![Sakshi Editorial On Artificial Intelligence](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/AI.jpg.webp?itok=1iUl1sq_)
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది.
చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది.
ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది.
అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది.
ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు.
రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది.
మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది.
ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి.
Comments
Please login to add a commentAdd a comment