అంతర్జాతీయంగా ఒక అస్పష్ట వాతావరణం అలుముకున్న వేళ భారత్–రష్యాలు తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని ప్రతినబూనాయి. ఏటా జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం ఆ దేశంలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా తమ నమ్మదగిన మిత్ర దేశమని మరోసారి చాటారు. దాదాపు ఆరున్నర దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తలేదని అనలేం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై అమెరికా వైపు మొగ్గుచూపటం మొదలైనప్పటినుంచీ రష్యా కలవరపడుతోంది.
అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఏర్పడిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో మన భాగస్వామ్యం రష్యాకు ససేమిరా నచ్చలేదు. దాన్ని ‘ఆసియా–పసిఫిక్ వ్యూహం’గా సవరించి తనతో సహా ఆసియా దేశాలన్నిటికీ అందులో భాగస్వామ్యం కల్పించాలన్నది రష్యా డిమాండ్. అదే సమయంలో చైనాకు రష్యా సన్నిహితం కావటం, పాకిస్తాన్‌తో సైతం మైత్రి నెరపటం మన దేశాన్ని ఇబ్బందిపెట్టే అంశాలు. ఇక ఇటీవలిఅంతర్జాతీయ పరిణామాల్లో ఇరు దేశాలూ ఉత్తర దక్షిణ ధ్రువాలుగా వున్నాయి.
దౌత్య సంబంధాలుఎంతో సున్నితమైనవి. ఒక దేశంతో మనకు ఏర్పడే చెలిమి అంతవరకూ మనతో మిత్రత్వం నెరపుతున్న మరో దేశానికి సమస్యగా అనిపించవచ్చు. అనుమానాలు తలెత్తవచ్చు. ఆ రెండు దేశాలమధ్యా వుండే పొరపొచ్చాలే అందుకు కారణం. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చినప్పటినుంచీ రష్యా–అమెరికా సంబంధాల్లో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాతకాలంలో క్రిమియాను రష్యా దురాక్రమించాక అమెరికా మరింత ఆగ్రహించింది. ఆ దేశంతో ఎవరూ సన్నిహితంగా వుండరాదని కోరుకుంది.
ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచీ రష్యాపై అనేక ఆంక్షలు విధించి, పాశ్చాత్య దేశాలను కూడగట్టింది. మన దేశంపై కూడా ఒత్తిళ్లు తెస్తూనేవుంది. అయినా ద్వైపాక్షిక వాణిజ్యం 1,200 కోట్ల డాలర్ల నుంచి నిరుడు 5,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా యూరొప్ దేశాలకు ముడి చమురు అమ్మకం ఆగిపోయిన పర్యవసానంగా మన దేశానికి రష్యా చవగ్గా చమురు విక్రయించటంతో ఈ వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. మున్ముందు ఇది మరింత పెరుగుతుందని జైశంకర్ చెబు తున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధాన్ని మన దేశం వ్యతిరేకించినా బాహాటంగా రష్యాను విమర్శించలేదు. మన జాతీయ భద్రతా వ్యూహంలో రష్యా పాత్ర అత్యంత కీలకం. మొదటినుంచీ మన రక్షణ కొనుగోళ్లలో రష్యా వాటా అధికం. ఇప్పటికీ ఆయుధాల మరమ్మత్తు బాధ్యత రష్యాదే. ఇటీవలి కాలంలో అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి కొనుగోళ్లు పెరిగాయి. తన సలహాను బేఖాతరు చేసి రష్యానుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయటం అమె రికాకు నచ్చలేదు. ఇలా ఎన్ని ఒత్తిళ్లున్నా రెండు దేశాల బంధం సడలలేదు.
జైశంకర్ తాజా పర్యటనలో తమిళనాడులోని కూదంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా మరింత సాంకేతిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలయ్యాయి. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఇప్పటికే పనిచేస్తుండగా మరో నాలుగు మొదలుకావాల్సివుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించాల్సి వుంది. ఇదిగాక ఔషధాలు, వైద్య పరికరాలు వగైరాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. యూరేషియన్ ఎకనామిక్ జోన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించాలన్న రష్యా ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది.
సాధారణంగా వేరే దేశాల మంత్రులు పర్యటించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వారిని కలిసే సంప్రదాయం లేదు. కానీ దాన్ని పక్కనబెట్టి ఆయన జైశంకర్‌తో సమావేశం కావటం, తమ దేశంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపటం భారత్‌తో బంధానికి పుతిన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియబరుస్తోంది. అయితే సమస్యలున్నాయి. ముడి చమురు కొనుగోళ్లకు మన దేశం రూపాయల్లో చెల్లింపులు మొదలు పెట్టినా, దాని అస్థిరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, అందుకోసం అదనంగా చెల్లించాలనీ రష్యా చమురు సంస్థలు కోరుతున్నాయి. అదింకా పరిష్కారం కావలిసేవుంది.
దౌత్యం ఎంతో క్లిష్టమైనది. అవతలి పక్షంనుంచి కావలసినవి రాబట్టుకోవటం, అదే సమయంలో వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవటం కొన్ని సందర్భాల్లో తప్పనిసరి. కల్లోల సమయాల్లో మరింత చాకచక్యం తప్పనిసరి. వాస్తవానికి భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఇరు దేశాల అధినేతలూ హాజరు కావలసివుంది. 2000 సంవత్సరం నుంచి ఈ సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా 2020లో అసలు సమావేశమే జరగలేదు. ఉక్రెయిన్ యుద్ధంతోరెండేళ్లుగా మోదీ శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లలేదు. అయినా సరే ఈసారి కూడా జైశంకరే వెళ్లక తప్పలేదు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రష్యాకు ఒకప్పుడు మనం జూనియర్ భాగస్వామిగా వుండేవాళ్లం.
ఉదాహరణకు 1991 నాటికి రష్యా జీడీపీ 51.80 కోట్ల డాలర్లు కాగా, మన జీడీపీ 27 కోట్ల డాలర్లు. ఇప్పుడు రష్యా జీడీపీ 2 లక్షల 20 వేల కోట్ల డాలర్లయితే, మన జీడీపీ మొత్తం విలువ 3 లక్షల 60 వేల కోట్ల డాలర్లు. అయినా ఇరు దేశాల సంబంధాలూ యధాతథంగా వున్నాయి. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఏర్పడే చెలిమి ఎప్పటికీ చెక్కుచెదరదు. ఎన్నో అవాంతరాలనూ, కాలపరీక్షలనూ తట్టుకుని నిలబడిన భారత్–రష్యా సంబంధాలు మున్ముందు సైతం ఇదే రీతిలో కొనసాగుతాయని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment