
ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ మీద ఇటీవల జరిగిన ప్యారిస్ శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది
అభిప్రాయం
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్‌సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్‌లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది.
దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి.
ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు.
పొంచివున్న ప్రమాదాలు
ఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్‌పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!
కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు.
ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్‌లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.
ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు.
నియంత్రణా? సృజనా?
ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు.
సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్‌పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి.
టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్‌సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు.
వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి.
మూడు సూత్రాలు
1942లో ప్రసిద్ధ సైన్స్‌ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్‌కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు!
ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌స అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment