అరుణాచల్‌ ప్రదేశ్‌పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్‌సీక్ | China DeepSeek Response to Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ ప్రదేశ్‌పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్‌సీక్

Jan 28 2025 5:30 PM | Updated on Jan 28 2025 5:56 PM

China DeepSeek Response to Arunachal Pradesh

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజాలకు సైతం దడపుట్టిస్తున్న చైనా ఏఐ 'డీప్‌సీక్‌' (DeepSeek) ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

చైనాకు చెందిన AI స్టార్టప్ డీప్‌సీక్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్న డీప్‌సీక్.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. గూగిల్ర్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే.. డీప్‌సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. ఈ కారణంగానే చాలామంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఎక్కువమంది ఉపయోగిస్తున్న డీప్‌సీక్ ఏఐను ఒక యూజర్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తరువాత అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా.. దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను.. ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా బుద్ది చూపించిందని కొందరు అంటే.. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని మరికొందరు అన్నారు. మొత్తం మీద కొంతమంది యూజర్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తోంది.

డీప్‌సీక్ అంటే ఏమిటి?
డీప్‌సీక్ అనేది చైనా ఏఐ చాట్‌బాట్. ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. దీనిని లియాంగ్ వెన్‌ఫెంగ్ (Liang Wenfeng) 2023లో ప్రారంభించారు. ఈ చాట్‌బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. యాపిల్ యాప్‌స్టోర్‌లోనూ దూసుకెళ్తోంది.

'డీప్‌సీక్'పై శామ్ ఆల్ట్‌మన్ స్పందన
డీప్‌సీక్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!

డీప్‌సీక్‌పై సైబర్‌ ఎటాక్‌
డీప్‌సీక్‌పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్‌లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement