రేపు సహకార దినోత్సవ సంబురం
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.
మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.
అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్‌ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.
పీఏసీఎస్‌ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్‌ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.
గుజరాత్‌లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్‌వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.
ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.
వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.
గుజరాత్‌లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్‌షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.
సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment