
అమెజాన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సొంత ఉద్యోగులే రూ.102 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారు. కంపెనీ లాజిస్టిక్స్, పేమెంట్ వ్యవస్థలను తారుమారు చేసి నిధులను పక్కదారి పట్టించారు. అమెజాన్ తన ఆర్థిక రికార్డుల్లో వ్యత్యాసాలను గమనించి అంతర్గత దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో పాల్గొన్న ఉద్యోగులు కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుపుతున్నారని, దీనివల్ల సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టాలు వచ్చాయని దర్యాప్తులో వెల్లడైంది.
అమెజాన్‌లో ఏదైనా వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు గోదాములో డెలివరీ ఏజెంట్ వస్తువులు రిసీవ్ చేసుకున్న వెంటనే యాప్‌లో చెక్-ఇన్ చేయాలి. సదరు వస్తువులను యూజర్లకు డెలివరీ ఇచ్చిన తర్వాత చెక్-అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆర్డర్ పెట్టినవారు చిరునామాలో అందుబాటులో లేకపోతే ఆ వివరాలు వెంటనే యాప్‌లో అప్‌డేట్ చేయాలి. దీన్ని రిలే అపరేషన్ సెంటర్‌లో ఉన్నవారు నిర్ధారిస్తారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అమెజాన్ కాల్‌సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్ అంటారు. వినియోగదారులు చిరునామాలో లేకపోతే అక్కడకు వెళ్లి వచ్చినందుకు డెలివరీ ఏజెంట్లకు ఛార్జీలు అందిస్తారు. అయితే చాలాచోట్ల ఈ డెలివరీ సదుపాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్వహిస్తుంటాయి. వాటికి అమెజాన్ డెలివరీ చెల్లింపులు చేస్తుంటుంది.
అమెరికాకు నకిలీ ట్రిప్పులు
మోసగాళ్లు అమెజాన్ డెలివరీ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. గతంలో కంపెనీలో పని చేసి మానేసిన కొందరి సాయంతో అమెరికాకు వస్తువులు డెలివరీ చేస్తున్నట్లు నకిలీ డెలివరీ ట్రిప్పులను సృష్టించి వాటికి చెల్లింపులు చేశారు. ఇందుకు రిలే ఆపరేషన్ సెంటర్‌లో ఉద్యోగులు సహకరించారు. అలా కొన్ని నెలలుగా ఏకంగా రూ.102,88,05,418 మోసానికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి: సడన్ ఫేమ్.. చైనా ఏఐ ‘డీప్‌సీక్’పై సైబర్ ఎటాక్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫిర్యాదు
అమెజాన్ తన ఆర్థిక రికార్డుల్లో వ్యత్యాసాలను గమనించి అంతర్గత దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఈ కుంభకోణాన్ని నడుపుతున్నారని, దీనివల్ల సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టాలు వచ్చాయని దర్యాప్తులో తేలింది. దీనిపై అమెజాన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అంతర్గత భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.