
కీవ్: మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా సహా అనేక యూరప్ దేశాలు తమకు మద్దతు తెలుపుతున్నందున యుద్ధానికి ఎంతో దూరంలో లేమని అన్నారు. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. మరో యుద్ధం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ముందే ఊహించారని చెప్పారు.
ఉక్రెయిన్ మొదటి ఆక్రమణలో జర్మనీ తన పాత్ర సరిగా పోషించలేదని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాతో యుద్ధంలో ఐరోపా దేశాల బలహీనతలను తాను కూడా అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కోసం పెద్ద ఎత్తున నిధులను సమీకరించే అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. ఉక్రెయిన్‌కు మద్దతు పోతుందా? అని ప్రశ్నించగా.. అమెరికా విధానం ఒక వ్యక్తితో ప్రభావితం కాబోదని అన్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతున్నాయి. అటు అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా విమానం కూలిన ఘటనలో 65 మంది మృతి చెందారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న క్రమంలో అమెరికా ఆర్థిక సహాయం తగ్గడంపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: Sudan: సూడాన్‌లో హింస.. 52 మంది మృతి!
Comments
Please login to add a commentAdd a comment