‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్‌ మానేశా’ | Pune techie quits Infosys without offer in hand cites 6 reasons in viral post | Sakshi
Sakshi News home page

‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్‌ మానేశా’ టెకీ పోస్ట్‌ వైరల్‌

Published Sat, Jan 11 2025 2:18 PM | Last Updated on Sat, Jan 11 2025 2:24 PM

Pune techie quits Infosys without offer in hand cites 6 reasons in viral post

దేశంలో టాప్‌ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్‌ ఆఫర్‌ లేదు.. అయినా ఇన్ఫోసిస్‌లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్‌ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌లో పంచుకోగా ఆ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరో ఆఫర్‌ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు.

"నేను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

జాబ్‌ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు
» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.

» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.

» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్‌వెయిట్‌గా భావించేలా చేసింది.

» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.

» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.

» ఆన్‌సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్‌సైట్ అవకాశాలు మెరిట్‌ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.

ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్‌

కంపెనీల్లో పని  సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్‌ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement