tomato prices
-
తోటల్లోనే టమాటా
పలమనేరు: మార్కెట్లో టమాటా ధర పడిపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. ఓ పక్క ఎగుమతులు లేకపోవడం, మరోపక్క కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. రైతుకు మిగులుతున్నది పంట పెట్టుబడికి తెచి్చన అప్పులే. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్లో రైతులకు పంట సాగు ఖర్చులు కూడా రావడంలేదు. స్థానిక టమాటా మార్కెట్లో సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200 మాత్రమే ఉంది.సగటు ధర బాక్సుకు రూ.180గా ఉంది. దీంతో పంట కోసిన కూలీల డబ్బు కూడా రావడంలేదని, కోసి నష్టపోయేకంటే తోటల్లోనే వదిలేయడం మేలన్న నిర్వేదంతో రైతులు పంటను కోయకుండా వదిలిపెట్టారు. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్లో టమాటా సీజన్ ఏడాదంతా ఉంటుంది. ప్రస్తుతం 9 వేల హెక్టార్లలో టమాటా పంట సాగవుతోంది. 2,58,888 టన్నులు దిగుబడి ఉంటుందని అంచనా. ఎక్కువగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటా కొనుగోలు చేస్తుంటారు.అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాల్లోనే సాగు పెరిగి, అక్కడి మార్కెట్లకు సరుకు భారీగా వస్తోంది. దీంతో అక్కడి వ్యాపారులు పలమనేరు, పుంగనూరు, మదనపల్లి రావడంలేదు. ఎగుమతులు లేక ఇక్కడ ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు వచి్చన కాస్త పంటను కూడా వ్యాపారులు, మధ్యవర్తులు అతి తక్కువ ధరకు కొని, బహిరంగ మార్కెట్లో అతి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రైతుకు మిగిలేదేమీ లేదు ఎకరా పంట పండించడానికి రైతుకు రూ. 1.20 లక్షలు ఖర్చవుతుంది. ఎకరాకు ప్రస్తుతం 500 నుంచి 600 బాక్సుల (బాక్సుకి 15 కిలోలు) దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఉన్న రేటు కనీసం రూ. 160 నుంచి గరిష్టంగా రూ. 200 మాత్రమే ఉంది. సరాసరి ధర రూ.180 వేసుకున్నా రైతుకు రూ. లక్ష నుంచి రూ.1,08,000కి మించి రావడంలేదు. ఇక్కడే రైతుకు కనీసంగా రూ.12 వేలు నష్టం వస్తోంది. రైతు కుటుంబమంతా కష్టపడి పంటకు నీరందించి సస్యరక్షణ చర్యలు చేపట్టి వారి కూలీని లెక్కకడితే అతనికి మిగిలేది అప్పులే. దీంతో కోత ఖర్చులు కూడా వృథాయేనన్న నిర్వేదంతో రైతులు పంటను చెట్టు మీదే వదిలేస్తున్నారు. ఎకరా సాగుకు అయ్యే ఖర్చు ఇలా..ఎకరా టమాటా సాగు కోసం భూమి దున్నటం, నర్సరి నుంచి మొక్కల కొనుగోలు (ఎకరాకు 8 వేల మొలకలు) రూ.8 వేలు అవుతుంది. టమోట స్టిక్‌లు ఎకరాకు 1200. ఒక్కోటి రూ.20 చొప్పున రూ.24 వేలు వీటికి ఖర్చవుతుంది. సేంద్రియ ఎరువు పది లోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు కలిపి రూ.27వేలు అవుతాయి. క్రిమి సంహారక మందులు రూ.10 వేలు. కూలీల ఖర్చు రూ.15 వేలు. ఇలా ఎకరా పంట సాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.84 వేలు. పంట వడిగేలోపు తోటలో కాయలు కోసేందుకు కూలీ, మార్కెట్‌కు రవాణ, తదితరాల ఖర్చు మరో రూ.36 వేలు అవుతోంది. మొత్తం కలసి రూ.1.20 లక్షలు అవుతుంది.బయటి నుంచి వ్యాపారులు వస్తేనే ధర పెరుగుతుంది..మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంలేదు. దీంతో సరుకు మిగిలిపోతోంది. ధరలు తగ్గిపోయాయి. కనీసం బాక్సు టమాటా ధర రూ.300 ఉంటే తప్ప రైతుకు మిగిలేదేమీ ఉండదు. – టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకులు, పలమనేరు -
సెంచరీ కొట్టిన టమాటా..
-
తగ్గనున్న టమాటా ధరలు
దేశంలో టమాటా ధరలు మరింత తగ్గనున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కిలో రూ.75 కి పెరిగిన రిటైల్ టమాటా ధర, దక్షిణాది రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగుపడటంతో రాబోయే వారాల్లో తగ్గుతుందని ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.ధరల పెరుగుదలకు కారణాలు"ఢిల్లీతోపాటు కొన్ని ఇతర నగరాల్లో టమాటా, బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వర్షపాతం కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల వినియోగ ప్రాంతాల్లో ధరలు పెరిగాయి" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి పీటీఐకి తెలిపారు. న్యూఢిల్లీలో టమాటా ధర కిలోకు రూ.75కి పెరిగింది. అయితే భారీ వర్షాలు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించకపోతే తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు.మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జూలై 12న ఢిల్లీలో రిటైల్ టమాటా ధర కిలోకు రూ.75గా ఉంది. ముంబైలో రూ.83, కోల్‌కతా రూ.80లుగా టమాటా ధరలు నమోదయ్యాయి. జూలై 12న దేశవ్యాప్తంగా టమాటా సగటు రిటైల్ ధర కేజీకి 65.21 లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.53.36 ఉండేది.టమాటా ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..ప్రస్తుతం ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా అవుతోంది. “ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి హైబ్రిడ్ టమాటాలు దేశ రాజధానికి చేరుకోవడంతో ధరలు తగ్గుతాయి” అని అధికారి తెలిపారు.సబ్సిడీతో కూడిన టమాటా అమ్మకాలను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించడం లేదు. గత ఏడాది కిలో ధర రూ.110 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చర్యను అమలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక నుంచి సరఫరా మెరుగుపడటంతో 1-2 వారాల్లో ధరలు సాధారణ స్థితికి వస్తాయని అధికారి విశ్వాసం వ్యక్తం చేశారు. -
కాసులు కురిపిస్తున్న టమాట
కోలారు: టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా రైతులకు మార్కెట్లో కాసుల పంట పండుతోంది. రెండు రోజులుగా కోలారు ఏపీఎంసీ మార్కెట్లో 15 కిలోల నాణ్యమైన టమాట బాక్సు ధర రూ.700 పలికింది. టోకు మార్కెట్లో కిలో ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వేసవి కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌కు పెద్దగా సరుకు రావడం లేదు. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీఎంసీ మార్కెట్ యార్డుకు గురువారం 8500 క్వింటాళ్ల టమాట వచ్చింది. గత సంవత్సరం ఇదే సీజన్లో మార్కెట్‌కు దాదాపు 15 వేల క్వింటాళ్ల దిగుబడి ఉండింది. ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండలు, ప్రస్తుతం కురుస్తున్న వానలకు టమాట దిగుబడి తగ్గుతోందని రైతులు అంటున్నారు. తెగుళ్ల బాధ, వాతావరణ వైపరీత్యం వల్ల కూడా టమాటా దిగుబడి బాగా తగ్గిందని రైతులు అంటున్నారు. వాతావరణంలో మార్పులను చూసి రైతులు కూడా టమాటా సాగుకు విముఖత చూపడం వల్ల దిగుబడి తగ్గిందని ఏపీఎంసీ మార్కెట్ యార్డు సెక్రటరీ విజయలక్ష్మి తెలిపారు. రాబోయే 15 రోజుల్లో మార్కెట్‌కు టమాట సరఫరా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. టమాట ధరలు రైతులకు లాభాలు కురిపిస్తుండగా వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. -
టమాటా రైతుకు బాసట..
సాక్షి, అమరావతి: ధరలేక సతమతమవుతున్న టమాటా రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిమాండ్‌కు మించి టమాటా పంట మార్కెట్లకు వస్తుండటంతో గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను నిరంతరం పరిశీలిస్తూ కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ ధరలు నిలకడగా ఉండేలా చూస్తోంది. ఇటీవల టమాటా ధరలు చుక్కలనంటి.. కిలో రూ. 250కు పైగా పలికిన దశలో వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 28 నుంచి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి పెద్ద ఎత్తున టమాటాలను సేకరించి కిలో రూ. 50కే రైతు బజార్లలో విక్రయించింది. ఇలా దాదాపు రెండు నెలల పాటు రైతుల నుంచి సగటున కిలో రూ. 107.50 చొప్పున రూ.14.66 కోట్ల విలువైన 1,364.55 టన్నుల టమాటాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 105 రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందించింది. నేడు రైతులకు అండగా నిలిచేందుకు.. గత నెల రోజులుగా ఖరీఫ్ పంట పెద్దఎత్తున వస్తుండటంతో మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లతో సంబంధం లేకుండా కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించింది. దీంతో సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తూ ధరల తగ్గిన మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ రైతులకు బాసటగా నిలుస్తోంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ పరిధిలో ధరలు తగ్గుదల నమోదవుతుండటంతో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి రైతులవద్ద టమాటాలు కొనుగోలు చేశారు. లాభం ఆశించకుండా విక్రయం ఇటీవల ప్యాపిలి మార్కెట్లో కనిష్ట ధర రూ. 6 పలుకగా, అంతకంటే ధర తగ్గకూడదన్న ఆలోచనతో రైతుల వద్ద గడిచిన నాలుగు రోజుల్లో 16 టన్నులు సేకరించి స్థానిక రైతుబజార్లలో నో ప్రాఫిట్–నో లాస్ పద్ధతిన వినియోగదారులకు విక్రయించారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ప్రభుత్వ జోక్యం చేసుకుంటుండటంతో సోమవారం ప్రధాన టమాటా మార్కెట్లలో నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో కనిష్టంగా రూ. 8, గరిష్టంగా రూ. 16 చొప్పున పలుకుతోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 11 నుంచి రూ. 24 పలుకుతుండగా, రైతు బజార్లలో కిలో రూ.9 నుంచి రూ. 20 వరకు ధరలు ఉండేలా చూస్తున్నారు. ధరల నిలకడే లక్ష్యం డిమాండ్ మించి పంట మార్కెట్‌కు వస్తుండటంతో గతకొద్ది రోజులుగా తగ్గుతున్న ధరలను నిలకడగా ఉంచడం ద్వారా రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీరోజూ ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కిలో రూ.7 కంటే తక్కువగా పలుకుతున్న మార్కెట్లో జోక్యం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే కిలో రూ. 6 చొప్పున 16 టన్నులు రైతుల నుంచి సేకరించి స్థానిక రైతు బజార్లలో అదే ధరకు విక్రయించాం. ధరల విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
ఎగిరెగిరి పడ్డ టమాటా.. ఇప్పుడు ఢీలా!
సాక్షి, కర్నూలు జిల్లా: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రంలో టమాటా ధరలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మార్కెట్లకు టమాటా చేరడం లేదు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా రూ. 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ప్యాపిలి మార్కెట్లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూ.3 మాత్రమే పలుకుతోంది. ధరలు లేకపోవడంతో టమాటాలను రైతులు మార్కెట్‌కు ఆరుబయటే పారేసి వెళ్లిపోతున్నారు. పచ్చి పంట కావడంతో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాలను రోడ్లపైనే పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీస ధర లేకపోవడంతో డోన్ జాతీయ రహదారిపైనే టమాటాలను ఓ రైతు పారబోశాడు. పారబోసిన టమాటాలను పశువులు తింటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి పంట అయినందున ఎక్కడా దాచలేమని రైతులు దిగులు పడుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 200 వరకు పలికిన కిలో టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎన్నో ఆశలతో ఉన్న టమాటా రైతులు.. వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎగిరెగిరి పడ్డ టమాటా ఇప్పుడిలా ఉల్టా కావడం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి: అలా.. ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు అవకాశాలు -
దిగొస్తున్న టమాటా ధర
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులుగా వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జూలైలో కిలో ఏకంగా రూ.250 పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.100–120 మధ్యకు చేరుకుందని తెలిపింది. ఈ ధరలు వచ్చే సెపె్టంబర్ రెండో వారానికి సాధారణ స్థాయికి అంటే కిలో రూ.30–40కి చేరుకుంటాయని అంచనా వేసింది. మహారాష్ట్ర నాసిక్‌లోని పింపాల్‌గావ్ బస్వంత్ మార్కెట్‌కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా ట మాటా సరఫరా పెరిగింది. ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 వరకు పలికింది. -
దిగొస్తున్న టమాట ధరలు
కోలారు: గత కొద్ది రోజులుగా రెక్కలు కట్టుకుని ఆకాశంలో తిరుగుతున్న టమాట ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం కోలారు ఏపీఎంసీ మార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు టమాట ధర కేవలం రూ.800 పలికింది. దీంతో మొదటి సారిగా 15 కిలోల బాక్సు ధర రూ.1000 లోపునకు దిగి వచ్చినట్లయింది. బుధవారం రూ.1100 ఉన్న బాక్సు టమాట ధరలు ఒకే రోజులో రూ.300 తగ్గడంతో రైతులు అసంతృప్తికి గురవుతుండగా వినియోగదారులకు మాత్రం కాస్త ఊరట లభిస్తోంది. పెరిగిన ధరలతో టమాటలను కొనలేక నానా ఇబ్బండులు పడిన వినియోగదారులకు ఇక మార్కెట్లో టమాటలు కొనడానికి ముందుకు వచ్చే అవకాశం కలిగింది. ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని రైతులు, మార్కెట్ నిపుణులు, వ్యాపారులు అంటున్నారు. రూ.2700 పలికిన ధర జూలై 31న కోలారు మార్కెట్ యార్డులో టమాట బాక్సు గరిష్ట ధర రూ.ఽ2700 పలికి రికార్డు సృష్టించింది. ధరలు తగ్గడానికి మార్కెట్‌కు అధికంగా టమాట దిగుబడి అవుతుండడమే కారణమని అంటున్నారు. గత బుధవారం కోలారు మార్కెట్‌కు 86,091 క్వింటాళ్ల టమాట అంటే 12,913 బాక్సుల టమాట వచ్చింది. జూలై 31న మార్కెట్‌కు 52,820 క్వింటాళ్ల టమాట వచ్చింది. అంటే గత 10 రోజుల అవధిలో మార్కెట్‌కు దాదాపు 33 వేల క్వింటాళ్ల టమాట దిగుబడి పెరిగిందని, అందువల్లే టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయని మార్కెట్ అధికారులు అంటున్నారు. టమాట ధరలు పెరిగిన తరువాత జిల్లాలో దాదాపు ఇటీవల 6 వేల హెక్టార్లలో రైతులు టమాట నాటినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. -
రికార్డు స్థాయిలో కిలో టమోటా రూ.200
-
టమోటా ధరల్లో ఓ సానుకూల కోణం
ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో టమోటాలు అమ్మిన రైతులు, ఉన్నట్లుండి లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మండీలను తరచుగా నిలదీస్తున్నారు కానీ, సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్లెట్ కూడా టమోటా రైతులకు అధిక ధర చెల్లించలేదు. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవని ప్రస్తుత ధరల పెరుగుదల మనకు చెబుతోంది. అయితే తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతు పొందేలా అధికారులు తప్పక చూడాలి. టమోటా ధరల విపరీత పెరుగుదల వినియోగదారుల్లో ఆగ్రహ ప్రతిస్పందనలను కలిగిస్తోంది. అయితే దీనికి ఒక ప్రకాశవంతమైన కోణం ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన వందలాది టమోటా రైతులు లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు బాగా పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జున్నర్‌లో 12 ఎకరాల్లో టమోటా సాగు చేసిన తుకారాం భాగోజీ గాయ్కర్ అనూహ్యంగా ఆదాయం పెరిగిన వారిలో ఒకరు. ఒక నెలలో 13,000 టమోటా బుట్టలను (ఒక్కోదాన్లో 20–22 కిలోలుంటాయి) విక్రయించి, రూ.1.5 కోట్లకు పైగా సంపాదించారు. కొద్ది రోజులుగా తుకారాం మీడియాలో సంచ లనంగా మారారు. అన్నింటి కంటే మించి, కనీస జీవితావసరాలు తీరడానికి కష్టపడుతున్న ఒక వ్యవసాయ కుటుంబానికి ఇంత సౌభాగ్యం కలగడం అత్యంత ఆహ్వానించదగినది. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఒక టమోటా రైతు 2,000 బుట్టల టమోటాలను విక్రయించి, ఒక రోజులో రూ. 38 లక్షలు సంపాదించాడని వార్తలు వచ్చాయి. అతని కుటుంబం కొన్ని దశాబ్దా లుగా సుమారు 40 ఎకరాల్లో టమోటాలు సాగు చేస్తోంది. అయితే ఈసారి అతను సాధించిన ధరలు మునుపటి రికార్డులను అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ టమోటా రైతు రూ.30 లక్షలు సంపాదించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్, సిర్మోర్, కులు జిల్లాల్లో టమోటా ధరలు విపరీతంగా పెరగడం వేలాదిమంది టమోటా సాగుదారులకు ఆశీర్వాదంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. సోలన్ మార్కెట్లో, నాణ్యమైన ఆపిళ్లకు ఈ సీజన్ లో రైతులకు లభించే సగటు ధరను టమోటా ధరలు దాటేశాయి. కిలో ఆపిల్ రూ.100 ఉండగా, టమోటా రైతులకు కిలో రూ.102 వరకు పలికింది. గతేడాది కొన్ని రోజుల్లో వీటి ధర బుట్టకు రూ.5 నుంచి రూ.8 ఉండగా, ఇప్పుడు ఒక్కో బుట్ట రూ.1,875 నుంచి రూ.2,400 (కిలో రూ. 90–120) పలికింది. ఇప్పుడు, రైతులు కోటీశ్వరులు కావడం సులభమని మీరు తప్పుడు అభిప్రాయానికి వచ్చే ముందు, అధిక రిటైల్ ధరను రైతు లకు బదిలీ చేసిన అరుదైన సందర్భాలలో ఇదొకటి అని నేను స్పష్టం చేస్తున్నాను. కొన్ని నెలల క్రితమే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో టమోటాలను పశువులకు తినిపించినట్లు, లేదంటే వాగులలో పారబోసినట్లు వార్తలు వచ్చాయి. టమోటా ధరలు పెరగక ముందు, జూన్ ప్రారంభంలో కూడా మహారాష్ట్ర రైతులు కిలోకు 2 రూపాయల ధరను కూడా చూడలేకపోయారు. వ్యవసాయ రంగ దుఃస్థితి ఒక మినహాయింపుగా కాకుండా సాధారణంగా ఉంటూ వస్తోంది. హరియాణాలోని భివానీ జిల్లాలో 42 ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్న ఓ ప్రగతిశీల రైతు ఈ అవకాశాన్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాలుగు నెలల తక్కువ ధరల తర్వాత, నేను దాదాపు రూ. 8–10 లక్షల నష్టంతో సుమారు రెండు నెలల క్రితం నా మొత్తం పంటను పీకేశాను. జూన్ మధ్య తర్వాత ధరలు విపరీతంగా పెరుగుతాయని నాకు తెలిసి ఉంటే, నేను కచ్చితంగా చాలా డబ్బు సంపాదించి ఉండేవాడిని’ అని రమేష్ పంఘాల్ నాతో అన్నారు. ‘నా అదృష్టం బాలేదు’ అని వాపోయారు. అదృష్టదేవత వరించిన కొద్ది మంది కంటే ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ అపూర్వమైన టమోటా ధరలను అపనమ్మకంతో చూస్తున్నారని ఇది తెలియజేస్తోంది. ఈ అనిశ్చిత విజయాలను అలా పక్కనుంచి, విపరీతమైన ధరల పెరుగుదల నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బహుశా, ఇది ప్రధానంగా వ్యవసాయ కష్టాల తీవ్రతకు దారితీసిన ఆధిపత్య ఆర్థిక ఆలోచనను సంస్కరించడానికి సహాయపడుతుంది. వినియోగదారులకు టమోటా ధరలు స్థిరంగా పెరిగాయని మనం అంగీకరిస్తున్నప్పటికీ, తక్కువ ధరలు దశాబ్దాలుగా కోట్లాదిమంది వ్యవసాయదారుల జీవనోపాధి మీద బలమైన దెబ్బ కొట్టాయని గ్రహించాలి. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచారని నేను ఎప్పుడూ అనుకుంటాను. సాధారణంగా ముద్ర వేసిన విధంగా రైతులు అసమర్థులు కాదు కానీ వారు తప్పుడు స్థూల ఆర్థిక విధానాల బాధితులుగా ఉండిపోయారు. రైతులకు ఆర్థికంగా లాభదాయకమైన జీవనోపాధిని నిరాకరిస్తూ వచ్చారు. టమోటా సాగు విషయానికి వస్తే – రైతులు అధిక దిగుబడినిచ్చే అన్ని పద్ధతులనూ చేపట్టారు. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేశారు. ఇవన్నీ ప్రమోట్ చేసిన సాగు ఆచరణల ప్యాకేజీలో భాగం. రైతులకు విక్రయిస్తున్న ప్రతి సాంకేతికత కూడా ఉత్పాదకతను పెంచుతుందనీ, తద్వారా అధిక ఆదాయాన్ని ఇస్తుందనీ వాగ్దానం చేస్తుంది. కానీ అది జరగలేదు. దీనికి విరుద్ధంగా రైతు సాంకేతిక ఇన్పుట్లను ఉపయోగిస్తాడు, కష్టపడి కుటుంబ శ్రమను వెచ్చించి రికార్డు స్థాయిలో పంటను పండిస్తాడు, తీరా మార్కెట్ ధరలు పడిపోయాయని తెలుసుకుంటాడు. రైతు పొందిన ధర తరచుగా పెట్టుబడి ఖర్చును కూడా తీసుకురాదు. బిజినెస్ మేనేజ్మెంట్ పాఠశాలలు తరచుగా సమర్థమైన వ్యవ సాయ సరఫరా గొలుసులలో భాగం కానందుకు రైతులను నింది స్తున్నాయి. టమోటా రైతు, ఆ మాటకొస్తే ఇతర రైతులూ విలువ జోడింపు చేస్తే తప్ప సహేతుకమైన లాభాలు పొందలేరు. అందుకే వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలను (ఏపీఎంసీ) విస్మరించి, కార్పొరేట్ నిచ్చెన మెట్ల పైకి వెళ్లాలని అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నారు. వ్యవసాయాన్ని సంపద్వంతం చేయడానికి వ్యవసాయాన్ని మరింత సరళీకరించడం, ప్రైవేటీకరించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచు కుని నీతి ఆయోగ్ ఇటీవల ఒక కార్యాచరణ పత్రాన్ని విడుదల చేసింది. అయితే వ్యవసాయ విధానాలను మనం అరువుగా తెచ్చు కున్న అమెరికాలో కూడా, వ్యవసాయ కార్పొరేటీకరణ వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో సహాయపడలేదని నీతి ఆయోగ్ గ్రహించడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి సమాధానం ఎక్కడో ఉందని వెల్లువె త్తుతున్న టమోటా ధర చెబుతోంది. ఏపీఎంసీ – మండీ వ్యవస్థను తరచుగా నిలదీస్తున్నారు కానీ సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్లెట్ కూడా టమోటా రైతుకు అధిక ధర ఇవ్వలేదు. అదేవిధంగా, ఈ సీజన్లో లాభపడిన కొంతమంది టమోటా సాగుదారుల సంపద సమర్థమెన సరఫరా గొలుసుల ద్వారా పెరగలేదు. ఇదంతా పూర్తిగా ధరలపై ఆధారపడి ఉంది. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చ గలవని ప్రస్తుతం టమోటా ధరల ఆకస్మిక పెరుగుదల మనకు చెబు తోంది. రెండు సీజన్లలో అటువంటి అధిక ధరలు లభించినట్లయితే, మీరు సంపన్నమైన టమోటా సాగుదారులకు చెందిన కొత్త తరగతి ఆవిర్భావాన్ని చూస్తారు. ధరలు నిర్దిష్టం కంటే తగ్గకుండా ఉండేలా కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తున్నప్పుడు, తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతులు పొందేలా అధికారులు తప్పక చూడాలి. రైతులను బతికించాలంటే అధిక ధర చెల్లించడం అత్యవశ్యం అని వినియోగదారులు గ్రహించాల్సిన సమయం ఇది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
ఆపిల్ ధర మించిపోయిన టమాటా
భారత దేశ చరిత్రలో టమాటా ధరలు టాప్ లేచిపోయాయి. టమాటాల చరిత్రలో మార్కెట్లో మంగళవారం అత్యధిక ధర పలికాయి. మంగళవారం మార్కెట్లో 30 కిలోల టమాటా ధర రూ.4,200 ధర పలికింది. కిలో టమాటా ధరలు రూ.140 వరకు ఽవేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. దేశంలో ఆపిల్ ధరలు అత్యధికంగా ఉండగా ఆపిల్‌ను అధిగమించి ఈరోజు టమాటాలు మార్కెట్లో మొదటిస్థానంలో నిలిచాయి. ఒక క్రీట్ టమాటా ధర ఇంచుమించుగా ఒక గ్రాము బంగారం ధరకు సమానంగా ఉండడం చరిత్రలో ఇదే మొదటిసారని రైతులు చర్చించుకోవడం గమనార్హం గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో సాగు చేసిన టమాటాలకు దేశంలో అత్యధికంగా ధర పలికింది. మంగళవారం మదనపల్లె, గుర్రంకొండతో పాటు జిల్లాలోని పలు మార్కెట్‌యార్డుల్లో టమాటా ధరలు అత్యధికంగా కిలో రూ.140 వరకు పలికాయి. 30 కిలోల టమాటా ఽక్రీట్ ధర రూ.4200 వరకు ధర పలికాయి. దీంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఓవైపు అధిక వర్షాలు, మరోవైపు వైరస్, ఇతర రోగాలతో పలు రాష్ట్రాలలో టమాటా తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జిల్లాలో ముఖ్యంగా పడమటి ప్రాంతాలైన (పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె) నియోజకవర్గాల్లో ఎంతో కొంత టమాటా దిగుబడి వస్తోంది. వారం రోజుల క్రితం వరకు టమాటా ధర క్రీట్ రూ.3500 నుంచి రూ.3800 వరకు ధరలు పలికాయి. మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడంతో అందరూ ఆశ్చర్య పోయారు. టమాటా పంట దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతుండడంతో మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ► జిల్లా మొత్తం మీద 945 క్వింటాళ్ల టమాటాలు మార్కెట్లోకి వచ్చాయి. మొదటి రకం కిలో టమాటా ధర రూ. 140 కాగా రెండవ రకం కిలో రూ.110, మూడవ రకం కిలో రూ. 80 వరకు ధర పలకడం విశేషం. బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు జిల్లాకు తరలివచ్చి ఇక్కడ మకాం వేశారు. మార్కెట్లో టమాటాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకొంటున్నారు. దేశంలో ఆపిల్ ధరల కంటే టమాటా ధరలు మించిపోవడం గమనార్హం. మార్కెట్లో టమాటాల డిమాండ్ ను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో టమాటాల క్రీట్ధర రూ.5000 వరకు ధర పలుకుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అత్యధిక ధరలు ఇవే .. దేశ చరిత్రలో టమాటా మార్కెట్లో అత్యధికంగా మంగళవారం టమాటా ధరలు పలికాయి. కిలో టమాటా రూ. 140 వరకు ధర పలికాయి. 30కిలోల టమాటా క్రీట్ ధర అత్యధికంగా రూ. 4200 వరకు ఽవేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. ఇంత పెద్ద ఎత్తున టమాటా ధరలు పెరగడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా టమాటా దిగుబడి భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో మన జిల్లాలో సాగు చేసిన టమాటాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకొంటున్నారు. టమాటా దిగుబడి పెరిగితేనే మార్కెట్లో ధరలు తగ్గే అవకాశముంది. – జగదీష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, వాల్మీకిపురం -
ధరల మంట.. టమాటాలతో తులాభారం.. కూతురు మొక్కు తీర్చుకున్న వ్యాపారి
సాక్షి, అనాకపల్లిటౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆవరణలో ఆదివారం వినూత్నరీతిలో తులాభారం నిర్వహించారు. వ్యాపారవేత్త మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతులు తమ కుమార్తె భవిష్యకు తులాభారం వేస్తామని అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. టమాటాలు, బెల్లందిమ్మలు, పంచదార 51 కిలోల చొప్పున తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. వీటితోపాటు జీడిపప్పు, కిస్మిస్ కూడా అందజేశారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు శ్రీను, ఆలయ సిబ్బంది తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. టమాట ధరల మంటతో జనం అల్లాడుతున్న సంగతి తెలిసిందే. టమాటాల తులాభారం అనేసరికి ఈ వార్త వైరల్‌గా మారింది. (చదవండి: టమాట కేజీ రూ. 300?.. ఎందుకంటే..) -
టమాటా ధర కిలో రూ.80
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కిలో రూ.250 దాకా పలికిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటు ధర కిలోకు రూ.117గా ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై టమాటాలు విక్రయిస్తోంది. పలు నగరాల్లో కొన్ని రోజులపాటు కిలో రూ.90కి విక్రయించగా, ఆదివారం నుంచి రూ.80కే అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత జాతీయ సహకార వినియోగదారుల సంఘం(ఎన్సీసీఎఫ్), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంఘం(నాఫెడ్) ద్వారా ప్రభుత్వం టమాటాలను రాయితీపై విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆదివారం ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా తదితర నగరాల్లో కిలో టమాటాలు రూ.80 చొప్పున విక్రయించారు. సోమవారం నుంచి మరికొన్ని నగరాల్లో ఈ రాయితీ ధరతో టమాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.178, ముంబైలో రూ.150, చెన్నైలో రూ.132 చొప్పున పలుకుతోంది. సాధారణంగా జూలై–ఆగస్టు, అక్టోబర్–నవంబర్‌లో టమాటా ధరలు పెరుగుతుంటాయి. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని సంగనేరీ నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. -
టమాటల కోసం ఏపీ వైపు కేంద్రం చూపు
ఢిల్లీ: సెంచరీతో మొదలైన ధరల పరుగు.. కిందకు దిగి రావడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. ప్రియమైన టమాటతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరల మంట ఇంకా రుగులుతోనే ఉంది. ఈ టైంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. టమాట ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఓ ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరల ప్రాంతాలకు సరఫరా చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్లను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో టమాట పండిస్తారు. డిసెంబర్-ఫిబ్రవరి టమాటకు మాంచి సీజన్‌కాగా.. జులై-ఆగష్టు, అక్టోబర్-నవంబర్ మధ్య పంట ఉత్పత్తి కాస్త తక్కువే ఉంటుంది. అయితే.. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం దక్షిణ, పశ్చిమ భారతం నుంచే అవుతుంటుంది. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకూ ఒక్కోసారి సరఫరా అవుతుంటుంది కూడా. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటలు దేశానికి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ.. సమీప ప్రాంతాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయి. ఏపీలో మదనపల్లె మార్కెట్ టమాట ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే ఏపీలో ప్రభుత్వ సబ్సిడీ మీద టమాటలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయడంలోనూ ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతోంది. అధిక ధరలతో పాటు వినియోగదారుల ఉత్పత్తిని సైతం పరిగణనలోకి తీసుకుని.. ఆయా కేంద్రాలకు టమాటాలను తరలించాలని ఆయా ఫెడరేషన్లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో టమాటా ఉత్పత్తులు చేరుకోవడంతో.. శుక్రవారం నుంచి ధరలు అదుపులోకి రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. -
వామ్మో! టమాటా.. కిలో రూ.140
అన్నమయ్య : రోజురోజుకీ పెరుగుతున్న టమాటా ధరలు మంగళవారం ఏకంగా ఆకాశాన్ని తాకాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ పలకనంతగా మొదటిరకం టమాటా కిలో రూ.140 ధర పలికి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. గత శుక్రవారం మార్కెట్లో నమోదైన కిలో రూ.124 ధర అత్యధికమని ఇప్పటివరకు భావిస్తుంటే, మంగళవారం దాన్ని తలదన్నేలా కిలో రూ.140కు చేరుకోవడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న టమాటా ధరలతో రైతులు ఆనందపడుతున్నప్పటికీ, వినియోగదారులు మాత్రం ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో వారంరోజుల టమాటా ధరలను పరిశీలిస్తే సరిగ్గా 13 రోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.38 ధర పలికి.. రోజురోజుకూ ఊహించనిరీతిలో పెరిగి రూ.140కు చేరుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశంలో టమాటా పండించే రాష్ట్రాల్లో పంట దిగుబడులు లేకపోవడంతో అందరిచూపు ఏడాది పొడవునా క్రయవిక్రయాలు జరిగే మదనపల్లె మార్కెట్‌వైపు పడింది. బయటి రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లెలో మకాం వేసి వచ్చిన సరుకు వచ్చినట్లుగా కొనేస్తుండటంతో పోటీపెరిగి ధరలు పెరిగాయి. దీనికితోడు దిగుబడులు తగ్గిపోవడం, వర్షాలతో పంటకు నష్టం వాటిల్లుతుండటంతో టమాటాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి ఢిల్లీ, చత్తీస్గడ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు సరుకు ఎగుమతి అవుతోంది. మార్కెట్‌కు సోమవారం రైతులు తీసుకువచ్చిన టమాటాకు మొదటిరకం కిలో రూ.104 ధర పలికితే మరుసటిరోజు మంగళవారం ఏకంగా కిలోపై రూ.36 పెరిగి రూ.140కు చేరుకుంది. మార్కెట్లో టమాటా ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పలు మార్కెట్‌యార్డులో వేలంపాటల్లో రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేస్తోంది. వాటిని రైతుబజార్లకు తరలించి రాయితీధరపై కిలో రూ.50కు అమ్మేలా చర్యలు తీసుకుంది. -
టమాటా ధరలపై పేలుతున్న మీమ్స్, ట్రోల్స్.. మీరూ ఓ లుక్కేయండి
టమాటా ధరలు ఆకాశంలో ఉండి ఆందోళన కలిగిస్తున్న మాట ఎలా ఉన్నా, చేతికి చిక్కని, అందనంత ఎత్తులో ఉన్న టమాటపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తూ వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేయండి.. ‘మా ప్రేమని టమాటాలతో కొనలేరు’ అంటాడు ఒక ప్రేమికుడు. పోజ్ కొడుతున్న టమాటాను ఉద్దేశించి సాటి కూరగాయలు ఇలా అంటాయి... ‘నడమంత్రపు సిరి అంటే ఇదే’ మరో మీమ్‌లో... పరుగు పందెంలో డీజిల్, పెట్రోల్లతోపాటు టమాట కూడా పాల్గొని నెంబర్‌వన్ స్థానంలో నిలిచి కాలరెగరేస్తోంది. ఉల్లిగడ్డ... కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. అదేమిటో... టమాట పేరు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి. Ek tamatar ki keemat tum kya jano, Ramesh Babu!!#TomatoPrice pic.twitter.com/ViZMVtaF7W — Sandhya Bhadauria (@Okk_Sandhya) June 27, 2023 Returning home with 2kg tomato#TomatoPrice pic.twitter.com/TH1oSEaELl — Thanos Pandit™ (@Thanos_pandith) June 27, 2023 #TomatoPrice keep running pic.twitter.com/Q2WmxttRkZ — varsha roshan (@RoshanVars79963) June 27, 2023 #TomatoPrice hike, Say it like Nimmo Tai 😎 pic.twitter.com/GmKJKR74vs — United India 🇮🇳 (@Unitedd_India) June 27, 2023 Tomato prices are skyrocketing across the country. Even a simple dish like rasam has become costly. But what is causing this price hike?#tomato #tomatopricehike #climatechange #delayedrainfall #heavyrainfall #heatwave #newswithnavya pic.twitter.com/RjgsJEHMxB — Navya Singh (@newswithnavya) July 2, 2023 #TomatoPrice pic.twitter.com/3YA3eYeg1I — Sri Rama Chandra Murthy YV (@yvsrc_murthy) July 4, 2023 #TomatoPrice pic.twitter.com/ITKLb1ONiN — Nala Ponnappa (@PonnappaCartoon) July 3, 2023 -
సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే!
కూరగాయల ధరలు మండుతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు పెరిగిపోయాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ప్రధానంగా టమాట సెంచరీ కొట్టగా.. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కింది. గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాట తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. తద్వారా 10 రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా.. పైపెచ్చు పెరుగుతున్నాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. కిలో టమాట రూ.100 హోల్‌సేల్ మార్కెట్లో కిలో నాణ్యమైన టమాట రూ. 80, రీటైల్ మార్కెట్లో కిలో రూ. 100కు మించి పలుకుతోంది. వారం క్రితం వరకు కిలో టమాట రూ. 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి 120కి వెళ్లింది. అయితే అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా టమాట సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయని వ్యాపారాలు చెబుతున్నారు. వర్షాలతో తగ్గిన దిగుబడి దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు వేసవిలో అధిక ఎండలతో ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదలకు ఓ కారణమని రైతులు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనమవ్వడం, బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక మార్కెట్లలో వారం క్రితం కిలో టమాట రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా..ఇప్పుడు కిలో రూ. 100కి అమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ. 80కి విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో టమాట ధర రూ.100కి చేరుకుంది. అటు ముంబయిలోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. ఇతర కూరగాయలు కూడా టమాట కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జేబులకు చిల్లులు: ప్రజలు పెరిగిన ధరలతో కూరగాయాలు కొనలేకపోతున్నామని పేద, మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలు వింటేనే భయమేస్తుందని, ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి తక్కువగా చెప్పడం లేదని పేర్కొన్నారు.. పచ్చిమిర్చి, టమాటలు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పులే నయం అన్న భావన కలుగుతుందంటున్నారు. రైతుల్లో సంతోషం టమాట ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషిస్తున్నారు. మార్కెట్లో 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం ఆనందంగా ఉంటుందంటున్నారు. 15 రోజుల క్రితం రూ.30, రూ.40 15 రోజుల క్రితం పచ్చిమిర్చి ధర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, టమాట కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే టమాట రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆకుకూరలు కూడా ఏ రకమైనా గతంలో రూ.10కి 4 కట్టలు వచ్చేవి.. ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి 4 కట్టలు ఇస్తున్నారు. -
మార్కెట్లో భారీగా పతనమైన టమాట ధరలు
సాక్షి, గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా): మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 36 ఉండేది. ఈసీజన్లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. పదిహేనురోజుల కిందట 25 కేజీల క్రీట్ రూ. 900 నుంచి రూ.750 వరకు ధర పలికింది. ప్రస్తుతం వారం రోజులుగా మార్కెట్లో 15కేజీల టమాటా క్రీట్ ధర రూ. 185 కాగా 25కేజీల క్రీట్ ధర రూ. 375 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మొదటిరకం టమాటాకిలో రూ.15, రెండోరకం కిలోరూ.8, మూడో రకం రూ.5 వరకు ధరలు పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, తమిళనాడు, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు ఇక్కడి టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడులు ఊపందుకున్నాయి. అక్కడి మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే టమాట ధరలు పతనం కావడంతో వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో బయట రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేశారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఊరటనివ్వని టమాట!
బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతం టమాట సాగుకు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధిక టమాట సాగు చేసే ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు టమాట ఎగుమతులు అవుతాయి. జిల్లాలో అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగవుతుంది. ఈ నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో, పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో టమాట ఏడాది పొడవునా సాగులో ఉంటుంది. ఈ నేపథ్యంలో టమాట దిగుబడి భారీగా పెరిగి, ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు సరిహద్దు కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో టమాట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా టమాట ధరలపై ప్రభావం చూపుతోంది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాట మార్కెట్లలోనూ ధరల తగ్గుదల నెలకొంది. మదనపల్లె మార్కెట్లో గురువారం కిలో టమాట మొదటి రకం రూ.8.40–10, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది. దిగుబడి ప్రభావమే మూడు నియోజకవర్గాల్లో పెరిగిన టమాటకు అదనంగా అనంతపురం జిల్లా, కర్ణాటకలో దిగుబడులు మొదలయ్యాయి. దీనితో టమాట పంట రెండువైపులా విక్రయానికి వస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో టమాట మార్కెట్లు ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతాయి. ఈసారి జూలై మొదటి వారంలోనే మార్కెట్లు ప్రారంభమై, విక్రయాలు సాగుతున్నాయి. ట్రేడర్లు ఇక్కడికి కూడా వెళ్లి టమాట కొంటున్నారు. దిగుబడి పెరగడం, ఇతర చోట్ల మార్కెట్లు ప్రారంభం వల్ల ధరలు తగ్గాయి. ఏడు రాష్ట్రాలకు ఎగుమతులు మదనపల్లె టమాట మార్కెట్ నుంచి గురువారం ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఒక్కరోజే 1,269 మెట్రిక్ టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. ఈ టమాటలో 60శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్, మహరాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్, జగదల్పూర్, విహిల్, అంబికాపూర్, బవోదాబాద్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్పూర్, పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా, గుజరాత్‌లోని జోధ్‌పూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, దేశ రాజధాని ఢిల్లీకి ఎగుమతి అయ్యింది. 40శాతం టమాట రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, తుని, నర్సీపట్నం, అనకాపల్లె, కంచిలి, ఏలూరులకు ఎగుమతి అయ్యింది. అమావాస్య ప్రభావం కూడా గురువారం అమావాస్య కావడంతో తెలంగాణ మార్కెట్లు మూతబడ్డాయి. ఇదికూడా ధర తగ్గడానికి కొంత కారణం అయినప్పటికీ ఇప్పడు వస్తున్న దిగుబడిలో నాణ్యత తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో వచ్చేనెలలో మార్కెట్లు ప్రారంభమై ఉంటే ధరలు కొంత పెరిగి ఉండేవని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు టమాట ఎగుమతులు ఉన్నందునే ఈ ధరైనా పలుకుతోందని, లేదంటే ధరలు పతనమయ్యే పరిస్థితి వచ్చేదని అంటున్నారు. -
Tomato Prices: ట‘మాట’ వినదే!
సాక్షి, వికారాబాద్ అర్బన్: గత రెండు నెలలుగా టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రకాల కూరగాయల ధరలు కాస్త తగ్గినా టమాటా ఏమాత్రం దిగిరావడం లేదు. ఆదివారం వికారాబాద్ మార్కెట్లో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయించారు. నాసిరకం టమాటా రూ.80 వరకు పలికింది. జూన్ మొదటి వారంలోనైనా ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారుల ఆశలు నెరవేరలేదు. శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలోకి ఆశించిన స్థాయిలో సరుకు రావడం లేదని పేర్కొంటున్నారు. కర్నూల్, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. సకాలంలో వర్షాలు పడితే ఆగస్టులో ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా టమాటా కొనుగోలు చేసేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజలు సాహసం చేయలేదు. చదవండి: మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ.. -
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. టమాటా ధరలకు కళ్లెం
సాక్షి, అమరావతి: టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి శుక్రవారం నుంచి రైతుబజార్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లుచేసింది. బహిరంగ మార్కెట్లో టమాటా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.81 వరకు పలుకుతోంది. స్థానికంగాను, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. వీటిని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద స్థానిక రైతుల వద్ద ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దిగుమతులు చేసుకోవాలని సంకల్పించింది. బహిరంగ మార్కెట్ ధరల కంటే కనీసం కిలోకి రూ.10లు తక్కువగా రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకున్న 20 టన్నుల టమాటాలను గుంటూరు, ఏలూరు రైతుబజార్ల ద్వారా శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మరో 40 టన్నుల దిగుమతికి ఏర్పాట్లుచేసింది. వీటిని ఉత్తరాంధ్రతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా విక్రయించనుంది. ఇదే రీతిలో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతగా తీసుకుని అక్కడ రైతుబజార్ల ద్వారా కిలో రూ.60కు మించకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మరోవైపు.. మదనపల్లి, ఇతర ప్రధాన టమాటా మార్కెట్లలో జోక్యం చేసుకుని రైతుల నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఈ చర్యలతో నాలుగైదు రోజుల్లో వీటి ధరలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తాం బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా రైతుల వద్ద ఉన్న నిల్వలను కూడా మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేశాం. ఇందుకోసం వ్యవసాయ, మార్కెటింగ్, రైతుబజార్ అధికారులకు ఆదేశాలు జారీచేశాం. వీటిని ప్రాధాన్యతా క్రమంలో రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతాం. సాధ్యమైనంత త్వరగా ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – కాకాణి గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి -
ఎరుపెక్కుతున్న టమాటా.. కిలో రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. -
టమాట ధర పైపైకి
మదనపల్లె : వేసవిలో ఎండలు పెరుగుతున్నట్లుగా మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నాయి. ఎండ దెబ్బకు కూరగాయల పంటలు వాడిపోవడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా పంటపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో డిమాండ్‌కు సరిపడా సరుకు లభ్యత లేకపోవడంతో మెల్లమెల్లగా ధరలు పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.30 ఉంటే గురువారం ఏకంగా రూ.44కు చేరుకుంది. నెలరోజుల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి 28న మొదటిరకం కిలో టమాటా రూ.9.20 ఉంది. ఈ లెక్కన వారంరోజుల వ్యవధిలో కిలోకు రూ.14, నెలరోజుల వ్యవధిలో రూ.35 పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టమాటాకు పెట్టుబడి ఖర్చులు అధికం కావడం, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చుచేయాల్సి రావడం, ఆశించిన స్థాయిలో «మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. మార్చి రెండోవారం నుంచి మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆశలు చిగురించిన రైతులు నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో సాగును ఆరంభించారు. పంట చేతికి వచ్చేందుకు 45–50 రోజుల సమయం ఉండటంతో దిగుబడులు పెరిగేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పెరిగిన ఎండలతో టమాటా దిగుబడులు తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాల నుంచి టమాటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రెండునెలల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
Tomato Price: నెల క్రితం 3టన్నుల టమాటా లక్ష రూపాయలు.. మరి నేడు..?
సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు. వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్‌కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు. చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్) -
టమాట, ఉల్లి ధరలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరలపై కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ.67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం టమాట ధర పెరిగిందని తెలిపింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాట ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 70.12లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిదని, గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లిపాయలు చేరుకుంటున్నాయని,సెప్టెంబర్‌లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రంపేర్కొంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రంఅందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది.