
కాపీరైట్ సంస్కరణపై మార్పులు అవసరం
కృత్రిమ మేధ (AI) ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ సంస్కరణల్లో నిబంధనల కారణంగా అమెరికన్ కంపెనీలు చాలా వెనుకబడిపోతాయని, చైనీస్ డెవలపర్లు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశాలు కనుగొంటున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ వ్యత్యాసం ఏఐ రేసులో చైనాను ముందుంచేందుకు వీలు కల్పిస్తుందని వాదించింది. ఇటీవల యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)కు ఇచ్చిన ప్రకటనలో ఈమేరకు వివరాలు వెల్లడించింది.
టెక్నాలజీపై ఆదిపథ్యం కోల్పోయే ప్రమాదం
‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) డెవలపర్లకు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశం ఉంది. అమెరికా కంపెనీలకు అలాంటి అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ముగిసిందనే చెప్పవచ్చు. నిజమైన ఐపీ క్రియేటర్లకు రక్షణల విషయంలో పెద్దగా ప్రయోజనం లేకపోగా, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా సంరక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత విధానం కాపీరైట్ కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అయితే చైనా అటువంటి డేటాను కృత్రిమ మేధ శిక్షణ కోసం స్వేచ్ఛగా ఉపయోగిస్తోంది. ఇది చైనా ఏఐ సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలో ముందుంచుతుంది’ అని ఓపెన్‌ఏఐ తెలిపింది.
డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరిన్ని ఆవిష్కరణలు
ఇటీవల ముగిసిన పబ్లిక్ కామెంట్ పీరియడ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ యాక్షన్ ప్లాన్‌పై ‘ఫ్రీడమ్-ఫోకస్డ్’కు సంబంధించి ఓపెన్ఎఐ సిఫార్సులను అందించింది. ఏఐ పరిశ్రమలో ‘నేర్చుకునే స్వేచ్ఛ’ను ప్రోత్సహించడానికి తన కాపీరైట్ వ్యూహాన్ని మార్చడం ద్వారా అమెరికా మరింత ముందంజలో ఉంటుందని తెలిపింది. లేదంటే పీఆర్సీలు యూఎస్ కంపెనీలు యాక్సెస్ చేయలేని కాపీరైట్ డేటాను వినియోగించి ఈ విభాగంలో దూసుకుపోతాయని పేర్కొంది. సాధ్యమైనంత విస్తృత శ్రేణి వనరుల నుంచి ఎక్కువ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరింత శక్తివంతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని, ఇది మరింత జ్ఞానాన్ని అందిస్తుందని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?
ఇప్పటికైతే ముందువరుసలో అమెరికానే..
ఇటీవల యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని అధిగమించిన చైనీస్ ఏఐ మోడల్ డీప్‌సీక్ ఆర్1 వంటి ఏఐలతో అమెరికా ఏఐ ఆదిపత్యానికి ముప్పు పొంచి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా ముందంజలో ఉండగా, డీప్‌సీక్ మాత్రం తమ ఆధిక్యం విస్తృతంగా లేదని, కుంచించుకుపోతున్నట్లు చూపిస్తోందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి కాపీరైట్ డేటా వినియోగించుకునేందుకు వీలుగా మరిన్ని మార్పులు చేసి మెరుగైన ఏఐ శిక్షణకు సహకరించాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో అభ్యర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment