ఎగుమతులు, డిమాండ్ లేక పడిపోతున్న ధర
రైతుకు మిగులుతున్నది అప్పులే
ప్రస్తుతం 15 కిలోల బాక్సు సగటు ధర రూ.180
ఎకరాకు కనీసం రూ.12 వేలు నష్టం
కోత ఖర్చులూ దండగన్న నిర్వేదంలో రైతులు
కోత కోయకుండా వదిలేస్తున్న రైతులు
పలమనేరు: మార్కెట్లో టమాటా ధర పడిపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. ఓ పక్క ఎగుమతులు లేకపోవడం, మరోపక్క కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. రైతుకు మిగులుతున్నది పంట పెట్టుబడికి తెచి్చన అప్పులే. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్‌లో రైతులకు పంట సాగు ఖర్చులు కూడా రావడంలేదు. స్థానిక టమాటా మార్కెట్‌లో సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200 మాత్రమే ఉంది.
సగటు ధర బాక్సుకు రూ.180గా ఉంది. దీంతో పంట కోసిన కూలీల డబ్బు కూడా రావడంలేదని, కోసి నష్టపోయేకంటే తోటల్లోనే వదిలేయడం మేలన్న నిర్వేదంతో రైతులు పంటను కోయకుండా వదిలిపెట్టారు. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్‌లో టమాటా సీజన్ ఏడాదంతా ఉంటుంది. ప్రస్తుతం 9 వేల హెక్టార్లలో టమాటా పంట సాగవుతోంది. 2,58,888 టన్నులు దిగుబడి ఉంటుందని అంచనా. ఎక్కువగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటా కొనుగోలు చేస్తుంటారు.
అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాల్లోనే సాగు పెరిగి, అక్కడి మార్కెట్లకు సరుకు భారీగా వస్తోంది. దీంతో అక్కడి వ్యాపారులు పలమనేరు, పుంగనూరు, మదనపల్లి రావడంలేదు. ఎగుమతులు లేక ఇక్కడ ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు వచి్చన కాస్త పంటను కూడా వ్యాపారులు, మధ్యవర్తులు అతి తక్కువ ధరకు కొని, బహిరంగ మార్కెట్‌లో అతి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
రైతుకు మిగిలేదేమీ లేదు
ఎకరా పంట పండించడానికి రైతుకు రూ. 1.20 లక్షలు ఖర్చవుతుంది. ఎకరాకు ప్రస్తుతం 500 నుంచి 600 బాక్సుల (బాక్సుకి 15 కిలోలు) దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఉన్న రేటు కనీసం రూ. 160 నుంచి గరిష్టంగా రూ. 200 మాత్రమే ఉంది. సరాసరి ధర రూ.180 వేసుకున్నా రైతుకు రూ. లక్ష నుంచి రూ.1,08,000కి మించి రావడంలేదు. ఇక్కడే రైతుకు కనీసంగా రూ.12 వేలు నష్టం వస్తోంది. రైతు కుటుంబమంతా కష్టపడి పంటకు నీరందించి సస్యరక్షణ చర్యలు చేపట్టి వారి కూలీని లెక్కకడితే అతనికి మిగిలేది అప్పులే. దీంతో కోత ఖర్చులు కూడా వృథాయేనన్న నిర్వేదంతో రైతులు పంటను చెట్టు మీదే వదిలేస్తున్నారు.
ఎకరా సాగుకు అయ్యే ఖర్చు ఇలా..
ఎకరా టమాటా సాగు కోసం భూమి దున్నటం, నర్సరి నుంచి మొక్కల కొనుగోలు (ఎకరాకు 8 వేల మొలకలు) రూ.8 వేలు అవుతుంది. టమోట స్టిక్‌లు ఎకరాకు 1200. ఒక్కోటి రూ.20 చొప్పున రూ.24 వేలు వీటికి ఖర్చవుతుంది. సేంద్రియ ఎరువు పది లోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు కలిపి రూ.27వేలు అవుతాయి. క్రిమి సంహారక మందులు రూ.10 వేలు. కూలీల ఖర్చు రూ.15 వేలు. ఇలా ఎకరా పంట సాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.84 వేలు. పంట వడిగేలోపు తోటలో కాయలు కోసేందుకు కూలీ, మార్కెట్‌కు రవాణ, తదితరాల ఖర్చు మరో రూ.36 వేలు అవుతోంది. మొత్తం కలసి రూ.1.20 లక్షలు అవుతుంది.
బయటి నుంచి వ్యాపారులు వస్తేనే ధర పెరుగుతుంది..
మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంలేదు. దీంతో సరుకు మిగిలిపోతోంది. ధరలు తగ్గిపోయాయి. కనీసం బాక్సు టమాటా ధర రూ.300 ఉంటే తప్ప రైతుకు మిగిలేదేమీ ఉండదు. – టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకులు, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment