Tomato Prices Soar To Over Rs 100; What Driving The Price Hike - Sakshi
Sakshi News home page

Tomato Prices: కిలో రూ.100 దాటిన టమాట ధరలు.. రానున్న రోజుల్లో మరింత ప్రియం.. కారణమిదే!

Published Tue, Jun 27 2023 4:58 PM | Last Updated on Tue, Jun 27 2023 5:46 PM

Tomato Prices Soar To Over Rs 100. What Driving The Price Hike - Sakshi

కూరగాయల ధరలు మండుతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు పెరిగిపోయాయి. మార్కెట్‌లో ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ప్రధానంగా టమాట సెంచరీ కొట్టగా.. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కింది. గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాట తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. తద్వారా 10 రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా.. పైపెచ్చు పెరుగుతున్నాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. 

కిలో టమాట రూ.100
హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో నాణ్యమైన టమాట రూ. 80, రీటైల్‌ మార్కెట్లో కిలో రూ. 100కు మించి పలుకుతోంది. వారం క్రితం వరకు కిలో టమాట రూ. 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి 120కి వెళ్లింది. అయితే అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా టమాట సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయని వ్యాపారాలు చెబుతున్నారు.

వర్షాలతో తగ్గిన దిగుబడి
దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్‌, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్‌, కోలార్‌, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది.

రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు వేసవిలో అధిక ఎండలతో ఉత్పత్తి  తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదలకు ఓ కారణమని రైతులు పేర్కొన్నారు.  వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనమవ్వడం, బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక మార్కెట్‌లలో వారం క్రితం కిలో టమాట రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా..ఇప్పుడు కిలో రూ. 100కి అమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ. 80కి విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో టమాట ధర రూ.100కి చేరుకుంది.  అటు ముంబయిలోనూ రిటైల్‌ ధర రూ.100కు చేరుకుంది.

ఇతర కూరగాయలు కూడా 
టమాట కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

జేబులకు చిల్లులు: ప్రజలు
పెరిగిన ధరలతో కూరగాయాలు కొనలేకపోతున్నామని పేద, మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలు వింటేనే భయమేస్తుందని, ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి తక్కువగా చెప్పడం లేదని పేర్కొన్నారు.. పచ్చిమిర్చి, టమాటలు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పులే నయం అన్న భావన కలుగుతుందంటున్నారు.

రైతుల్లో సంతోషం
టమాట ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషిస్తున్నారు. మార్కెట్‌లో 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం ఆనందంగా ఉంటుందంటున్నారు.

15 రోజుల క్రితం రూ.30, రూ.40
15 రోజుల క్రితం పచ్చిమిర్చి ధర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, టమాట కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అయితే టమాట రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆకుకూరలు కూడా ఏ రకమైనా గతంలో రూ.10కి 4 కట్టలు వచ్చేవి.. ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి 4 కట్టలు ఇస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement