
‘డీప్ సీక్ ఆర్–1’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్‌ను ‘డీప్ సీక్’ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్‌లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్ జీపీటీ’ (Chat GPT) మోడల్ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్‌గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్ సీక్ ఆర్–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్‌సీక్ తయారు చేసింది.
గూగుల్ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్ సీక్ కంటే ముందుగానే మార్కెట్‌లోకి వచ్చినా చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్ జీపీటీకి డీప్ సీక్ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్‌లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్ సీక్ ఏపీఏ ధరలు చాట్ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్స్‌లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.
డీప్ సీక్ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్‌లు భారీగా పతనం అయ్యాయి. డీప్ సీక్ (DeepSeek) వంటి మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్‌లను అమెరికాలోని ఎన్‌వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్‌ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్ సీక్ తయారీకి ఎన్‌వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్‌వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్‌లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.
ఈ నేపథ్యంలో డీప్ సీక్ ‘ఐపీ అడ్రస్‌ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్ సీక్‌పై భారీ సైబర్ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్ ముప్పుఉండటం, డీప్ సీక్ మోడల్‌లో చైనీస్ సెన్సార్ షిప్ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్‌కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్‌పై అనుమానాలు కలిగిస్తున్నాయి.
డీప్ సీక్ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్‌ని తయారు చేయటానికి మార్కెట్‌లో అనువైన కాంపిటీషన్ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్ సీక్‌ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.
చదవండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!
ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్ జీపీటీ, డీప్ సీక్‌లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.
– శ్రీరామ్ సుదర్శన్
ఏఐ పరిశోధక విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment