మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన టమాటా
మదనపల్లె: టమాటా మార్కెట్‌లో ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం ధరలు మరింత తగ్గాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో గతనెల 20, 21, 22 తేదీల్లో కిలో టమాటా మొదటిరకం రూ.24, రెండోరకం రూ.17 వరకు పలికాయి. ఈ మార్కెట్‌లో ఆదివారం కిలో మొదటిరకం రూ.16, రెండోరకం రూ.11.80 పలికాయి. పదిరోజుల కిందటి ధరలతో పోలిస్తే కిలో ధర రూ.8 నుంచి రూ.6 వరకు తగ్గింది. వాతావరణంలో మార్పులు, ఇటీవల కురుస్తున్న వర్షాలతో స్థానికంగా దిగుబడులు తగ్గడం, కాయ నాణ్యత లోపించడం, ఎగుమతులకు కావాల్సిన సరుకు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బయటిప్రాంతాల వ్యాపారులు సరుకు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు రావడం లేదు. దీనికితోడు అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం, రాయదుర్గం, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆదోని, కడప జిల్లాలోని మైదుకూరు తదితర ప్రాంతాల్లో టమాటా సీజన్ ప్రారంభమైంది.
ఆరంభంలో కాయలు నాణ్యతగా వస్తుండటం, అధిక దిగుబడులు వస్తుండటంతో వ్యాపారులు అక్కడి సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి తమిళనాడుకు టమాటా లోడ్ కావడం లేదు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పంట వస్తుండటంతో అక్కడి వ్యాపారులు ఇక్కడకు రాకపోవడం ధరలు తగ్గేందుకు కారణమైంది. రానున్న రోజుల్లో టమాటా ధరలు ఇంకా తగ్గే అవకాశముందని మార్కెట్ కమిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లు రెండూ టమాటా రైతును నిలువునా ముంచాయి. జిల్లాలోని పడమటి నియోజకవర్గాల్లో సీజన్ ప్రారంభ సమయంలో కోవిడ్ విస్తృతి అధికంగా ఉండటం, లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుండటంతో గడిచిన రెండు సీజన్లు టమాటా రైతును నిరాశకు గురిచేశాయి. ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో పెట్టుబడి డబ్బు కూడా రాక టమాటా రైతు నిలువునా మునిగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment