చైనా ఏఐ డీప్‌సీక్‌పై ఓపెన్‌ఏఐ సీఈఓ స్పందన | OpenAI CEO Sam Altman shared thoughts on DeepSeek has been making waves in the tech world with AI model DeepSeek R1 | Sakshi

చైనా ఏఐ డీప్‌సీక్‌పై ఓపెన్‌ఏఐ సీఈఓ స్పందన

Jan 28 2025 1:03 PM | Updated on Jan 28 2025 1:36 PM

OpenAI CEO Sam Altman shared thoughts on DeepSeek has been making waves in the tech world with AI model DeepSeek R1

కొత్త జనరేటివ్‌ ఏఐ మోడల్‌తో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్‌సీక్‌(DeepSeek) ఆర్‌1పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ ఇటీవల తన ఆలోచనలను పంచుకున్నారు. ఆల్ట్‌మన్‌ తన ఎక్స్‌ ఖాతాలో డీప్‌సీక్‌ జనరేటివ్‌ ఏఐ మోడళ్లపై చేస్తున్న ఖర్చుపై స్పందించారు.

‘డీప్‌సీక్‌ ఆర్ 1 ఆకట్టుకునే మోడల్. వారు ఖర్చు చేసిన దానికి సరిపడా అవుట్‌పుట్‌ ఇస్తున్నారు’ అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.

డీప్‌సీక్‌పై సైబర్‌ ఎటాక్‌

డీప్‌సీక్‌పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్‌లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’

భద్రత ప్రమాణాలపై ఆందోళనలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్‌ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్‌ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్‌విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్‌ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్‌ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement