ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్‌.. | New Stricter Work From Office Guidelines For TCS Employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్‌..

Published Fri, Jan 17 2025 5:29 PM | Last Updated on Fri, Jan 17 2025 5:40 PM

New Stricter Work From Office Guidelines For TCS Employees

ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని (WFH)  పూర్తిగా తొలగించి వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్‌ అందులోనూ కీలక మార్పులు చేసింది.

ఆఫీస్‌ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ (WFO) విధానాన్ని టీసీఎస్‌ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్‌ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.

ఎంట్రీల్లోనూ పరిమితులు
ఇక ఒక ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపులను సమర్పించడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలైతే ఒకేసారికి ఐదు ఎంట్రీలు నివేదించవచ్చు. 10 రోజులలోపు పూర్తి చేయని మినహాయింపు అభ్యర్థనలు వాటంతటవే రిజెక్ట్‌ అవుతాయి. ఆలస్యంగా చేసే సమర్పణలకు సంబంధించి ప్రస్తుత తేదీ నుండి మునుపటి రెండు తేదీల వరకు మాత్రమే బ్యాక్‌డేటెడ్ ఎంట్రీకి  అనుమతి ఉంటుంది. అలాగే ప్రస్తుత నెలలో డబ్ల్యూఎఫ్‌వో ఎంట్రీ కేటగిరీ లేకపోతే తదుపరి నెల 5వ తేదీ వరకు దాన్ని నివేదించవచ్చని కంపెనీ నోట్ పేర్కొంది.

కార్యాలయ హాజరు ఆదేశం నుండి మినహాయింపులను అభ్యర్థించడానికి లార్జ్‌ స్కేల్‌ అప్‌లోడ్‌లు లేదా బ్యాకెండ్ ఎంట్రీలను టీసీఎస్‌ నిషేధించింది. ఐదు రోజుల వర్క్‌వీక్ హాజరు విధానాన్ని అవలంబించడంలో కొన్ని ఇతర భారతీయ ఐటీ సంస్థలతో పాటు టీసీఎస్‌ ముందంజ వేసింది. ఇతర సంస్థలు వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు కార్యాలయంలో హాజరును తప్పనిసరి చేశాయి.  హాజరు సమ్మతితో వేరియబుల్ పేని ముడిపెట్టాయి.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..

ఉద్యోగులు స్థిరత్వం సాధించిన తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసే అవకాశం ఉందని టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ హెడ్ మిలింద్ లక్కాడ్ చెప్పినట్లుగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత లక్కడ్ మాట్లాడుతూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు పూర్తి వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు అర్హులని, మిడ్‌, సీనియర్ లెవల్‌ సిబ్బంది వేరియబుల్ వేతనం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరించారు.

40,000 మంది నియామకం
టీసీఎస్‌ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగా అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.

టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని లక్కడ్‌ వెల్లడించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement