ఢిల్లీ: సెంచరీతో మొదలైన ధరల పరుగు.. కిందకు దిగి రావడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. ప్రియమైన టమాటతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరల మంట ఇంకా రుగులుతోనే ఉంది. ఈ టైంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్రం అడుగులు వేస్తోంది.
టమాట ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఓ ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరల ప్రాంతాలకు సరఫరా చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్‌లను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది.
మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో టమాట పండిస్తారు. డిసెంబర్-ఫిబ్రవరి టమాటకు మాంచి సీజన్‌కాగా.. జులై-ఆగష్టు, అక్టోబర్-నవంబర్ మధ్య పంట ఉత్పత్తి కాస్త తక్కువే ఉంటుంది. అయితే.. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం దక్షిణ, పశ్చిమ భారతం నుంచే అవుతుంటుంది. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకూ ఒక్కోసారి సరఫరా అవుతుంటుంది కూడా.
ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటలు దేశానికి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ.. సమీప ప్రాంతాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయి. ఏపీలో మదనపల్లె మార్కెట్ టమాట ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే ఏపీలో ప్రభుత్వ సబ్సిడీ మీద టమాటలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయడంలోనూ ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతోంది.
అధిక ధరలతో పాటు వినియోగదారుల ఉత్పత్తిని సైతం పరిగణనలోకి తీసుకుని.. ఆయా కేంద్రాలకు టమాటాలను తరలించాలని ఆయా ఫెడరేషన్‌లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించింది. ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో టమాటా ఉత్పత్తులు చేరుకోవడంతో.. శుక్రవారం నుంచి ధరలు అదుపులోకి రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment