మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌) రాయని డైరీ | Mark Zuckerberg Rayani Diary | Sakshi
Sakshi News home page

మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌) రాయని డైరీ

Published Sun, Jan 26 2025 5:54 AM | Last Updated on Sun, Jan 26 2025 5:54 AM

Mark Zuckerberg Rayani Diary

మాధవ్‌ శింగరాజు 

వాషింగ్టన్‌ లో ప్రెసిడెంట్‌ ఇనాగరేషన్‌ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్‌ హౌస్‌ నుండి ఫోన్‌  కాల్‌!
‘‘మిస్టర్‌ జుకర్‌బర్గ్‌! నేను అలెక్స్‌ ఎన్‌ వాంగ్, యునైటెడ్‌ స్టేట్స్‌ డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ లైన్‌ లోకి రావటం కోసం దయచేసి కొద్ది క్షణాలు మీరు వేచి ఉండగలరా?’’ – అని !! ‘‘ఎస్‌... ప్లీజ్‌’’ అన్నాను.‘ఎవరు?!’ అన్నట్లు ప్రిసిల్లా నావైపు చూసింది. 

టేబుల్‌ మీద ఉన్న ‘లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌’ లో ట్రంప్‌ ఫొటోను కనుసైగగా ఆమెకు చూపించాను.
పిల్లల్ని తీసుకుని ప్రిసిల్లా పక్క గదిలోకి వెళ్లిపోయింది. మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా ఎప్పుడూ తల్లిని చుట్టుకునే ఉంటారు. తొమ్మిదేళ్లొకరికి, ఏడేళ్లొకరికి. రెండేళ్లొకరికి! 

కాలేజ్‌లో ప్రిసిల్లా అంటే... ప్రిసిల్లా–నేను. ఇప్పుడు ప్రిసిల్లా అంటే ‘ఆల్‌ గర్ల్‌ టీమ్‌’ లా పిల్లలు–తను! కలిసి తిరుగుతుంటారు. కలిసి ఆడుతుంటారు. బుద్ధి పుడితే ఎప్పుడైనా ‘పోన్లే పాపం డాడ్‌...’ అన్నట్లు నన్ను తమ జట్టులోకి చేర్చుకుంటారు.

‘‘మిస్టర్‌ జుకర్‌బర్గ్‌! లైన్‌ లోనే ఉన్నారా...?’’ అన్నారు అలెక్స్‌ ఎన్‌  వాంగ్, నిర్ధారణ కోసం.
‘‘ఎస్‌... మిస్టర్‌ వాంగ్‌! నేను లైన్‌ లోనే ఉన్నాను...’’ అన్నాను.
హఠాత్తుగా ‘‘హాయ్‌ జాక్‌...’’ అంటూ లైన్‌ లోకి వచ్చేశారు ట్రంప్‌!

‘‘సర్‌ప్రైజింగ్, మిస్టర్‌ ప్రెసిడెంట్‌!’’ అన్నాను.
‘‘నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే నీకు ఫోన్‌  చేశాన్‌  జాక్‌...’’ అన్నారు ట్రంప్‌!!
‘‘ఏ విషయం గురించి మిస్టర్‌ ప్రెసిడెంట్‌!!’’ అని అడిగాను.

‘‘వెల్‌... జాక్‌! నా ఇనాగరేషన్‌ లో నువ్వు నీ పక్కనున్న స్త్రీమూర్తిని – ఆమె కంఠానికి దిగువనున్న భాగం వైపు – ఆపేక్షగా చూశావని అంతా నిన్ను ట్రోల్‌ చేయటం గురించే అంటున్నా! మగవాళ్లు నిప్పులా ఉన్నా నిందలు తప్పవు. లుక్‌!  స్త్రీ విషయంలో నోరు జారిన మగాడినైనా ఈ లోకం క్షమిస్తుంది కానీ, చూపు జారిన మగాడికి ఏ లోకంలోనూ క్షమాపణ లభించదు...’’ అన్నారు ట్రంప్‌.

‘‘థ్యాంక్యూ మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అన్నాను.ఆయన అంటున్న ఆ స్త్రీ మూర్తి లారెన్‌  సాంచెజ్‌! జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు. ఇనాగరేషన్‌ లో నాకు ఒక పక్క నా భార్య,ఇంకో పక్క ఆమె ఉన్నారు. ఆమెకు అటువైపున నిలబడి ఉన్న జెఫ్‌ బెజోస్‌ ఏదో చెబుతుంటే, నేను తలతిప్పి చూసినప్పుడు, నా చూపు ఆమె ‘లో–నెక్‌’ లోపలికి స్లిప్‌ అయినట్లుంది. అంత బ్యాడ్‌ మోమెంట్‌ లేదు నా లైఫ్‌లో!

ఇలాంటి సంక్షోభ సమయంలో లోకంలోని ఒక మగవాడు నాకు సపోర్ట్‌గా రావటం బాగుంది. అయితే ఆ మగవాడు డోనాల్డ్‌ ట్రంప్‌ కాకపోయుంటే నాకు మరింత సపోర్టివ్‌గా అనిపించేది.

‘‘వింటున్నావా జాక్‌? నువ్వు ఆమెను చూడాలని చూడలేదని నాకు తెలుసు. చూడటం వేరు. చూపు పడటం వేరు. కానీ జాక్, నీపైన వచ్చిన లక్ష కామెంట్‌లలో ఒకటైతే నాకు భలే నచ్చింది. మొదటిసారి నువ్వొక హ్యూమన్‌ లా స్పందించావట! హాహ్హహా...’’ అంటూ పెద్దగా నవ్వారు ట్రంప్‌.  

నేనూ నవ్వాపుకోలేకపోయాను.‘హాయ్‌ జాక్‌’ అంటూ లైన్‌ లోకి వచ్చినంత హఠాత్తుగా ‘బాయ్‌ జాక్‌’ అంటూ లైన్‌ లోంచి వెళ్లిపోయారు ట్రంప్‌.
ఫోన్‌  పెట్టేశాక, ‘‘ఏమిటట?’’ అని ప్రిసిల్లా.
పక్కన పిల్లల్లేరు! నిద్రబుచ్చి వచ్చినట్లుంది.

‘‘అదే, ఆ బ్యాడ్‌ మోమెంట్‌ గురించి ట్రంప్‌ నన్ను సపోర్ట్‌ చేస్తున్నారు... ’’ అని చెప్పాను.
ప్రిసిల్లా నవ్వింది.
‘‘అది బ్యాడ్‌ మోమెంట్‌ కాదు బాస్, బ్యాడ్‌ ఫొటోగ్రాఫ్‌... ‘ అంది, నన్ను అతుక్కుపోతూ.
ప్రిసిల్లా అంటే... ఇప్పుడు మళ్లీ ప్రిసిల్లా–నేను... కాలేజ్‌ డేస్‌ తర్వాత ఇన్నేళ్లకు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement