విశ్లేషణ
వ్యవసాయ కార్మికులు అనేక రకాల ప్రమాదాలకు లోనవుతున్నారు. కరెంటు షాకులు, రసాయనాల (పురుగు మందుల) విష ప్రభావం, పాము కాట్లు, యంత్రాలు, పిడుగులు, వడదెబ్బ, ఇంకా అనేక ఇతర సహజ, అసహజ, మానవ తప్పిదాలు వ్యవసాయ కార్మికుల భౌతిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. వాటి బారిన పడి కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. కానీ దేశంలో సంఖ్యాపరంగా అతి పెద్ద శ్రామిక శక్తిగా ఉన్న వ్యవసాయ రంగం పట్ల సర్కారుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనబడుతుంది. వ్యవసాయ కూలీలకు ప్రమాదాలు ఎదురైతే రాజకీయ, సామాజిక స్పందన శూన్యం. చట్టాలు కూడా వీళ్ళ విషయంలో ఏమీ నిర్దేశించడం లేదు. వ్యవసాయ కార్మికులందరికీ వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి.
పరికరాలు, యంత్రాలు, రసాయనాలు, డ్రోన్లు, మోటార్లు, ‘రసాయన’ పూత విత్త నాలు వగైరాలను వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దానికి తగిన శ్రేయో మార్గదర్శకాలు రూపొందించడం లేదు. ప్రమాదాల బారిన పడిన వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతుల సత్వర చికిత్సకు ఏర్పాట్లు లేవు. నష్టపరిహారం, ఆర్థిక మద్దతు వగైరా అంశాలు గురించి ఆలోచననే లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు రసాయన పిచికారీ చేస్తూ స్పృహ తప్పితే పొలంలో నుంచి గ్రామంలోకి తేవడానికి 3 గంటలు పట్టింది. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ప్రాణం పోయింది. వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న ‘ఆధునిక’ పరికరాలు, రసాయనాలతో జరిగే ప్రమదాలకు సంబంధించి ప్రాథమిక వైద్య కేంద్రాలలో కనీస చికిత్స, మందులు లేవు.
జిల్లా ఆసుపత్రిలోనే ఉండవు. విద్యుదాఘాతం కారణంగా ప్రతిరోజూ కనీసం ముప్పై మంది భారతీయులు చనిపోతున్నారని అంచనా.ఇందులో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలోనే జరుగుతున్నాయి. వీళ్లలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ.
ప్రమాదకరమైన వృత్తి
న్యూఢిల్లీలోని ‘ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ సహకారంతో ‘జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి’ ఆధ్వర్యంలో 2004–07 నుంచి 2012–13 మధ్య కాలానికి వ్యవసాయ ప్రమాద సర్వే జరిగింది.
ఒక సంవత్సరంలో మొత్తం సంఘటనల రేటు లక్ష మంది కార్మికులకు 334 ప్రమాదాలు కాగా, మరణాల రేటు లక్ష మంది కార్మికులకు 18.3గా ఉంది. ఇది చాలా తక్కువ అంచనా. వాస్తవంగా వ్యవసాయంలో వివిధ ప్రమాదాల మీద, తదుపరి పర్యవసానాల మీద ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ సమాచారం సేకరించడం లేదు. యాంత్రీకరణ, రసాయనీకరణ, డిజిటలీ కరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి ఉపయోగం వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాల పట్ల దృష్టి పెట్టడం లేదు.
ఆధునికత పొంగిపొర్లే అమెరికాలోనే వ్యవసాయం ప్రమాదకర వృత్తిగా పరిణమిస్తున్న వైనాన్ని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా వ్యవసాయ శాఖకు సంబంధించిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’ మద్దతుతో చేసిన ఒక అధ్యయనం,ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తూ వ్యవసాయ పరిశ్రమ గతంలో అనుకున్న దానికంటే మరింత ప్రమాదకరమైనదని సూచించింది. 2015–19 వరకు 60,000 మందికి పైగా వ్యవసాయ సంబంధిత గాయాలతో అత్యవసర చికిత్స పొందారని వెల్లడించింది. గాయపడిన వారిలో దాదాపు మూడోవంతు మంది యువకులు.
ట్రాక్టర్లు, డ్రోన్ల ప్రమాదాలు
భారతదేశంలో మధ్యప్రదేశ్‌లో 1995–99 వరకు, సంవత్సరానికి ప్రతి 1000 మంది వ్యవసాయ కూలీలలో 1.25 మందికి పని
చేసే సమయంలో గాయాలు, దాదాపు 9.2% మరణాలు అయినట్లు ఒక అధ్యయనం కనుగొంది. అత్యధిక మరణాలు ట్రాక్టర్లు, పాము కాటు వల్ల జరిగాయి. మరణాలు, గాయాలతో ఆర్థిక నష్టం కూడా ఎక్కువే.
ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లాలో వ్యవసాయంలో ప్రమాదాల కారణంగా ఏటా సుమారు రూ.6.19 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఒక అధ్యయనం అంచనా వేసింది. దేశంలో సగటున వ్యవసాయ క్షేత్ర ప్రమాదాలలో ట్రాక్టర్ ప్రమాదాలు అత్యధికం (పల్టీలు కొట్టడం, ట్రాక్టర్ నుండి పడిపోవడం మొదలైనవి) (27.7%). తర్వాత నూర్పిడి యంత్రాల వల్ల (థ్రెషర్) (14.6%), పిచికారీ (స్ప్రేయర్ /డస్టర్) వల్ల (12.2%), చెరకు క్రషర్ (8.1%), గడ్డి కట్టర్ (7.8%) వల్ల జరిగాయి.
ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వస్తున్నాయి. 2010–17 మధ్య కాలంలో అమెరికాలో 12,842 మందికి డ్రోన్ల వల్ల గాయాలైనాయి. భారత
దేశంలో దాదాపు ఆరు లక్షలకు పైగా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి వీటి వినియోగాన్ని ప్రోత్స హిస్తున్నది. వీటి వల్ల కలిగే ప్రమాదాల మీద మాత్రం ఏ సంస్థ సమాచారం సేకరించడం లేదు. పెరుగుతున్న డ్రోన్ల సంఖ్య చూస్తే, సంబంధిత ప్రమాదాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది.
పని కోసం వెళ్తున్నప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రభుత్వం, యాజమాన్యాల స్పందన మీద చట్టం నిశ్శబ్దంగా ఉన్నది. పని ప్రదేశంలో భద్రత కల్పించే బాధ్యత ఆ యా వ్యక్తులు, లేదా సంస్థల మీదనే ఉంటుంది. కానీ పని ప్రదేశం చేరకముందు జరిగే ప్రమాదాల బాధ్యత ఎవరి మీదా ఉండటం లేదు.
అదే ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ ప్రకారం, కార్మికుల ప్రయాణ సమయాన్ని కూడా పని సమయంగా పరిగణించాలి. అప్పుడు వారి భద్రత కూడా పని ఇచ్చేవారి మీద ఉంటుంది. ప్రయాణ సమయంలో కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరాన్ని ప్రపంచ కార్మిక సంస్థ ‘గ్లోబల్ స్ట్రాటజీ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్’ 2024–2030 నొక్కి చెబుతోంది.
బాధితులకు ఉపశమనం కలిగేలా...
2024 నవంబర్‌లో అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ఆర్టీసీ బస్సు, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు మరణించారు. 2019 ఆగస్ట్‌లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో రిక్షాను లారీ ఢీకొనడంతో 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్ని కుటుంబాలు వైద్య చికిత్స కోసం ఉన్న అరకొర ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. సరైన సమయంలో చికిత్స లభించనందున దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాద బాధితుల వైద్యానికి బీమా నుంచి కూడా మద్దతు లేదు. రవాణా వాహన ప్రమాదాలలో వ్యవసాయ కార్మికులకు థర్డ్ పార్టీ బీమా ప్రయోజనం ఉండదు.
వారి ప్రయాణం తరచుగా నాన్ పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు సాధారణంగా బీమా ఉండదు. డ్రైవర్‌కు లైసెన్స్ కూడా ఉండదు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ఒక కారణం.
ప్రమాదాల కారణంగా రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. అవయవాలను కోల్పోయి వికలాంగులైతే, ఆ కుటుంబం పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది. ప్రమాదాలలో మరణమే మేలు అనే విధంగా పరిణామాలు ఉంటున్నాయి.
వ్యవసాయ కార్మికులందరికీ, ప్రత్యేకించి క్షేత్రస్థాయి కూలీలు, మహిళలపై దృష్టి సారించి, వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి. ప్రతి గ్రామీణ ప్రమాదాన్ని నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలి. ఇది జరగాలంటే, మోటారు వాహనాల రవాణా చట్టంతో సహా సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయవలసి రావచ్చు. తమ తప్పులేకుండా బలి పశువులయ్యే వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను మెరుగు పరచాలి.
వ్యవసాయ మార్కెట్ సెస్, ఇతర పద్ధతుల ద్వారా ఒక ప్రమాద సహాయ నిధి ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కూలీలకు కనీస బీమా కవరేజీ రూ.5 లక్షలతో ప్రారంభించి మున్ముందు పెంచాలి. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.
డా‘‘ దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment