జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్ఫోసిస్ (Infosys) కీలక విషయం తెలిపింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం (IT Company) భారత్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 6-8 శాతం వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభించనుంది. ఇది దాని ప్రణాళికాబద్ధమైన వేతన సవరణలలో మొదటి దశ. రెండవది వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది.
"భారత్‌లో కాంప్ (వార్షిక వేతనాల పెంపు) 6-8% ఉంటుందని ఆశిస్తున్నాం. విదేశీ కాంప్‌లు మునుపటి కాంప్ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి" అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల (Q3FY25) వెల్లడి సందర్భంగా మీడియాతో అన్నారు.
బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
కాగా వేతన పెంపు ప్రభావం మార్జిన్‌లపై ఏ మాత్రం పడుతుందన్నది లెక్కించలేదని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం, 2026 మొదటి త్రైమాసికంలో "కొన్ని ఎదురుగాలులు" తప్పవని సంఘ్‌రాజ్కా పేర్కొన్నారు. మరోవైపు భారత్ వెలుపల ఉండే ఉద్యోగులకు కూడా జీతం పెంపు సింగిల్ డిజిట్‌లోనే మునుపటి వేతన సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఇక అధిక పనితీరు కనబరిచేవారికి ఎలాగూ వేతన పెంపు కాస్త ఎక్కువగానే ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ క్యూ3 ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ వెల్లడించారు.
రూ.6,806 కోట్ల లాభం
ఏదేమైనా ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలను (Q3 Results) సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.
ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’ టెకీ పోస్ట్ వైరల్
ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment