ఏఐ ‘డీప్‌’ వార్‌! | An anonymous Chinese AI startup poses a major challenge to ChatGPT | Sakshi
Sakshi News home page

ఏఐ ‘డీప్‌’ వార్‌!

Published Wed, Jan 29 2025 5:11 AM | Last Updated on Wed, Jan 29 2025 5:56 AM

An anonymous Chinese AI startup poses a major challenge to ChatGPT

ప్రపంచ టెక్నాలజీ రంగంలో డీప్‌సీక్‌ఏఐ కుదుపు

అతి తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్‌ను రూపొందించిన చైనా స్టార్టప్‌ 

డ్రాగన్‌ అనూహ్య పోటీతో పాశ్చాత్య టెక్‌ కంపెనీల్లో వణుకు.. పేకమేడల్లా కుప్పకూలిన ’ఏఐ’ సంబంధిత షేర్లు... 

ఏఐ ఎకోసిస్టమ్‌లో సమూల మార్పులు తప్పవంటున్న విశ్లేషకులు  

మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్‌యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్‌ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది  – డీప్‌సీక్‌ ఫౌండర్‌ లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌  

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్‌ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్‌ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్‌జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్‌ పెను సవాల్‌ విసిరింది. అదే డీప్‌సీక్‌. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్‌ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. 

లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్‌’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్‌ బరిలోకి దూకడంతో ఏఐ వార్‌కు తెరలేచింది. దీంతో జపాన్‌ నుంచి యూరప్‌ మీదుగా.. అమెరికా వరకు టెక్‌ షేర్లన్నీ కుప్పకూలాయి. 

విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్‌ల మొత్తం మార్కెట్‌ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్‌

2023లో ఆవిర్భావం
డీప్‌సీక్‌ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్‌ హెడ్జ్‌ ఫండ్‌ ‘హై–ఫ్లయర్‌’చీఫ్‌ లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ రూపొందించిన ఆర్‌1 ఏఐ మోడల్‌ చైనాతోపాటు అమెరికా టెక్‌ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్‌ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్‌ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్‌కు గొడ్డలిపెట్టులా మారింది. 

అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో డీప్‌సీక్‌ మొబైల్‌ యాప్‌ అత్యధిక డౌన్‌లోడ్‌లతో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుని చాట్‌జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ను ఇమేజ్‌గా మార్చే జానస్‌–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్‌సీక్‌.  

అమెరికాకు ‘డీప్‌’ట్రబుల్‌.. 
ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్‌గేట్‌ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్‌ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్‌పవర్‌గా చేసేందుకు ఓపెన్‌ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌ బ్యాంక్, ఎంజీఎక్స్‌ చేతులు కలిపాయి. 

ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్‌సీక్‌ కారు చౌకగా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్‌ సలహాదారు మార్క్‌ ఆండర్సన్‌.. డీప్‌సీక్‌–ఆర్‌1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్‌ మూమెంట్‌’’గా (1957లో సోవియట్‌ యూనియన్‌ ప్రపంచంలో తొలి శాటిలైట్‌ స్పుత్నిక్‌ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్‌ మధ్య స్పేస్‌ వార్‌కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.

దిగ్గజాలకు దీటుగా..
ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్‌ హార్డ్‌వేర్‌తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్‌ను రూపొందించామని డీప్‌సీక్‌ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. 

డీప్‌సీక్‌ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్‌ సోర్స్‌ (డెవలపర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్‌ను రూపొందించుకోవచ్చు) మోడల్‌ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. 

డీప్‌సీక్‌ ఆర్‌1 ఏఐ మోడల్‌ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్‌ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్‌జీపీటీ, జెమిని, గ్రోక్‌ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్‌ అభివృద్ధికి 6 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్‌సీక్‌ కేవలం 6 మిలియన్‌ డాలర్లతోనే ఆర్‌1 ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది.

మైక్రోసాఫ్ట్‌ నుంచి 13 బిలియన్‌ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్‌ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్‌సీక్‌ వెచ్చించింది 10 మిలియన్‌ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.

ఎన్విడియాకు షాకెందుకు?
ఏఐ మోడల్స్‌ను నడిపేందుకు హై ఎండ్‌ చిప్స్, జీపీయూలు, నెట్‌వర్కింగ్‌ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్‌ వన్‌గా ఉన్న ఎన్విడియా మార్కెట్‌ విలువ 2023 డిసెంబర్‌లో తొలిసారి 500 బిలియన్‌ డాలర్లు దాటింది. 

గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్‌ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను వెనక్కి నెట్టింది. డీప్‌సీక్‌ చౌక మోడల్‌ వల్ల డిమాండ్‌ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్‌ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్‌ 17 శాతం కుప్పకూలింది. 

బ్రాడ్‌కామ్, ఏఎండీ, అరిస్టా నెట్‌వర్క్స్, నెదర్లాండ్స్‌ చిప్‌ దిగ్గజం ఏఎస్‌ఎంఎల్‌ హోల్డింగ్స్, తైవాన్‌ సెమీకండక్టర్స్‌ మాన్యుఫ్యాక్చర్స్‌ (టీఎస్‌ఎం) వంటి చిప్, నెట్‌వర్కింగ్‌ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement