సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్‌ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్‌సీక్ చాట్‌బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్‌సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్‌సీక్ ఓపెన్‌ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్‌ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
టోక్యోలో సమావేశాలు..
జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్‌లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్‌ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.
ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?
డీప్ రీసెర్చ్ ఎవరికంటే..
డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment