‘ప్రచ్ఛన్నయుద్ధం’ నీడలో ఆఫ్రికా | africa battles the Cold War | Sakshi
Sakshi News home page

‘ప్రచ్ఛన్నయుద్ధం’ నీడలో ఆఫ్రికా

Published Fri, Aug 8 2014 12:24 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

‘ప్రచ్ఛన్నయుద్ధం’ నీడలో ఆఫ్రికా - Sakshi

‘ప్రచ్ఛన్నయుద్ధం’ నీడలో ఆఫ్రికా

ఆఫ్రికా ఖండంలో ఆమెరికా, చైనాల మధ్య సాగుతున్న సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం అంతగా వెలుగులోకి రావడం లేదు. వాణిజ్యం, దీర్ఘకాలిక పెట్టుబడుల బాటలో చైనా, అమెరికా మిత్ర దేశాలపై ప్రాబల్యాన్ని సాధిస్తోంది. అమెరికా తన పాత సైనిక వ్యూహాలతో, వాటి ఫలితమైన ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’లో మరింతగా కూరుకుపోతోంది.
 
ప్రపంచ యుద్ధాలకు కాలం చెల్లిపోయింది. 20వ శతాబ్దపు అనాగరిక ప్రపంచంలో ప్రపంచ శక్తులు తె లిసీతెలియక ఆడిన ఆటలవి. ఇది అత్యధునాతనమైన 21వ శతాబ్దం. యుద్ధం నాగరికతగా, ప్రపంచమే యుద్ధంగా, యుద్ధమే శాంతిగా మారిపోయాక యుద్ధ ప్రమాదం గురించి మాట్లాడటం అనుచితం, అసందర్భం. అఫ్ఘానిస్థాన్‌లోనో, ఇరాక్‌లోనో, సిరియాలోనో, ఉక్రెయిన్‌లోనో యుద్ధమో లేక అంతర్యుద్ధమో, కాదంటే ముసుగు యుద్ధమో జరుగుతోం దంటే... బ్రేక్ ఫాస్ట్‌కీ, కాఫీ కప్పుకీ మధ్య ఓ లుక్కు వేస్తే వేస్తామేమో. ఎవడి చావు ఎవడికి కావాలి? ఎవరికీ అక్కర్లేని చావులకు ఆఫ్రికా ఖండం ఎప్పటి నుంచో ప్రసిద్ధి. ప్రపంచంలోనే అతి పిన్న దేశం దక్షిణ సూడాన్ ‘చావు’ బ్రేకింగ్ న్యూస్‌గా కాదుగదా స్క్రోలింగ్‌గా కూడా కంట పడటం లేదు. అలాం టి దేశానికి సమాచార మంత్రి మైఖేల్ మకుయీ లూత్ ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఆఫ్రికా-అమెరికా శిఖరాగ్ర సదస్సుకు హాజరై ఏం చెబితే ఎవరికి కావాలి? ‘‘సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో మా దేశం మొట్ట మొదటి రణ రంగంగా మారుతోంది. మా దేశాన్ని నిలుపునా విచ్ఛిన్నం చేస్తున్న అంతర్యుద్ధం నిజానికి ప్రపంచ అగ్ర శక్తులు తమ బంట్లతో సాగిస్తున్న ప్రాక్సీ యుద్ధం.’’ లూత్ ప్రస్తావించినది. ఆఫ్రికాలోని అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం గురించి.

‘మంత్రసాని’ కడుపు మంట

దక్షిణ సూడాన్‌కు పురుడు పోసి, అస్తిత్వంలోకి తెచ్చిన మంత్రసాని అమెరికా. వందల కోట్ల డాలర్లు ధారపోసి తిరుగుబాటు దళాలను పోషించి ‘పురిటి ఖర్చును’ భరించినది అదే. ఆఫ్రికాలో మూడో అతి పెద్ద చమురు నిక్షేపాలున్న దేశం తన గనులను అప్పగించేస్తే సరిపుచ్చుకోవాలని భావించింది. అందుకు అనుమతించే ‘సొంత’ ప్రభుత్వం ఉండాలని కోరుకుంది. ఆ ఆశతోనే ఇంత చేసింది. అమెరికాయే పెంచి పోషించిన బిన్ లాడెన్‌కు సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్  కాసిన్ని రోజులు ఆశ్రయమిచ్చాడు. ఆ నెపంతో అమెరికా ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ ఆపరేషన్స్‌తో, దక్షిణ, ఉత్తర సూడాన్‌ల మధ్య చిచ్చును దావానలంగా మార్చి సూడాన్‌ను రెండు ముక్కలు చేసింది. నోట్లోని మాంసం ముక్కను డ్రాగన్ తన్నుకు పోతే ఊరుకుంటుందా? 1996 నుంచి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులను, చౌకగా సరుకులను గుమ్మరించడం ప్రారంభించిన చైనాను అమెరికా తక్కుగా అంచనా వేసింది. ఏదో ముడిపదార్ధాలు, ఖనిజాలకు కక్కుర్తిపడే చౌక వస్తు తయారీ బాపతేనని భావించింది. కానీ చాపకింది నీరులా అది సర్వాంతర్యామిగా విస్తరిస్తుందని ఊహించలేదు. చైనా ఇప్పుడు దక్షిణ సూడాన్ కు ప్రధాన వ్యాపార భాగస్వామి. అమెరికాను వెనక్కు నెట్టేసి ఆఫ్రికా ఖండానికే ప్రధాన భాగస్వామిగా మారిపోయింది. అధ్యక్షుడు సల్వా కీర్ ప్రభుత్వంతో చైనాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనొక్కరే ఏమిటి ఆఫ్రికాలోని ప్రభుత్వాధినేతలందరికీ చైనా అంటే ఎనలేని ప్రేమ. అమెరికాలాగా అది అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అప్పటికి  ఏ ప్రభుత్వం ఉంటే అదే దాని ప్రభుత్వం! రాజకీయాలకు అతీతమైన నికార్సయిన ఆర్థిక, వ్యాపార బంధాల దారి. 2000లో ఆఫ్రికాతో 1,000 కోట్ల డాలర్లున్న చైనా వాణిజ్యం నేడు అమెరికాకు రెండు రెట్లకు అంటే 20,000 కోట్ల డాలర్లకు చేరిందంటే ఊరికే కాదు. సహజంగానే దక్షిణ సూడాన్ చమురు నిక్షేపాలపైనా చైనా పట్టు బిగుస్తోంది. ఇదంతా చూస్తూ సహించేదెలా? సల్వా కీర్‌ను కూలదోయడం కోసం తెగల తిరుగుబాటుదార్లకు ఆయుధాలిచ్చి అమెరికా చిచ్చు రేపింది. గత రెండేళ్లలో పది వేల మంది బలైనా, లెక్కలేనంత మంది అత్యాచారాలకు గురైనా, 15 లక్షల మంది నిర్వాసితులైనా దానికి పట్టదు. ప్రధాన చమురు సంస్థల్లో 40 నుంచి 70 శాతం వాటాలను చేజిక్కించుకున్న చైనా సంస్థలు తాజాగా కీర్ ప్రభుత్వానికి 100 కోట్ల డాలర్ల రుణాన్ని అందజేశాయి. ‘అర్ధరహితమైన ఈ యుద్ధం కోసం మేం మా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టేస్తున్నాం’ అని స్థానిక పరిశోధకుడొకరు వాపోయారు.

అంతా చైనీయం

ఇథియోపియా నేడు ‘చైనా ఇథియోపియా’! ప్రపంచ వస్తు తయారీ సూపర్ పవర్ చైనా ఇటీవలి కాలంలో ఆ దేశాన్ని అతి పెద్ద వస్తు తయారీ కేంద్రంగా మార్చేస్తోంది. గత ఏడాదిలోనే ఆ దేశానికి చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 3.4 రెట్లు పెరిగి దాదాపు 100 కోట్ల డాలర్లకు చేరాయి. అవి మన దేశంలోకి ప్రవేశిస్తున్న స్వల్పకాలిక పెట్టుబడులు కావు. నేరుగా పారిశ్రామిక రంగంలోకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి దీర్ఘకాలిక పెట్టుబడులుగా చేరేవి. ఫలితంగా రెండేళ్లలో చైనా తూర్పు ఆఫ్రికా దేశాల్లో 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇథియోపియా, కెన్యా, లెసాతో, రువాండా, సెనెగల్, టాంజానియా తదితర దేశాల్లో చైనా వస్తు తయారీ వివ్లవాన్ని సృష్టించబోతోందని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికశాస్త్రవేత్త జస్టిన్ లిన్ యీఫూ తెలిపారు. ‘ఇథియోపియా సరిగ్గా 30 ఏళ్ల క్రితంనాటి చైనా లాగా ఉంది. సగటు వేతనాలు నెలకు 40 డాలర్లు (రూ. 2,600). ఇప్పటికే ఆఫ్రికాను చౌక వస్తువులతో ముంచెత్తుతున్న చైనా లోటెక్ వస్తు తయారీతో ఆఫ్రికానే చైనాగా మార్చేయబోతోంది’ అని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిబోరా బ్రాటిగామ్ అన్నారు. రాబోయే ఐదేళ్లలో కూడా చైనా వ్యాపార ఆధిపత్యానికి తిరుగులేదని అంచ నా. కాదనలేని విధంగా చైనా ఇటీవలే వివిధ దేశాలతో 40,000 కోట్ల డాలర్ల విలువైన నిర్మాణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటికే ఆఫ్రికాలో అది 2,200 మైళ్ల రైలు రోడ్లు, 1,400 మైళ్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది.

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ ఊబిలో అమెరికా

చైనా ఆఫ్రికాను గొప్ప అవకాశాల గనిగా చూసి పాతుకుపోతుంటే అమెరికా తన సైనిక దృక్పథంతో పీక లోతు వరకు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధాల్లో కూరుకుపోయింది. కల్నల్ గఢాఫీని హతమార్చి, లిబియాను బుగ్గిచేసి ‘ప్రజాస్వా మ్యాన్ని’ స్థాపించింది. ఆ ప్రజాస్వామ్యం భగ్గున దేశాన్ని మండించేస్తోంది. ఆ ధాటికి తట్టుకోలేక రాజధాని ట్రిపోలీలో నుంచి సైతం అమెరికా దౌత్య సిబ్బంది పలాయన మంత్రం పఠించాల్సి వచ్చింది. ఆఫ్రికా నుండి చేసుకునే చమురు దిగుమతుల్లో 70 శాతం కోసం లిబియాపై ఆధారపడిన చైనాకు ‘లిబియా విప్లవం’ వల్ల 2,000 కోట్ల నష్టం వాటిల్లింది. గడాఫీ కూలదోసివేతకు కారణాల్లో ఒకటి... చైనా ప్రాబల్యానికి అడ్డు కట్టవేయడం. లిబియాపై దాడికి అమెరికా దాని మిత్ర దేశాలు చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. గడాఫీ వ్యతిరేక యుద్ధం కోసం వారు అన్ని తెగలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చారు. కేంద్ర అధికారం కూలిపోయాక ఆ తెగలన్నీ ‘ప్రజాస్వామ్యాన్ని’ ధిక్కరిస్తున్నాయి. లిబియా యుద్ధంలో కీలక పాత్ర వహించిన ట్యు రెగ్ తెగలు అత్యాధునిక ఆయుధాలతో మాలీ, చాద్, నైజీరియా, బుర్కినా పోసో, ఘనా, గినియా, అల్జీరియాల్లో కూడా అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయి. మాలీలో అమెరికా సహాయంతో సైనిక జోక్యానికి దిగిన ఫ్రాన్స్ అక్కడి నుండి బయటపడే పరిస్థితి లేదు. సోమాలియాలో 2006లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఇస్లామిక్ కోర్ట్ యూనియన్ (ఐసీయూ) ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా  2007లో కూల్చింది. అందుకోసం ఇథియోపియా, కెన్యాలను సోమాలియాపై యుద్ధానికి దించింది. ఫలితంగా ఐసీయూ చీలిపోయి అల్ షబాబ్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని పెంపొందించుకుంది. అది ఇథియోపియా, కెన్యా, ఉగాండా తదితర దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడుతోంది. మేలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాంగ్రెస్ కమిటీలో మాట్లాడుతూ, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో ఆఫ్రికా ప్రధాన రంగంగా ముందుకు వస్తోందంటూ 5,000 కోట్ల డాలర్ల నిధులను అందుకు కేటాయించారు. అఫ్ఘానిస్థాన్‌ను నుంచి ఉపసంహరించే సేనలను ఆఫ్రికాలో స్పెషల్ ఆపరేషన్స్‌కు నియమించబోతున్నారు. చైనా ప్రాబల్యాన్ని పరిమితం చేసే లక్ష్యం నుండి దాన్ని ఎదుర్కొనే లక్ష్యానికి మారినట్టుగా ఇటీవల ఒబామా ప్రకటించారు. కానీ చైనా దీర్ఘకాలిక వ్యూహంతో వాణిజ్య, పెట్టుబడుల బంధాలతో 54 దేశాల ఆఫ్రికా మద్దతును కూడగట్టడానికి యత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికల నుండి అమెరికాను సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. లిబియాలో తిన్న ఎదురు దెబ్బకు చైనా మూల్యాన్ని వసూలు చేయక తప్పనట్టే కనిపిస్తోంది.
 
పిళ్లా వెంకటేశ్వరరావు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement