలంటే ఉత్పత్తిని పెంచడమే పరిష్కారమని సెలవిచ్చారు. సరఫరా పెరగడానికి ‘పెద్ద ఎత్తున పెట్టుబడులు, మదుపులు, ఉత్పత్తి, సరఫరా సదుపాయాలు వగైరా’ అవవసరమని అన్నారు. నిజమే ఉత్పత్తి పెరగనిదే సరఫరా పెరగదు. కానీ చిదంబరం చెబుతున్నట్టుగా ఉల్లి ధర రూ. 100, రూ.150 కి చేరడానికి కారణం సరఫరా తగ్గడమేనా? తగ్గిన సరఫరాతో పోలిస్తే ధర పది రెట్లకు పైగా ఎందుకు పెరిగింది? నిన్నిటి ఉల్లి సరే ఇప్పుడు బీహార్, పశ్చిమబెంగాల్లో పలు ప్రాంతాల్లో ఉప్పును రూ. 100 నుంచి 150లకు అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నవారి సంగతేమిటి? దొంగ నిల్వదారులే, వ్యాపారులే ఏలికలకు రాజపోషకులనేది బహిరంగ రహస్యమే కాబట్టి ఈ ఎన్నికల విరాళాల కాలంలో వారు అసలే కనబడకపోవడం ‘న్యాయమే’. ఏదేమైతేనేం, అధిక ధరల గుదిబండ దించడానికి మనకు చిదంబరం దీర్ఘకాలిక పరిష్కారం చూపారు. అందుకోసమే చిందంబరం ఇప్పటికే ఇచ్చిన సంస్కరణల డోసులతోనూ, విదేశీ బ్యాంకుల రాకతోనూ, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతోనూ వచ్చిన విదేశీ పెట్టుబడులు ఉత్పత్తి రంగంలోకి పోలేదెందుకు? గత ఏడాది 1 శాతం నామాత్రపు వృద్ధిని సాధించిన పారిశ్రాకమిక రంగం ఆగస్టులో 0.5 శాతం వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకో ఆర్థిక మంత్రి చెప్పరు. దీపావళికి అమ్మకాలు లేక కళ తప్పిన అధిక ఆదాయ వర్గాల వినియోగవస్తు మార్కెట్లు చెబుతాయి. ఈ పండుగల సీజన్లో పేద వర్గాల్లాగే, అధిక ఆదాయవర్గాలను కూడా కొనుగోళ్లకు దూరంగా ఉంచినది ద్రవ్యోల్బణమేనని పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తేల్చి చెప్పింది. అది దాని లెక్కల్లో సిగరెట్లు, ఎల్పీజీ వ్యంట గ్యాస్ వంటి వస్తువులను కూడా అధిక ఆదాయవర్గాల వస్తువులుగా లెక్కించింది. అంటే మధ్యతరగతిలోని ఉన్నత వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరికీ నేడు ద్రవ్యోల్బణం సెగ తగులుతున్నదన్న మాటే. చిదంబరం చిలుక పలుకులు బాగున్నా, సార్వత్రిక ఎన్నికల వైతరణిని దాటించ లేవు. - పిళ్లా వెంకటేశ్వరరావు