
దేశంలో అగ్ర ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు నిరాశను కలిగించే చేదు వార్తను చెప్పింది. ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.
వేతనాల పెంపును ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిశీలిస్తామని టీసీఎస్ తెలిపింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యాపార వాతావరణం మరింత స్థిరంగా మారడానికి వేచి చూస్తున్నామని కంపెనీ అగ్ర నాయకత్వం వెల్లడించింది. వేతనాల పెంపు ఎప్పుడు చేయాలనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ప్రస్తుత చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ ఆర్‌వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అనిశ్చిత మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రకటన ప్రతిబింబిస్తోంది.
ఇప్పటికే చాలా మంది క్లయింట్లు తమ వ్యయాన్ని తగ్గించుకునే సంకేతాలను చూపుతున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.కృతివాసన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే విచక్షణ వ్యయంలో జాప్యం జరుగుతుందన్నారు. టారిఫ్ సంబంధిత అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ బడ్జెట్లను సమీక్షిస్తున్నందున అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని లేదా తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వార్షిక వేతన పెంపును నిలిపివేసినప్పటికీ, టీసీఎస్ త్రైమాసిక వేరియబుల్ పేను కొనసాగిస్తుంది. నాలుగో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి అర్హత కలిగిన వేరియబుల్ వేతనం అందనుంది. మిగతా సిబ్బందికి వ్యాపార పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు.

బలంగానే నియామకాలు
వేతనాల పెంపు ఆలస్యమైనా ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ తెలిపింది. గత ఏడాది నియామకాల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది కాలేజీల నుంచి 42,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 625 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,979కి చేరింది.
మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 6,433 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అంతకుముందు సంవత్సరంలోని 13,249 క్షీణత నుంచి కోలుకుంది. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 13.3 శాతానికి చేరింది. ఇచ్చిన హామీ మేరకు 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసిందని లక్కడ్ తెలిపారు.
కాగా 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 0.79 శాతం పెరిగింది.