జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek)పై సైబర్‌దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్‌లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్(AI Chat Bot) సేవలందించే డీప్‌సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్‌సీక్‌కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్‌లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.
కంపెనీ స్పందన..
డీప్‌సీక్‌కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్‌సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీప్‌సీక్ ఆర్-1
భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్‌విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్‌ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.
ఇదీ చదవండి: భారత్‌లో క్రెడిట్ కార్డుల జోరు
ఆందోళనలు.. ‘డీప్’
గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్‌ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్‌డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్‌విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్‌విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట.
Comments
Please login to add a commentAdd a comment