
చైనాలో ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో విద్యాభ్యాసం
ఆరేళ్ల కిందట హెడ్జ్ ఫండ్ ఏర్పాటు
రెండేళ్ల క్రితమే డీప్‌సీక్‌తో ఏఐ మోడల్స్‌కు శ్రీకారం
అత్యంత శక్తిమంతమైన చౌక ఏఐ అసిస్టెంట్‌తో కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్‌ఫెంగ్ (40) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా కనీసం వినబడని, కనబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ (టెస్లా), శామ్ ఆల్ట్‌మన్‌ను (ఓపెన్ ఏఐ) మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది.
లియాంగ్ దక్షిణ చైనాలోని అయిదో శ్రేణి పట్టణమైన గ్వాంగ్‌డాంగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచరు. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ, 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు.
హెడ్జ్‌ఫండ్‌తో వ్యాపార రంగంలోకి..
లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి హై–ఫ్లయర్ అసెట్ మేనేజ్‌మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.19 లక్షల కోట్లకు) చేరింది.
అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్‌విడియా చిప్‌లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటుపైన 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్‌సీక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్‌ఎల్‌ఎం, వీ2 లాంటి మోడల్స్‌ను చకచకా ప్రవేశపెట్టి, బైట్‌డ్యాన్స్, బైదులాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో, ఓపెన్‌ఏఐ జీపీటీ–4కి పోటీగా డీప్‌సీక్–ఆర్1 ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు.
ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ తమ మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ, యూజర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుండగా.. డీప్‌సీక్ చాట్‌బాట్‌ను అత్యంత చౌకగా కేవలం 6 మిలియన్ డాలర్లకే (దాదాపు రూ. 52 కోట్లు) తయారు చేసి షాకిచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్‌సోర్స్ మోడల్‌గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేథ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెబుతున్న నేపథ్యంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment