చాట్‌జీపీటీ, డీప్‌సీక్.. సాధనాలకు చెక్
అధికారిక పరికరాల్లో చాట్‌జీపీటీ(ChatGPT), డీప్‌సీక్(Deepseek) వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధిస్తూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఐ టూల్స్, అప్లికేషన్‌లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అడ్వైజరీ హైలైట్ చేసింది. జనవరి 29, 2025 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం డేటా భద్రత, ప్రభుత్వ డాక్యుమెంట్ల గోప్యతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
నిషేధం ఎందుకు?
ఏఐ టూల్స్, అప్లికేషన్‌లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం వాటిల్లేలా ప్రవర్తిస్తాయని అడ్వైజరీ స్పష్టం చేసింది. ఈ సాధనాలు తరచుగా బయటి సర్వర్ల ద్వారా వినియోగదారు ఇన్‌పుట్‌లను ప్రాసెస్ చేస్తాయి. ఇది డేటా లీక్‌లకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డేటా భద్రతా ప్రమాదాలను ఉదహరిస్తూ ఇలాంటి ఆంక్షలు విధించాయి. దాంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
ఓపెన్ఏఐ సీఈఓ పర్యటన
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈరోజు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు అడ్వైజరీ వెలువడడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధికారిక, గోప్యమైన కమ్యూనికేషన్లలో ఏఐ ఆధారిత డేటా భద్రతా ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలను ఈ చర్య నొక్కి చెబుతోంది.
ఇదీ చదవండి: ‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’
డేటా భద్రతా చర్యలు అవసరం
ఈ నిషేధం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు కంప్యూటర్లు, డివైజ్‌ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించకూడదు. ఉద్యోగులు పని ప్రయోజనాల కోసం వ్యక్తిగత పరికరాలపై ఈ సాధనాలను ఉపయోగించవచ్చో లేదో ఆదేశాల్లో ప్రత్యేకంగా పేర్కొననప్పటికీ సౌలభ్యం కంటే డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. పని ప్రదేశాల్లో కృత్రిమ మేధ సాధనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చర్చ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున పటిష్టమైన డేటా భద్రతా చర్యల అవసరాన్ని కూడా ప్రభుత్వ నిర్ణయం ఎత్తి చూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment