fraudsters
-
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్‌ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
కొనుగోలు మోసాలతో.. కునారిల్లుతున్న రైతు
తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ఎవరున్నా రైతు మాత్రం పచ్చి మోసానికీ, దోపిడీకీ గురవుతున్నాడు. ముఖ్యంగా పండిన పంట అమ్ముకునే క్రమంలో రైతులను వడ్ల కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జాబు తిరుపతి అనే కౌలురైతు ఉదంతం.తిరుపతి దాదాపు నలభై రోజుల క్రితం 40 కేజీల తూకంతో ఉన్న 297 బస్తాల రబీపంట ధాన్యం మొత్తాన్నీ స్తంభనపల్లి ‘ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ’ (పీఏసీఎస్–ప్యాక్స్) వడ్ల కొనుగోలు కేంద్రాని (పీపీసీ)కి అమ్మాడు. ఈ పీపీసీ బాధ్యుడు ఆశ పవన్. ఈ ధాన్యం విలువ రూ. 2,61,716. అయితే వడ్లు కొన్నట్లుగా పవన్ ఎలాంటి రసీదును ప్యాక్స్ తరఫున ఇవ్వలేదు. కౌలు రైతు తన వడ్ల డబ్బుల కోసం, బ్యాంకు పాస్‌బుక్, కౌలు ధ్రువీకరణ తదితర పత్రాలన్నింటిన్నీ ప్యాక్స్‌కు అందించాడు.తిరుపతి అమాయకత్వాన్ని గమనించిన పవన్ తన స్నేహితుడైన గుండెల్లి ప్రవీణ్‌తో కుమ్మక్కై అతని డబ్బును కాజేశాడు. పథకం ప్రకారం పవన్ తన స్నేహితుడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి, ‘నీ ఖాతాలో జాబు తిరుపతి అనే రైతు డబ్బులు వేస్తున్నా’నని పదే పదే చెప్పి మరీ వేశాడు.పవన్ వడ్లు అమ్మిన రైతుకు, రసీదు ఇవ్వకపోవడం మొదటి తీవ్రమైన తప్పు. రైతు ఖాతాలో డబ్బులు వేయకుండా ఆ డబ్బులు మిత్రుని ఖాతాలో వేయడం తీవ్రమైన నేరం. పాక్స్ –1964 చట్టం, తెలంగాణ పౌరసరఫరాల చట్టాల ప్రకారం అత్యంత నేరపూరితమైన చర్య. జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు, పౌరసరఫరాల అధికారికి, జిల్లా సహకార సంఘం (ప్యాక్స్ ఉన్నత) అధికారికి, స్థానిక పోలీసు సీఐకీ, బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. ప్యాక్స్ సంఘాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించే జిల్లా సహకార సంఘం అధికారులు తమ కింది సంఘాలు రైతుల పట్ల పాల్పడుతున్న ఘోరమైన మోసాన్ని గుర్తించారు.ఈ ప్యాక్స్‌కు ఆర్థిక వనరులు అంటే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, వరి ధాన్యం కొనుగోలు ఇలా అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. వీటి ద్వారా భారీ ఎత్తున డబ్బు వస్తుంది. ప్యాక్స్ చట్టం ప్రకారం ఈ డబ్బుతో మోసపోయిన రైతుకు డబ్బు చెల్లించాలి. ప్యాక్స్ చట్టం –1964 ప్రకారం రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు. నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలి. ఇలా రైతులను మోసం చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ చట్టం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం ఆ ప్యాక్స్ పరిధిలో మోసం చేసిన వారిని విచారించి వారి ఆస్తులను వేలం వేసి సమానమైన డబ్బును ప్యాక్స్‌కు జమకట్టాలని 1964 చట్టం చెబుతుంది. ధాన్యం కొలుగోల్లలో రైతులకు ఎలాంటి మోసం జరిగినా తానే బాధ్యుణ్ణి అని కొనుగోలు కేంద్రాల బాధ్యులందరితో ప్రతి ఏటా ప్రమాణ పత్రాలు తీసుకోకపోవడం ప్రభుత్వాలు చేస్తున్న పెద్ద తప్పు.జాబు తిరుపతికి తను అమ్మిన ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్యాక్స్ రసీదు ఇచ్చి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. జరిగినా రసీదు అనే ఆధారం ఉండేది. డబ్బులు వాటికవే రైతు ఖాతాకు వచ్చేవి. తెలంగాణలో ధాన్యం అమ్మిన లక్షలాది మంది రైతులలో చాలామందికి రసీదులు ఇవ్వక పోవడం వారికి సామూహికంగా జరుగుతున్న అన్యాయం. రసీదులో రైతు ధాన్యం బరువు కచ్చితంగా తెలుస్తుంది. ఇవ్వవలసిన డబ్బులు ఎంత అనేది తెలుస్తుంది. రైతుకు రసీదు ఇచ్చిన తరువాత ధాన్యానికి సమానమైన ధర చెల్లించక తప్పదు. రసీదు ప్రకారం అమ్మకం జరిగిన నాటి ధాన్యం బరువులో కోత విధించకూడదు. ధాన్యం నాణ్యత బాగాలేదు, తేమ ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఇలా అనేక విషయాల్లో పీపీసీ బాధ్యుడి అన్యాయాలకు రసీదు సంకెళ్లు వేస్తుంది.ఈ రబీ పంట కాలంలో 40 కిలోల వడ్ల బస్తాకు మూడున్నర కిలోల చొప్పున మిల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా రైతులను దోచుకున్నారు. అంటే క్వింటాల్‌కు 7–8 కిలోల చొప్పున రైతాంగాన్ని యధేచ్ఛగా దోపిడీ చేశారు. ప్రతి క్వింటాల్‌కు రైతును రూ. 160 చొప్పున మిల్లర్లు దోచుకున్నారు. ఈ లెక్కన తెలంగాణ అంతటా కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం ఎంత? దోపిడీ ఎంత అనేది గణిస్తే తేలికగా దోపిడీ అర్థమవుతుంది.జరిగిన మరో పెద్ద మోసం అన్ని రకాల వడ్లను గ్రేడ్ల వారీగా కాకుండా, ఓకే సాధారణ వెరైటీ కింద మిల్లర్లు కొనుగోలు చేయడం. ఇందులో జరిగిన మిల్లర్ల దోపిడీ మాయాజాలం ఏమిటి? ఏ– గ్రేడ్ సన్న రకం వడ్లకు రూ. 2,203 కాగా బీ–గ్రేడ్ కు రూ. 2,183. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ఏ ఒక్క క్వింటాల్ ధాన్యానికీ గ్రేడ్ల వారీగా ధర చెల్లించిన దాఖలా లేదు. అంటే ప్రతి క్వింటాల్ ధాన్యానికి రైతు రూ. 20 నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్‌కు మిల్లర్ రూ. 20 దోచుకున్నాడు. దీన్నిబట్టి రాష్ట్రం మొత్తం కొనుగోళ్లలో దోపిడీ ఎంత భారీ స్థాయిలో జరిగిందో గుర్తించవచ్చు. అలాంటప్పుడు ఏ– గ్రేడ్, బీ– గ్రేడ్ లేదా సన్న, దొడ్డు రకాలు అని వేరువేరుగా విభజన చేయడం, గుర్తించడం ఎందుకు? ఏ– గ్రేడ్ వడ్లు పండించడానికి రైతు చేసిన ప్రత్యేక శ్రమ, ఖర్చులకు సస్యరక్షణకు విలువ ఏమిటి?సన్న వడ్లకే రూ. 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం ఒక మోసం కదా? ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు బోనస్‌గా క్వింటాల్‌కు రూ. 500 చెల్లిస్తామన్నారు. నిజానికి సన్న, దొడ్డువడ్లు అనే విభజన అమలులో లేదు. ఎన్నికల తర్వాత మాట మార్చడం ఏమి నీతి? ఈ సన్న రకాలకు గత ఖరీఫ్ సీజన్లో బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 2,800– 3,000 వరకు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వం ఇచ్చే బోనస్‌తో కలుపుకుని 2,703 రూపాయలు మాత్రమే (రూ. 2,203+500) రైతుకు వస్తుంది. గత ఖరీఫ్ బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే, ప్రతి క్వింటాల్‌కు రైతు వంద రూపాయల నుండి 300 వరకూ నష్టపోతున్నాడు. ఇది రైతాంగానికి తలపెట్టిన సామూహిక మోసం కాదా?పదేళ్ల కేసీఆర్ పాలనలో ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వ ప్యాక్స్, డీసీఎమ్ఎస్ల దోపిడీ యధేచ్చగా సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇదొక కారణం. గత పదేళ్ల దోపిడీని గుర్తించి కొన్ని ప్రాంతాలలో ప్యాక్స్ డీసీఎంఎస్‌లకు ఈ రబీ సీజన్లో ఒక్కటంటే ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వలేదు. వీరి స్థానంలో ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను ఇచ్చారు.కేసీఆర్ పాలనలో దోపిడీకి అలవాటు పడ్డ ఒక ప్రభుత్వ ప్యాక్స్ సంఘమే, తమది రైతు రాజ్యం అని చెబుతున్న ప్రభుత్వ హయాంలో ఓ అమాయక నిరుపేద కౌలు రైతు మొత్తం కష్టాన్నీ నిట్ట నిలువునా దోచుకుంది. భూమి కౌలు, పెట్టుబడుల భారం, అప్పుల వాళ్ళ ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు ఆ రైతు యత్నిస్తే, బంధుమిత్రులు ఆపారు. పంట అమ్మి నేటికీ 40 రోజులవుతోంది. ప్రభుత్వం ప్యాక్స్ సంఘంతో కౌలు రైతు కష్టం ఇప్పిస్తారా? ఈ ‘రైతు రాజ్యం’లో ఏం జరుగుతుందో చూద్దాం!అభిప్రాయం: – నైనాల గోవర్ధన్, వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్, 97013 81799ఇవి చదవండి: బాల్యానికి భరోసా ఏదీ? -
ఆర్థిక మోసాలపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం కేవైసీ నిబంధనలను కఠినతరం చేయడం, బిజినెస్ కరెస్పాండెంట్లను (బీసీ) చేర్చుకునేటప్పుడు మదింపు ప్రక్రియను మరింత పటిష్టం చేసేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించడం మొదలైన అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే వ్యాపారులు, బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) మదింపు ప్రక్రియను పటిష్టం చేయడమనేది మోసాల నివారణతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు దోహదపడగలదని వివరించాయి. సాధారణంగా వ్యాపారులు, బీసీల వద్దే డేటా ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే డేటాకు భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. సైబర్ మోసాలకు హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల్లో బీసీలు ఎక్కువగా ఉండటాన్ని, వారి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పునఃసమీక్షించుకోవాలని, మోసాల్లో ప్రమేయమున్నట్లుగా తేలిన మైక్రో ఏటీఎంలను బ్లాక్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక మోసాల నివారణపై ఇటీవల జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ మేరకు సూచనలు వచి్చనట్లు పేర్కొన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2023లో రూ. 7,489 కోట్ల సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించి 11,28,265 కేసులు నమోదయ్యాయి. -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
స్టాక్‌మార్కెట్ పేరుతో అక్రమ సంపాదన.. సెబీ కొరడా!
సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని స్టాక్మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వెనకేసిన ఓ వ్యక్తిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్కెట్ నుంచి నిషేధించింది. అంతేకాదు సంపాదించిన సొమ్మునంతటినీ ఎస్క్రో ఖాతా (తాత్కాలిక థర్డ్‌పార్టీ అకౌంట్)లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో 'బాప్ ఆఫ్ చార్ట్' (Baap of Chart) పేరుతో ప్రొఫైల్‌ను నడుపుతున్నాడు. అందులో స్టాక్ మార్కెట్లో కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన సిఫార్సులను అందించేవాడు. అంతేకాకుండా మార్కెట్‌పై అవగాహన కోర్సులు నిర్వహించేవాడు. ఇలా చట్టవిరుద్ధంగా రూ. కోట్లు సంపాదించాడు. బాప్ ఆఫ్ చార్ట్ లేదా మరేదైనా పేరుతో పెట్టుబడి సలహాదారులుగా వ్యవహరించరాదని సెబీ తన ఆదేశాల్లో మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీని హెచ్చరించింది. అలాగే చట్టవిరుద్ధంగా సంపాదించిన సుమారు రూ.17.20 కోట్లను ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ఎస్క్రో ఖాతాను తెరిచి 15 రోజులలోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఖాతాపై సెబీకి తాత్కాలిక హక్కు ఉంటుందని, సెబీ అనుమతి లేకుండా అందులోని సొమ్మును విడుదల చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌గా.. మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తనను తాను స్టాక్ మార్కెట్ నిపుణుడిగా ప్రమోట్ చేసుకున్నాడని, మార్కెట్‌పై తాను అందించే కోర్సులలో చేరాలని పెట్టుబడిదారులను ఆకర్షించాడని సెబీ పేర్కొంది. తన సలహాలను పాటిస్తే ఖచ్చితమైన లాభాలు వస్తాయని నమ్మించి సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేలా వారిని ప్రేరేపించాడని వివరించింది. ఇటువంటి మోసపూరిత, నమోదుకాని పెట్టుబడి సలహా కార్యకలాపాల ద్వారా మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ రూ. 17.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సెబీ తెలిపింది. -
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
ఏఐ ఫేస్ స్కాం.. వీడియోలో స్నేహితుని ముఖం చూపించి...
జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు మనిషి టెక్నాలజీని వీలైనంత మేరకు వినియోగిస్తున్నాడు. తాజాగా ఇదే కోవలో మనిషి జీవితంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రవేశించింది. దీనిని అందరూ ఒక అద్భుతంగా భావిస్తున్నారు. అయితే ఇంతలోనే ఏఐని అక్రమ కార్యకలాపాలకు వినియోగించడం కూడా మొదలయ్యింది. డీప్ ఫేక్ ఇమేజ్, వీడియో టూల్ మొదలైనవి ఆన్లైన్ మోసాలకు ఉపకరించేవిగా మారిపోయాయి. ఇటువంటి మోసం ఒకటి చైనాలో చోటుచేసుకుంది. ఉత్తర చైనాకు చెందిన ఒక వ్యక్తి డీప్ ఫేక్ టెక్నిక్ ఉపయోగించి ఐదు కోట్లకుపైగా మొత్తాన్ని కొల్లగొట్టాడు. డీప్‌ఫేక్ అంటే ఫేక్ డిజిటల్ ఫొటో, దీని ఆధారంగా రూపొందించే వీడియో చూసేందుకు నిజమైనదిగానే కనిపిస్తుంది. దీని ఆధారంగా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే అవకాశం ఏర్పడుతుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తర చైనాకు చెందిన ఒక మోసగాడు డీప్ ఫేక్ టెక్నిక్ సాయంతో ఒక వ్యక్తి నుంచి తన ఖాతాలోకి కోట్లాది రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. స్కామర్.. ఏఐ- వైఫై ఫేస్ స్వైపింగ్ టెక్నిక్ సాయంతో ఈ మోసానికి పాల్పడ్డాడు. బావోటా సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోసగాడు వీడియో కాల్లో స్నేహితునిగా మారి, అతని నుంచి 4.3 మిలియన్ల యువాన్లు(సుమారు రూ. 5 కోట్లు) ట్రాన్స్ ఫర్ చేయాలని కోరాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని నమ్మి, తాను డబ్బులు టాన్స్‌ఫర్ చేశానని తెలిపాడు. అయితే తన స్నేహితుడు అసలు విషయం చెప్పడంతో మోసపోయానని గ్రహించానన్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! -
దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా
సాక్షి, హైదరాబాద్: టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో చిక్కుకున్న ఓ మహిళ దాదాపు రూ.10 లక్షలు నష్టపోయింది. ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఉత్తరాదికి చెందిన నలుగురి ఖాతాల్లోకి ఆ డబ్బు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వారిని పట్టుకోగా.. వాళ్లంతా నిందితులుగా మారిన బాధితులని వెల్లడైంది. ప్రత్యేక ప్రోగ్రామింగ్‌తో వ్యవహారం... వివిధ రకాలైన సోషల్ మీడియా లింకుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎర వేస్తున్న నేరగాళ్లు తమ మోసాల కోసం ఆయా యాప్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు బాధితులు పెట్టిన పెట్టుబడికి 50 నుంచి 80 శాతం లాభాలు రావడంతో పాటు ఆ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ తర్వాత నుంచి లాభం వచ్చినట్లు యాప్‌లో కనిపించినా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతిసారీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుతూ పోవాల్సిందే. ఇన్వెస్ట్ చేయగానే నిర్ణీత కాలంలో ఆ మొత్తం రెట్టింపు అయినట్లు యాప్‌లో కనిపిస్తుందే తప్ప తీసుకునే అవకాశం ఉండదు. హఠాత్తుగా కనిపించకుండా పోతూ... ఇలా బాధితుడి నుంచి కొంత మొత్తం వచ్చిన తర్వాత యాప్‌లో పెట్టుబడి ఆగిపోతుంది. ఆపై హఠాత్తుగా ఆ యాప్‌లోని బాధితుడి ఖాతా ఇక ఓపెన్ కాకుండా అదృశ్యమైపోతుంది. రోజూ రూ.లక్షలు కాజేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌లో చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. బాధితులను సంప్రదించి ఖాతాలుకావాలంటూ.. పావులుగా మార్చి ఈ మోసగాళ్లు తమ వలలో పడి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టపోయిన వారినే పావులుగా చేసుకుంటున్నారు. బాధితులతో సంప్రదింపులు జరుపుతూ పోగొట్టుకున్న డబ్బు వెనక్కురావాలంటే తమకు కొన్ని బ్యాంకు ఖాతాలు కావాలంటూ కోరుతున్నారు. ఒక్కోఖాతాను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఇస్తామంటూ ఆశపెడుతున్నారు. పోగొట్టుకున్న సొమ్ముల్లో ఎంతో కొంత వస్తుందని ఆశ పడిన బాధితులు ఇందుకు అంగీకరించి తమ కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల పేర్ల మీదా ఖాతాలు తెరుస్తున్నారు. అక్కడ నుంచే వీటిని ఆపరేట్ చేస్తూ.. ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌లను వాట్సాప్ ద్వారా బాధితులు సూత్రధారులకు పంపిస్తున్నారు. ఆపై వాళ్లు చెప్పే చిరునామాలకు లింకై ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించిన సిమ్‌కార్డులను కొరియర్ చేస్తున్నారు. వీటిని దగ్గర ఉంచుకుంటున్న సూత్రధారులు ఇక్కడ టార్గెట్ చేసిన వారితో నగదు ఈ ఖాతాల్లోనే వేయించుకుంటున్నారు. కేసు నమోదై, పోలీసులు దర్యాప్తు చేపట్టినా బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నాటి బాధితుల వద్దకే వెళ్లి ఆగిపోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోయాయని చెప్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్టిమెంట్స్ వద్దని స్పష్టం చేస్తున్నారు. -
పాపం..! నిరుద్యోగులే.. అతని దొంగ ఉద్యోగానికి బలి పశువులు..!!
-
అసలు డౌట్ రాలేదు.. అక్షరం మార్చి రూ. కోటి కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలు చేసే కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. అకౌంట్ టేకోవర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయం వరకు వేచిచూసి బ్యాంక్ ‘ఖాతా’ మార్చేయడం ద్వారా తేలిగ్గా సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారినపడి 1.39 లక్షల డాలర్లు (రూ.1.15 కోట్లు) చెల్లించి.. అతికష్టం మీద తిరిగి పొందిన హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఎల్రక్టానిక్ వస్తువుల కోసమని.. బ్యాటరీలు, పలు రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసే హెచ్‌బీఎల్ సంస్థ.. పలు రకాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన ఎక్సెల్ పాయింట్ అనే సంస్థ నుంచి మైక్రో కంట్రోలర్లు, చిప్‌ల కొనుగోలు కోసం సంప్రదింపులు జరిపింది. ఎక్సెల్ పాయింట్ సంస్థకు మన దేశంలోని పెద్ద నగరాల్లోనూ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలోని ఓ కార్యాలయంలో పనిచేసే నవ్య అనే ఉద్యోగి.. హెచ్‌బీఎల్ సంస్థతో ఫోన్ ద్వారా, తన పేరిట ఉన్న ఈ–మెయిల్ ఐడీ ద్వారా సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో ఎక్సెల్ సంస్థ విడిభాగాలకు సంబంధించి 1.39 లక్షల డాలర్లను.. ఈనెల 2న సింగపూర్ బ్యాంక్‌లోని తమ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ వివరాలను హెచ్‌బీఎల్‌కు ఈ–మెయిల్ చేసింది. అదేరోజున సాయంత్రం 4:30 గంటలకు ఎక్సెల్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా హెచ్‌బీఎల్ సంస్థకు మరో ఈ–మెయిల్ అందింది. అందులో ఐటీ, పలు ఇతర కారణాల వల్ల బ్యాంకు ఖాతాను మార్చాలని, యూఏఈకి చెందిన ఓ బ్యాంకు ఖాతాకు సొమ్ము ట్రాన్స్ఫర్ చేయాలని అందులో ఉంది. దీంతో హెచ్‌బీఎల్ సంస్థ అదేరోజున 1.39 లక్షల డాలర్లను యూఏఈ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కానీ రెండు రోజులు వేచి చూసినా సింగపూర్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పరిశీలించిన హెచ్‌బీఎల్ సంస్థ ప్రతినిధులు.. రెండోసారి వచ్చిన ఈ–మెయిల్ నకిలీదని, సొమ్ము వేరే ఎవరికో ట్రాన్స్ఫర్ అయిందని గుర్తించారు. దీనిపై వెంటనే సంస్థ ఖాతా ఉన్న ఎస్బీఐకి ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం యూఏఈ బ్యాంకు నుంచి నగదును వెనక్కి రప్పించగలిగింది. ఈ–మెయిల్ ఐడీని హ్యాక్ చేసి.. సైబర్ నేరగాళ్లు సింగపూర్ సంస్థకు చెందిన ఈ–మెయిల్ ఐడీని హ్యాక్ చేసి ఉంటారని, లావాదేవీలు ఇతర విషయాలను క్షుణ్నంగా పరిశీలించి మోసానికి దిగి ఉంటారని సైబర్‌క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. హెచ్‌బీఎల్ సంస్థతో సంప్రదింపుల కోసం ఎక్సెల్ సంస్థ వాడిన ఈ–మెయిల్ ఐడీని గుర్తించి, కేవలం ఒక్క అక్షరం మార్చి మరో ఈమెయిల్ ఐడీని సృష్టించారని.. దీనిని గమనించలేక పోవడంతో డబ్బు వేరేవారికి ట్రాన్స్ఫర్ అయిందని వివరిస్తున్నారు. ఈ తరహా నేరాల్లో నగదు రికవరీ కావడం కష్టమని.. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా.. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ..
సాక్షి,హైదరాబాద్: మోడలింగ్ పేరుతో ప్రముఖ మాల్స్‌లో ర్యాంప్ షోలు నిర్వహించి, ప్రముఖ యాడ్స్‌లో సినీ తారలు, క్రికెటర్లతో కలిసి నటించే అవకాశాలు కల్పిస్తానని అమాయకులకు టోకరా వేస్తున్న ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాంప్ షోలో పాల్గొనే వారితో మేకప్ ఛార్జీలు, కాస్ట్యూమ్స్ ఇతర ఉపకరణాల పేరుతో ఖాతాలలో డబ్బు జమ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన అపూర్వ అశ్విన్ దౌడ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్ గతంలో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కాస్మోపాలిటన్ మోడల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన అతను చైల్డ్ మోడలింగ్ షోలు నిర్వహించేవాడు. ఈ నేపథ్యంలో మదీనా గూడకు చెందిన గోపాలకృష్ణన్ కృష్ణానంద్ కుమార్తెను తాను నిర్వహించిన షోలో ఎంపిక చేశాడు. అనంతరం ఆమెకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి యాడ్‌లో నటించే అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. ఇందుకుగాను క్యాస్టూమ్స్, షూటింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.14 లక్షలు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. అయితే తన కుమార్తెకు అవకాశం కల్పించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.15.60 లక్షల నగదు, 4 యాపిల్ ఫోస్లు, ల్యాప్‌ట్యాప్, 3 సిమ్ కార్డులు, 2 ఆధార్‌కార్డులు స్వాధీదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మంబైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. చదవండి: కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం! -
క్యూనెట్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎంఎల్ఎం మోసాలపై సజ్జనార్ ట్వీట్
అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని, అవి మోసపూరిత సంస్థలని అని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయని తెలిపారు. అలాంటి మోసపూరిత స్కీమ్ లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవని స్పష్టం చేశారు. బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకు సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని, నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు. మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల మాయలో పడొద్దన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ గొలుసుకట్టు సంస్థల వల్ల దేశ ఆర్థిక పరిస్థితే కాక.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీగా సజ్జనర్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. (చదవండి: Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది) అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్, పూజహెగ్డే, షారుఖ్ ఖాన్ లకు 2019లో నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా 500 మందికి సైబరాబాద్ పోలీసులు అప్పట్లో నోటీసులు జారీ చేయడం గమనార్హం. తాజాగా క్యూనెట్ సంస్థ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనార్ స్పందించారు. క్యూనెట్ లాంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి మాయలో పడొద్దని సూచించారు. ఎంఎల్ఎం కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. It’s a FRAUD ⚠️ When I was @cpcybd, I registered several cases against #Qnet. Since I felt that #Qnet business model is a FRAUD and DUPED gullible investors, I fought with conviction. @dir_ed’s public disclosure of its findings against Qnet vindicated my stand. pic.twitter.com/elXSEhPSMN — V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2023 It’s a FRAUD ⚠️ There is a need to widen the crackdown on such entities (firms running pyramid, MLM and other ponzi schemes) and save gullible people. pic.twitter.com/hFOETKLMP1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2023 -
‘సంకల్ప’ స్కాం
ఒకటికి పది రెట్లిస్తాం.. డబ్బులే డబ్బులు!! బంగారం.. స్థలాలు.. కట్టిన సొమ్మంతా తిరిగిస్తాం... ఎర్ర చందనం మొక్కలతో చెట్లకు డబ్బులు కాయిస్తాం!! తెలిసిన వారిని చేరిస్తే కమీషన్ కూడా ఇస్తాం.. మీరు మునగండి.. మీ పక్కవారినీ ముంచండి! యాప్‌లో ఒకరి తరువాత ఒకరుగా మోసపోయిన గొలుసు కట్టు గోల్మాల్ బాగోతమిదీ.. – సాక్షి ప్రతినిధి, విజయవాడ యాప్ ద్వారా.. విజయవాడలో సంకల్ప సిద్ధి మార్ట్ పేరుతో ఏర్పాటైన చెయిన్ లింక్, మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ మోసాలు బహిర్గతమయ్యాయి. సీతారాంపురంలోని దుర్గా అగ్రహారంలో ఏడాది క్రితం ఓ అద్దె ఇంట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ యాప్ ద్వారా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. పది రోజులుగా యాప్ పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వేల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. ఐదు రకాల స్కీంలతో చెయిన్ చీటింగ్ ► సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులు సభ్యత్వం కోసం రూ.3 వేలు చొప్పున బాధితుల నుంచి వసూలు చేసి నమ్మకం కలిగించేందుకు సరుకులు ఇచ్చారు. రోజుకు రూ.10 చొప్పున 300 రోజుల్లో కట్టిన డబ్బంతా వెనక్కు వస్తుందని నమ్మించారు. ► రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తామనేది రెండో స్కీం ► రూ.లక్ష నగదు చెల్లిస్తే లక్ష విలువైన బంగారం ఇవ్వడంతో పాటు రోజుకు రూ.100 చొప్పున 300 రోజుల్లో రూ.30 వేలు ఇస్తామని మూడో స్కీం ద్వారా ఆశ చూపారు. ► రూ.2.5 లక్షలు ఇస్తే 25 ఎర్ర చందనం మొక్కలతో కూడిన స్థలం ఇవ్వడంతోపాటు 15 ఏళ్లకు రూ.1.75 కోట్లు వస్తాయంటూ వసూళ్లకు పాల్పడ్డారు. ► రూ.5 లక్షలు చెల్లిస్తే సెంటు భూమి ఇవ్వడంతోపాటు 300 రోజుల్లో తిరిగి రూ.2.5 లక్షలు చెల్లిస్తామని మరో ఎర వేశారు. పోలీసుల అదుపులో నిందితులు దుర్గా అగ్రహారం, బందర్ రోడ్డులోని కార్యాలయం, నిడమానూరులోని సంకల్పసిద్ధి మార్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ డేటాను సీజ్ చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేసి రూ.2.5 కోట్ల నగదును సీజ్ చేశారు. సంస్థ చైర్మన్ గుత్తా వేణుగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. న్యాయం చేస్తాం.. చట్టపరమైన చర్యలు తీసుకొని సంకల్ప సిద్ధి డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తాం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – టి.కె.రాణా, సీపీ -
కేటుగాళ్లు.. కలెక్టర్ డీపీ పెట్టుకుని 1.40 లక్షలు కొట్టేశారు
సూర్యాపేట క్రైం: కలెక్టర్ డీపీ పెట్టుకుని ఏకంగా జిల్లా అధికారి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీపీతో కేటుగాళ్లు వాట్సాప్ నంబర్‌తో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం నంబర్‌కు మెసేజ్ చేశారు. నాకు అర్జెంటుగా రూ.1.40 లక్షలు కావాలని కోరారు. దీంతో నిజంగానే కలెక్టర్ మెసేజ్ పెట్టారని నమ్మి సదరు వైద్యాధికారి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఏకంగా రూ.1.40 లక్షల విలువైన ఆరు అమెజాన్ గిఫ్ట్ కార్డులను పంపించారు. వెంటనే అదే నంబర్ నుంచి ఇంకో రూ.20 వేలు పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించి ఆ అధికారి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
AP News: అనధికార డిపాజిట్లు ఇక జప్తే..!
సాక్షి, అమరావతి: ఆర్థిక మోసాలు, అనధికార డిపాజిట్ల దందాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో అనధికారికంగా, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడాన్ని నిరోధించేందుకు కఠిన నిబంధనలను రూపొందించింది. అనధికారికంగా సేకరించే డిపాజిట్లు, అటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది. తద్వారా అధిక వడ్డీల ఎరకు మోసపోకుండా సామాన్యులకు రక్షణ కవచాన్ని కల్పించింది. అనధికార డిపాజిట్ల సేకరణపై పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.. ► ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏ సంస్థగానీ, వ్యక్తులుగానీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. ► అనధికారికంగా డిపాజిట్లు సేకరించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నియమించే అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి. ► ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే వాటికి సంబంధించిన వివరాలను ఆ అధికారికి తెలపాలి. ► తమ బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు వెల్లడించలేకున్నా వాటిని అనధికారిక డిపాజిట్లుగానే పరిగణిస్తారు. ► అడిగిన వివరాలు చెప్పకుండా పరారైతే సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను న్యాయస్థానానికి నివేదిస్తారు. ► ఇక అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, అలా సేకరించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులనూ జప్తు చేసే అధికారం ఆ అధికారికి ప్రభుత్వం ఇచ్చింది. ఆస్తుల జప్తునకు సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి సమర్పిస్తారు. ► స్థానిక పోలీసు అధికారులతో కలసి ఆ వ్యక్తులు, సంస్థల ఆస్తులు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను కూడా ఆ అధికారి పరిశీలించవచ్చు. వీటికి మినహాయింపు డ్వాక్రా గ్రూపులు, చేనేత, స్వగృహ సహకార సంఘాలు, గుర్తింపు పొందిన మతపరమైన సంస్థలకు మినహాయింపు నిచ్చారు. ఆ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు ఏడాదికి గరిష్టంగా రూ. 10 వేల వరకు చేసే డిపాజిట్లను అనధికారిక డిపాజిట్లుగా పరిగణించరు. మతపరమైన సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు, వేద పాఠశాలలు, గోశాలల నిర్వహణకు సేకరించే డిపాజిట్లకు కూడా ప్రభుత్వం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. డిపాజిట్‌దారుల సొమ్ముకు రక్షణ సామాన్యులు అవగాహన లేకుండా అనధికారిక డిపాజిట్లు చేస్తే.. వారి సొమ్ముకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించింది. అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, ఆ సంస్థల ఆస్తులను వెంటనే జప్తు చేస్తారు. ఆ విధంగా జప్తు చేసిన నగదు, ఆస్తులను ఇతరులకుగానీ ఇతర సంస్థలకుగానీ బదిలీ చేయడానికి వీల్లేదు. కేసు పరిష్కారమైన తరువాత డిపాజిటర్లకు వారి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సెక్యూరిటీ ఏజెన్సీలు పాటించాల్సిన నిబంధనలు, సెక్యూరిటీ సిబ్బంది నియామక అర్హతలు, వారికి ఇవ్వాల్సిన కనీస శిక్షణ ప్రమాణాలను నిర్దేశించింది. విధివిధానాలను పాటించే ఏజెన్సీలకే లైసెన్సులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
బ్యాంకు మోసాల కట్టడికి ఫ్రాడ్ రిజిస్ట్రీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మోసాలు తగ్గించేందుకు, కస్టమర్ల రక్షణ కోసం.. మోసాలకు సంబంధించి సమాచారంతో ఓ రిజిస్ట్రీని (ఫ్రాడ్ రిజిస్ట్రీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఇందులో మోసపూరిత వెబ్సైట్లు, ఫోన్ నంబర్లు, డిజిటల్ మోసాలకు పాల్పడే తీరు తదితర వివరాలు ఉంటాయి. ఆయా వెబ్సైట్లు, ఫోన్ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ద్వారా మోసాలకు చెక్ పెట్టాలని ఆర్బీఐ చూస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ తెలిపారు. ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటుకు కచ్చితమైన సమయం ఇంకా అనుకోలేదని.. ప్రస్తుతం వివిధ భాగస్వాములు, విభాగాలతో సంప్రదింపులు నడుస్తున్నాయని చెప్పారు. చెల్లింపుల వ్యవస్థలకు చెందిన భాగస్వాములు ఎప్పటికప్పుడు ఈ ఫ్రాడ్ రిజిస్ట్రీ సమాచారం పొందేలా అనుమతించాలన్నది యోచనగా చెప్పారు. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కస్టమర్లు రిజర్వ్‌బ్యాంకు సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి వస్తారని శర్మ తెలిపారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం ఒకే అంబుడ్స్‌మన్‌ను ప్రారంభించడం తెలిసిందే. 2021–22లో 4.18 లక్షల ఫిర్యాదులు అంబుడ్స్‌మన్ ముందుకు వచ్చాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 3.82 లక్షలుగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది 97.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు చెప్పారు. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా, కార్డుల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఆశపడ్డారో.. కొంప కొల్లేరే! కుక్కపిల్లని కూడా వదలరు
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఉన్నచోటనుంచే కడుపులో చల్ల కదలకుండా చాలా ఈజీగా చేసేస్తున్నాం. అంతేనా ఒక చిన్న క్లిక్‌తో ఇన్‌స్టంట్‌గా రుణాలు, యాప్ ద్వారా ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలకసమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచే స్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదోవిధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ 2 వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
Petrol Bunk Fraud: కొలతల్లో ‘కోత’.. జేబులకు చిల్లు
సాక్షి, నెల్లూరు: ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతుంటే.. మరో వైపు పెట్రోల్ బంకుల దోపిడీ మితిమీరుతోంది. కొలతల్లో కోత పెట్టి వాహనచోదకుల జేబులకు చిల్లు పెడుతున్నారు. జిల్లాలో నిత్యం పెట్రోల్ బంకుల్లో విక్రయాల లెక్కలు చూస్తే రోజుకు రూ.కోట్లల్లో దోపిడీ జరుగుతున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలోని దాదాపు ఒకటీ.. రెండు చోట్ల తప్ప ప్రతి పెట్రోల్ బంకులో మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయనే జగద్వితం. అయినా సంబంధిత తునికలు, కొలతల శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్నారు. ఈ శాఖ తనిఖీలు, జరిమానా లెక్కలు చూస్తేనే పనితీరు అర్థమవుతోంది. పెట్రోల్ బంకుల్లో చిప్‌ల టెక్నాలజీ సాయంతో మోసాలు జరుగుతున్నాయి. చదవండి: బాబోయ్ ఎండలు.. అలా చేస్తే వాహనాలు పేలే ప్రమాదం నెల్లూరు శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలోని పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి పెట్రోలు పట్టించుకునేందుకు వెళ్లాడు. రూ.100కు పట్టమని చెప్పి.. పర్సులో నుంచి డబ్బులు తీసే సరికి పెట్రోలు పోసే వ్యక్తి ఇంధనం నింపేశాడు. ఇంతలోనే పట్టడం అయ్యిందా? అని ప్రశి్నస్తే.. అంత అనుమానముంటే రీడింగ్ చూసుకోవాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ రోజు ఉదయం పని చేసే కార్యాలయానికి వెళ్తుండగా మధ్యలో వాహనం ఆగిపోయింది. వెంటనే పెట్రోలు బంకుకు వెళ్లి ఆ వ్యక్తిని నిలదీయగా.. మేం సక్రమంగానే పోశాం. మీరు ఎక్కడెక్కడ తిరిగారో అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి. నగరంలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బిడ్జి వద్ద ఉన్న ఓ పెట్రోలు బంకులో రెండు రోజుల క్రితం ఒకరు వాహనానికి పెట్రోలు పోయించుకున్నాడు. కొలతపై అతనికి అనుమానం వచ్చి మళ్లీ లీటర్ బాటిల్లో లీటర్ పెట్రోలు పోయించుకోవడంతో 200 ఎంఎల్ తక్కువ వచ్చింది. ఆ లీటర్ బాటిల్ నిండా పట్టిస్తే రూ.150 చూపించింది. లీటర్‌కు దాదాపు 200 ఎంఎల్ తక్కువ రావడంతో నిలదీస్తే సిబ్బంది కానీ, యాజమాన్యం కానీ పట్టించుకోలేదు. దీనిపై బాధితులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇంధన వినియోగం పెరుగుతోంది. అందుకు తగిన విధంగా జిల్లాలో పెట్రోల్ బంకులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ అత్యంత నిత్యావసర వినియోగం కావడంతో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ బంకుల యజమానులు దోపిడీకి తెర తీస్తున్నారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, మరి కొందరు వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. ఇంధనం నాణ్యత, కొలతలపై తరచూ తనిఖీలు చేయాల్సిన పౌర సరఫరాలశాఖ అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. రేటు వాత.. కొలత కోత ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు అటూ ఇటూగా ఉన్నాయి. పెట్రోల్ లీటరు 121.70, డీజిల్ రూ.107.70 ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో పెట్రోల్, డీజిల్ లీటరుపై సుమారు రూ.50 వరకు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతి రోజు లీటరుకు రూ.0.80 వంతున పెరుగుతూనే ఉంది. ఓ వైపు ధరలు ఇలా పెరుగుతుంటే.. మరో వైపు బంకుల్లో దోపిడీకి అంతూపంతూ లేకుండాపోయింది. లీటరుకు 200 ఎంఎల్ వరకు కోత పడుతున్నట్లు వినియోగదారులు గుర్తిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా, గొడవ చేసినా స్పందన లేకపోవడంతో వినియోగదారులు సైతం పట్టింది పట్టించుకుని మౌనంగా వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే లీటరుకు 5 ఎంఎల్ వరకు ఇంధనం తక్కువ రావడం సహజం. అయితే అనేక బంకుల్లో 50 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ వరకు తేడా వస్తున్నట్లుగా వాహనదారులు వాపోతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి తూనికలు, కొలతల శాఖ అధికారులు అడపా దడపా చేసిన తనిఖీల్లో కూడా భారీగానే మోసాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో కేటుగాళ్లు పెట్రోల్, డీజిల్‌లో తెల్ల కిరోసిన్ కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కన్నెత్తి చూడని అధికారులు పెట్రోల్ బంకుల్లో రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలున్నాయా లేదా నిర్వహణ తీరు తదితర అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖది. పెట్రోలు, డీజిల్‌ను వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయా? లేదా అనే విషయాలను తూనికలు, కొలతల శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు తమ పరిధిలో ఉన్న బంకుల్లో ఎంత మేర నిల్వలున్నాయో కూడా చెప్పలేకపోతున్నారు. తూనికలు, కొలతలు శాఖ అధికారులు మాత్రం అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. ఏడాది మొత్తంలో 35 కేసులు నమోదు చేసి, రూ.9.70 లక్షల జరిమానా విధించారంటే ఈ శాఖ పనితీరును అర్థం చేసుకోవచ్చు. రోజుకు రూ.3.36 కోట్ల దోపిడీ జిల్లాలో దాదాపు 210 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ 14 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. లీటర్‌కు 200 ఎంఎల్ తక్కువ వస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ రేటు ప్రకారం 200 ఎంఎల్ విలువ రూ.24 అవుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.3.36 కోట్ల వాహనచోదకుల జేబులకు చిల్లుపడుతున్నట్లు అంచనా. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లాలోని పెట్రోలు బంక్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చినప్పుడుతో పాటు ఏడాదిలో సాధారణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొలతల్లో తేడాలు వచ్చినా, టైంకు సీలింగ్ వేయించకున్నా కేసులు నమోదు చేసి జరిమానా విధించి వసూళ్లు చేస్తున్నాం. గతేడాదిలో 35 కేసులు నమోదు చేసి అపరాధ రుసుం రాబట్టాం. రెండు రోజుల క్రితం అయ్యప్పగుడి ఫ్లైఓవర్బ్రిడ్జి వద్ద ఉన్న పెట్రోలు బంకులో మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వెళ్లి విచారణ చేపట్టాం. వారిపై చర్యలు తీసుకుంటాం. – రవిథామస్, తూనికలు, కొలతలశాఖ ఉన్నతాధికారి నెల్లూరు -
కలెక్టర్ పేరుతో వాట్సాప్ మెసెజ్‌లు.. అమెజాన్ గిఫ్ట్ కార్డులంటూ..
సాక్షి, కుమురం భీం జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసిన ఘటన మరుకవముందే మరో సంఘటన చోటుచేసుకుంది. కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డీపీతో డబ్బుల కోసం అదికారులకు వాట్సాప్ మెసెజ్‌లు పంపుతున్నారు. డబ్బులు, అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. జిల్లా ఉన్నాతాదికారులకు, ఎమ్మార్వో, ఎంపీడీఓలకు మెసెలు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్ల మెసెజ్‌లతో అధికారులు భయపడిపోతున్నారు. అదేవిధంగా కలెక్టర్ అదికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్ -
మ్యాట్రిమోనీ యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి..
చిత్తూరు అర్బన్: అతడు చదువుకుంది ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు వచ్చింది. చేస్తున్నపని నచ్చలేదు. మానేశాడు. దుర్వ్యసనాల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషించాడు. ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ, నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాల వెబ్సైట్లలో ఉంచాడు. వీటి ఆసరాగా వందమందికిపైగా యువతులను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. ఈ మోసాలకు పాల్పడ్డ చిత్తూరుకు చెందిన కరణం రెడ్డిప్రసాద్ (42)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ ఈ వివరాలను మీడియాకు వివరించారు. అరక్కోణంలో స్థిరపడి మోసాలు చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పిళ్లై పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్‌కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్‌గా రివర్షన్ ఇచ్చారు. దీంతో ఉద్యోగం మానేసిన రెడ్డిప్రసాద్ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్య, కుమార్తె అతడి నుంచి వేరుగా ఉంటున్నారు. మ్యాట్రిమోనీ (వివాహాలను కుదిర్చే ఆన్లైన్ సంస్థలు) యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్‌లు కూడా అప్లోడ్ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్లైన్లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్లో చెప్పేవాడు. పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్‌కి ఫోన్ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెడ్డిప్రసాదే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వందమందికిపైగా యువతుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు చెప్పాడు. 2019లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్ చేశారు. యువతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మోసపోవడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఇతడి ద్వారా మోసపోయినవాళ్లు చిత్తూరు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించడంలో ప్రతిభచూపిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
తాడిపత్రి: ఇత్తడి విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి విక్రయాలు సాగిస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వివరాలను బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యంకు చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన షాలీబాషా ముఠాగా ఏర్పడి ఇత్తడితో తయారు చేసిన దేవతా మూర్తుల విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి తాడిపత్రిలో మంగళవారం రాత్రి విక్రయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ ధరణీబాబు అక్కడకు చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలతో పాటు రూ.5,800 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ మట్కా నిర్వాహకులు.. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, రూ.5,76,000 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమాంవలి, పీర్ల హాజీ ముస్తాఫాతో పాటు మరో 11 మంది ఉన్నారు. -
ఏటీఎం మిషన్‌లో వేయాల్సిన నగదుతో జంప్!... దంపతులను బురిడీ కొట్టించినదొంగ!
మాండ్య : మండ్య జిల్లా మద్దూరు పట్టణంలోని కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన దంపతులను ఓ ఘరానా మోసగాడు వంచించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామానికి చెందిన మహదేవయ్య, మమత దంపతులు ఈనెల 2న తన కుమారుడు ఉన్నత చదువుల కోసం బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ. 50 వేలు తీసుకుని మద్దూరులోని కెనరా బ్యాంక్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బ్యాంకులో వినియోగదారులు ఎక్కువగా ఉండటంతో ఏటీఎం మిషన్‌లో వేయాలని సూచించారు. వారి వెనుకాలే ఓ వ్యక్తి ఏటీఎం సెక్యూరిటీ ఉద్యోగి తరహాలో వారి వద్దకు వచ్చాడు. నగదు ఏటీఎం మిషన్‌లో తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని కోరారు. మోసగాడు వారిని చూపు మళ్లించి నగదు తన జేబులో పెట్టుకుని, ఖాతాలో వేసినట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో దంపతులు కుమారుడికి ఫోన్ చేసి నగదు వేశామని చెప్పారు. తనకు ఇంకా నగదు పడలేదని చెప్పడంతో బ్యాంకు సిబ్బందితో విచారించారు. సర్వర్ సమస్య ఉంటుందని, వారం రోజుల్లో నగదు పడుతుందని చెప్పారు. వారం రోజులు గడచినా నగదు జమ కాకపోవడంతో అనుమానించిన సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
మోసగాడి చెర నుంచి 22 మందికి విముక్తి
నక్కపల్లి/పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరిట సంస్థను నిర్వహిస్తూ యువతీ, యువకుల్ని బందీలుగా మార్చుకున్న మోసగాడి ఆట కట్టింది. అతని చెరలో ఉన్న వారందరికీ విముక్తి కల్పించిన అధికారులు అతడి భవంతికి శనివారం తాళం వేశారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులు, నలుగురు యువకులు అతడి భవంతిలో బందీలుగా ఉన్నట్టు గుర్తించారు. తమ ఇళ్లకు పంపమని కోరిన 8 మందిని శుక్రవారమే ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య వారి స్వస్థలాలకు పంపించారు. మిగతా 14 మంది తాము భవనం ఖాళీ చేసే ప్రసక్తి లేదని, ఇక్కడే ఉంటామని మొండికేయడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం వారిని కూడా విశాఖ కేజీహెచ్‌లోని దిశ షెల్టర్ హోమ్‌కు తరలించారు. వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధార్ హోమ్‌కు తరలిస్తామని, మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు చెప్పారు. సంస్థ నిర్వాహకుడైన అనిల్‌కుమార్ అలియాస్ ప్రేమదాసు, అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమదాస్‌కు సహకరించిన రాజేశ్వరి అలియాస్ లిల్లీ పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ అలర్ట్..!
హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను హెచ్చరించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. అయితే, ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్త ఉండాలని సూచిస్తుంది. మోసగాళ్లు ఈ నకిలీ లింక్స్ సహాయంతో వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్బీఐ పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు క్రింద పేర్కొన్న విధంగా వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి రూ.10 వేల నగదు పొగట్టుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందుకే, ఇలాంటి నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మోసాల బారిన పడకుండా ఎస్బీఐ సూచనలు: * ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆలోచించండి. * కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. * మీ మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. * నకిలీ లింక్స్ ఎప్పుడు క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి. వాటి యుఆర్ఎల్ లో బ్యాంక్ పేరు లేకుండా వస్తాయి. రిపోర్ట్ చేయడం ఎలా? ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాలో అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు నివేదించాలి. ఇలాంటి లావాదేవీలను గుర్తించిన వెంటనే 1800 425 3800, 1800 112 211 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. వారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు. (చదవండి: లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!)