పీయూష్‌ గోయల్‌ (కేంద్ర మంత్రి) రాయని డైరీ | Union Minister Piyush Goyal Rayani Diary | Sakshi
Sakshi News home page

పీయూష్‌ గోయల్‌ (కేంద్ర మంత్రి) రాయని డైరీ

Published Sun, Apr 6 2025 5:57 AM | Last Updated on Sun, Apr 6 2025 5:57 AM

Union Minister Piyush Goyal Rayani Diary

ఇండియాలో ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు?! తింటూ మాట్లాడుతుం టారు?! తింటూనే కాన్ఫరెన్సులు, తింటూనే ‘డిఫరెన్స్‌ ఆఫ్‌ ఒపీనియన్‌’లు, తింటూనే చాట్‌ జీపీటీలు, ్రగ్రోక్‌లు, జిబ్లీలు... ఆఖరికి నిద్రలోకి జారుకోవటం కూడా తింటూనేనా! మనిషి లోపల గుండె కొట్టుకుంటూ ఉన్నట్లు మనుషుల నోట్లో తిండెందుకు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది?! 

‘స్టార్టప్‌ మహాకుంభ్‌’లో కూడా తిండి... తిండి... తిండి! మహాకుంభ్‌కు మూడువేల స్టార్టప్‌ కంపెనీలు వచ్చాయి. అన్నీ ఇండియన్‌ల తిండీతిప్పల కంపెనీలే. వెయ్యి మంది ఇన్వెస్టర్‌లు వచ్చారు. అంతా తిండి కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయటానికి వచ్చిన ఇండియన్‌లే! ఏప్రిల్‌ 3 నుంచి 5 వరకు ప్రగతి మైదాన్‌లోని ‘భారత మండపం’లో ఒకటే తిండి గోల.

విజిటర్స్‌కైతే అదొక తిండి మహా సముద్రం. మనుషులు తిండిలో ఓలలాడి,తిండిలో మైమరచి, తిండిలో స్పృహ తప్పటం స్టార్టప్‌ మహాకుంభ్‌ ప్రాంగణంలోని ‘ఆహార్‌ కుంభ్‌’లో కళ్లారా చూశాన్నేను!

‘రెక్టిజా అండ్‌ కో’ స్టార్టప్‌ కంపెనీవారు అక్కడ స్టాల్‌ పెట్టుకుని పిజ్జాలు అమ్ము తున్నారు. పిజ్జాను రౌండ్‌గా కాకుండా రెక్టాంగిల్‌లో చేసివ్వటం రెక్టిజా అండ్‌ కో ప్రత్యేకత. జనం వాటి కోసం ఎగబడుతున్నారు! 

ఇంకోచోట, ‘సంప్రదాయ భారతీయ ఆహారపు ప్రామాణిక రుచులు మా ప్రత్యేకత’ అని ‘శాండీ ఫుడ్స్‌’ స్టార్టప్‌ వాళ్లు బోర్డు పెట్టారు. టేబుల్స్‌ అన్నీ నిండిపోయి ఉన్నాయి! అవి ఖాళీ అయితే కూర్చోటానికి ఆ టేబుల్స్‌కి నాలుగు వైపులా జనం! ఆ పక్కనే ‘ఫార్చూన్‌ ఫుడ్స్‌’ స్టార్టప్‌ వారి ‘ఇంటి తరహా భోజనం’! అక్కడా నిలువుకాళ్ల గుంపులే. 

ఇంట్లో భోజనం చేసుకోకుండా ‘ఇంటి తరహా భోజనం’ కోసం ఇంటిల్లిపాదీ ఇలా ఆహార కుంభాలకు రావటం ఏమిటి? ఇందు కేనా ఇండియాలో కొత్త కొత్త తిండి యాప్‌లు, తిండి స్టార్టప్‌లు వచ్చేస్తున్నాయి!

కామర్స్‌ మినిస్టర్‌గా నేనీ చెత్తంతా మాట్లాడకూడదు. మనిషి తింటేనే దేశానికి పుష్టి. ఫుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్టర్‌గా కూడా పని చేశాను కనుక ఇలా అసలే మాట్లాడకూడదు. మనుషులందరికీ తిండి చేరితేనే దేశానికి ముందుకు నడిచే శక్తి అందుతుంది.

నిజానికి ఇండియా కంటే చైనాలోనే తిండి ధ్యాస ఎక్కువ. కానీ వాళ్ల స్టార్టప్‌లు... ఈవీలు, ఏఐలు, సెమీ కండక్టర్‌లు, రోబోటిక్స్, గ్లోబల్‌ లాజిస్టిక్స్, ట్రేడ్, డీప్‌ టెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మీదే ఎక్కువగా పని చేస్తున్నాయి. 

లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్‌’ అన్నారు. అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆ నినాదానికి ‘జై విజ్ఞాన్‌’ను జోడించారు. మోదీజీ ‘జై అనుసంధాన్‌’ అనే మాటను చేర్చి... ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్‌’ అన్నారు. సిపాయి ఎంతో, రైతు ఎంతో, విజ్ఞానం ఎంతో, పరిశోధన అంత ముఖ్యం దేశ భవిష్యత్తుకు!

‘‘మీరు డెలివరీ బాయ్స్‌ని, డెలివరీ గర్ల్స్‌ని సృష్టించటంతోనే ఆగిపోతారా?’’ అని... స్టార్టప్‌ మహాకుంభ్‌కు వచ్చిన ఇండియన్‌ ‘స్టెమ్‌’ గ్రాడ్యుయేట్‌లను నేను అడిగాను. అది కేవలం అడగటం మాత్రమే కాదు... థామస్‌ ఆల్వా ఎడిసన్‌లా శాస్త్ర విజ్ఞానాన్ని, వ్యాపారాన్ని కలిపి డెలివరీ చెయ్యమని చెప్పటం కూడా!  
స్టార్టప్‌ మహాకుంభ్‌ ముగిశాక భారత మండపం నుంచి బయటికి వచ్చేస్తూ, ‘‘ఏమైనా తిన్నారా?’’ అని ఆ యంగ్‌ గ్రాడ్యుయేట్‌లను అడిగాను. అడగాలని అడగలేదు. అనుకోకుండా అలా అడిగేశాను.  

ఇంటికి రాగానే సీమ కూడా నన్ను అదే మాట అడిగింది... ‘‘ఏమైనా తిన్నారా?’’ అని!! 
ఇండియాలోని విశేషం.. తింటూ మాట్లాడటం, తింటూ పని చేయటం మాత్రమే కాదా? ‘‘తిన్నావా?’’ అని అడగటం కూడానా!!

గొప్ప టెక్నాలజీని కనిపెట్టటం మాత్రమే కాదు, సాటి మనిషిని ‘‘తిన్నారా?’’ అని అడిగి కనుక్కోవటం కూడా ఎప్పటికప్పుడు ఒక గొప్ప ఇన్వెన్షనే అనిపిస్తోంది నాకిప్పుడు! 
- మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement