చైనా ‘క్రీడ’... వియత్నాం విలవిల
ఉక్రెయన్‌లో రష్యా ‘తలనొప్పి’తో సతమతమవుతున్న ఒబామా ప్రభుత్వానికి ఇప్పట్లో ఆగ్నేయ ఆసియా మిత్రులకు ఇచ్చిన ‘అభయం’ గుర్తుకు రాదు. చైనాను ఏకాకిని చేసి చుట్టుముట్టే ‘ఆసియా వ్యూహాన్ని’ ఆచరణలో పెట్టగల సత్తా నేటి అమెరికా బలగాలకు లేదు.
కీలెరిగి వాత పెట్టడం సంగతేమోగానీ... ఒకరి కీలుకి వాత పెట్టి మరొక రికి చికిత్స చేసే శక్తి చైనాకే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం-చైనాల మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు ఆ ‘చికిత్స’లో భాగమే. ఈ నెల 7న చైనా తన భారీ చ మురు రిగ్గును (హెచ్‌వైఎస్‌వై 981) దాదాపు 60 నౌకల రక్షణతో దక్షిణ చైనా సముద్రంలోకి దించింది. వియత్నాం తన ‘ప్రత్యేక ఆర్థిక మండలం’గా (ఈఈజెడ్) పేర్కొంటున్న వివాదాస్పద ‘పార్సెల్ దీవుల’ ప్రాంతంలో తవ్వకం ప్రారంభించింది. రిగ్గుకు చుట్టూ మూడు మైళ్ల ప్రాంతాన్ని తమ ‘ప్ర త్యేక మండలం’గా ప్రకటించింది. ఆ పరిధిలోకి ప్రవేశించే వియత్నాం కోస్ట్‌గార్డ్ ఓడలపై వాటర్ కేనన్లను ప్రయోగిస్తోంది. దీంతో వియత్నాంలో చైనా వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.
నిజానికి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో సరిహద్దు వివాదాలున్న దేశాలలో వియత్నామే దానితో సహకరించే వైఖరితో వ్యవహరిస్తోంది. అందుకే ఈ హఠాత్పరిణామం పరిశీలకులకు ఒక పట్టాన మింగుడు పడటం లేదు. ఈనెల 6న... అంటే చైనా హెచ్‌వైఎస్‌వై 981ని రంగంలోకి దించడానికి సరిగ్గా ఒకరోజు ముందు... చైనాకు చెందిన ఒక చేపల మర పడవను ఫిలిప్పీన్స్ స్వాధీనం చేసుకుంది. ‘కలయాన్ దీవుల’పై చైనాతో వివాదంలో వున్న ఆ దేశాన్ని అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించారు. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటూ పొడిగించే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యవాదాన్ని సవాలు చేసే ఉద్దేశంతోనే ఫిలిప్పీన్స్ ఆ దేశం చేపల పడవను స్వాధీనం చేసుకుంది. అమెరికాతో అతిగా అంటకాగుతున్న ఫిలిప్పీన్స్‌కు ‘చికిత్స’ చేయడానికి చైనా అప్పటికే సిద్ధంగా ఉండటంతో వెంటనే రంగంలోకి దిగింది. సరిగ్గా ఏ కీలుకు వాత పెట్టాలో అక్కడే వాతపెట్టింది! వియత్నాంకు అమెరికాతోగానీ, జపాన్‌తోగానీ లాంఛనప్రాయంగా ఎలాంటి రక్షణ ఒప్పందమూ లేదు.
కాబట్టి తక్షణమే సైనిక సంఘర్షణకు దిగనవసరం లేదు. ఒకవేళ వియత్నాంతో చిన్నపాటి సంఘర్షణ అనివార్యమైనా 1945 నుంచి ఎలాంటి నిజ యుద్ధ అనుభవంలేని చైనా నావికా దళానికి అది చక్కటి అనుభవమే అవుతుంది. వియత్నాం తీరంలో ప్రస్తుతం చైనా రేకెత్తిస్తున్న ఉద్రిక్తతలు అంతకు ముందు తలెత్తిన ఉద్రిక్తతలకు భిన్నమైనవి. చైనా... వియత్నాం తనదిగా పేర్కొన్న ప్రాంతంలోకి ప్రవేశించడమే కాదు, ఆర్థిక, వాణి జ్యపరంగా ఆ ప్రాంతాన్ని వాడుకుంటానని చాటింది. తద్వారా ఆ ప్రాంతంలో తనకు సరిహద్దు వివాదాలున్న వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, బ్రూనీలకు.... తనను నిలవరించే శక్తి ఏదీ లేదని ఒకేసారి హెచ్చరికను పంపింది. అమెరికా వైపు చూపులు మాని అవి తనతో నెయ్యం నెరపాలని అంతరార్థం. లేకపోతే వంద కోట్ల డాలర్ల ఖరీదైన ‘హెచ్‌వైఎస్‌వై 981’ తదుపరి మజిలీ ఫిలిప్పీన్స్ తీరంలోని కలయాన్ దీవులేనని పరమార్థం.
ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు సవివరంగా నివేదిస్తున్న అంతర్జాతీయ మీడియాకున్న ‘అమాయత్వం’ ఫిలి ప్పీన్స్‌కు లేదు. అందుకే అది బెంబేలెత్తి అమెరికాకు విన్నపాలు పంపుతోంది. ఖండనలకు మించి శ్వేతసౌధం చేయగలిగేది ఏదీ లేదని చైనాకు తెలుసు. ఉక్రెయిన్‌లో తలదూర్చి ‘రష్యా తలనొప్పి’తో సతమతమవుతున్న ఒబామా ప్రభుత్వానికి... ఇప్పట్లో ఆగ్నేయ ఆసియా మిత్రులకు తాను అభయ హస్తం ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చే అవకాశం లేదు. అమెరికా గత రెండేళ్లుగా ‘ఆసియా వ్యూహం’ పేరిట చైనాను ఏకాకిని చేసి చుట్టుముట్టే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టగల సత్తా నేటి అమెరికా బలగాలకు లేదు. ‘‘మనకు ఆ సమష్టి రక్షణ వ్యూహాన్ని అమలుచేయడానికి తగిన ంత నావికా బలగం, మానవ బలగం ఉన్నాయా?’’ అని అమెరికా నౌకా దళ ఉన్నతాధికారి జనరల్ జాన్ పాక్స్‌టన్ ప్రశ్నించారు. చైనాతో సయో ధ్యే మేలనుకునే ఒబామా తదుపరి అమెరికా అధ్యక్షుల హయాంలో అది సాధ్యం కావచ్చు. ఆ వచ్చే కొత్త అధ్యక్షులు అమెరికా ‘ఆసియా వ్యూహ’ కర్త మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటనే కావచ్చని చైనా సరిగ్గానే అంచనా వేస్తోంది. హిల్లరీ అధ్యక్ష పదవి చేపట్టేటప్పటికే ఆమె ‘ముద్దు బిడ్డ’ అసియా వ్యూహాన్ని నిష్ఫలం చేయాలని భావిస్తోంది. పదేళ్లుగా అమెరికాతో సాగిస్తున్న శాంతియుత పరస్పర సహకార దశ ముగిసిపోయిందని ఇటు చైనా అటు పెంటగాన్ గుర్తించాయి. రానున్న సంఘర్షణాత్మక దశకు సన్నాహాలు చేయడానికి చైనాకు అమెరికా, రష్యాల మధ్య సరికొత్త ‘కోల్డ్‌వార్’కు మించిన శుభ ముహూర్తం మరేముంటుంది?
పిళ్లా వెంకటేశ్వరరావు