వాతావరణ ప్రతికూల ప్రభావాలు, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల పంట దిగుబడిలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను బయటపడవేయడానికి ఏ కేటాయింపులూ లేవు.
అభిప్రాయం
భారత్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్‌లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు.
ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్‌లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).
ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.
ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.
రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.
భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.
డా‘‘ దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment