కేంద్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి గాను 14 రకాల పంటలకు మద్దతు ధరను ప్రకటించింది. గత ఏడాది మద్దతు ధరలపై 5 శాతం నుండి 7 శాతం వరకు మాత్రమే పెంచి ప్రకటించింది. వాస్తవానికి ఈ పెంచిన ధరలు ప్రైవేట్ మార్కెట్లలో ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ మార్కెట్లలో ఏనాడూ అమలు కాలేదు, ఇప్పుడూ కావడంలేదు. పత్తి, వరి మినహా మిగిలిన పంటలకు ధరలు అమలు జరపడానికి ఏలాంటి వ్యవస్థా లేదు. కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కలిపి ధర నిర్ణయం అయ్యింది.
మద్దతు ధర నిర్ణయంలో ఉత్పత్తి ధర కీలకంగా ఉంటుంది. 2024–25 సంవత్సరానికి ధాన్యం ఉత్పత్తి ధర క్వింటాల్‌కు రూ. 1,523గా నిర్ణయించి దానికి 50 శాతం కలిపారు. వాస్తవానికి 2023–24లో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ధర రూ. 2,100గా తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు కేంద్రానికి నోట్ పంపాయి.
దానిని గమనంలోనికి తీసుకున్నప్పుడు క్వింటాల్ ధాన్యానికి రూ. 3,150గా నిర్ణయించాలి. క్వింటాలున్నర ధాన్యానికి క్వింటాల్ బియ్యం వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ బియ్యం ధర రూ. 5,500 నుండి రూ. 6,000 వరకు అమ్మకాలు సాగుతున్నాయి. క్వింటాల్ ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు రూ. 3,150 నిర్ణయించినప్పటికీ క్వింటాలు బియ్యానికి రూ. 4,650 లకు అమ్మవచ్చు. అయినప్పటికీ క్వింటాల్‌కు రూ. 500 నుండి రూ. 1,500ల వరకు లాభం ఉంటుంది.
పప్పుధాన్యాలకు నిర్ణయించిన ధరల ప్రకారం ముడిపప్పును క్వింటాలుకు కందులు రూ. 7,550కి కొనుగోలు చేసినప్పటికీ 80 కిలోల పప్పు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పప్పు ధర కిలో రూ. 150 నుండి రూ. 180 వరకు ఉంది. అనగా 80 కిలోలు రూ. 12,000 నుండి రూ. 14,640 వరకు గిట్టుబాటు అవుతుంది. ధాన్యం కానీ, పప్పు ధాన్యాలు కానీ మిల్లు ఆడించినందుకు మిల్లర్‌కు దాని నుండి వచ్చిన ఊక, నూక, పరం, తవుడు తీసుకొని తయారైన సరుకులు ఇస్తారు.
కొన్ని సందర్భాల్లో క్వింటాలుకు రూ. 100ల లోపు చార్జీ వేస్తారు. దీనిని బట్టి పరిశీలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరలు రైతుకు కనీసం పెట్టుబడి వచ్చే విధంగా లేవు. ధరల నిర్ణయ విధానంలో తీసుకున్న ‘ఉత్పత్తి ధర’ అత్యంత మోసపూరితమైనది. వాస్తవ ఉత్పత్తి ఖర్చును ఏనాడూ లెక్కలోకి తీసుకోలేదు.
‘ధరల నిర్ణాయక కమిషన్’ (సీఏసీపీ) గణాంకాల ద్వారా సేకరించిన సగటు ఉత్పత్తి ధరను కేంద్ర ప్రభుత్వం ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదు. ఆ కమిషన్ రికమండేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం నిర్ణయించిన మద్దతు ధరలు 60 శాతానికి పైగా పెరగాలి. కమిషన్ రికమండేషన్‌ను క్యాబినెట్ కమిటీ చర్చించి మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. వాస్తవానికి కమిషన్ రికమండేషన్‌ను క్యాబినెట్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కనపడదు.
క్యాబినెట్ కమిటీ ప్రకటించిన ధరలు అమలు జరుపడానికి మార్కెట్ యంత్రాంగం లేదు. మార్కెట్లు రాజ్యాంగం రీత్యా రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. మార్కెట్ కమిటీలు మధ్యదళారీలకు, కార్పొరేట్ సంస్థలకు లోబడి ఉంటాయి. అందువల్ల నిర్ణయించిన మద్దతు ధరలు కూడా అమలు జరుగడం లేదు. మద్దతు ధరలు శాస్త్రీయంగా నిర్ణయించకపోవడం, నిర్ణయించిన వాటిని అమలు జరుపకపోవడం వలన ఏటా రైతులు రూ. 4 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నారు. ఇతర రంగాలకు ఇస్తున్నట్లు ఉచితాలు, మినహాయింపులూ వ్యవసాయ ఉత్పత్తులకు లేవు. పైగా బ్యాంకులు పం ట రుణాలు తగ్గించడం వల్ల అత్యధిక వడ్డీకి ప్రైవేట్ అప్పులు తెచ్చి రుణగ్రస్థులు అవుతున్నారు. ఆ రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
భారతదేశంలో వ్యవసాయదారుల ఉత్పత్తులకు తక్కువ ధరలు నిర్ణయించి, ఆ ఉత్పత్తులు వినియోగదారులకు చేరేటప్పటికి అత్యధిక ధరలుగా మారేలా వ్యవస్థ ఉండటంతో మధ్య దళారీలు, కార్పొరేట్ సంస్థల వాళ్లు 50 శాతం నుండి 100 శాతం వరకు లాభాలు సంపాదిస్తున్నారు. ఈ లాభాలు మరిన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపి కనీస మద్దతు ధరలు పెరగకుండా చూస్తున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి రైతులు, రైతు సంఘాలు గత మూడేళ్లుగా ‘మద్దతు ధరల చట్టాన్ని’ పార్లమెంటు ఆమోదించాలని పార్లమెంట్‌లో ముసాయిదా బిల్లును కూడా ప్రవేశపెట్టారు. కార్పొరేట్ సంస్థల ప్రభావానికి లొంగి ఆ చట్టాన్ని చర్చించకుండా పెండింగ్‌లో పెట్టింది ప్రభుత్వం. ఒకవైపున ప్రధాని ఆ చట్టాన్ని చర్చిస్తానని రాతపూర్వకంగా రైతుసంఘాలకు హామీ ఇవ్వడంవల్ల అవి తాము సాగి స్తున్న 11 మాసాల పోరాటాన్ని ఉపసంహరించుకున్నాయి.
కేంద్రం మాట తప్పడంతో తిరిగి 135 రోజులుగా (జూన్ 25 నాటికి) ఢిల్లీలో వేల మంది రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్దిమంది దళారీలు, కార్పొరేట్ల ప్రయోజనాన్ని, లాభా లను పెంచడానికి చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల వ్యవసాయంపై ఆధారపడి ఉన్న 52 శాతం ప్రజలు అనగా 70 కోట్ల మంది జనం నష్టపోతున్నారు. అందుకే మద్దతు ధర లను శాస్త్రీయంగా నిర్ణయించాలంటే ఉత్పత్తి వ్యయాన్ని న్యాయంగా నిర్ణయించాలి.
– సారంపల్లి మల్లారెడ్డి, వ్యాసకర్త ఏఐకెఎస్ మాజీ ఉపాధ్యక్షులు, 94900 98666
Comments
Please login to add a commentAdd a comment