అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి.
ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.
ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది.
క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు.
తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్‌లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం.
అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్‌లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?!
Comments
Please login to add a commentAdd a comment