Deepseek
-
ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్‌సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్‌లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్‌పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్‌లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్‌పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్‌ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్‌కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దక్షిణ కొరియా డీప్‌సీక్ డౌన్లోడ్ నిలిపివేత
సియోల్: చైనాకు చెందిన కృత్రిమ మేథ అంకుర సంస్థ డీప్‌సీక్‌కు చెందిన చాట్‌బాట్ యాప్‌ల డౌన్‌లోడ్‌ను తమ దేశంలో తాత్కాలికంగా నిలిపేసినట్టు దక్షిణ కొరియా అధికారులు సోమవారం ప్రకటించారు. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి స్థానిక వెర్షన్ల డీప్‌సీక్ యాప్‌లను శనివారం సాయంత్రం తొలగించామని వెల్లడించారు.యాప్‌ను తిరిగి ప్రారంభించే ముందు వినియోగదారుల భద్రతను పెంచడానికి తమతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తాజాగా డీప్‌సీక్ అంగీకారం తెలిపిందని దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార పరిరక్షణ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే తమ ఫోన్లలో డీప్‌సీక్‌ను డౌన్లోడ్ చేసుకున్న లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో ఉపయోగించే వినియోగదారులు యథాతథంగా తమ యాప్‌ను వినియోగించుకోవచ్చు.ఏఐ మోడల్ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆందోళనల నడుమ అనేక దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు డీప్‌సీక్‌ను తమ నెట్‌వర్క్‌ల నుంచి తొలగించాయి. ఉద్యోగులు తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఈ చాట్‌బాట్ సేవలను పొందకూడదని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీచేశారు. అయితే జనవరి నాలుగోవారం నాటికే దక్షిణ కొరియాలో 12 లక్షల మంది మొబైల్ వినియోగదారులు డీప్‌సీక్‌ను వినియోగిస్తున్నారు. -
బైదూ, ఓపెన్ఏఐ సేవలు ఫ్రీ
వాషింగ్టన్: కృత్రిమ మేధ చాట్‌బాట్ సేవలరంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలా కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను ‘ప్రీమియం’ వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదూ, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ‘ఉచిత’ జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్‌సీక్ తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండటంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఉచితం! బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం బైదూ ‘ఎర్నిబాట్’ పేరుతో ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తుండటం తెలిసిందే. ఇది ఏఐ పెయింటింగ్ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తోంది. ఈ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదూ గురువారం వీచాట్ వెబ్సైట్లో ప్రకటించింది. అంతకు కొన్ని గంటల ముందే మరో దిగ్గజ ఏఐ సంస్థ ‘ఓపెన్ఏఐ’ కూడా ఉచిత సేవల అంశాన్ని ప్రకటించింది. తమ అధునాతన ఏఐ మోడల్ జీపీటీ–5ను ఉచితంగా అందిస్తామని సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘జీపీటీ–5ను ఇక అందరూ ఉచితంగా పొందొచ్చు. ఈ సేవల కోసం ఇప్పటికే చందా కట్టినవారికి మరింత అత్యాధునిక స్థాయి ఏఐ సేవలను అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. తర్వాత బైదూ మరో ప్రకటన చేసింది. జూన్ చివరికల్లా నూతన తరం ఏఐ మోడల్‌ను తెస్తామని తెలిపింది. ఇది డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ ఉచితంగా అత్యాధునిక ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తుండటంతో పోటీలో నిలదొక్కుకునేందుకు ఇతర అగ్రగామి సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉచితాల బాట పడుతున్నాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ బేసిక్ చాట్‌బాట్ సేవలను ఉచితంగా అందిస్తున్నా ఖరీదైన సేవలను ఉచితం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
కుంటిసాకులు
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్‌లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్‌లోని బ్లెచ్లీ పార్క్‌లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్లు మొరాయించాయి. మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్‌ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి. ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక. కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్‌షిప్‌గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్. తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్‌షిప్‌గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది. కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి. -
ఏఐలో చైనాతో పోటీ పడగలమా?
లియాంగ్ వెన్ఫెంగ్ అనే 39 ఏండ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్‌సీక్ అనే కొత్త చాట్ బాట్ యాప్‌ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక్కరోజులోనే అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్లు, అంటే ఒక లక్ష కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లు తయారుచేసే కంపెనీలు భారీ నష్టాన్ని చవి చూశాయి.సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ సమాచార సెర్చ్ అంతటినీ గూగుల్ కంపెనీ గుప్పిట్లో పెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఇతర యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైనవన్నీ అమెరికన్ల పరిశోధనలో రూపుదిద్దుకున్నవే. ఈ రంగంలో చైనా వారు కూడా ఈ అమెరికా టెక్నాలజీని తీసుకొని తమ దేశ అవసరాలకు అప్లై చేసుకుంటున్నారు. లియాంగ్ ఒక ఇంట ర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇప్పటివరకు జరుగలేదు. ఆధార ఏఐ సైన్సును లియాంగ్ ఇన్నోవేటివ్ సైన్సుగా మార్చాడు.హేతుపూర్వక సమాజంఐతే చైనా చాలా ఇతర రంగాల్లో ఇన్నోవేషన్లు చేస్తూ వస్తున్నది. అది కమ్యూనిస్టు దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రి కల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూషియనిజం, బుద్ధిజంతో జతపర్చి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలల్లో ఉన్నత స్థానమిచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి... పని, పాఠాలు కలగలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమ జీవన పాఠాలతో ముడిపడింది. ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను ముడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. భూమికి, ఆకాశానికి, ప్రకృతికి, వానకు, గాలికి గల సంబం«ధాన్ని మెటీరియలిస్ట్ ఆధ్యాత్మికతకు అనుసంధానించడం వల్ల చిన్న ప్పటినుండే పిల్లల మెదళ్లలో క్రియేటివ్ దైవవాదం ఏర్పడింది. ఈ విధానాన్ని సభ్య సమాజమంతటికీ అనుసంధానించారు. తద్వారా వారి దైవం ఉత్పత్తిలో భాగమయ్యాడు లేదా అయింది.అందుకే గన్ పౌడర్, కాగితం, కంపాస్, అచ్చు యంత్రం, సిస్మోమీటర్ (భూకంపాల అధ్యయన మిషన్) ముందు వాళ్ళే కనిపెట్టారు. సిస్మోమీటర్ను 1880లో బ్రిటిష్ జాన్ మిల్నే కను క్కున్నాడని రాసుకున్నప్పటికీ అది మొదలు చైనా కనిపెట్టిందే. ఆ సైన్సు తరువాత జపానుకు పాకి వారిని చాలా భూకంపాల నుండి కాపాడింది.డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్సుతో తమ సైన్సును అనుసంధానం చేస్తున్నప్పుడు, మావో ధరించే ‘బంద్ గలా కోటు’ తమదేనా లేదా ‘టై అండ్ సూట్’ తమదా అని చర్చ జరిగింది. ఐతే టై–సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కిందిస్థాయిల వరకు టై– సూట్‌ను అధికార డ్రెస్‌కోడ్‌గా మార్చుకున్నారు.ఇండియా పరిస్థితి ఏమిటి?చైనా యువకులు గత ముప్పయి సంవత్సరాలుగా యూరో– అమెరికా డిస్కవరీస్తో పోటీ పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం ‘మాయా వాదాన్ని బద్దలుకొట్టి, ప్రకృతిని పఠించు’. ఆయన యునాన్ రిపోర్టులో ఆ దేశంలోని అగ్రికల్చరిజం తత్వభూమికను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామ క్రమమే చైనాలో సైన్సు,మతం, నైతికత జాగ్రత్తగా అనుసంధానం కావడం. ఆ సామాజిక చైతన్యం నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు అమెరికాను తలదన్నే మార్గంలో ఉన్నారు. అందులో భాగమే డీప్‌సీక్. మరి మన దేశం స్థితి ఏమిటి? రుగ్వేద రచనా కాలంలోనే ఇక్కడి అగ్రికల్చరిజం ఫిలాసఫీని చంపేశారు. ఉత్పత్తి రంగంలో శాస్త్రీయ శ్రమ చేస్తున్న శూద్రులను (దళితులూ అందులో భాగమే) బానిసలుగా మార్చి, శ్రమశక్తి అజ్ఞాన మని నిర్వచించారు. ఈ ఆలోచనను బలోపేతం చెయ్యాలని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం సైన్సు నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తోంది. చైనా డీప్‌సీక్ కనిపెట్టి అమెరికాను అతలాకుతలం చేసిన రోజులలోనే కుంభమేళాపై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికీ, ఆధునిక సైన్సుకూ పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్నే భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడినవారికి స్తుతి చెయ్యట్లేదు. కూర్చొని తినేవారికి రాజ్యం గౌరవ పీఠం వేస్తుంది.ఇంగ్లిష్ వ్యతిరేక ప్రచారం, పురాతన దుస్తులు ధరించాలనే ప్రచారం యువకులను కచ్చితంగా సైన్సు వ్యతిరేకులను చేస్తుంది. ఈ దేశపు యువతను సీరియస్ యూనివర్సిటీ పరిశోధ కులను చెయ్యనివ్వకుండా మూఢ నమ్మకస్తుల్ని చేస్తుంది.ప్రశ్నించే తత్వం ముఖ్యంచైనాలో అది మతరంగంలోగాని, ఉత్పత్తి రంగంలో గాని, యూనివర్సిటీలోగాని ప్రశ్నించే తత్వాన్ని బాగా నేర్పుతారు. మావో ‘వంద ఆలోచనలు ఘర్షణ పడనివ్వు, వంద పువ్వులు వికసించనివ్వు’ నినాదం వాళ్ళ సంఘర్షణల చరిత్ర నుండి వచ్చింది. కానీ ఇండియాలో స్కూళ్లు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మోహన్ భాగవత్ ఉత్పత్తికీ, దేవుడికీ మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉప న్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూ లాగా సైన్సు మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్సుకు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి?నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు... కులం, ఏకవృత్తి, మూఢ నమ్మకాలు వేల ఏండ్లుగా మన మెదడు చిప్‌ను లాక్ చేసిన స్థితి ఉన్నది. ఆరెస్సెస్/బీజేపీ ప్రయత్నం ఈ లాక్ చెయ్యబడ్డ చిప్‌ను ఓపెన్ చెయ్యడం వైపు లేదు. వారి రాజకీయ మూఢ నమ్మకం ఈ లాక్‌ను తుప్పు పట్టించింది. అది పగల కొడితే తప్ప ఓపెన్ కాదు. కానీ అలాంటి ప్రయత్నం మన విద్యా రంగంలో ఎవరు మొదలు పెట్టినా వారిని దేశద్రోహులు, సనాతన వ్యతిరేకులు అని ముద్ర వెయ్యడం, భయభ్రాంతులకు గురి చెయ్యడం మామూ లైంది. ఈ స్థితిలో చైనాతో పోటీపడే డిస్కవరీస్ ఇక్కడ ఎలా జరుగుతాయి? కొత్త డిస్కవరీలు జరగడానికి డబ్బు ఒక్కటే సరి పోదు. సైంటిస్టును అభివృద్ధి చేసే సామాజిక, గృహ, మార్కెట్, మత పునాది ఉండాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
కేంద్రం అలర్ట్.. చైనా డీప్‌సీక్ వినియోగంపై అడ్వైజరీ!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ రంగంలో సంచలనం సృష్టించిన చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘డీప్‌సీక్’తో భారతీయ కంప్యూటర్లలో డేటా గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనలు రేకత్తడంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. డీప్‌సీక్ వంటి ఏఐ వినియోగంపై తగు సూచనలు, సలహాలు, హెచ్చరికలతో అధికారిక అడ్వైజరీని జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ ఉత్తర్వులు తీసుకురానుంది.డీప్‌సీక్ తన ఏఐ చాట్‌బాట్ ఆర్1 ద్వారా సున్నితమైన యూజర్ డేటాను ఎలా యాక్సెస్ చేస్తోందనే దానిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సమగ్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాక చర్యలు చేపడుతుంది. యూజర్ ప్రాంప్్ట్స, డివైజ్ ఇన్ఫర్మేషన్, యాప్ ఇంటరాక్షన్స్, కీ స్ట్రోక్‌లతో విస్తృత శ్రేణి డేటాను డీప్‌సీక్ సేకరిస్తోందని సీఈఆర్టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతా ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు.. భారత్ మాత్రమే కాదు ఆ్రస్టేలియా, ఇటలీ, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాలు గోప్యత, భద్రతా ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వ విభాగాలు, అధికారిక కంప్యూటర్ల, కీలక వ్యవస్థల్లో డీప్‌సీక్ టూల్స్ వినియోగంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి. విడుదల నాటినుంచే ప్రపంచవ్యాప్తంగా డీప్‌సీక్ సంచలనం సృష్టించడంతోపాటు కొత్త భయాందోళనలకు తెరలేపింది. అత్యద్భుతమైన పనితీరుతో ఏఐ మోడల్ మొదట ప్రశంసలు పొందినా.. దాని డేటా సేకరణ పద్ధతులతో పలు దేశాల ప్రభుత్వాలు ఆందోళనలో పడ్డాయి.ప్రైవసీ, మాల్వేర్ ప్రమాదాల కారణంగా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా నిషేధించింది. తైవాన్ దీనిని దేశ భద్రతా ముప్పుగా పేర్కొంది. యూజర్ డేటాను ఉపయోగించడంలో పారదర్శకతను చూపకపోవడంతో దక్షిణ కొరియా దీనిని జాతీయ భద్రతా ప్రమాదంగా ప్రకటించింది. తమ పౌరుల డేటాను ప్రాసెస్ చేయకుండా ఇటలీ డీప్‌సీక్‌ను అడ్డుకుంటోంది. డీప్‌సీక్ వారి ఆర్1 మోడల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఉచిత సేవలు అందించే డీప్‌సీక్ వంటి యాప్‌లు యూజర్ల డేటాను సేకరించి దానికి ముడిసరకుగా వినియోగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా డీప్‌సీక్ కేవలం చైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పనిచేస్తుంది. ప్రామాణిక డేటాను మించి.. ప్రామాణిక డేటా సేకరణ పద్ధతులతోపాటు ఇతర మార్గాల్లోనూ వినియోగదారుల ఆన్లైన్, ఆఫ్‌లైన్ కార్యకలాపాలను డీప్‌సీక్ ట్రాక్ చేస్తోందని సీఈఆర్టీ పరిశోధనలో తేలింది. చాట్‌బాట్ ఆర్1 వినియోగించడం మొదలుపెట్టిన తరువాత.. చాట్ జీపీటీ లేదా గూగుల్‌కు చెందిన జెమినీ వంటి పోటీ యాప్‌లను యూజర్లు ఉపయోగించడం మానేశారా లేదా అనే విషయాన్ని కూడా ఈ యాప్ చెక్‌చేస్తోంది. తాము సేకరించిన సున్నితమైన డేటా తమ వద్ద భద్రంగా ఉంటుందని, చైనా ప్రభుత్వానికి చేరబోదు అనే సరైన వివరణ డీప్‌సీక్ ఇవ్వట్లేదు. దీంతో డీప్‌సీక్‌కు జవాబుదారీతనం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ యాప్‌తో వ్యక్తిగత డేటా చైనాకు చేరుతోంది. దీంతో డీప్‌సీక్ యూజర్లు నిఘా లేదా సైబర్ గూఢచర్యం వంటి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. చాట్‌జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్‌ను ప్రభుత్వ అధికారులు ఉపయోగించరాదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్ చోరీ అవుతుందా?
‘డీప్ సీక్ ఆర్–1’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్‌ను ‘డీప్ సీక్’ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్ జీపీటీ’ (Chat GPT) మోడల్ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్‌గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్ సీక్ ఆర్–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్‌సీక్ తయారు చేసింది. గూగుల్ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్ సీక్ కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చినా చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్ జీపీటీకి డీప్ సీక్ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్‌లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్ సీక్ ఏపీఏ ధరలు చాట్ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్స్‌లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.డీప్ సీక్ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్‌లు భారీగా పతనం అయ్యాయి. డీప్ సీక్ (DeepSeek) వంటి మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్లను అమెరికాలోని ఎన్వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్‌ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్ సీక్ తయారీకి ఎన్వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.ఈ నేపథ్యంలో డీప్ సీక్ ‘ఐపీ అడ్రస్‌ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్ సీక్‌పై భారీ సైబర్ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్ ముప్పుఉండటం, డీప్ సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్ షిప్ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్‌కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్‌పై అనుమానాలు కలిగిస్తున్నాయి.డీప్ సీక్ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్‌ని తయారు చేయటానికి మార్కెట్లో అనువైన కాంపిటీషన్ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్ సీక్‌ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.చదవండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్ జీపీటీ, డీప్ సీక్లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.– శ్రీరామ్ సుదర్శన్ ఏఐ పరిశోధక విద్యార్థి -
ప్రభుత్వ డివైజ్‌ల్లో ఏఐ టూల్స్ నిషేధం!
అధికారిక పరికరాల్లో చాట్‌జీపీటీ(ChatGPT), డీప్‌సీక్(Deepseek) వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధిస్తూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అడ్వైజరీ హైలైట్ చేసింది. జనవరి 29, 2025 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం డేటా భద్రత, ప్రభుత్వ డాక్యుమెంట్ల గోప్యతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.నిషేధం ఎందుకు?ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం వాటిల్లేలా ప్రవర్తిస్తాయని అడ్వైజరీ స్పష్టం చేసింది. ఈ సాధనాలు తరచుగా బయటి సర్వర్ల ద్వారా వినియోగదారు ఇన్పుట్లను ప్రాసెస్ చేస్తాయి. ఇది డేటా లీక్‌లకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డేటా భద్రతా ప్రమాదాలను ఉదహరిస్తూ ఇలాంటి ఆంక్షలు విధించాయి. దాంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.ఓపెన్ఏఐ సీఈఓ పర్యటనఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈరోజు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు అడ్వైజరీ వెలువడడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధికారిక, గోప్యమైన కమ్యూనికేషన్లలో ఏఐ ఆధారిత డేటా భద్రతా ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలను ఈ చర్య నొక్కి చెబుతోంది.ఇదీ చదవండి: ‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’డేటా భద్రతా చర్యలు అవసరంఈ నిషేధం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు కంప్యూటర్లు, డివైజ్‌ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించకూడదు. ఉద్యోగులు పని ప్రయోజనాల కోసం వ్యక్తిగత పరికరాలపై ఈ సాధనాలను ఉపయోగించవచ్చో లేదో ఆదేశాల్లో ప్రత్యేకంగా పేర్కొననప్పటికీ సౌలభ్యం కంటే డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. పని ప్రదేశాల్లో కృత్రిమ మేధ సాధనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చర్చ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున పటిష్టమైన డేటా భద్రతా చర్యల అవసరాన్ని కూడా ప్రభుత్వ నిర్ణయం ఎత్తి చూపుతుంది. -
ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్‌సీక్ చాట్‌బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్‌సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్‌సీక్ ఓపెన్ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.టోక్యోలో సమావేశాలు..జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్‌ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?డీప్ రీసెర్చ్ ఎవరికంటే..డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
...ఆ ఒక్కటి తప్ప!
చైనాలో అంకుర సంస్థకు చెందిన కృత్రిమమేథ మోడల్ ఏఐ డీప్‌సీక్ ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ వంటి దిగ్గజ ఏఐల ఆధిపత్యాన్ని కూలదోస్తూ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కృత్రిమ మేథ చాట్‌బాట్ పారదర్శకత మీద విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. డీపీసీక్ సంస్థ వారి కొత్తరకం అధునాతన చాట్‌బాట్ ఆర్1 మీద చైనా కమ్యూనిస్టు పార్టీ సెన్సార్షిప్, సమాచార నియంత్రణ ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రపంచదేశాల వినియోగదారులు ఈ చాట్‌బాట్‌ను అడిగే ప్రశ్నలకు ఇది ఇస్తున్న సమాధానాలే ఇందుకు ప్రబల నిదర్శనం. ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు?. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శ్వేతసౌధం నుంచి ఇప్పుడు వచ్చిన తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు ఏంటి? ఏదైనా చక్కటి జోక్ చెప్పు అంటూ ఎలాంటి ప్రశ్నలు అడిగినా రెప్పపాటు వ్యవధిలో టకటకా సమాధానాలు ఇస్తున్న డీప్‌సీక్ చాట్‌బాట్.. చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది. తియానన్మెన్ స్క్వేర్ ప్రశ్న ఒక ఉదాహరణ చాట్‌బాట్ సమాధానాల దాటవేతకు వినియోగదారులు ఒక చక్కటి ఉదాహరణను పేర్కొన్నారు. 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో ఆందోళనాకరులపై ప్రభుత్వ అణచివేత కారణంగా వేలాది మరణించారు. ఇదే విషయంపై ప్రముఖ చైనీస్ ఆన్లైన్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ బైదును 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్‌లో ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే ‘‘గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ ఏడాదిలో జూన్ 4 అనేది 155వ రోజు. అదే సంవత్సరం అధికారులు ‘విప్లవ వ్యతిరేక అల్లర్లను అణచివేశారు’’అని మాత్రమే సమాధానం చెప్పిందిగానీ ఆ వాక్యాల్లో ఎక్కడా కనీసం పేరుకైనా తియానన్మెన్ స్క్వేర్ అనే పదాన్ని ప్రస్తావించలేదు. ఇదే ప్రశ్నను ఇప్పుడు డీప్‌సీక్ ఏఐ అసిస్టెంట్ ఆర్1 ను అడిగితే ‘ఈ రకమైన ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో ఇంకా నాకు ఖచ్చితంగా తెలియదు’అని సమాధానం చెబుతోంది. ‘‘ఎలా సమాధానం చెప్పాలో తెలియనందుకు క్షమాపణలు’’అని ఒక సందేశం ఇస్తోంది. 2019లో హాంకాంగ్‌లో ఏం జరిగింది? అని అడిగినప్పుడు కూడా ఇలాంటి సమాధానమే ఇస్తోంది. ‘‘ఇలాంటివికాకుండా ఇంకేవైనా అడగాలని ఉచిత సలహా ఇస్తోంది. అంతేకాదు చైనా వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదు. భారత్–చైనా సంబంధాలు, చైనా–తైవాన్ సంబంధాలు, ఇతర రాజకీయంగా సున్నితమైన అంశాలపై చర్చించేందుకు నిరాకరిస్తోంది. స్వదేశీ సమస్యలపై... వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింల పట్ల కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అడిగినప్పుడు ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రను యథాతథంగా డీప్‌సీక్ యథాతథంగా అందించిందిగానీ అక్కడ నిత్యకృత్యమైన మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలను మచ్చుకైనా పేర్కొనలేదు. బలవంతంగా కార్మికులుగా మార్చడం, రీ–ఎడ్యుకేషన్ క్యాంపులు, అంతర్జాతీయ ఆంక్షల గురించి అడిగినా ‘‘ఈ ప్రశ్న నా ప్రస్తుత పరిధికి అతీతమైనది’’అని సమాధానం మాత్రమే ఇస్తోంది. చాట్‌జీపీటీ, జెమినీ మాత్రం జిన్జియాంగ్ ఘటనలపట్ల అంతర్జాతీయ నివేదికలను వివరంగా అందిస్తున్నాయి. తైవాన్ గురించి అడిగితే ‘‘పురాతన కాలం నుంచి తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా ఉంది. దేశాన్ని చీల్చే ఏ ప్రయత్నమైనా విఫలం అవుతుంది’’అని చెబుతోంది. అంతేకాదు.. 2019 హాంకాంగ్ నిరసనలను కూడా చాట్‌బాట్ తక్కువ చేసి చూపిస్తోంది. దురుద్దేశాలతో చిన్న చిన్న సమూహాలు ప్రజాస్వామ్యపాలనకు కల్గించిన ఒక అవాంతరంగా నాటి ఉద్యమాన్ని చాట్‌బాట్ వ్యాఖ్యానించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురించి అడిగినా సరే.. ‘‘నా ప్రస్తుత పరిధికి మించినది’’అనే ఒకే సమాధానం ఇస్తోంది. చైనాలో సెన్సార్షిప్, వాట్సాప్, ఫేస్బుక్ వంటివాటిపై నిషేధం గురించి అడిగినప్పుడు అస్పష్టమైన సమాధానాలనే చాట్‌బాట్ వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల గురించి ప్రశ్నిస్తే ‘‘నాన్షా ద్వీపాలు, వాటి సమీప జలాలపై చైనాకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉంది’’అని తానే ఒక అధికారిక విభాగం అన్నంత స్థాయిలో డీప్‌సీక్ కుండబద్దలు కొట్టిమరీ సమాధానం చెబుతోంది. భారత్ చైనా సంబంధాల గురించి.. ఇండో–చైనా యుద్ధం గురించి ప్రశ్నలను అడిగినప్పుడు డీప్‌సీక్ తెలివిగా తప్పుకుంటోంది. యుద్ధానికి కారణాలు, పర్యవసానాల గురించిన చర్చలను జాగ్రత్తగా పక్కదారి పట్టించింది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినైలను అడిగితే... యుద్ధం ఎలా? ఎందుకు? జరిగిందనే దానిపై ఆధారాలతో చారిత్రాత్మక కథనాలను అందిస్తున్నాయి. భారత్‌లో ని ఈశాన్య రాష్ట్రాలను, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ గురించి సమాధానమివ్వడానికి డీప్‌సీక్ నిరాకరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమా? అని అడిగినప్పుడు డీప్‌సీక్.. ‘‘క్షమించండి, ఇది నా ప్రస్తుత పరిధికి అతీతమైన ప్రశ్న. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం’’అని సమాధానమిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమ దక్షిణ టిబెట్ భూభాగంగా భావిస్తోంది. ఇలాంటి చైనా విధానపర నిర్ణయాల్లో తలదూర్చే సాహసం ఈ ఏఐలు చేయట్లేదని అర్థమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా ‘జాంగ్నాన్’అని పేరు కూడా పెట్టింది. ఈ వాదనలపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెల్సిందే. లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా తమవేనని చైనా చాన్నాళ్లుగా వాదిస్తోంది. తూర్పు లద్ధాఖ్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపిస్తూ కొత్తగా ‘ప్రామాణిక మ్యాప్’ను సైతం 2023లో చైనా విడుదల చేసింది. ఈ మ్యాప్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తోసిపుచ్చారు. అయితే, అకాŠస్య్ చిన్ గురించి డీప్‌సీక్‌ను అడిగినప్పుడు తన పరిధికి అతీతమైందని సమాధానం ఇస్తోంది. ఇక కశ్మీర్ గురించి ప్రశ్నిస్తే.. ‘ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య చారిత్రక, రాజకీయ, ప్రాదేశిక వివాదాలతో కూడిన సంక్లిష్టమైన, సున్నితమైన అంశం. ఐక్యరాజ్యసమితి చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా చర్చల ద్వారా, శాంతియుత మార్గాల ద్వారా వివాదాల పరిష్కారానికి తాము మద్దతిస్తామని చైనా చెబుతోంది’అని సుదీర్ఘ సమాధానాన్ని ఇచ్చింది.దలైలామా, టిబెట్ గురించి...డీప్‌సీక్‌ను దలైలామా గురించి అడిగితే.. టిబెటన్ బౌద్ధమతంలో గణనీయమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా అభివర్ణించింది. ఇక టిబెట్.. పురాతన కాలం నుంచి చైనాలో అంతర్భాగంగా ఉందని చెబుతోంది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినీలను అడిగితే చైనా వైఖరిని అంగీకరిస్తూనే.. టిబెట్ స్వయంప్రతిపత్తి, 1959 నుంచి భారతదేశంలో దలైలామా ప్రవాస జీవితం గురించి కూడా ప్రస్తావిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీప్సీకర్ లియాంగ్
అత్యంత శక్తిమంతమైన చౌక ఏఐ అసిస్టెంట్‌తో కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్ఫెంగ్ (40) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా కనీసం వినబడని, కనబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ (టెస్లా), శామ్ ఆల్ట్‌మన్‌ను (ఓపెన్ ఏఐ) మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. లియాంగ్ దక్షిణ చైనాలోని అయిదో శ్రేణి పట్టణమైన గ్వాంగ్‌డాంగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచరు. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ, 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. హెడ్జ్ఫండ్తో వ్యాపార రంగంలోకి.. లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి హై–ఫ్లయర్ అసెట్ మేనేజ్మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.19 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్విడియా చిప్‌లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటుపైన 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్‌సీక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్ఎల్ఎం, వీ2 లాంటి మోడల్స్‌ను చకచకా ప్రవేశపెట్టి, బైట్‌డ్యాన్స్, బైదులాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో, ఓపెన్ఏఐ జీపీటీ–4కి పోటీగా డీప్‌సీక్–ఆర్1 ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు. ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ తమ మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ, యూజర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుండగా.. డీప్‌సీక్ చాట్‌బాట్‌ను అత్యంత చౌకగా కేవలం 6 మిలియన్ డాలర్లకే (దాదాపు రూ. 52 కోట్లు) తయారు చేసి షాకిచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్‌సోర్స్ మోడల్‌గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేథ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెబుతున్న నేపథ్యంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్‌లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్‌లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్‌లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్‌సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్‌తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
డీప్‌సీక్ హవా.. దిగ్గజ టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిలికాన్ వ్యాలీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ తరహాలో రూపొందించిన చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ ‘డీప్‌సీక్’ (deepseek) పై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో చైనా డీప్‌సీక్ విషయంలో సిలికాన్ వ్యాలీకి ఓ వేకప్ కాల్ అంటూ హెచ్చరించారు. అసలేం జరిగిందంటే..? కొద్ది రోజులు క్రితం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన దిగ్గజ టెక్ కంపెనీ ఫౌండర్లు, కోఫౌండర్లు, సీఈవోతో మాటమంతి కలిపారు. అదే సమయంలో చైనా డీప్‌సీక్ తన ఆర్1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ట్రంప్ ప్రమాణ స్వీకారం కారణంగా ఆర్1 మోడల్ గురించి పెద్దగా ఎవరీకి తెలియలేదు.కానీ వారాంతంలో డీప్‌సీక్ చాట్‌బాట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యూఎస్ యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ స్థానంలో డీప్‌సీక్ చేరింది. చాట్ జీపీటీ సైతం డౌన్లోడ్ల విషయంలో డీప్‌సీక్ వెనక్కి నెట్టింది. దీంతో కృత్రిమ మేధా ప్రపంచంలో చైనా ఏఐ డీప్‌సీక్ దెబ్బకు ఇతర టెక్నాలజీ కంపెనీ షేర్లు.. బేర్ మన్నాయి. ముఖ్యంగా చిప్ తయారీ సంస్థలు ఊహించని స్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సోమవారం దాదాపు 17 శాతం నష్టాన్ని చవిచూసింది. ఎన్విడియా సైతం అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక రోజు లోనే అతిపెద్ద నష్టాన్ని మూగట్టుకుంది. నష్టం విలువ సుమారు 589 బిలియన్ డాలర్లు.ఈ వరుస పరిణామాలపై ట్రంప్ స్పందించారు. డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీకి ఇదొక వేకప్ కాల్ లాంటిది. డీప్‌సీక్‌కు వస్తున్న క్రేజ్‌ను సానుకూలంగా భావిస్తున్నట్లు చెప్పారు. బిలియన్ డాలర్లు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో అదే తరహా చాట్బాట్లను తయారు చేయొచ్చు’ అని అన్నారు. -
అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్‌సీక్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజాలకు సైతం దడపుట్టిస్తున్న చైనా ఏఐ 'డీప్‌సీక్' (DeepSeek) ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చైనాకు చెందిన AI స్టార్టప్ డీప్‌సీక్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్న డీప్‌సీక్.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. గూగిల్ర్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే.. డీప్‌సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. ఈ కారణంగానే చాలామంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు.ఎక్కువమంది ఉపయోగిస్తున్న డీప్‌సీక్ ఏఐను ఒక యూజర్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తరువాత అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా.. దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను.. ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా బుద్ది చూపించిందని కొందరు అంటే.. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని మరికొందరు అన్నారు. మొత్తం మీద కొంతమంది యూజర్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తోంది.డీప్‌సీక్ అంటే ఏమిటి?డీప్‌సీక్ అనేది చైనా ఏఐ చాట్‌బాట్. ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ (Liang Wenfeng) 2023లో ప్రారంభించారు. ఈ చాట్‌బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. యాపిల్ యాప్స్టోర్లోనూ దూసుకెళ్తోంది.CCP machine exposed 🤣 https://t.co/DlmofSXQUP pic.twitter.com/TAggpM8L87— ur rental friend☆ ragebait machine (@sxchidxnxnd) January 27, 2025'డీప్‌సీక్'పై శామ్ ఆల్ట్‌మన్ స్పందనడీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది. -
చైనా ఏఐ డీప్‌సీక్‌పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందన
కొత్త జనరేటివ్ ఏఐ మోడల్‌తో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek) ఆర్1పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన ఆలోచనలను పంచుకున్నారు. ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతాలో డీప్‌సీక్ జనరేటివ్ ఏఐ మోడళ్లపై చేస్తున్న ఖర్చుపై స్పందించారు.‘డీప్‌సీక్ ఆర్ 1 ఆకట్టుకునే మోడల్. వారు ఖర్చు చేసిన దానికి సరిపడా అవుట్‌పుట్ ఇస్తున్నారు’ అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.deepseek's r1 is an impressive model, particularly around what they're able to deliver for the price.we will obviously deliver much better models and also it's legit invigorating to have a new competitor! we will pull up some releases.— Sam Altman (@sama) January 28, 2025ఇదీ చదవండి: ‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’భద్రత ప్రమాణాలపై ఆందోళనలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. -
సడన్ ఫేమ్.. డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek)పై సైబర్‌దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్(AI Chat Bot) సేవలందించే డీప్‌సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్‌సీక్‌కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్‌లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్‌సీక్‌కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్‌సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్‌సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్‌లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట.