కొనుగోలు మోసాలతో.. కునారిల్లుతున్న రైతు | Nainala Govardhan's Comments On The Way Farmers Are Being Cheated In The Purchase Of Paddy | Sakshi
Sakshi News home page

కొనుగోలు మోసాలతో.. కునారిల్లుతున్న రైతు

Published Tue, Jun 11 2024 9:44 AM | Last Updated on Tue, Jun 11 2024 9:44 AM

Nainala Govardhan's Comments On The Way Farmers Are Being Cheated In The Purchase Of Paddy

తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ఎవరున్నా రైతు మాత్రం పచ్చి మోసానికీ, దోపిడీకీ గురవుతున్నాడు. ముఖ్యంగా పండిన పంట అమ్ముకునే క్రమంలో రైతులను వడ్ల కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జాబు తిరుపతి అనే కౌలురైతు ఉదంతం.

తిరుపతి దాదాపు నలభై రోజుల క్రితం 40 కేజీల తూకంతో ఉన్న 297 బస్తాల రబీపంట ధాన్యం మొత్తాన్నీ స్తంభనపల్లి  ‘ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ’ (పీఏసీఎస్‌–ప్యాక్స్‌) వడ్ల కొనుగోలు కేంద్రాని (పీపీసీ)కి అమ్మాడు. ఈ పీపీసీ బాధ్యుడు ఆశ పవన్‌. ఈ ధాన్యం విలువ రూ. 2,61,716. అయితే వడ్లు కొన్నట్లుగా పవన్‌ ఎలాంటి రసీదును ప్యాక్స్‌ తరఫున ఇవ్వలేదు. కౌలు రైతు తన వడ్ల డబ్బుల కోసం, బ్యాంకు పాస్‌బుక్, కౌలు ధ్రువీకరణ తదితర పత్రాలన్నింటిన్నీ ప్యాక్స్‌కు అందించాడు.

తిరుపతి అమాయకత్వాన్ని గమనించిన పవన్‌ తన స్నేహితుడైన గుండెల్లి ప్రవీణ్‌తో కుమ్మక్కై అతని డబ్బును కాజేశాడు. పథకం ప్రకారం పవన్‌ తన స్నేహితుడు ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి, ‘నీ ఖాతాలో జాబు తిరుపతి అనే రైతు డబ్బులు వేస్తున్నా’నని పదే పదే చెప్పి మరీ వేశాడు.

పవన్‌ వడ్లు అమ్మిన రైతుకు, రసీదు ఇవ్వకపోవడం మొదటి తీవ్రమైన తప్పు.  రైతు ఖాతాలో డబ్బులు వేయకుండా ఆ డబ్బులు మిత్రుని ఖాతాలో వేయడం తీవ్రమైన నేరం. పాక్స్‌ –1964 చట్టం, తెలంగాణ పౌరసరఫరాల చట్టాల ప్రకారం అత్యంత నేరపూరితమైన చర్య.  జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు, పౌరసరఫరాల అధికారికి, జిల్లా సహకార సంఘం (ప్యాక్స్‌ ఉన్నత) అధికారికి, స్థానిక పోలీసు సీఐకీ, బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. ప్యాక్స్‌ సంఘాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించే జిల్లా సహకార సంఘం అధికారులు తమ కింది సంఘాలు రైతుల పట్ల పాల్పడుతున్న ఘోరమైన మోసాన్ని గుర్తించారు.

ఈ ప్యాక్స్‌కు ఆర్థిక వనరులు అంటే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, వరి ధాన్యం కొనుగోలు ఇలా అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. వీటి ద్వారా భారీ ఎత్తున డబ్బు వస్తుంది. ప్యాక్స్‌ చట్టం ప్రకారం ఈ డబ్బుతో మోసపోయిన రైతుకు డబ్బు చెల్లించాలి. ప్యాక్స్‌ చట్టం –1964 ప్రకారం రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు. నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలి. ఇలా రైతులను మోసం చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ చట్టం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం ఆ ప్యాక్స్‌ పరిధిలో మోసం చేసిన వారిని విచారించి వారి ఆస్తులను వేలం వేసి సమానమైన డబ్బును ప్యాక్స్‌కు జమకట్టాలని 1964 చట్టం చెబుతుంది. ధాన్యం కొలుగోల్లలో రైతులకు ఎలాంటి మోసం జరిగినా తానే బాధ్యుణ్ణి అని కొనుగోలు కేంద్రాల బాధ్యులందరితో ప్రతి ఏటా ప్రమాణ పత్రాలు తీసుకోకపోవడం ప్రభుత్వాలు చేస్తున్న పెద్ద తప్పు.

జాబు తిరుపతికి తను అమ్మిన ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్యాక్స్‌ రసీదు ఇచ్చి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. జరిగినా రసీదు అనే ఆధారం ఉండేది. డబ్బులు వాటికవే రైతు ఖాతాకు వచ్చేవి. తెలంగాణలో ధాన్యం అమ్మిన లక్షలాది మంది రైతులలో చాలామందికి రసీదులు ఇవ్వక పోవడం వారికి సామూహికంగా జరుగుతున్న అన్యాయం. రసీదులో రైతు ధాన్యం బరువు కచ్చితంగా తెలుస్తుంది. ఇవ్వవలసిన డబ్బులు ఎంత అనేది తెలుస్తుంది. రైతుకు రసీదు ఇచ్చిన తరువాత ధాన్యానికి సమానమైన ధర చెల్లించక తప్పదు. రసీదు ప్రకారం అమ్మకం జరిగిన నాటి ధాన్యం బరువులో కోత విధించకూడదు. ధాన్యం నాణ్యత బాగాలేదు, తేమ ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఇలా అనేక విషయాల్లో పీపీసీ బాధ్యుడి అన్యాయాలకు రసీదు సంకెళ్లు వేస్తుంది.

ఈ రబీ పంట కాలంలో 40 కిలోల వడ్ల బస్తాకు మూడున్నర కిలోల చొప్పున మిల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా రైతులను దోచుకున్నారు. అంటే క్వింటాల్‌కు 7–8 కిలోల చొప్పున రైతాంగాన్ని యధేచ్ఛగా దోపిడీ చేశారు. ప్రతి క్వింటాల్‌కు రైతును రూ. 160 చొప్పున మిల్లర్లు దోచుకున్నారు. ఈ లెక్కన తెలంగాణ అంతటా కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం ఎంత? దోపిడీ ఎంత అనేది గణిస్తే తేలికగా దోపిడీ అర్థమవుతుంది.

జరిగిన మరో పెద్ద మోసం అన్ని రకాల వడ్లను గ్రేడ్ల వారీగా కాకుండా, ఓకే సాధారణ వెరైటీ కింద మిల్లర్లు కొనుగోలు చేయడం. ఇందులో జరిగిన మిల్లర్ల దోపిడీ మాయాజాలం ఏమిటి? ఏ– గ్రేడ్‌ సన్న రకం వడ్లకు రూ. 2,203 కాగా బీ–గ్రేడ్‌ కు రూ. 2,183. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ఏ ఒక్క క్వింటాల్‌ ధాన్యానికీ గ్రేడ్ల వారీగా ధర చెల్లించిన దాఖలా లేదు. అంటే ప్రతి క్వింటాల్‌ ధాన్యానికి రైతు రూ. 20 నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్‌కు మిల్లర్‌ రూ. 20 దోచుకున్నాడు. దీన్నిబట్టి రాష్ట్రం మొత్తం కొనుగోళ్లలో దోపిడీ ఎంత భారీ స్థాయిలో జరిగిందో గుర్తించవచ్చు. అలాంటప్పుడు ఏ– గ్రేడ్, బీ– గ్రేడ్‌ లేదా సన్న, దొడ్డు రకాలు అని వేరువేరుగా విభజన చేయడం, గుర్తించడం ఎందుకు? ఏ– గ్రేడ్‌ వడ్లు పండించడానికి రైతు చేసిన ప్రత్యేక శ్రమ, ఖర్చులకు సస్యరక్షణకు విలువ ఏమిటి?

సన్న వడ్లకే రూ. 500 బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించడం ఒక మోసం కదా? ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు బోనస్‌గా క్వింటాల్‌కు రూ. 500  చెల్లిస్తామన్నారు. నిజానికి సన్న, దొడ్డువడ్లు అనే విభజన అమలులో లేదు. ఎన్నికల తర్వాత మాట మార్చడం ఏమి నీతి? ఈ సన్న రకాలకు గత ఖరీఫ్‌ సీజన్‌లో బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 2,800– 3,000 వరకు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వం ఇచ్చే బోనస్‌తో కలుపుకుని 2,703 రూపాయలు మాత్రమే (రూ. 2,203+500)  రైతుకు వస్తుంది. గత ఖరీఫ్‌ బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే, ప్రతి క్వింటాల్‌కు రైతు వంద రూపాయల నుండి 300 వరకూ నష్టపోతున్నాడు. ఇది రైతాంగానికి తలపెట్టిన సామూహిక మోసం కాదా?

పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వ ప్యాక్స్, డీసీఎమ్‌ఎస్‌ల దోపిడీ యధేచ్చగా సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి ఇదొక కారణం. గత పదేళ్ల దోపిడీని గుర్తించి కొన్ని ప్రాంతాలలో ప్యాక్స్‌ డీసీఎంఎస్‌లకు ఈ రబీ సీజన్‌లో ఒక్కటంటే ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వలేదు. వీరి స్థానంలో ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను ఇచ్చారు.

కేసీఆర్‌ పాలనలో దోపిడీకి అలవాటు పడ్డ ఒక ప్రభుత్వ ప్యాక్స్‌ సంఘమే, తమది రైతు రాజ్యం అని చెబుతున్న ప్రభుత్వ హయాంలో ఓ అమాయక నిరుపేద కౌలు రైతు మొత్తం కష్టాన్నీ నిట్ట నిలువునా దోచుకుంది. భూమి కౌలు, పెట్టుబడుల భారం, అప్పుల వాళ్ళ ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు ఆ రైతు యత్నిస్తే, బంధుమిత్రులు ఆపారు. పంట అమ్మి నేటికీ 40 రోజులవుతోంది. ప్రభుత్వం ప్యాక్స్‌ సంఘంతో కౌలు రైతు కష్టం ఇప్పిస్తారా? ఈ ‘రైతు రాజ్యం’లో ఏం జరుగుతుందో చూద్దాం!
అభిప్రాయం: – నైనాల గోవర్ధన్‌, వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్‌, 97013 81799

ఇవి చదవండి: బాల్యానికి భరోసా ఏదీ?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement