చోక్సీ కథ కంచికేనా! | Sakshi Editorial On Mehul Choksi | Sakshi

చోక్సీ కథ కంచికేనా!

Published Wed, Apr 16 2025 5:46 AM | Last Updated on Wed, Apr 16 2025 5:46 AM

Sakshi Editorial On Mehul Choksi

ప్రపంచంలో మనుషుల్ని అమెరికన్‌ వ్యంగ్య రచయిత జార్జి ప్రెంటిస్‌ మూడు రకాలుగా విభజించాడు – కలవారు, లేనివారు, అప్పులు చెల్లించనివారు. కానీ ఆయన గమనించి వుండకపోవచ్చు గానీ... మన దేశంలో ఇంకోరకం ఘరానా మనుషులున్నారు– కేవలం ఎగ్గొట్టడానికే అప్పులు చేసే వారు! పైగా అందుకోసం ప్రభుత్వరంగ బ్యాంకుల్ని మాత్రమే ఎంచుకునేవారు!! ఆ బాపతు మోసగాళ్లలో అగ్రభాగానవున్న మెహుల్‌ చోక్సీ ఏడేళ్ల తర్వాత బెల్జియంలో పట్టుబడ్డాడు. ఆయనగారు దొరకడం ఇది మొదటిసారేమీ కాదు. 

2021 మే నెలలో వెస్టిండీస్‌కు దగ్గర్లో కరీబియన్‌ సముద్ర ప్రాంత ద్వీప దేశమైన యాంటీగాలో మన సీబీఐ బృందం అరెస్టు చేసింది. అప్పటికే చోక్సీ ఆ దేశ పౌరసత్వం తీసుకోవటం, యాంటీగాతో మనకు నేరస్తుల మార్పిడి ఒప్పందం లేకపోవటం పర్యవ సానంగా విడుదల చేయక తప్పలేదు. తనకొచ్చిన ప్రాణాంతక వ్యాధికి చికిత్స కోసం బెల్జియం రావటంవల్లా, ఆ దేశంతో మనకు నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉండటంవల్లా ఎట్టకేలకు అరెస్టయ్యాడు. 

మన బ్యాంకులు సాధారణ రైతులు, మధ్యతరగతి ప్రజానీకం అప్పుకోసం వస్తే సవాలక్ష  యక్ష ప్రశ్నలతో వేధిస్తాయి. అనుమానాస్పద వ్యక్తుల్ని చూసినట్టు చూస్తాయి. కానీ మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యావంటి మోసగాళ్లకు రెడ్‌కార్పెట్‌ పరుస్తాయి. అడిగిందే తడవు ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వడానికి సిద్ధపడిపోతాయి. మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీ ఇద్దరూ బంధువులు మాత్రమే కాదు... జంట కేటుగాళ్లు. వీరిద్దరూ ఎంత లాఘవంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును దోచారంటే– 2011లో మోసాలు మొదలెడితే దాన్ని ఆనవాలు కట్టడం 2018 వరకూ బ్యాంకు సిబ్బందికి సాధ్యమే కాలేదు. 

ఇది బ్యాంకుల చేతగానితనం అనుకోవాలా, ఉన్నతస్థాయిలో పనిచేసే వారి చేతివాటం అనుకోవాలా? లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ (ఎల్‌ఓయూ)ల్ని బ్యాంకునుంచి అపహరించి రూ. 13,500 కోట్లు కొట్టేశారంటే బ్యాంకు ఉన్నతాధికారగణం నిద్రపోయినట్టా, నిద్ర నటించినట్టా? ఈ ఎల్‌ఓయూలతో ఇద్దరూ విదేశీ ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులనుంచి వేల కోట్ల రూపాయలు కొట్టేశారు. ఎల్‌ఓయూలను ఆమోదించేముందు వాటిని జారీచేసిన ప్రధాన బ్యాంకును సంప్రదించటం తప్పనిసరి. 

అదేం జరగలేదు సరిగదా బ్యాంకు అంతర్గత ఆడిట్‌లో సైతం ఇది లెక్కకు రాకుండా చూసుకోవటం వీరిద్దరి ప్రత్యేకత! మోసం బయటపడినప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు పోయిన సొమ్మెంత అన్న స్పృహ కూడా లేదు. మొదట రూ. 11,000 కోట్లని నిర్ధారణ చేయగా, తవ్వినకొద్దీ బయటపడుతూ అది పాపం పెరిగినట్టు పెరిగి చివరకు రూ. 13,500 కోట్ల దగ్గర ఆగింది. 

కనీసం అప్పనంగా కొట్టేసిన డబ్బుతో ‘అధికారికంగా’ ఉన్న బాకీలో కాస్తయినా తీర్చుదామని వారనుకోలేదు. ఎల్‌ఓయూ ద్వారా తీసుకునే అప్పును మూణ్ణెల్లలో తీర్చేయాలి. కొనసాగించదల్చుకుంటే దానిపై వడ్డీ ఉంటుంది. కానీ అప్పిచ్చిన బ్యాంకులు కనీసం వడ్డీ వసూలుకు కూడా ప్రయత్నించలేదు.

అయినా బ్యాంకులు మేల్కొన్నాయా? నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) చిట్టా గమనిస్తే పెద్దగా సంతో షించాల్సింది కనబడదు. 2019లో రూ. 7.3 లక్షల కోట్ల మేర ఉన్న ప్రభుత్వ బ్యాంకుల ఎన్‌పీఏలు నిరుడు రూ. 3.4 లక్షల కోట్లకు తగ్గాయి. కానీ ఇంకా మొండి బకాయిలు రూ. 3.9 లక్షల కోట్లు న్నాయి. ఎగవేతదారులకు రాజకీయ ప్రాపకం దొరకటం, అది బ్యాంకులకు సమస్యగా మారటం ఇందుకు కారణం కావొచ్చు. 

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగు దేశం నుంచి ఆ పంచన చేరిన ఇద్దరు నాయకులు ఎగవేతదారులే. అందులో ఒకరు కేంద్రమంత్రి పదవి కూడా వెలగబెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. మరొకరు ఎంపీ. నిజంగా బ్యాంకులు తమ బకాయిలు రాబట్టుకోవటానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం వుండదు. 

చోక్సీ సంగతే తీసు కుంటే పరారయ్యాక అతగాడి దుకాణాన్ని సీజ్‌ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్కడ రూ. 5,000 కోట్ల కిమ్మత్తు చేసే వజ్రాలున్నాయని ప్రకటించింది. తీరా వాటిని లెబోరేటరీల్లో పరీక్షిస్తే అన్నీ నకిలీ వని తేలింది. ఇతరేతర స్థిరాస్తులు రూ. 2,500 కోట్లుగా తేల్చారు. కానీ కొట్టేసిన సొమ్ముతో పోలిస్తే, దానికి ఇప్పటివరకూ అయిన వడ్డీ కూడా జతచేస్తే అది ఏ మూలకు? థాయ్‌లాండ్, దుబాయ్, జపాన్, అమెరికాల్లో చోక్సీకున్న ఆస్తుల విలువ దాదాపు వంద కోట్లని చెబుతున్నారు. 

చోక్సీ అరెస్టు మన ప్రభుత్వ దౌత్య విజయమని, దేశం గర్వించదగ్గదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ చెబుతున్నారుగానీ అంతగా సంతోషించదగ్గదేమీ లేదు. ఎందుకంటే, చోక్సీ తోడుదొంగ నీరవ్‌ మోదీ 2019లో లండన్‌లో అరెస్టుకాగా ఇప్పటికీ అక్కడి న్యాయస్థానాల్లో తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నాడు. ఈ వరస ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. బెల్జియం న్యాయస్థానాలు సైతం చోక్సీ అప్పగింతపై ఓ పట్టాన నిర్ణయం తీసుకోవు. 

మానవ హక్కుల ఉల్లంఘన, నిర్బంధంలో చిత్రహింసలు వగైరా కారణాలు చూపుతూ ఏళ్ల తరబడి కాలక్షేపం చేయగలడు. బ్యాంకులకు రూ. 9,000 కోట్లు ఎగ్గొట్టి పరారైన విజయ్‌ మాల్యా కేసు గతీ అంతే. 2017లో అరెస్టయ్యాక బెయిల్‌పై విడుదలై ఇప్పటికీ తనను భారత్‌ పంపకుండా న్యాయస్థానాల్లో అడ్డుకుంటున్నాడు. వీరందరినీ వెనక్కి తీసుకొచ్చి శిక్షపడేలా చూస్తే పోగొట్టుకున్న డబ్బు రాకపోయినా కనీసం అలాంటి మోసగాళ్లకు అదొక హెచ్చరికగా ఉంటుంది. కానీ అది కూడా అత్యాశేనని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement