donthi Narasimha Reddy
-
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
మరో ‘డిజిటల్’ వ్యూహం
ఒక్కో పదం వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ప్రకృతితో కూడిన వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం రసాయన రహిత వ్యవసాయం. జీరో బడ్జెట్ వ్యవసాయం పెట్టుబడి ఖర్చు లేని వ్యవసాయం. హరిత విప్లవ వ్యవసాయం రసాయనాలతో, హైబ్రిడ్ విత్తనాలతో కూడిన వ్యవసాయం. పారిశ్రామిక వ్యవసాయం పరిశ్రమ స్థాయిలో ఉత్పాదకత మీద దృష్టి పెట్టే వ్యవసాయం. మరి, డిజిటల్ వ్యవసాయం అంటే ఏమిటి? సమాచారంతో కూడిన వ్యవసాయం. జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యం కాకుండా సమాచారం సేకరించి ఇచ్చే ప్రక్రియలతో కూడిన వ్యవసాయం. రైతు జ్ఞానాన్ని, నైపుణ్యాలను కాలరాసే పెట్టుబడిదారుల వ్యూహంలో డిజిటల్ వ్యవసాయం ఒక సాధనం.హరిత విప్లవం ఒక ప్యాకేజీ. హైబ్రిడ్ విత్తనాలు వేస్తే రసాయన ఎరువులు వాడాలి. రసాయన ఎరువులు వాడితే చీడపీడ, పురుగు పుట్రకు రసాయనాలు పిచికారీ చెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. అంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవాలి. డిజిటల్ వ్యవసాయం కూడా అలాంటి ఒక ప్యాకేజీ. బడా కంపెనీలు గుత్తాధిపత్యం సాధించడమే లక్ష్యం. రైతుల స్వావలంబనను దెబ్బ కొట్టడమే ఎజెండా. ఆహార ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడింది అంటున్నారు. ఒక వైపు అందరికి ఆహారం దొరకని పరిస్థితులలో ఆహారం మిగిలింది అని చెప్పడంలోనే డొల్లతనం బయటపడింది. ఆహార ఉత్పత్తి ఖర్చులు పెరిగి ధర రాని పరిస్థితులలో ఒకవైపు రైతు ఉంటే, అధిక ధరలకు కొనలేని స్థితిలో సగం దేశ జనాభా ఉన్నది. రైతుల ఆదాయం పెరగాలంటే పంటలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి. ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. గిట్టుబాటు ధర కొరకు కనీస మద్దతు ధర పెంచమంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి, పెద్ద కొనుగోలు కంపెనీలు వస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది అని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. అదే నిజమైతే అమె రికాలో, ఐరోపా దేశాలలో ఆ వ్యవస్థ ఉన్నది. అయినా అక్కడి రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు. ఆధునిక వ్యవసాయం ద్వారా భారతదేశం అద్భుతమైన విజ యాలు సాధించింది. దురదృష్టవశాత్తూ చిన్న, సన్నకారు రైతులు అట్టడుగున ఉన్నారు. గడిచిన దశాబ్దంలో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు ఐదు రెట్లు పెరిగింది. 1995 నుండి దాదాపు 3,00,000 కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారత వ్యవసాయంలో ఉన్న సంక్లిష్టత దృష్ట్యా, ఏ ఒక్క విధాన మార్పు లేదా సాంకేతిక మార్పుతో చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడం, భారత వ్యవసాయంలో పోటీని బలోపేతం చేయడం వంటి ద్వంద్వ లక్ష్యాలు సాధ్యం కావు. కానీ డిజిటల్ వ్యవసాయమే అన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తున్నది.చిన్న రైతులకు ఆదాయం పరమార్థం కనుక ఉత్పత్తి–కేంద్రీకృత మౌలిక వసతుల కల్పన నుండి మార్కెట్–కేంద్రీకృత మౌలిక సదుపా యాలకు మారడం, డిజిటల్ వ్యవసాయం ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే భారతదేశంలో కూడా మొబైల్ ఫోన్ గ్రామీణ కుటుంబాల జీవితాలను మార్చింది. బిహార్‌లో గొర్రెలు అమ్ముకునే మహిళ ఫోను ఉపయోగించి వాటిని డిజిటల్ వేదికల ద్వారా అమ్ముకుంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలలో, తయారు చేస్తున్న విధానాలలో, పని తీరులో డేటా డిజిటల్ పద్ధతులు పాటిస్తున్నాయి. ఇదివరకు, సమాచార సేకరణలో ఏ సమాచారం అనే ప్రశ్న వచ్చేది. ఇప్పుడు సమాచారం దేనికి అనే ప్రశ్న వస్తున్నది.కేంద్ర ప్రభుత్వం, బడా పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ టెక్ కంపెనీలు అన్నీ కలిసి డిజిటల్ టెక్నాలజీల ద్వారా తమ వ్యాపారం పెంచుకోవడం కోసం సమాచారాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలిచే ప్రక్రియను డిజిటల్ వ్యవసాయంగా ప్యాకేజీ చేసి ఊదరగొడుతున్నారు. ఒకవైపు మార్కెట్లో చిన్న రైతులకు డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలు అంటూ, ఇంకొక వైపు ఉత్పత్తి దశలలో రైతుల మీద ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇక్రిశాట్’ సహకారంతో బహుళ జాతి సంస్థ మైక్రోసాఫ్ట్ ‘ఏఐ’ విత్తే యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రైతులకు నాట్లకు సరైన తేదీలు, నేల సారం బట్టి ఎరువుల ఉప యోగం, వాడాల్సిన విత్తనాల సలహాలను పంపింది. నిత్యం వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడు ఏమి విత్తాలి వంటి సలహాలు ఇస్తుంది. రైతులకు తెలవదా? సలహాలు ఇవ్వాలంటే ఈ యాప్‌కు ప్రాథమిక సమాచారం కావాలి. ఆ సమాచారం ఒక ఒప్పందం ద్వార ప్రభుత్వం నుంచి ఎప్పుడో తీసుకున్నారు. ఇక ఇందులో రైతు పాత్ర ఉండదు. వాళ్ళు చెప్పింది చేయడమే!ఈ యాప్ కొనసాగాలంటే ఆ సలహాలు కొనేవాడు కావాలి. చిన్న రైతు కొంటే అదనపు పెట్టుబడి ఖర్చు. చిన్న రైతు కొనలేడు, కొనడు కాబట్టి ప్రభుత్వ నిధులు వాడి తమ వ్యాపారం పెంచుకుంటారు. వీళ్ళకు ఎరువులు, విత్తనాలు, క్రిమికీటక నాశక రసాయనాల కంపెనీలతో మార్కెట్ ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా వ్యవసాయ ఇన్పుట్ మార్కెట్లో ఇంకొక మధ్య దళారీ వ్యవస్థను పెంపొందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్ర యించడానికి, మధ్యవర్తులను తగ్గించడానికి, వ్యాపారంలో పారదర్శ కతను పెంచడానికి ఒక ఆన్లైన్ డిజిటల్ వేదిక (ఈ–నామ్) రూపొందించడానికి భారత ప్రభుత్వం 2016 నుంచి కృషి చేస్తోంది. వ్యవ సాయ మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు, కొనుగోలుదారులకు మధ్య ఆన్లైన్ ట్రేడింగ్‌ను సులభతరం చేయడానికి ఈ వేదికను తయారు చేస్తున్నారు. రైతు తన పంటకు మెరుగైన ధరను కనుగొ నడంలో ఇది సహాయపడుతుంది. అయితే, ఇది గిట్టుబాటు ధర కాదు. స్థానిక రసాయనాల దుకాణాల నుంచి అప్పు తీసుకుని పంట అమ్మే పరిస్థితి నుంచి రైతులను విముక్తులను చేసి, ఉత్తమ ధరకు పంటలను విక్రయించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు. పబ్లిక్ రంగానికి చెందిన బ్యాంకులు అప్పులు సరళంగా ఇచ్చే వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, ప్రైవేటు రుణ వ్యవస్థకు ఊతం ఇస్తున్నారు. ప్రైవేటు అప్పులు సులభంగా అందుకోవడానికి మాత్రమే ఈ వేదికలు ఉపయోగపడతాయి. ఏ రాయి అయితే ఏమి పండ్లు ఊడగోట్టుకోవడానికి అన్న చందంగా స్థానిక వడ్డీ వ్యాపారి నుంచి డిజిటల్ వడ్డీ వ్యాపారి చేతిలో రైతులు పడతారు. డ్రోన్ ద్వారా పంట పొలాలలో చేసే విన్యాసాలు కూడా డిజిటల్ వ్యవసాయ ప్రతిపాదనలలో భాగమే. ఎరువులు చల్లవచ్చు, విత్తనాలు చల్లవచ్చు, నాటవచ్చు, క్రిమినాశక రసాయనాలు పిచికారీ చేయ వచ్చు. పైనుంచి క్రిమికీటకాలు, కలుపు ఫోటోలు తీసి యాప్‌లో పెడితే, ఏ రసాయనం పిచికారీ చెయ్యాలి అని సలహా వస్తుంది. ఆ సలహా మేరకు ఎక్కడ పురుగు ఉందో అక్కడ దాని మీదనే రసాయనం పిచికారీ చేయవచ్చు, ఇత్యాది పనులు డ్రోన్ల ద్వారా చేసి, అధిక దిగుబడులు, అధిక ఆదాయం చిన్న, సన్నకారు రైతులు పొందుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే, ఒక్కొక్క డ్రోన్ కొరకు రూ.7 నుంచి 8 లక్షల వరకు ఆయా డ్రోన్ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ పథకం పేరు డ్రోన్ దీదీ (డ్రోన్ అక్క). రైతు రోజుకు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడని వాపోతున్న ప్రభుత్వం నేరుగా రైతుకు ఇచ్చేది కేవలం రూ.2 వేలు మాత్రమే. డ్రోన్ కంపెనీలకు లక్షల సబ్సిడీ ఇవ్వడానికి మాత్రం సంకోచించడం లేదు.భారత వ్యవసాయంలో రైతు సంక్షోభంలో ఉన్నాడని ఒప్పుకొంటున్న ప్రభుత్వం మార్పుకు ప్రతిపాదిస్తున్న, నిధులు ఇస్తున్న పథ కాలు రైతు మీద ఉత్పత్తి ఖర్చు ఇంకా పెంచే విధంగా ఉంటున్నాయి. ఖర్చుకూ, ఆదాయానికీ మధ్య వ్యత్యాసం తగ్గించే ప్రయత్నం కాకుండా రైతును వ్యవసాయం నుంచి దూరం చేసే ప్రతిపాదనలు డిజిటల్ వ్యవసాయం దార్శనిక విధానాలలో ఉన్నాయి. డిజిటల్ వ్యవసాయంలో రైతు దగ్గర సమాచారం తీసుకుని, రైతుకే సలహాలు ఇచ్చే ప్రక్రియలు అనేకం ఉన్నాయి. పాత తప్పిదాల నుంచి తప్పించుకుని, రైతులకు చూపే కొత్త ఆశలకు ప్రతి రూపం డిజిటల్ వ్యవసాయం. రసాయన ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రమాదకర కీటక నాశక రసాయనాల వ్యాపారం పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్న వాహనం డిజిటల్ వ్యవసాయం.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం
రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్ కాల్’ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ రావు.వ్యవసాయ అభివృద్ధి బాగా ఉన్నది, ఆహార ఉత్పత్తి పెరుగుతున్నది అని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలోగానీ, ఇటు కేంద్ర బడ్జెట్లోగానీ ఎటువంటి ప్రస్తావనా చేయకపోగా, వారి సమస్య పరిష్కారానికి తగిన స్పందన కనబరచలేదు.భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలు, పెరుగుతున్న పంట ఖర్చులు వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24 ఆర్థిక సర్వే కూడా ఇంచుమించు ఇదే మాట చెప్పింది. అయినా 2024–25 సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పాత బాటనే పట్టినాయి. ఎన్నికల నుంచి అధికార భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. ప్రైవేటీకరణ, దిగుమతులు, విదేశీ విధానాల విషయాల్లో పాతబాటనే సాగుతోంది. మారుతున్న వాతావరణం వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పిన నివేదిక, ఆహార ఉత్పత్తి పెరిగింది అని చెబుతున్నది. ఈ వైరుద్ధ్యం మీద ఉన్నశంక తీర్చే ప్రయత్నం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, అకాల వర్షాలు ఒక వైపు నష్టపరుస్తుంటే పంటల దిగుబడి ఎట్లా పెరుగుతున్నది? ప్రధానంగా, రైతుల ఆర్థిక పరిస్థితి మీద అంచనా మాత్రం చేయలేదు. బడ్జెట్ కేటాయింపులలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొత్త ఆలోచన విధానం ఏదీ కనపడటం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది, వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారు చేయటం. అయితే, ఎట్లా సాధిస్తారు? బడ్జెట్లో కేటాయింపులతో ఇది సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులను మారుస్తామని తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పినా వాస్తవానికి ఇది కొత్త పథకం కాదు. 2023–24లో దానికి ఇచ్చింది రూ.459 కోట్లు మాత్రమే. ఈసారి అది కూడా తగ్గించి రూ.365.64 కోట్లు ఇచ్చారు. 2023–24లో ప్రకృతి వ్యవసాయానికి సవరించిన బడ్జెట్ రూ.100 కోట్లు మాత్రమే. ప్రకృతి వ్యవసాయం కాకుండా పంటల దిగుబడిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఉపాయం ఏది?వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని పదే పదే ఆర్థిక సర్వేలు చెప్పినా, వ్యవసాయ బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించారు. 2022–23లో రూ.1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24లో రూ.1,15,531.79 కోట్లకు తగ్గాయి. ఇది 7 శాతం తగ్గింపు. 2024–25లో వ్యవసాయ పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా పరిశోధనలకు ఇచ్చినవి మొత్తం రూ.9,941 కోట్లు మాత్రమే. ప్రకటించిన స్థాయిలో కేటాయింపులు లేవు. 2022–23లో ఇదే పద్దుకు ఇచ్చినవి రూ. 8,513.62 కోట్లు. 2023–24లో ఇచ్చినవి రూ.9,504 కోట్లు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ.7,137 కోట్లు ఈసారి ఇచ్చారు. అంతకుముందు సంవత్సరాలలో వరుసగా కేటాయించింది రూ.6576.62 కోట్లు, రూ.5,956.70 కోట్లు. నిధులు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ.13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారినపడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం.కొత్త ఉపాధి కల్పన పథకం ప్రవేశపెట్టి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెలవారీ జీతం తీసుకునే యువతకు (సంవత్సరానికి రూ.లక్ష వరకు) కొంత భృతి చెల్లించే ఈ పథకం లక్ష్యం అంతుబట్టకుండా ఉన్నది. గ్రామీణ భారతంలో ఉన్న ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు చేయడం లేదు. ఈ పథకం కేవలం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు రాయితీగా ఇస్తునట్టు కనబడుతున్నది. శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉద్యోగ రక్షణకు కాకుండా ఫ్యాక్టరీలలో ఉపాధికి ఈ రాయితీ ఇవ్వడం అంటే ఆ యా కంపెనీలకు ఇవ్వడమే! పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడిపోతున్నది. ఆహార ద్రవ్యోల్బణం వల్ల సరి అయిన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. పర్యావరణానికి దోహదపడే చేతివృత్తుల ఉపాధికి ఈ పథకం ఇచ్చివుంటే బాగుండేది.వివిధ మార్గాల ద్వారా 2024–25లో కేంద్రం ఆశిస్తున్న ఆదాయం రూ. 46,80,115 కోట్లు. పోయిన సంవత్సరం మీద రాబోయే సంవత్సరంలో పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.2,50,000 కోట్లు. కానీ పెరిగిన ఈ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద పెట్టడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెరుగుతున్నది. 2022–23 నాటికే ఇది రూ.1,54,78,987 కోట్లకు చేరింది. మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులకు రూ. 11 లక్షల కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు. అభివృద్ధి అందరికీ కాకుండా కొందరికే పోతున్నది అని నివేదికలు చెబుతున్నప్పటికీ, అభివృద్ధి తీరులో మార్పులకు కేంద్ర ప్రభుత్వ సిద్ధంగా లేదు. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించే రోడ్లు, వంతెనలు వగైరా మౌలిక వసతులు నాసిరకం నిర్మాణం వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూలిపోతుంటే పరిస్థితిని సమీక్షించకుండా, సమస్య లోతులను గుర్తించకుండా పదే పదే ఈ రకమైన పెట్టుబడుల మీద ప్రజా ధనం వెచ్చించడం వృథా ప్రయాసే అవుతుంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
విత్తనాలకు.. సుస్థిర విధానం అవసరం!
మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం తగ్గింది. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండటం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి.ఆహార ఉత్పత్తి మొదలయ్యేది విత్తనాల నుంచే. దాదాపు ప్రతి పంటకు అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యేక పర్యావరణ, వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పంటలో రైతులు వందల ఏండ్లుగా విత్తనాలను రూపొందిస్తున్నారు. మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. వంకాయలో 3 వేలతో సహా అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వందల యేండ్ల నుంచి వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. దేశవ్యాప్తంగా విత్తనాల చుట్టూ అనేక సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ కార్యక్రమాలు ఉండేవి. గ్రామీణులు, రైతులు, ప్రత్యేకంగా మహిళలు విత్తనాలను గుర్తించటంలో, దాచటంలో, శుద్ధి చేయడంలో గణనీయ జ్ఞానం, కౌశల్యం సంపాదించారు. 35,000 సంవత్సరాలకు పైగా, తరతరాలుగా రైతాంగం పరిశోధనల ఫలితంగా అనేక రకాల విత్తనాలు వృద్ధి అయినాయి. ఈ జానపద విత్తన రకాలు మానవాళికి సుమారు 2,500 పంటలు, 14 పశువుల రకాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే స్థాయిలో 11.4 లక్షల రకాల పంటలు, 8,800 పశువుల జాతులను అందించాయి.హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు, ప్రధానంగా వరి, గోధుమలు, మక్కల(మొక్కజొన్న)లో ప్రవేశపెట్టారు. 1968–2019 మధ్య వివిధ సంస్థల ద్వారా 1200 వరి హైబ్రిడ్లు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయికి చేరింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రతి 3, 4 ఏళ్లకు మార్చాల్సి వస్తుంది. ఆధునిక వ్యవసాయం ల్యాబ్ విత్తనాలను ప్రవేశపెట్టి, సంప్రదాయ విత్తనాలను కనుమరుగు చేస్తున్నది. విత్తనాలు కంపెనీల గుప్పిట్లోకి పోయాయి. విత్తనాలు పోయినాయి అంటే మొత్తం ఆహార వ్యవస్థ ఈ కంపెనీల చేతులలోకి వెళ్లిపోవచ్చు. అట్లని కంపెనీల అధీనంలో, ఒక గొప్ప విత్తన వ్యవస్థ వచ్చిందా అంటే అదీ లేదు. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. సహజంగా విత్తనాలలో సహజీవన సూక్ష్మజీవులు ఉంటాయి. రసాయన చర్యకు లోనైన ఆధునిక విత్తనాలలో ఈ సూక్ష్మ జీవులు ఉండవు. జీవ ప్రక్రియలో ముఖ్య ఘట్టం విత్తనాలు. ఆ విత్తనాలు విషానికి, విష వ్యాపార సంస్కృతికి బలవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల విత్తన వ్యాపారం మన దేశంలో 2002 నుంచి పుంజుకుని, ప్రతి యేడు పెరుగుతున్నది. దాదాపు రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం విత్తన వ్యాపారం కేవలం మూడు బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నది. అమెరికాలోనే పారిశ్రామిక వ్యవసాయానికి అనుగుణమైన విత్తన వ్యవస్థ పుట్టుకొచ్చింది.అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కంపెనీలకు మద్దతుగా తన వాణిజ్య, విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మార్కెట్లో పోటీ తగ్గి కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండడం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. బీటీ పత్తి మినహా వేరే రకం పత్తి మార్కెట్లో లేకుండా ఈ ప్రైవేటు కంపెనీలు సిండికేట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలలో విత్తన పరిశోధనలు జరగకుండా ప్రైవేటు విత్తన వ్యాపారం అడ్డు పడుతున్నది.అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1968లో కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అప్పట్లో ప్రభుత్వ పరిశోధన సంస్థలు విత్తనాలను విడుదల చేసే పద్ధతిని నిర్దేశించిడం. తరువాత 2002లో ప్రైవేట్ కంపెనీలకు విత్తనాలను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినాక విత్తన చట్టం సవరించాలని భావించారు. 2003 నుంచి కొత్త విత్తన చట్టాన్ని రైతాంగం కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కంపెనీలకు అనుకూల ముసాయిదాలతో 20 యేండ్ల కాలం దాటింది. కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో చట్టం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. వ్యవసాయానికి విత్తన ఆవశ్యకత ఉన్నందున విత్తనాలను నిత్యావసర చట్టంలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. విత్తన ధరల మీద నియంత్రణ లేదు. ఉత్తుత్తగా ప్రతి సంవత్సరం పత్తి విత్తనాల ధర నిర్ణయిస్తారు. కొరత ఉందని రైతులను భయపెట్టి బ్లాకు మార్కెట్లో ధరను పదింతలు పెంచుతారు. రైతు మీద భారం మోపుతారు. ఎవరైనా రైతు సొంతంగా విత్తనాలు చేసి అమ్మితే వారి మీద 420 కేసులు పెట్టే శాసన వ్యవస్థ, నాణ్యత లేని విత్తనాల వల్ల వేల ఎకరాల పంట నష్టపోయినా ఆయా కంపెనీలకు తాఖీదులు కూడా ఇచ్చే ధైర్యం చేయలేదు.జన్యుమార్పిడి విత్తనాల వల్ల శ్రేష్ఠమైన సంప్రదాయ విత్తనాలు కనుమరుగు అవుతుంటే, కలుషితం అవుతుంటే పట్టించుకుని సంరక్షించే విత్తన సంస్థ లేకపోవడం దురదృష్టకరం. ప్రత్తి విత్తనాలలో శ్రేష్ఠమైన, దేశీ విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అనేక పంటలలోనూ ఇదే పరిస్థితి. పసుపు, చెరుకు, గోధుమలు, జొన్నలు, కూరగాయలు, మక్కలలో దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్న కంకర లాంటి మక్క గింజల పంటను ఫ్యాక్టరీకి పంపించి, ప్రాసెస్ చేసి, పశువుల, కోళ్ళ దాణాగా మాత్రమే ఉపయోగించేందుకు వృద్ధి చేశారు. ఇప్పటి మక్క కంకులు నేరుగా ఇళ్లల్లో కాల్చుకుని, ఉడకపెట్టుకుని, ఒలుచుకుని తినే విధంగా లేవు. అటువంటి మక్క గింజలనే పక్కాగా వాడమనీ, తమ కంపెనీల దగ్గర కొనుక్కోమనీ వివిధ దేశాల మీద ఒత్తిడి తేవడం అమెరికా పని. ఇటీవల అటువంటి జన్యుమార్పిడి మక్కలు మాకు వద్దని మెక్సికో ప్రభుత్వం అమెరికా నుంచి మక్కల దిగుమతిని ఆపేసింది. ముక్కలకు మక్కాగా ప్రసిద్ధి చెందిన మెక్సికో తమ గింజలను, తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అమెరికాను ధిక్కరించింది. వరి గింజలకు, వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మన దేశం మాత్రం విత్తన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కడుగు కూడా వేయడం లేదు. రైతులే కేంద్రంగా విత్తన వ్యవస్థను పునరుద్ధరించే పనిని అనేక స్వచ్చంద సంస్థలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. సహకార విత్తన బ్యాంకులను (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి రైతులు, ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. గత పదేళ్ళలో వరిలో, గోధుమలలో, చిరు ధాన్యాలలో, వివిధ కూరగాయలు, పండ్లలో తిరిగి దేశీ విత్తనాలను ఉపయోగించే వాతావరణం కల్పించటంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉన్నది. మన దేశంలో ఈ రెండు వ్యవస్థల (రైతు కేంద్రీకృత విత్తన వ్యవస్థ, లాభాపేక్షతో కొన్ని జన్యుమార్పిడి విత్తనాలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు వ్యవస్థ) మధ్య కనపడని సంఘర్షణ ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు విత్తన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ, సబ్సిడీలు అందిస్తూ గుత్తాధిపత్యానికి ఊతం అందిస్తున్నాయి. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రసాయన రహిత పౌష్టిక ఆహారం అందాలన్నా, అందరికి కూడు, బట్ట అందాలన్నా విత్తన వ్యవస్థ లాభాపేక్ష లేని వ్యవస్థగా రూపుదిద్దాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి. గాలి, నేల, నీరు వంటివి సహజ పర్యావరణ వనరులు. విత్తనాలు కూడా సహజ వనరు. ఏ ఒక్కరి సొంతమో కారాదు. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
అమృత కాలంలో ఇదేనా వ్యవసాయం?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రూపొందించినట్లున్నా... వ్యవసాయానికి మాత్రం అన్యాయం జరిగింది. ఒకపక్క 2022–23 ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరం అని పేర్కొన్నా... బడ్జెట్లో మాత్రం పాత కేటాయింపుల కన్నా తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. ఈ రంగానికి 2022–23లో రూ. 1.24 లక్షల కోట్లు కేటాయించగా... 2023–24కు గానూ రూ. 1.15 లక్షల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు సగటు ఆదాయం దారుణంగా రూ.7 వేలకు మిం^è డం లేదు. కానీ వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగు తోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ ప్రస్తావించలేదు. భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలూ, పెరుగుతున్న పంట ఖర్చులూ వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమనీ జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. ఇదే ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2020–21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి పెరిగాయి. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2021–22లో రూ. 18.6 లక్షల కోట్లకు పెరిగాయి. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల వల్ల 2021–22 లో 315.7 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేరింది. 2021–22 నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి ఏటేటా పెరుగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గత ఐదేళ్లలో సగటున 23.8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది. మారుతున్న వాతావరణం... వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపు తోందని చెప్పిన నివేదిక ఆహార ఉత్పత్తి పెరిగిందనీ చెబుతోంది. కానీ రైతుల పరిస్థితి మీద అంచనా మాత్రం వేయలేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. రైతు సగటు ఆదాయం చాలా దారుణంగా రూ.7 వేలు మించని వైనం ప్రస్తావించలేదు. వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని ఆర్థిక సర్వే చెప్పినా, బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులను తగ్గించారు. 2022–23లో రూ. 1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24కి వచ్చేటప్పటికి రూ. 1,15,531.79 కోట్లకు తగ్గించారు. పశుగణాభివృద్ధికీ, మత్స్య రంగానికీ కలిపి రూ. 6,576.62 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం ఈ రంగాలకు ఇచ్చింది రూ. 5,956.70 కోట్లు. వ్యవసాయ పరిశో ధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. గతేడాది ఇచ్చింది రూ. 8,513.62 కోట్లు. మొత్తం మీద వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా రూ. 8,468.21 కోట్లు – దాదాపు 7 శాతం తగ్గించారన్నమాట. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం. ప్రధాన మంత్రి రైతులకు అందిస్తున్న రూ. 2 వేల నగదు సహాయం వల్ల రైతులకు నగదు సమస్య తీరిందనీ, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు వారి రోజువారీ వినియోగం, విద్య, ఆరోగ్యం ఇతర యాదృచ్ఛిక ఖర్చులను తీర్చడానికి సహాయపడిందనీ సర్వే తెలిపింది. ఏడాదికి కేవలం రూ. 2 వేలతో రైతుల సమస్య తీర్చిన ఈ గొప్ప పథకానికి బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పెరగలేదు. పైగా తగ్గాయి. మొత్తంగా రూ. 8 వేల కోట్లు తగ్గించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (రూ. 20 లక్షల కోట్ల) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 18 లక్షల కోట్లు. ఇది లక్ష్యం మాత్రమే. రైతులకు బ్యాంకుల నుంచి, సంస్థాగత రుణాలు పలు కారణాల వల్ల అందడం లేదు. ప్రతి ఏటా ప్రకటించే రుణాల లక్ష్యం ఏ మేరకు సఫలం అయ్యిందీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పదు. రూ. 2,200 కోట్ల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహిత, నాణ్యమైన మొక్కల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ కొత్త పథకానికి ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు. కృషి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టవచ్చు. మత్స్యకారులూ, చేపల వ్యాపారులూ... సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికీ, మత్స్య ఉత్పత్తుల సరఫరా సామర్థ్యాలను మెరుగుపరచడానికీ, మార్కెట్ విస్తరించడానికీ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త ఉప పథకాన్ని రూ. 6,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. కాని మత్స్య శాఖ కేటాయింపులు మొత్తం రూ. 2,250 కోట్లు దాటలేదు. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకానికి ఇచ్చిన కేటాయింపు కేవలం రూ. 2,025 కోట్లు మాత్రమే. తరువాత పెంచుతారా అనే విషయంలో స్పష్టత లేదు. వ్యవసాయ రుణాలపై ఉండే 9 శాతం వడ్డీకి, 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది రూ. 23 వేల కోట్లు. పోయిన ఏడాది సవరణ ద్వారా ఈ పథకానికి ఇచ్చింది రూ. 22 వేల కోట్లు – పెంచింది కేవలం 4.5 శాతం మాత్రమే. ఈ పథకం ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందు తున్నారు? బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ ఈ వడ్డీ రాయితీ అందడం లేదు. వడ్డీ రాయితీ నేరుగా రైతులకు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రుణదాతలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు తమ నిధుల వినియోగంపై వడ్డీ రాయితీ... ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల రీఫైనాన్సింగ్ కోసం నాబార్డ్‌కు ఇస్తారు. ఇదివరకు, 3 శాతం వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 3 శాతం ఇచ్చేది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇవ్వడం లేదు. రైతు మీద వడ్డీ భారం 7 నుంచి 9 వరకు ఉంటుందని మనకు అర్థమవుతోంది. స్పష్టంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయ లేదు. రుణ వ్యవస్థలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యను పెంచడానికీ, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచాలనీ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందనే ప్రకటన చూశాం. దీనికీ బడ్జెట్ కేటాయింపులకూ సంబంధం లేదు. వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగుతోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కుంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలో, ఇటు కేంద్ర బడ్జెట్లోనూ ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం, వారి సమస్య పరిష్కారానికి తగిన విధంగా స్పందించక పోవడం వ్యవసాయ ఆధారిత సమాజంలో పెను విషాదం. డా. దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
ప్రపంచాన్ని నియంత్రించే వేదిక
దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడుగులు వేస్తున్నది. ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ తమ సభ్యులు ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రపంచంలో జరిగే కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. గత నాలుగు దశాబ్దాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో వేలాది మంది అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు,బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, దేశాధినేతలు, ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ధనిక దేశాల విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇంతమంది నాయకులు, ప్రముఖులు అక్కడ పోషించే పాత్ర ఏమిటో తెలియదు. ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఈ సంవత్సరం కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు దావోస్(స్విట్జర్లాండ్) పోతున్నారు– మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. తెలంగాణా నుంచి దావోస్ ప్రతి సమావేశంలో పాల్గొనే మంత్రి గారు వెళ్తున్నారు. ఈ సమావేశాలు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక ప్రైవేటు సంస్థ. దీని ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రపంచంలో రెండు పెట్టుబడిదారీ నమూనాలు ఉన్నాయి. మొదటిది: చాలా పాశ్చాత్య సంస్థలు స్వీకరించిన ‘షేర్ హోల్డర్ క్యాపిటలిజం’. దీని ప్రకారం ఒక కార్పొరేషన్ ప్రాథమిక లక్ష్యం దాని లాభాలను గరిష్ఠంగా పెంచడం, తద్వారా వాటాదారు లకు లాభాలు పంచడం. రెండవ నమూనా: ‘స్టేట్ క్యాపిటలిజం’. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. చైనా, ఇంకా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తరహ వ్యవస్థ ఇటీవల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రెండింటికి భిన్నంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధినేత క్లాస్ శ్వాబ్ ప్రతిపాదించిన మూడవ తరహా ‘స్టేక్ హోల్డర్ పెట్టుబడిదారీ విధానం’లో ప్రైవేట్ కంపెనీలకు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది ఒక విధంగా మన దేశంలో అమలవుతున్న సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ) లాంటిది. ఇది మంచిదేగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తున్నది. వైఫల్యం చెందినప్పటికీ ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తూ, ప్రపంచ పరిపాలన మీద దృష్టి పెడుతున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ సమస్యలో అయినా ‘డబ్ల్యూఈఎఫ్’ సభ్యులు తమ ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఆలోచనలతో క్లాస్ శ్వాబ్ రాసిన పుస్తకం: ‘ది గ్రేట్ రీసెట్’. దీనిలో భాగస్వామ్య పెట్టుబడిదారీ విధానంతో పాటు తనదైన మార్క్సిజం బ్రాండ్‌తో ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని పిలుపు ఇచ్చాడు. దశాబ్దాలుగా ఒక క్లబ్ మీటింగ్ తరహాలో ఇక్కడ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. నయా ఉదారవాదం పునాదిగా కార్పొరేట్ వాణిజ్య ఒప్పందాల వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయడం ఇక్కడి ప్రక్రియలో భాగం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లకు దన్నుగా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను ప్రోత్సహించడానికి ఈ సమావేశాలను వాడుకుంటున్నారు. వాస్తవానికి, ఈ ఆర్థిక వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచీకరణ ద్వారా ఉన్నత వర్గాల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడ టమే. 1990లో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైనప్పుడు గనులు, బ్యాంకులు, గుత్తాధిపత్య పరిశ్రమలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయం చేస్తుందని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడైన వెంటనే 1992 జనవరిలో ‘డబ్ల్యూఈఎఫ్’ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను మార్చుకుని ‘పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ’ను స్వీకరించారు. చైనా, వియత్నాం, కంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటే తమ దేశానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాయి. 1997లో అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ ‘దావోస్ మగవాడు’ (దావోస్ మ్యాన్) అనే పదాన్ని సృష్టించారు. ‘దేశ సరిహద్దులను కనుమరుగవుతున్న అవరోధాలుగా, జాతీయ ప్రభు త్వాలను గతానికి అవశేషాలుగా చూస్తూ– అటువంటి ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఉపయోగకరమైన పని ఉన్నత వర్గాల పుడమి స్థాయి కార్యకలాపాలను సులభతరం చేయడమే అని నమ్మేవారు’ అంటూ ఈ పదాన్ని ఆయన విశ్లేషించారు. ఏటా దావోస్ సమావేశాలకు హాజరయ్యేవాళ్ళు తమ పరపతి, వనరులు పెంచుకోవడానికీ, ఇతరులతో కలిసి తమ ఆధిపత్యానికి అడ్డంకులు తొలగించుకోవడానికీ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఒకానొక సమావేశంలో, బోరిస్ బెరెజోవ్స్కీ నేతృత్వంలోని ఏడుగురు రష్యన్ నేతలు బోరిస్ యెల్ట్సిన్ తిరిగి ఎన్నిక కావడానికి నిధులు సమకూర్చాలనీ, ‘తమ దేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి’ కలిసి పనిచేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ కూటమి అనుకున్నది సాధించింది. ఇది వారందరినీ ఇంకా ధనవంతులను చేసింది. 2009 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రజలకు విశ్వాసం తగ్గినప్పటికీ, ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి దావోస్ పని చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫౌండేషన్ బోర్డు (దాని అత్యున్నత పాలక సంస్థ)లో ప్రపంచ కుబేరులు ఉన్నారు. 2002లో ఏర్పాటైన మరొక పాలక మండలి ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్’ను 100 మంది ప్రముఖులతో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, వార్షిక సమావేశ ఎజెండా తయారీకి ఈ మండలి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. 2015 నాటికి ‘డబ్ల్యూఈఎఫ్’ వార్షిక వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందాలంటే దాదాపు 7 లక్షల డాలర్ల రుసుము కట్టాలి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామి సభ్యులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లేస్, బ్లాక్ రాక్, బీపీ, చెవ్రాన్, సిటీ, కోకాకోలా, క్రెడిట్ సూయిజ్, డ్యూష్ బ్యాంక్, డౌ కెమికల్, ఫేస్బుక్, జీఈ, గోల్డ్‌మాన్ శాక్స్, గూగుల్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, సీమెన్స్, టోటల్, యూబీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో జరిగే కార్పొరేట్, ఆర్థిక శక్తి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ప్రతిఘటన ఉద్యమాల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ఆసక్తి చూపిస్తున్నది. 1999లో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ ఆసక్తి స్పష్టమైంది. అప్పటి నిరసనల వల్ల సియాటెల్ నగరంలో కీలక వాణిజ్య చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలను పెరుగుతున్న ‘ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం’గా ‘డబ్ల్యూఈఎఫ్’ అభివర్ణించింది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో, లేదా నిరంకుశంగా అణిచివేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. 2001 జనవరిలో దావోస్ సమావేశాలకు అంతరాయం కలగకుండా అసాధారణ భద్రతా చర్యలు తీసుకున్నారు. దావోస్ పట్టణం చుట్టూ కాంక్రీట్ బ్లాక్‌లు అమర్చి, కంచెకు అవతలి వైపునే వేలాది పోలీసులు నిరసనకారులను నిలువరించారు. అదే సమయంలో, దావోస్‌కు ప్రతి వేదికగా బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో ఏర్పడిన వరల్డ్ సోషల్ ఫోరమ్ కాలక్రమేణా బలహీనపడగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బలపడింది. అన్ని దేశాల ఒప్పందం మేరకు ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడగా, ఒక ప్రైవేటు సంస్థ అయిన ‘డబ్ల్యూఈఎఫ్’ బలపడుతున్నది. తన దగ్గర ఉన్న కోట్లాది సొమ్ముతో అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. కరోనా మహమ్మారి గురించిన వివిధ దేశాల ప్రభుత్వాల స్పందనను, విధానాలను శాసించే స్థితికి కూడా ఈ సంస్థ చేరిందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
ప్రకృతిపై ప్రభుత్వానికి పట్టింపు లేదా?
హైదరాబాద్ జీవనంలో అతి ముఖ్యమైన నీటి వనరుల నిర్వహణలో ఆధునిక ప్రభుత్వాలు తలా తోక లేని విధానాలతో భవిష్యత్తుని అగమ్య గోచరం చేస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ దుఃస్థితి దిశగా పయనిస్తు న్నాయి. ప్రకృతితో కూడిన ప్రజా సంక్షేమ పాలన చేయకుండా ప్రకృతి వనరులను కైంకర్యం చేసుకుని, వ్యక్తిగత సంపద సృష్టించుకుంటున్నారు. జీవో 111 రద్దు చెరువులే అస్తిత్వంగా కలిగిన తెలంగాణా సంస్కృతి మీద దాడి. గొలుసు కట్టు చెరువుల ద్వారా తక్కువ ఖర్చుతో దాహార్తిని తీర్చే అవకాశం ఉండగా, ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. 1985కి పూర్వం చెరువులు, కుంటలు నగర నివాసితుల నీటి అవసరాలను తీర్చేవి. 400 యేండ్ల క్రితం తవ్విన హుస్సేనసాగర్ చెరువు ఒక 30 ఏళ్ళ కాలంలో క్రమంగా విషపూరితం అయిపొయింది. 1990 తరువాత అసలు ఆ నీటిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందూ, తరువాతా కూడా ప్రభుత్వాలు ఈ చెరువు పరిస్థి తిని మెరుగుపరచడంలో విఫలం అయ్యాయి. తాగు నీటికి కాకున్నా ఇతర అవసరాలకు వినియోగించే స్థాయికి కూడా తీసుకురాలేక పోవడం సాంకేతిక పరిమితులతో పాటు పరిపాలనా లోపం స్పష్టంగా కనపడుతున్నది. నగరం నడి బొడ్డున కాలుష్య జలాలతో నిండి ఉన్న చెరువుతో జీవించక తప్పని దుస్థితి తెలంగాణా ప్రజలకు వచ్చింది. ప్రకృతి వనరుల నాశనం వల్ల విపరీతంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. 1908లో మూసి నదికి వరదలు వచ్చి హైదరాబాద్ అతలా కుతలం అయ్యింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలను నివారించటానికి అప్పటి నిజాం ప్రభుత్వం మూసీ నది ఏర్పడక ముందు ఉన్న రెండు పాయల మీద రెండు చెరువులను నిర్మించింది. మూíసీ నది మీద నిర్మించిన ఉస్మాన్ సాగర్ చెరువు 1920లో పూర్తయింది. ఇది తరువాత గండిపేట్గా ప్రసిద్ధి చెందింది. పైన అనంతగిరి గుట్టల నుంచి జాలువారే ఈ నీళ్ళు గండిపేట్ నీళ్ళుగా ప్రాచుర్యం పొందాయి. ఇవి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచివి అని నానుడి ఏర్పడింది. ప్రత్యేకంగా, తమ ప్రాంతంలో కలుషిత నీటితో సతమతమయ్యే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ నీటి ప్రాశస్త్యాన్ని గుర్తించారు. వలసలు ఈ ప్రాంతానికి ఆ కారణంగా కూడా జరిగి నాయి. ఈసా నది మీద కట్టిన హిమాయత్ సాగర్ చెరువు 1927లో పూర్తయింది. ఈ రెండు చెరువులు కట్టిన ప్రాథమిక ఉద్దేశం హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి కాపాడటానికే. మంచి నీటిని అందించటం కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఈ చెరువులు కలుషితం కాకుండా వీటి పరివాహక ప్రాంతంలో అప్పట్లోనే నిజాం ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. వీటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఊర్లకు ఇవి వర్తింప జేశారు. అయితే ఆ పరిమితుల మీదా, వాటి ప్రభావం మీదా పూర్తి స్థాయి సమాచారం ఎక్కడా చరిత్రలో కనపడదు. హుస్సేన్ సాగర్ కలుషితం అయిన నేపథ్యంలో, ఈ జంట జలాశయాలు కూడా కలుషితం కావద్దనే ఉద్దేశంతో 1989లో ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది (జీవో 50. జనవరి 28. 1989). ఈ ఉత్తర్వు, ఈ జంట జలాశయాల నీటి పరివాహక ప్రాంతం మొత్తాన్నీ పరిరక్షించాలని నిర్దేశించింది. ప్రస్తుతం, ఈ ఉత్తర్వు పూర్తి ప్రతి అందుబాటులో లేదు. కానీ, దాని ప్రస్తావన తదుపరి ఉత్తర్వులలో ఉంది. దీనిలో ఉన్న అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 1993లో ఒక సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన మొదటి నివేదిక ఆధారంగా 1994లో ఈ చెరువుల పరిరక్షణకూ, నీటి నాణ్యత రక్షణకూ ఇంకొక ఉత్తర్వు జారీ అయ్యింది (జీవో 192. మార్చ్ 31, 1994). ఈ కమిటీ ఇచ్చిన రెండవ నివేదిక ఆధారంగా 1996 మార్చ్ 8న ఇంకో కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అది 111 జీవోగా ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్తర్వులో పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలలో కొత్త నిర్మాణాల మీద పరిమితులు విధించారు. పరిశ్రమల ఏర్పాటుని పూర్తిగా నిషేధించారు. వాణిజ్య భవనాల నిర్మాణం వద్దన్నారు. ఇండ్ల నిర్మాణం మీద, కొత్త లేఅవుట్ల మీద ఆంక్షలు పెట్టారు. మంచి నీటి చెరువులకు చేటు తెచ్చే కాలుష్య కార్యకలాపాలు నిర్దేశించే విధంగా ఈ ఉత్తర్వులు రూపొందించారు. ఈ ఉత్తర్వు ఒక విధంగా 314 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ వంటిది. కొంత జోన్ల గురించి ప్రస్తావన ఉన్నా, పూర్తిగా జోనల్ విధానం లేదు. గ్రామకంఠంలో ఆంక్షలు లేవు. కాకపోతే, అంతస్తుల మీద పరిమితులు ఉన్నాయి. ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ కూడా నిర్వ చించారు. ఈ ఉత్తర్వు జారీ చేసిన రెండు నెలలలోనే ప్రభుత్వమే ఉల్లంఘనలకు నాంది పలికింది. ఒక పరిశోధన ల్యాబ్‌కు అనుమతిచ్చారు. అప్పట్లో ఇది ఎవరికీ తెలవదు. ఆ సంస్థ భవన నిర్మాణం 2002లో హిమాయత్ నగర్ గ్రామం దగ్గర మొదలు పెడితే తెలిసింది. ఇంకొక ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు. దాని మీద సుప్రీం కోర్టులో హోరాహోరీ పోరాటం జరిగింది. ఆఖరున సుప్రీం కోర్టు అన్ని కాలుష్య కార్యకలాపాలు నిలిపి వేయాల్సిందే అని 2000 సంవత్సరంలో తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా ఈ ఉత్తర్వు పరిధిలోకి వస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ప్రభుత్వం ధారాదత్తం చేస్తే, అందులో 2 వేల ఎకరాలు 111 జీవో పరిధిలోకి వస్తుంది అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేస్తే, అనేక వాదనల తరువాత ఈ వ్యాజ్యం కొట్టివేశారు. అంతకు ముందే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవెలప్మెంట్ అథారిటీ పేరిట ఆ ప్రాంతంలో జోనల్ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ అథారిటీ పరిధిలో దాదాపు 1,700 ఎకరాలను బయో కన్జర్వేషన్ జోన్‌గా గుర్తించి (జీవో 111 పరిధిలో) నిర్మాణాల మీద పరిమితులు విధించారు. అయినా ఈ రెండు చెరువుల పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఆగలేదు. 2007లో ఈ విషయమై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది. అంతకుముందే 2005లో (జీవో 952. నవంబర్ 25, 2005) ప్రభుత్వం ‘ఈపీటీఆర్ఐ’, ‘ఏపీïపీసీబీ’లతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రెండు చెరువుల కట్ట దాటి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఆ మేరకు చెరువుల కట్ట కింద పారే మంచి నీటి కాలువలను సంరక్షించాలని ఇంకా కొన్ని అదనపు ఆంక్షలు చేరాయి. దాంతో ఇంకొక 86 గ్రామాలు దీని పరిధిలోకి వచ్చాయి. జీవో 111 కొనసాగించాలని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. 2015లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎదుట జీవో 111ను సవాలు చేస్తూ, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నయంటూ వ్యాజ్యాలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం 2016లో (జీవో 839. డిసెంబర్ 7, 2016) ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ నిర్ణయం మేరకు తమ వాదన, నిర్ణయం ఉంటుందని కోర్టుకు తెలిపింది. కాగా ఆ కమిటీ 2019 వరకు నివేదిక ఇవ్వకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవటంతో ఎన్జీటీ 111 జీవో కొనసాగింపు ఉంటుందని తీర్పు ఇచ్చింది. ధనికులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఇక్కడ వందల ఎకరాలు కొనుక్కుని ఫార్మ్‌హౌస్‌లు కట్టుకుని, నిర్మాణాల మీద ఉన్న ఆంక్షలను తుంగలో తొక్కారు. వీరిని నియంత్రించని ప్రభుత్వం చిన్న చితక కుటుంబాల మీద తన ప్రతాపం ఇప్పటికీ చూపెడుతోంది. వారి నిర్మాణాలకు ఎటువంటి ఆంక్ష లేకున్నా వారిని ఇబ్బంది పాలు జేస్తూ, పలుకుబడి ఉన్నవారు ఏమి చేసినా పట్టించుకోకపోవటం అలవా టైంది. ఈ విషయంగా జీవో 111 పట్ల అపోహలు పెంచారు. దీన్ని చూపెట్టి చిన్న, సన్నకారు రైతుల నుంచి భూమి బదలాయింపు చేసుకోవడం, అసైన్డ్ భూములను కబ్జా చేసుకోవడం మొదలైంది. ప్రశ్నించిన వారికి 111 బూచి చూపెట్టడంతో దాని పట్ల వ్యతిరేకత వచ్చింది. మీడియాలో కూడా అసందర్భ వ్యాఖ్యలతో అది ఇంకా పెరిగింది. తెరాస అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 చేవెళ్ళ ఎన్నికల బహిరంగ సభలో 111 జీవో ఎత్తివేతకు హామీ ఇస్తూ, ఎకరాకు రూ.20 లక్షల ధర కూడా ఇప్పిస్తానని ఒక విచిత్రమైన వాగ్దానం చేయడం ఆశ్చర్యపరిచింది. తరువాత కూడా చేవెళ్ళ, ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దాన్ని ఎత్తివేస్తామని ప్రకటన చేస్తూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈ జీవో పట్ల వ్యతిరేక భావం పెంచి పోషిస్తున్న పరిస్థితి! 2022 మార్చి శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చివరిరోజు ముఖ్యమంత్రి ఈ రెండు చెరువుల కాలం చెల్లిపోయింది కాబట్టి జీవో 111 ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే ఈ 111 ఎత్తివేత వల్ల 1,32,600 ఎకరాల ఆంక్షలు తొలిగిపోయి మార్కెట్లోకి వస్తాయి; దాని వలన రియల్ ఎస్టేట్ పరిస్థితి గందరగోళంగా మారు తుంది కాబట్టి ఒక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి, ఈ హామీని కూడా తుంగలో తొక్కుతూ ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ సమావేశంలో జీవో 111 ఎత్తివేతకు తీర్మానం ఆమోదం పొందింది అని ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో ప్రకటించారు. నిపుణుల కమిటీ వేయకుండా, కమిటీ నివేదిక లేకుండానే తెలంగాణా మంత్రివర్గం జీవో ఎత్తివేతకు ఆమోదం తెలపడం విస్మయం కలిగించింది. అంత తొందరపాటు దేనికోసం అనే ప్రశ్న వచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత చాలామంది నిపుణుల కమిటీ మీద ఆశలు పెట్టుకున్నారు. నిపుణుల కమిటీ ప్రజలతో సంప్రదింపులు చేయాలనీ డిమాండ్ చేశారు. ఆ ఆశలను తుంచివేస్తూ ఆకస్మికంగా ఏప్రిల్ 19న 111 జీవోను రద్దు చేస్తూ, 69 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీని మీద ఉన్న తేదీ మాత్రం ఏప్రిల్ 12ది. వారం రోజుల ముందు జీవో వచ్చింది; లేదా, జీవోకి బ్యాక్ డేట్ ఇచ్చారు. కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నేపథ్యంలో ఈ వారం రోజుల ఆలస్యం అనుమానాలను రేకెత్తిస్తుంది. గందరగోళం ఏర్పడుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి జాగ్రత్త చెప్పి, నిపుణుల కమిటీ లేకుండా, శాస్త్రీయ నివేదిక మంత్రిమండలి ముందు పెట్టకుండా, వారం రోజులు ఆలస్యంగా ప్రజల ముందుకు కొత్త జీవో తేవడం వంటి చర్యల వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడింది. విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. తెలంగాణా రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో అనేక అన్యా యాల ప్రస్తావన వచ్చింది. అందులో ఒకటి: హైదరాబాద్ నగరంలో స్థానికుల, మూలవాసుల నుంచి వలసదారులు ఏ విధంగా ప్రభు త్వాలను, అధికారులను అడ్డు పెట్టుకుని దోచుకున్నారనేది. తెలం గాణా రాష్ట్రంలో చెరువులను కాపాడుకోవాలనీ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణా మూలవాసుల భాగస్వామ్యం పెంచాలనీ, తెలంగాణా భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవాలనీ ఆనాటి ఉద్యమం ఆకాంక్షించింది. తెలంగాణ అస్తిత్వం చెరువుల చుట్టూ ఉంది; ఇంకుడు గుంతలు కాదు, చెరువుల మీద ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఆధునిక అభివృద్ధి పేరిట జరుగుతున్న వనరుల దోపిడీని ప్రశ్నించడం మలి దశ తెలంగాణా ఉద్యమం కంటే ముందే పుట్టింది. జీవో 111 రద్దును తెలంగాణా సంçస్కృతి మీద దాడిగా భావించవచ్చు. తెలంగాణకు నీటి నిర్వహణలో ఎవరూ పాఠాలు చెప్పే పని లేదు. గొలుసు కట్టు చెరువుల ద్వారా హైదరాబాద్ వంటి మహా నగర దాహార్తిని తక్కువ ఖర్చుతో తీర్చే అవకాశం ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఈ విపరీత అప్రజాస్వామిక, ప్రకృతి వ్యతిరేక చర్య వల్ల తెలంగాణా సాంస్కృతిక వారసత్వ సంపద మీద, భవిష్యత్తు తరాల నీటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ రెండు చెరువుల వినాశనం తెలంగాణకే చేటు చేస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ దొంతి నరసింహారెడ్డి విధాన విశ్లేషకులు -
జీవో 111ను రద్దు వినాశనానికి దారితీస్తుంది: రాజేంద్రసింగ్
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, నేల, నీటి పరిరక్షణ (సాయిల్, వాటర్ కన్జర్వేషన్)కు.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు దోహదపడుతున్న జీవో 111ను రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని జల్ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని అధిక భాగం ‘సిమెంట్ కాంక్రీట్ జంగిల్’గా మారిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. అక్కడ కొత్తగా మరో పెద్ద కాం క్రీట్ అడవి ఏర్పడి వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. కర్బన ఉద్గారాలు, సిమెంట్ కట్ట డాల వల్ల ‘రేడియేషన్’ పెరిగి ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పచ్చదనానికి, జీవ వైవిధ్యానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందన్నారు. నీటివనరులు, చెరువులు, వాగులు, గుంటలతో కూడిన భూమి ‘టైటిల్’ను ఎవరూ మార్చలేరని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 2001 జూలై 6న తొలి తీర్పునిచ్చిందని తెలిపారు. ఆ తర్వాత వీటితోముడిపడిన వివిధ కేసులు, వివాదాలపై చెరువులు, వాగుల పరిరక్షణకు ఇప్పటిదాకా దేశ అత్యున్నత న్యాయ స్థానం వందకు పైగా తీర్పులిచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ జీవోను ఎత్తేయడాన్ని కోర్టులు అనుమతించే పరిస్థితి ఉండబోదని సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పరిరక్షించుకోవాలి... ఒక్క హైదరాబాద్ మహానగరానికే కాకుండా యావత్ భారతావనికి గర్వకారణం, తలమానికంగా నిలుస్తున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించుకోవాలి. పర్యావరణ వ్యవస్థలను కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నగర ప్రజలకు ప్రాణ వాయువును అందించడంలో ఇవి గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ జలాశయాల నీటిని వాడడం లేదంటూ జీవో 111ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎంతో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ జీవోను రద్దుచేసే యోచనను మానుకుని ఈ జలాశయాల సహజసిద్ధ క్యాచ్మెంట్ ఏరియా పరిరక్షణ ద్వారా సీఎం కేసీఆర్ మొత్తం దేశానికి ‘రోల్‌మోడల్’గా నిలవాలి. కేసీఆర్ తలుచుకుంటే ఈ 84 గ్రామాల్లోని క్యాచ్ మెంట్ ఏరియాల్లోని ప్రజలను మరోచోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని పరిరక్షించవచ్చు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా.. కేసీఆర్ ఆ విధంగా చేయకపోతే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే జీవోపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన వెంటనే దానిని ఎత్తేస్తామని ప్రకటించడాన్నిబట్టి.. తాను నియమించిన కమిటీ ద్వారా అనుకూల నివేదికను ఇప్పించుకొని ఈ జీవోను ఎత్తేసేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమౌతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ఎకో–సెన్సిటివ్ జోన్ క్యాచ్మెంట్ ఏరియా అయిన ఏడు మండలాలు 84 గ్రామాల్లో 1. 32 లక్షల ఎకరాలను జీవో 111 పరిధిలోకి తీసుకొచ్చారు. దీని కారణంగానే గత పాతికేళ్లలో జంటనగరాల అభివృద్ధి సాధ్యమైంది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ జలాశయాలను కాపాడుకుంటేప్రకృతి, పచ్చదనం, జీవ వైవిధ్యం, పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వారమవుతాం. కేసీఆర్‌కు లేఖ రాశా...: వందేళ్ల పాటు నీటిని కృత్రిమంగా ఈ చెరువుల్లోకి పంపింగ్ చేసేందుకు అవసరమైన నీరు అందుబాటులో ఉందని కేసీఆర్ చెప్పగలరా? సహజ వనరుల పరిరక్షణ, వాటిని మెరుగపరిచే విషయంలో రాజ్యాంగంలోని 48ఏ ఆర్టికల్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున దాని నుంచి తప్పించుకోలేదు. జీవో111ను ఎత్తేయడం సరికాదని, ఆ యత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాశా. వరదల ముప్పు .. పర్యావరణ హననం హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేం దుకు, తాగునీటి అవసరాలకు జంట జలాశయాలను నాటి నిజాం పాలకులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేసిన పక్షంలో చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతాయి. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవంతులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరదనీరు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి చేరే దారిలేక లోతట్టు ప్రాంతాల వైపు మళ్లుతుంది. అప్పుడు భారీ వరదలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతాయి. మరోవైపు నగర తాగునీటి అవసరాలకు స్వచ్ఛమైన తాగునీరు మృగ్యమౌతుంది. ఇన్‌ఫ్లో చేరిక భారీగా తగ్గే ప్రమాదం ఉండడంతో సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పడతాయి. భూతాపం పెరుగుతుంది. కాలుష్యం పెరిగి ప్రజలు నివసించే పరిస్థితి ఉండదు. పర్యావరణ హననం జరుగుతుంది. – పర్యావరణవేత్త ప్రొఫెసర్ నర్సింహారెడ్డి -
గ్లైఫోసేట్పై దేశవ్యాప్త నిషేధం అత్యవసరం
గ్లైఫోసేట్.. ఇది కలుపును చంపే విష రసాయనం. దీన్ని చల్లితే కలుపుతో పాటు నేలపై ఉన్న అన్ని రకాల మొక్కలూ చనిపోతాయి. కలుపు తీయాలంటే కూలీలకు ఖర్చు అధికమవుతోందని గ్లైఫోసేట్ మందును చల్లుతున్నారు. కానీ, ఆరోగ్యం చెడిపోతే, చికిత్సకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని రైతులు గ్రహించడంలేదు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా గ్లైఫోసేట్ ఉపయోగం మీద కొంత కాలం పాటు ఆంక్షలు విధిస్తున్నది. సాధారణంగా, పత్తి పంట కాలం అయిన జూన్ నుంచి అక్టోబర్ వరకు గ్లైఫోసేట్ అమ్మకాల మీద ఆంక్షలు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా ఒకసారి ఆంక్షలు విధించాయి. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే క్రమం తప్పకుండా 2018 నుంచి ప్రతి ఏటా ఆంక్షలు ప్రకటిస్తున్నది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ ఆంక్షల అమలు మాత్రం ఆశించిన మేరకు లేదు. ప్రతి ఏటా గ్లైఫోసేట్ అమ్మకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. దుకాణాలలో ఈ డబ్బాలు దొరుకుతూనే ఉన్నాయి. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం చట్టవిరుద్ధమైన బీజీ–3 పత్తి విత్తనాలను మన దేశంలో అక్రమంగా ప్రవేశపెట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వీటి విస్తృతిని నివారించి, బాధ్యులమీద క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. గ్లైఫోసేట్ అనేది పరాన్నజీవి వ్యవసాయ రసాయన ఉత్పాదన. జన్యుమార్పిడి విత్తనాల సాంకేతిక పరిజ్ఞానంపై స్వారీ చేస్తుంది. కలుపు రసాయనాలను తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన (హెచ్.టి. బీటీ–3) అక్రమ పత్తి విత్తనాలతోపాటు గ్లైఫోసేట్ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. పైగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా చట్ట వ్యతిరేక బీజీ–3 పత్తి విత్తనాల మార్కెట్ 40 శాతానికి పెరిగిందని ఒక అంచనా. కేంద్రం చేతుల్లోనే అధికారం విత్తనాలను మార్కెట్ చేస్తున్న కంపెనీల మీద చర్యలు చేపట్టే ఉద్దేశం లేకపోవడంతో, మధ్యేమార్గంగా గ్లైఫోసేట్ను నియంత్రించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సు చేసింది. ఆ విధంగా గ్లైఫోసేట్ మీద ఆయా రాష్ట్రాల్లో కొద్ది నెలల పాటు ఆంక్షలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా గ్లైఫోసేట్ను నియంత్రించవచ్చు. అది అత్యంత ప్రమాదకారి అనుకుంటే నిషేధించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ‘మీకు అవసరం అనిపిస్తే నియంత్రించండి’ అని రాష్ట్రాలకు చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పురుగు మందుల నియంత్రణ చట్టం కింద తన కున్న అధికారాలను, బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. పనిచేయని తాత్కాలిక ఆంక్షలు ఎనిమిదేళ్ల్ల క్రితం మన దేశంలో గ్లైఫోసేట్ పెద్దగా ఎవరికీ తెలియదు. చట్టపరంగా అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాల రాకతో దీని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వీటి వాడకాన్ని అరికట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలిపెట్టింది. గ్లైఫోసేట్ ఉపయోగం మీద ఏటా కొద్ది నెలలు ఆంక్షలు పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. కాగా, ఈ వ్యూహం పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పురుగు మందును, పురుగు మందుల నియంత్రణ చట్టం–1968 ఉపయోగించి 60 రోజుల వరకు నిషేధించవచ్చు. పూర్తిగా నిషేధించే అధికారాలు మటుకు లేవు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పూర్తిగా, శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. అయితే, కేరళ, సిక్కిం రాష్ట్రాల మాదిరి కొన్ని అధికరణాల ద్వారా రాష్ట్రాలకు అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం ఆ విధంగానే ఇదివరకు ఎండోసల్ఫాన్ మీద చర్యలు చేపట్టింది. గ్లైఫోసేట్ మీద కూడా పూర్తి నిషేధం అక్కడ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇచ్చిన ఉత్తర్వులలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. ప్రతి ఏటా ఆంక్షల తీవ్రతను నీరుగార్చే మార్పులు జరుగుతున్నాయి. పంట ఉన్న ప్రాంతంలో వాడవద్దు (జూన్ – అక్టోబర్ వరకు), పంట లేని ప్రాంతంలో వాడవచ్చు, విస్తరణ అధికారి నుంచి తీసుకున్న పత్రం ప్రకారమే అమ్మాలి, విస్తరణ అధికారులు గ్లైఫోసేట్ ఉపయోగాన్ని అరికట్టాలి.. వంటి ఆచరణ సాధ్యం కాని ఆంక్షలు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. ఆచరణాత్మక ప్రణాళికేదీ? తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఒక ఆచరణాత్మక ప్రణాళిక జిల్లాల వారీగా తయారు చేసి ఉండవచ్చు. 2018 ఉత్తర్వులలో పురుగు మందుల విక్రయదారులకు ఇచ్చే లైసెన్స్‌లో గ్లైఫోసేట్ పదాన్ని తొలగించాలన్నారే గానీ దాన్ని అమలు చేయలేదు. 2019లో ఆ పదాన్నే తీసివేశారు. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా అనేక సూచనలు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో గ్లైఫోసేట్ ప్రభావంపై అధ్యయనాలు లేవు. అనేక గ్రామాలలో రైతులు పత్తి చేలల్లో గ్లైఫోసేట్ చల్లితే పంటంతా మాడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. దీని ప్రధాన తయారీదారు అయిన బేయర్ కంపెనీ (ఇది వరకు మోన్సాంటో) మీద అమెరికాలో అనేక నష్ట పరిహారం కేసులు వేశారు. దేశవ్యాప్త నిషేధమే మార్గం చట్టవిరుద్ధమైన కలుపు మందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నంత కాలం తాత్కాలిక ఆంక్షలు పని చేయవు. ముందుగా బీజీ–3 విత్తనాల తయారీదారుల మీద, విక్రయదారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. రైతులు, గ్రామీణుల ఆరోగ్య రక్షణకు, ఆర్థిక, పర్యావరణ కారణాల రీత్యా కూడా గ్లైఫోసేట్ తయారీ, దిగుమతి, ఎగుమతి, వాడకంపై కేంద్రం దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించడం తక్షణ అవసరం. - డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త: ప్రముఖ విధాన విశ్లేషకులు ఈ–మెయిల్: nreddy.donthi20@gmail.com -
ప్రజలు తిరస్కరించిన ఫార్మాసిటీ
వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా పటాన్ చెరు, జీడిమెట్ల, చౌటుప్పల్, కొత్తూర్ వంటి ప్రాంతాలలో, ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయం మనకు అనుభవమే. అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి మరియు అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులు ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలు అవుతూనే ఉన్నారు. పరిశ్రమ వేసే పవర్ బోర్ల తోటి స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతు న్నాయి. బర్రెలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు వంటివి కూడా కాలుష్యం బారిన పడి చనిపోవడంతో, వాటి మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిన ఉదంతాలు అనేకం. నష్ట పరిహారం ఇచ్చే ఆలోచన అటు పరిశ్రమలు కాని, ఇటు ప్రభుత్వం కాని చేయలేదు. ఉపరితల నీటి వనరుల కాలుష్యం ఒక బాధ కాగా, కొన్ని పరిశ్రమలు ఇంజక్షన్ బోర్లు వేసి ప్రమాదకర వ్యర్థ జలాలను భూగర్భంలోకి వదులుతున్నాయి. జీరో డిశ్చార్జి అంటూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా, వాటిని మూసివేయకుండా, ప్రజల నిరసనలు తెలియ జేస్తే వారి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన వైనాలు కూడా ఉన్నాయి. పోలేపల్లిలో కాలుష్యం గురించి ప్రజలు ఆందోళన చేస్తే, 22 జూలై 2017 నాడు జరిగిన సమీక్ష సమావేశంలో, పరిశ్రమల మంత్రితో సహా అధికారులు కాలుష్య నియంత్రణ మీద ఆలోచనలు పెట్టకుండా, కేవలం కంటితుడుపు మాటలతో తమ నిస్సహాయతను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కుల గురించి స్పష్టం చేసినా కూడా, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఇంకా ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కాలుష్యం చేసే పరిశ్రమల మీద ఈగ వాలనీయకుండా కాపాడుతున్నారు. పరిశ్రమల నేరపూరిత వ్యవహారాన్ని ఎండగట్టకుండా కాలుష్య నియంత్రణ అధికా రులు గ్రామీణులను మోసం చేస్తున్నారు. కాలుష్యం తగ్గించి, వనరులను పునర్వినియోగించి, పర్యావరణాన్ని కాపాడవలసిన తరుణంలో, పరిశ్ర మలు కేవలం తమకు వచ్చే లాభాల మీదనే దృష్టి పెడుతున్నాయి. ఔషధ పరిశ్రమలు ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు పొందుతూ, ప్రజల మీద పడుతున్న దుష్ప్రభావం గురించి పట్టించుకోవడం లేదు. అక్కడ ఒక్కటి, ఇక్కడ ఒకటి పరిశ్రమలు ఉన్నప్పుడే ఇంత దారుణ పరిస్థితి ఉండగా, హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట కొన్ని వందల ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే రాబోయే దుర్భర పరిస్థితులు ఊహకు కూడా అందవు. వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియం త్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఫార్మా సిటీ బారిన పడే అన్ని గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 20,000 ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు వలన కనీసం 100 కి.మీ. పరిధిలో పర్యావరణం, చెట్లు, చెరువులు, కుంటలు, చెలమలు, మట్టి, నేల, గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితం అయ్యి, స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ కాలుష్య ప్రభావం కొన్ని దశాబ్దాల వరకు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్ తరాల ఉనికికే ఇది ప్రమా దం. తెలంగాణ రాష్ట్రం మీద ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 14న జారీ చేసిన జీవో 63 గమనించాలి. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం తమ వనరులను అంచనా వేసుకుని, తమ స్థాయికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఈ ఉత్తర్వులు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి గ్రామం కూడా తమ అభివృద్ధిని నిర్దేశించుకునే అవకాశం ఉంది. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలో ఉన్న అనేక గ్రామాలు, ముచ్చెర్ల, మేడిపల్లి, కురుమిద్ద తదితర గ్రామాలతో సహా, ఎవరూ ఫార్మా సిటీ కోరుకోలేదు. స్థానిక యువతకు వారి చదువుకు, నైపుణ్యానికి తగ్గ ఉపాధి అవకాశాలు ఈ గ్రామాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయం, వృత్తులు ఇంకా అనేక ఇతర జీవనోపాధుల పునాదుల మీద అభివృద్ధి జరగాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు ఉపాధి దొరకకపోగా, స్థానిక గ్రామాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలే పరమావధిగా అసమగ్ర సమాచారం, అబద్ధాలతో కూడిన నివేదికలు ఇచ్చి, హైదరాబాద్ ఫార్మా సిటీకి అనుమతులు తీసుకుంది. ఫార్మా సిటీ లోపల ఉండే గ్రామాలు, నివాస ప్రాంతాల గురించి ప్రభుత్వం చేసిన ప్రణాళిక శూన్యం. అసైన్డ్ భూములకు, ఇతర భూములకు మధ్య నష్ట పరిహార పరిమాణంలో సరి సమానత లేదు. పేద, దళిత, బలహీన వర్గాల భూమి తన సొంత భూమిగా ప్రభుత్వం భావిస్తున్నది. భూమి లేని కుటుంబాలు, ఇతర వృత్తిదారుల పట్ల పునరావాస ప్రణాళికలు అసలే లేవు. వారికి భారత రాజ్యాంగం హక్కులు కల్పిస్తున్నది అనే వాస్తవం విస్మరించారు. ఇప్పటికే కొంత అవకతవకల నడుమ, చిన్న రైతులను బెదిరించి తీసుకున్న భూముల వ్యవహారంలో స్పష్టమైన అవినీతి మీద విచారణ చేపట్టలేదు. సింగపూర్ కంపెనీకి ఫార్మా సిటీ మాస్టర్ ప్రణాళిక తయారు చేయమని కాంట్రాక్ట్ ఇచ్చినా, వారి నివేదిక ప్రజలకు అందుబాటులో లేదు. మాస్టర్ ప్లాన్ తయారు కాకముందే, అసైన్డ్ భూములు, అటవీ, పట్టా భూముల సేకరణ చేపట్టడం సుపరిపాలన పద్ధతులకు వ్యతిరేకం. హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్ట్ ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త, పర్యావరణ విధాన విశ్లేషకులు -
రాష్ట్రాల మీదికి ఎక్కుపెట్టిన త్రిశూలం
ఈనెల 3న కేంద్ర ప్రభుత్వం ఒకేరోజు మూడు ఆర్డినెన్సుల్ని ఆమోదించింది. రైతులకు మేలు చేసే, వ్యవసాయ రంగ రూపు మార్చే చారిత్రక ఆర్డినెన్సులుగా వీటిని పేర్కొన్నారు. మూడింట్లో ఒకటైన నిత్యావసర సరుకుల చట్టం సవరణ ఆర్డినెన్స్ అన్ని వ్యవసాయ సంబంధ ఉత్పత్తులను నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగిస్తుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏ వ్యవసాయ ఉత్పత్తినైనా అత్యవసరమైనదిగా పేర్కొనే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగివుంటుంది. అయితే, వ్యవసాయరంగంలో పెట్టుబడిదారులను నిరుత్సాహపరచకుండా, ఎగుమతిదారుల నిల్వల పరిమితిని దీన్నుంచి మినహాయించినట్టు తెలిపింది. ఉత్పత్తి, నిల్వల, రవాణా, పంపిణీలపై స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు రంగాన్నీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ పెద్దస్థాయిలో ఆకర్షించవచ్చనీ; భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఎస్మా ఆర్డినెన్స్ వల్ల ధరలు స్థిరీకరించబడి, వ్యాపారులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది ప్రాథమికంగా వ్యాపారులకు మేలు చేసేదే. ఇక రెండవదైన, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్యం ఆర్డినెన్స్ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాలు సూచించిన భౌతిక ఆవరణల బయట రాష్ట్ర అంతర్గత, అంతర్రాష్ట్ర వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉద్దేశించినది. దేశంలో విస్తారంగా క్రమబద్ధీకరించిన వ్యవసాయ మార్కెట్లను తెరిచే దిశగా ఇదొక చారిత్రక అడుగుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇది ప్రాథమికంగా ‘మార్కెట్ ఆవరణల’ బయట వాణిజ్య అవకాశాలను సృష్టించడానికి ఉద్దేశించినది. ఇక మూడోది, ‘ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ ఆర్డినెన్స్, 2020’. ఇది రైతులతో ఒప్పందాలు చేసుకునే ఏ థర్డ్ పార్టీకైనా ఒక జాతీయ ఫ్రేమ్‌వర్క్ సమకూర్చడం కోసం ఉద్దేశించింది. అంటే, కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధతను కల్పించడం. ఈ మూడు ఆర్డినెన్సులూ రైతులకు లబ్ధి చేకూర్చేవిగా ప్రభుత్వం చిత్రిస్తున్నప్పటికీ, ఇందులో ఏ ఒక్కటి కూడా రైతులకు మేలు చేయదు. ఇవి వ్యాపారులకు, ప్రత్యేకించి పెద్ద కంపెనీలకు లబ్ధి కలిగిస్తాయి. ఉమ్మడిగా ఈ మూడు అత్యవసరాదేశాలు రాష్ట్ర చట్టాల్నీ, మార్కెట్ కమిటీల్నీ కాదని రాష్ట్రాల అధికారాల్ని బలవంతంగా లాక్కునే లక్ష్యంతో తెచ్చినవి. ప్రణాళిక, నిధుల కేటాయింపు, అమలు తదితరాల్లో కేంద్ర ప్రభుత్వం భాగమైనప్పటికీ వ్యవసాయం ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలోని అంశం. దీర్ఘకాలంగా వ్యవసాయ ఉత్పాదక కంపెనీలు, ముఖ్యంగా విత్తనాలు, రసాయన ఎరువుల కంపెనీలు వ్యవసాయ సంబంధ నిర్ణయాల్లో కేంద్రీకరణ ఉండటం తమకు లాభిస్తుందనే యోచనతో ఉన్నాయి. గత కొన్ని యేళ్లుగా మోడల్ చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వాణిజ్యంలో సంస్కరణల కోసం పట్టుబడుతోంది. ఈ శాసనాలతో పాటు ఇంకా ఇతరత్రా అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలను, ప్రాంత గుత్తాధిపత్యాలను నీరుగార్చడానికి ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత విధానం ‘మార్చి’, ఈ ‘నమూనా’ విధానంలోకి మారడానికి మొగ్గుచూపవు. ఎందుకంటే వాటికి ఆదాయం సమకూర్చే ఆధారంలో కోతపడుతుంది. ఈ త్రిశక్తి ఆర్డినెన్సులు– వ్యవసాయ ఉత్పత్తులు, వాటి మార్కెట్ల మీద రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణనూ సంపూర్ణంగా తొలగించాలని ఆశిస్తున్నాయి. అత్యవసర ఉత్పత్తి అనే ట్యాగ్ తొలగించినప్పటకీ, రాష్ట్రాల మార్కెటింగ్ కమిటీ చట్టాల వల్ల వ్యాపారులు ఇప్పటికీ ఆటంకాలు ఎదుర్కోవచ్చు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని వ్యాపారులు, వ్యవసాయ కంపెనీలకు కేంద్రం విశ్వాసం కలిగించవచ్చు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం నష్టపోతాయి. వ్యవసాయ ఉత్పత్తుల మీద వాటి ఆధిపత్యం తగ్గిపోతుంది. ఒక్కమాటలో, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి ఏ మాత్రమూ వీలు లేకుండా చేయడంలో ఈ మూడు అత్యవసర ఆదేశాలు విజయం సాధిస్తాయి. కానీ, వినియోగదారులు(ఈ దేశానికి సంబంధించిన అందరు పౌరులు) ధరలు పెరగడాన్ని చూడాల్సిరావొచ్చు. ‘స్వేచ్ఛా వాతావరణం’లో వ్యవసాయ దిగుమతులు పెరగవచ్చు. ఈ దిగుమతులతో ఉత్పన్నమయ్యే పోటీలో, రైతులు నష్టపోవచ్చు.రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్న సందర్భంలో ఇది ఇక అధికార క్రీడ అవనుంది. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కానీ ఒకటి, ఈ అధికార పోరులో రైతులకు స్థానం లేదు. రైతులు ఎప్పుడూ పరిగణనలో లేరు, ఉండరు. కేంద్రం ఇప్పటికైతే ఈ త్రిశూల్ ద్వారా వ్యాపారులు, పెట్టుబడిదారులు, కంపెనీలు, అమ్మకందారులు అందరికీ సహకరించాలని నిర్ణయించుకుంది. ఇండియాను పారిశ్రామిక వ్యవసాయంలోకి నడిపించాలనుకునే ఈ శక్తిమంతమైన లాబీకి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తలొగ్గుతాయా? బహుశా అవునా కాదా అన్నదానికంటే ఎప్పుడు, ఎలా అనేదే విషయం కావొచ్చు. నరసింహారెడ్డి దొంతి – వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు ఫోన్ : 0091–40–24077804 -
చేనేతకు చుక్కలు చూపించారు!
అన్ని పథకాల కంటే చేనేత రంగానికి కేటాయింపులను దారుణంగా తగ్గించేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలు, అసమంజస పోటీ, ప్రత్యర్థి రంగాలకు సబ్సిడీ ఇవ్వడం వంటి పరిణామాలతో చేనేతరంగం గిడసబారిపోతోంది. తాజా బడ్జెట్ చేనేత పరిశ్రమపై శీతకన్ను వేసినట్లే చెప్పాలి. చేనేత రంగానికి గత సంవత్సరం రూ. 604 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో కేవలం రూ. 386.09 కోట్లు కేటాయించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో కుదేలైన చేనేత రంగంపై దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. గత వందేళ్లలో చేనేత రంగానికి ఇంత తక్కువ ఎన్నడూ కేటాయించలేదు. భారీ నష్టాలు, పెరిగిన అప్పులతో సతమతమవుతున్న చేనేత కార్మికులు, ఈ ఏటి బడ్జెట్లో అయినా ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగిస్తుందని, ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రోత్సహిస్తుందని పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. చూస్తుంటే ప్రభుత్వానికి ఆలోచనలే కరువై చేష్టలుడిగినట్లు కనిపిస్తోంది. అన్ని పథకాల కంటే చేనేత రంగానికి కేటాయింపులను దారుణంగా తగ్గించేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలు, అసమంజసమైన పోటీ, ప్రత్యర్థి రంగాలకు సబ్సిడీ ఇవ్వడం వంటి పరిణామాలతో చేనేతరంగం గిడసబారిపోతోంది. నూలు సరఫరా స్కీం కేటాయింపుల్లో భారీ కోతలు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. పట్టు, పత్తి, నూలు, ఇతర సహజ ఫైబర్‌కి సంబంధించిన ముడి çసరుకు ధర పెరిగిపోవడంతో చేనేత రంగం నిత్యం ప్రకంపనలకు గురవుతూనే ఉంది.బీజేపీ ఎన్నికల ప్రణాళికల్లో, ఎన్నికల ప్రసంగాల్లో సమీకృత అభివృద్ధి గురించి వాగ్దానం చేసింది. కానీ జైట్లీ బడ్జెట్ ఈ అభివృద్ధిలో చేనేత కార్మికులను భాగం చేయలేదు. చేనేతరంగాన్ని పైకి తీసుకురావడానికి కనీస ప్రతిపాదనలు కూడా పొందుపర్చలేదు. 14 శాతం నుంచి 60 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్న తమకు తక్కువ వడ్డీతో అప్పు ఇప్పించాలని చేనేత కార్మికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. పైగా, చేనేత ఉత్పత్తికి సంబంధించి అతి ముఖ్యమైన భాగం పెట్టుబడి. సాంప్రదాయిక వనరుల నుంచి చేనేతకు పెట్టుబడులు తరిగిపోతున్నాయి. చేనేత రంగానికి అంతో ఇంతో పెట్టుబడులు అందించేదిగా పేరుపడిన నాబార్డ్ చాలా వరకు ఆ బాధ్యతను తగ్గించుకుంది. దీని ఫలితంగా అధిక ఖర్చు భారాన్ని మోపే ప్రైవేట్ వనరుల వైపు మళ్లవలసి వస్తోంది. అధిక వడ్డీ రేట్లు, జాగరూకత లేమి, దోపిడీ పరిస్థితులు చేనేత కార్మికుల కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణమాఫీ చేనేతకు జీవగర్ర లాంటిది. కానీ ఈ విషయంలో కేంద్రం స్పందన రానురానూ తగ్గిపోతున్నట్లు స్పష్టమవుతూనే ఉంది. 2013–14 బడ్జెట్లో రూ. 157 కోట్ల స్వల్పమొత్తాన్ని కేటాయించిన ప్రభుత్వం 2016–17 నాటికి చేనేత కార్మికుల వెతలను విస్మరించేసింది. - డా‘‘దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త స్వతంత్ర జౌళి విధాన నిపుణులు ఈ–మెయిల్ : nreddy.donthi16@gmail.com -
ఉరిపేనుతున్నది విధానాలే!
విశ్లేషణ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల తీరు వ్యవసాయ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. కరువు నేపథ్యంలో పత్తి రైతులతోపాటు కూరగాయ పంటలు పండించే రైతులూ నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతోపాటు.. రైతుకు భద్రతనిచ్చే దిశగా విధానాల్లో మౌలిక మార్పు తేవడం తక్షణావసరంగా పాలకులు గుర్తించాలి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు చేజేతులా తమ ప్రాణాలనే తీసుకోవడం అనేక సంవత్సరాలుగా జరుగుతున్నవే అయినా.. గత కొద్ది నెలలుగా ఉధృతమయ్యాయి. రోజుకు ఐదు లేక ఆరుగురు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లెక్కకు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్న దానికన్నా.. ఈ దుర్భర స్థితి ఎందుకు దాపురించింది? పరిష్కారం ఏమిటన్నది చర్చించాల్సిన ప్రధానాంశం. బలవన్మరణాల నుంచి రైతులను రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చెయ్యాలన్న చర్చే ఉపయోగకరం. మహిళా రైతులు, యువ రైతులు సైతం.. గతంలో పత్తి వంటి పంటలు సాగు చేసిన రైతులే ఆత్మహత్యల పాలయ్యేవారు. కానీ, ప్రస్తుతం ఇతరత్రా పంటలు సాగు చేసే రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. తీవ్ర కరువు పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. పత్తి రైతులతోపాటు వరి, మొక్కజొన్న, చివరకు కూరగాయల రైతులు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు. వీరిలో మహిళా రైతులు, యువ రైతులు కూడా ఉండడం అత్యంత విషాదకర వాస్తవం. ఆత్మహత్యలకు సాధారణంగా కనపడే కారణాలు: పంటల సాగు ఖర్చులు పెరిగిపోవడం, ఖర్చుకు తగిన ధర మార్కెట్లో రాకపోవడం. ఖర్చు పెట్టే డబ్బు కన్నా తిరిగొచ్చే డబ్బు తగ్గిపోవడంతో అప్పులు, వాటికి వడ్డీలు తోడవుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడే దారి కనపడక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తడిసి మోపెడవుతున్న ఖర్చు సాగు వ్యయం పెరగడానికి అనేక కారణాలున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు, సాధనాలు స్వతహాగా రైతు దగ్గరే ఉండేవి. ఇప్పుడు అన్నిటినీ డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి వస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు రైతుకు భారమయ్యాయి. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడక రైతులు విత్తనాలు రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. బీటీ పత్తి విత్తనాల ధర అయితే అన్నింటికంటే ఎక్కువగా పెరిగింది. నాణ్యత లేకపోయినా దుకాణంలో ఉన్న విత్తనాలనే కొనకతప్పని స్థితి నెలకొంది. విత్తనాలు మొలకెత్తకపోయినా, పూత/కాత సరిగ్గా లేకపోయినా నష్టపోయేది రైతే. ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర యంత్ర పరికరాలు అద్దెకు తెచ్చుకోవడం, వీటికి తోడు కూలి పెరిగిపోవడం వల్ల రైతు మీద ఆర్థిక భారం పెరిగింది. మోటారు చెడిపోతే ఎంత ఖర్చయినా ఆఘమేఘాల మీద మరమ్మతులు చేయిస్తే కానీ పంటకు నీళ్లు అందవు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే, దాని మరమ్మతు ఖర్చు కూడా రైతులే భరించాల్సిన దుస్థితి ఉంది. ప్రైవేటు అప్పులే దిక్కు బ్యాంకులు రుణాలివ్వకపోవడం, ఇచ్చినా చాలా తక్కువ ఇవ్వడం, అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల రైతులు అధిక వడ్డీకిచ్చే ప్రైవేటు అప్పుల మీద ఆధారపడుతున్నారు. రైతులు ఎక్కువగా దుకాణదారుల అప్పుల మీదే ఆధారపడతారు. కుటుంబ ఖర్చులకు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, శుభకార్యాలు, బట్టలు.. ఇవన్నీ పంటల ద్వారా అయినా రావాలి. లేదా అప్పు తెచ్చిన డబ్బులో నుంచైనా చెల్లించాల్సిందే. మార్కెట్ సంస్కరణలు.. 1995లో వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని దేశాల వ్యవసాయ మార్కెట్లలో కూడా పెనుమార్పులు వచ్చాయి. అనేక దేశాలు తమ రైతులను కాపాడుకోవడానికి అనేక విధాన మార్పులు తీసుకువచ్చాయి. భారతదేశంలో కూడా విధానాల మార్పులు, మార్కెట్ విధానాల పరంపర, విధానాల ‘సంస్కరణ’ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా, పాలక పార్టీలు మారినా ఆర్థిక, మార్కెట్ విధానాల సరళీకరణ కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ దిగుమతులతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరల మీద వ్యతిరేక ప్రభావం పెరిగింది. ఫార్వార్డ్ మార్కెట్లు, కాంట్రాక్టులు, విదేశీ కంపెనీల లాభాపేక్ష వల్ల కూడా రైతుకు గిట్టుబాటు ధర రావడంలేదు. చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ వ్యత్యాసాల నుంచి రైతును కాపాడే ప్రయత్నాలు చేయడం లేదు. కనీస మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు వాస్తవ ఉత్పత్తి ఖర్చును పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాయి. మద్దతు ధరల అమలు అంతకన్నా శూన్యం. ప్రభుత్వం చేష్టలుడిగి చూడడం కంటే విధానాల సమీక్ష జరిపి, రైతుల క్షేమమే ధ్యేయంగా, రైతు అనుకూల విధానాలు తీసుకురావాలి. రైతులకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో, ఆత్మహత్యల నివారణ యుద్ధప్రాతిపదికన నివారించాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేయడం తగదు. నిధుల కేటాయింపు అత్యంత ఆవశ్యమైనదైనా.. విధానాల్లో మార్పు తేవాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విత్తనాల నియంత్రణ, పథకాల అమలు వంటి అంశాల మీద దృష్టిపెట్టి, కేంద్ర ప్రభుత్వ విధానాల మార్పునకు అందరూ కృష్టి చేయాలి. ఉత్పత్తి ఖర్చు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం, రైతు మీద భారం పెంచగా, వాతావరణంలో విపరీత మార్పులు ఉత్పత్తి మీద, దిగుబడి మీద దుష్ట్రభావం చూపుతున్నాయి. అకాల వర్షాలు, తక్కువ లేదా అధిక వర్షాలు, గాలి దుమారాలు, వడగళ్ల వానలతో రైతులు గత ఏడాది విపరీతంగా నష్టపోయారు. రైతులను ఆదుకోవడానికి ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయాలి. వాతావరణ బీమా సౌకర్యం కల్పించాలి. త్వరగా పరిహారం అందించే ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తే, వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు) డా. దొంతి నరసింహారెడ్డి