ట‘మోత’
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో టమాట ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇటీవల ధర తగ్గినట్టేతగ్గి మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. వారం కిందట కిలో రూ. 12-15 ఉన్న టమాట ధర ఒక్కసారిగా రూ. 30 లకు పెరిగింది. ఇళ్లవద్దకు వచ్చే తోపుడు బండ్ల వారైతే కేజీ రూ. 35కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో ఆ ప్రభావం పంట దిగుబడిపై పడిందని, ఈ కారణంగానే ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
స్థానికంగా సాగవుతున్న టమాట పంట కూడా చివరి దశకు చేరడం నగరంలో కొరతకు ఓ కారణంగా నిలిచింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటపైనే నగరం ఆధార పడాల్సి వస్తోంది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా కాకపోవడంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నిజానికి హోల్ సేల్ మార్కెట్లో ఆదివారం కిలో రూ. 20లు ధర పలికింది. దీనికి రూ. 3లు అదనంగా వేసి రైతుబజార్లలో ధర నిర్ణయించడంతో అక్కడ కిలో రూ.23లకు విక్రయించారు. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి కిలో రూ. 30-35 ప్రకారం వసూలు చేస్తున్నారు.
ఘాటెక్కిన మిర్చి
హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.26లున్న పచ్చిమిర్చి ధర రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లకు చేరింది. నగర అవసరాలకు నిత్యం 100-150 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 100 టన్నుల లోపే మిర్చి దిగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం లోకల్‌గా మిర్చి సరఫరా తగ్గిపోవడంతో గుంటూరు, విజయవాడ, అనంతపురం, బెంగళూరుల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. బెండ, దొండ, బీర, కాకర, దోస తదితరాల ధరలు కేజీ రూ.40లకు చేరువయ్యాయి. ఇక క్యారెట్, చిక్కుడు, గోకర, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి.