
అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికే నిర్ణయం
దిగుమతులపై పన్నులు విధిస్తాం: ట్రంప్
అమెరికా పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే సాహసోపేత చర్యలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక విధానాలు అనుసరించాలని చెప్పారు. అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్నును రద్దు(abolishing income tax) చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఆదాయాన్ని(కనీస అవసరాలు, ఈఎంఐలు.. వంటి వాటికి ఖర్చు చేశాక మిగిలే మొత్తం) పెంచే లక్ష్యంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ప్రవేశపెట్టాలని ట్రంప్ సూచించారు. హౌస్ రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రత్యేక టారిఫ్(tariff)లను ప్రవేశపెట్టి వాటివల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడిందని ట్రంప్ తెలిపారు. తర్వాత ఆ ప్రత్యేక టారిఫ్‌లను క్రమంగా తొలగించారని గుర్తు చేశారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఊతమిస్తుందని ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికన్లను ధనవంతులుగా, మరింత శక్తిమంతులుగా మార్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆదాయపన్ను రద్దు చేసి, దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచాలనే విధానాలు ప్రవేశపెట్టాలని ట్రంప్ చెబుతుండడం చర్చకు దారి తీసింది.
భారత్, చైనాలపై టారిఫ్‌లు
ఈ విధానాన్ని పర్యవేక్షించడానికి, టారిఫ్‌లు, సంబంధిత ఆదాయాల నిర్వహణకు బాధ్యత వహించే ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే జనవరి 20న ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ..‘అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికి విదేశాలపై సుంకాలు విధిస్తాం. మన ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది’ అన్నారు. ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్‌లో రూ.102 కోట్ల మోసం
ఈ ఆదాయ పన్ను రద్దు పథకంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, మరికొందరిలో విమర్శలకు దారితీస్తుంది. పెరిగిన దిగుమతి వ్యయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పన్ను పునర్వ్యవస్థీకరణను అమలు చేయడంలో లోపాలు ఎదురవుతాయని అమెరికన్ కాంగ్రెస్‌లో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము వెంటనే వాణిజ్య వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment