ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో టమోటాలు అమ్మిన రైతులు, ఉన్నట్లుండి లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మండీలను తరచుగా నిలదీస్తున్నారు కానీ, సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది.
ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్‌లెట్ కూడా టమోటా రైతులకు అధిక ధర చెల్లించలేదు. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవని ప్రస్తుత ధరల పెరుగుదల మనకు చెబుతోంది. అయితే తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతు పొందేలా అధికారులు తప్పక చూడాలి.
టమోటా ధరల విపరీత పెరుగుదల వినియోగదారుల్లో ఆగ్రహ ప్రతిస్పందనలను కలిగిస్తోంది. అయితే దీనికి ఒక ప్రకాశవంతమైన కోణం ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన వందలాది టమోటా రైతులు లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు బాగా పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జున్నర్‌లో 12 ఎకరాల్లో టమోటా సాగు చేసిన తుకారాం భాగోజీ గాయ్‌కర్ అనూహ్యంగా ఆదాయం పెరిగిన వారిలో ఒకరు. ఒక నెలలో 13,000 టమోటా బుట్టలను (ఒక్కోదాన్లో 20–22 కిలోలుంటాయి) విక్రయించి, రూ.1.5 కోట్లకు పైగా సంపాదించారు. కొద్ది రోజులుగా తుకారాం మీడియాలో సంచ లనంగా మారారు. అన్నింటి కంటే మించి, కనీస జీవితావసరాలు తీరడానికి కష్టపడుతున్న ఒక వ్యవసాయ కుటుంబానికి ఇంత సౌభాగ్యం కలగడం అత్యంత ఆహ్వానించదగినది.
కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఒక టమోటా రైతు 2,000 బుట్టల టమోటాలను విక్రయించి, ఒక రోజులో రూ. 38 లక్షలు సంపాదించాడని వార్తలు వచ్చాయి. అతని కుటుంబం కొన్ని దశాబ్దా లుగా సుమారు 40 ఎకరాల్లో టమోటాలు సాగు చేస్తోంది. అయితే ఈసారి అతను సాధించిన ధరలు మునుపటి రికార్డులను అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ టమోటా రైతు రూ.30 లక్షలు సంపాదించాడు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్, సిర్‌మోర్, కులు జిల్లాల్లో టమోటా ధరలు విపరీతంగా పెరగడం వేలాదిమంది టమోటా సాగుదారులకు ఆశీర్వాదంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. సోలన్ మార్కెట్‌లో, నాణ్యమైన ఆపిళ్లకు ఈ సీజన్ లో రైతులకు లభించే సగటు ధరను టమోటా ధరలు దాటేశాయి. కిలో ఆపిల్ రూ.100 ఉండగా, టమోటా రైతులకు కిలో రూ.102 వరకు పలికింది. గతేడాది కొన్ని రోజుల్లో వీటి ధర బుట్టకు రూ.5 నుంచి రూ.8 ఉండగా, ఇప్పుడు ఒక్కో బుట్ట రూ.1,875 నుంచి రూ.2,400 (కిలో రూ. 90–120) పలికింది.
ఇప్పుడు, రైతులు కోటీశ్వరులు కావడం సులభమని మీరు తప్పుడు అభిప్రాయానికి వచ్చే ముందు, అధిక రిటైల్ ధరను రైతు లకు బదిలీ చేసిన అరుదైన సందర్భాలలో ఇదొకటి అని నేను స్పష్టం చేస్తున్నాను. కొన్ని నెలల క్రితమే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో టమోటాలను పశువులకు తినిపించినట్లు, లేదంటే వాగులలో పారబోసినట్లు వార్తలు వచ్చాయి. టమోటా ధరలు పెరగక ముందు, జూన్ ప్రారంభంలో కూడా మహారాష్ట్ర రైతులు కిలోకు 2 రూపాయల ధరను కూడా చూడలేకపోయారు. వ్యవసాయ రంగ దుఃస్థితి ఒక మినహాయింపుగా కాకుండా సాధారణంగా ఉంటూ వస్తోంది.
హరియాణాలోని భివానీ జిల్లాలో 42 ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్న ఓ ప్రగతిశీల రైతు ఈ అవకాశాన్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాలుగు నెలల తక్కువ ధరల తర్వాత, నేను దాదాపు రూ. 8–10 లక్షల నష్టంతో సుమారు రెండు నెలల క్రితం నా మొత్తం పంటను పీకేశాను. జూన్ మధ్య తర్వాత ధరలు విపరీతంగా పెరుగుతాయని నాకు తెలిసి ఉంటే, నేను కచ్చితంగా చాలా డబ్బు సంపాదించి ఉండేవాడిని’ అని రమేష్ పంఘాల్ నాతో అన్నారు. ‘నా అదృష్టం బాలేదు’ అని వాపోయారు. అదృష్టదేవత వరించిన కొద్ది మంది కంటే ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ అపూర్వమైన టమోటా ధరలను అపనమ్మకంతో చూస్తున్నారని ఇది తెలియజేస్తోంది.
ఈ అనిశ్చిత విజయాలను అలా పక్కనుంచి, విపరీతమైన ధరల పెరుగుదల నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బహుశా, ఇది ప్రధానంగా వ్యవసాయ కష్టాల తీవ్రతకు దారితీసిన ఆధిపత్య ఆర్థిక ఆలోచనను సంస్కరించడానికి సహాయపడుతుంది. వినియోగదారులకు టమోటా ధరలు స్థిరంగా పెరిగాయని మనం అంగీకరిస్తున్నప్పటికీ, తక్కువ ధరలు దశాబ్దాలుగా కోట్లాదిమంది వ్యవసాయదారుల జీవనోపాధి మీద బలమైన దెబ్బ కొట్టాయని గ్రహించాలి. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచారని నేను ఎప్పుడూ అనుకుంటాను. సాధారణంగా ముద్ర వేసిన విధంగా రైతులు అసమర్థులు కాదు కానీ వారు తప్పుడు స్థూల ఆర్థిక విధానాల బాధితులుగా ఉండిపోయారు. రైతులకు ఆర్థికంగా లాభదాయకమైన జీవనోపాధిని నిరాకరిస్తూ వచ్చారు.
టమోటా సాగు విషయానికి వస్తే – రైతులు అధిక దిగుబడినిచ్చే అన్ని పద్ధతులనూ చేపట్టారు. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేశారు. ఇవన్నీ ప్రమోట్ చేసిన సాగు ఆచరణల ప్యాకేజీలో భాగం. రైతులకు విక్రయిస్తున్న ప్రతి సాంకేతికత కూడా ఉత్పాదకతను పెంచుతుందనీ, తద్వారా అధిక ఆదాయాన్ని ఇస్తుందనీ వాగ్దానం చేస్తుంది.
కానీ అది జరగలేదు. దీనికి విరుద్ధంగా రైతు సాంకేతిక ఇన్‌పుట్‌లను ఉపయోగిస్తాడు, కష్టపడి కుటుంబ శ్రమను వెచ్చించి రికార్డు స్థాయిలో పంటను పండిస్తాడు, తీరా మార్కెట్ ధరలు పడిపోయాయని తెలుసుకుంటాడు. రైతు పొందిన ధర తరచుగా పెట్టుబడి ఖర్చును కూడా తీసుకురాదు.
బిజినెస్ మేనేజ్‌మెంట్ పాఠశాలలు తరచుగా సమర్థమైన వ్యవ సాయ సరఫరా గొలుసులలో భాగం కానందుకు రైతులను నింది స్తున్నాయి. టమోటా రైతు, ఆ మాటకొస్తే ఇతర రైతులూ విలువ జోడింపు చేస్తే తప్ప సహేతుకమైన లాభాలు పొందలేరు. అందుకే వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలను (ఏపీఎంసీ) విస్మరించి, కార్పొరేట్ నిచ్చెన మెట్ల పైకి వెళ్లాలని అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నారు.
వ్యవసాయాన్ని సంపద్వంతం చేయడానికి వ్యవసాయాన్ని మరింత సరళీకరించడం, ప్రైవేటీకరించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచు కుని నీతి ఆయోగ్ ఇటీవల ఒక కార్యాచరణ పత్రాన్ని విడుదల చేసింది. అయితే వ్యవసాయ విధానాలను మనం అరువుగా తెచ్చు కున్న అమెరికాలో కూడా, వ్యవసాయ కార్పొరేటీకరణ వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో సహాయపడలేదని నీతి ఆయోగ్ గ్రహించడం లేదు.
వ్యవసాయ సంక్షోభానికి సమాధానం ఎక్కడో ఉందని వెల్లువె త్తుతున్న టమోటా ధర చెబుతోంది. ఏపీఎంసీ – మండీ వ్యవస్థను తరచుగా నిలదీస్తున్నారు కానీ సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్‌లెట్ కూడా టమోటా రైతుకు అధిక ధర ఇవ్వలేదు. అదేవిధంగా, ఈ సీజన్‌లో లాభపడిన కొంతమంది టమోటా సాగుదారుల సంపద సమర్థమెన సరఫరా గొలుసుల ద్వారా పెరగలేదు.
ఇదంతా పూర్తిగా ధరలపై ఆధారపడి ఉంది. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చ గలవని ప్రస్తుతం టమోటా ధరల ఆకస్మిక పెరుగుదల మనకు చెబు తోంది. రెండు సీజన్లలో అటువంటి అధిక ధరలు లభించినట్లయితే, మీరు సంపన్నమైన టమోటా సాగుదారులకు చెందిన కొత్త తరగతి ఆవిర్భావాన్ని చూస్తారు.
ధరలు నిర్దిష్టం కంటే తగ్గకుండా ఉండేలా కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తున్నప్పుడు, తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతులు పొందేలా అధికారులు తప్పక చూడాలి. రైతులను బతికించాలంటే అధిక ధర చెల్లించడం అత్యవశ్యం అని వినియోగదారులు గ్రహించాల్సిన సమయం ఇది.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment