
భారత పర్యటనలో కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వెల్లడి
మంత్రులు, పరిశ్రమ దిగ్గజాలతో భేటీ
న్యూఢిల్లీ: కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన తమ చాట్‌జీపీటీకి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్‌గా మారిందని ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. దేశీయంగా చాట్‌జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది మూడు రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు పది రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ రంగం అసాధారణంగా పురోగమిస్తోందని తెలిపారు.
భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆల్ట్‌మన్ ఈ విషయాలు తెలిపారు. పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ, స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్, అన్‌అకాడెమీ సీఈవో గౌరవ్ ముంజాల్ తదితర పరిశ్రమ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లాంటి కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్‌మన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆల్ట్‌మన్‌కి వైష్ణవ్ కౌంటర్
చాట్‌జీపీటీలాంటి ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్‌పై అసలు ఆశలే లేవంటూ రెండేళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్‌మన్‌కి తాజాగా మంత్రి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రుడి మీదకు అత్యంత చౌకగా చంద్రయాన్–3 మిషన్‌ను అమలు చేసిన భారత్‌కి.. అత్యంత తక్కువ ఖర్చులోనే ఏఐని కూడా రూపొందించే సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సొంతంగా చిప్‌సెట్లను తయారు చేసుకోవడం, అత్యంత చౌకగా కంప్యూటింగ్ సామర్థ్యాలను అందించడం నుంచి ప్రాంతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా మోడల్స్‌కి శిక్షణనిచ్చే డేటా సెట్లను రూపొందించే వరకు ఏఐ సంబంధిత పూర్తి వ్యవస్థను తీర్చిదిద్దడంపై భారత్ కసరత్తు చేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment